Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
ఒక బిలియన్‌ డాలర్లకు పైగా విలువ కలిగిన అంకుర సంస్ధలు( స్టార్టప్స్‌) మన దేశంలో 21 ఉన్నాయని, అవి చైనా సంస్దలలో కేవలం పదో వంతని ఆగస్టు మొదటి వారంలో పిటిఐ వార్తా సంస్ధ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. అంకుర సంస్ధలు అనేకం ఉన్నప్పటికీ ఒక బిలియన్‌ డాలర్ల విలువ దాటిన వాటిని యూనీకార్న్‌ సంస్దలని పిలుస్తున్నారు. అలాంటి సంస్దలు భారతీయులు విదేశాల్లో నెలకొల్పినవి 40కి పైగా ఉన్నాయన్న సమాచారం ఆసక్తి కలిగించేది.
కరోనా వైరస్‌ కారణంగా చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు, ఫ్యాక్టరీలు మన దేశానికి తరలివస్తున్నాయనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌ చివరి వారంలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ అలాంటి కంపెనీలను ఆకర్షించే విధంగా రాష్ట్రాలు అవసరమైన నైపుణ్యం, మౌలిక సదుపాయాలను కలిగించి చైనా నుంచి వచ్చే కంపెనీలకు ప్రత్యామ్నాయం మన దేశమే అనే పరిస్ధితిని కల్పించాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తెలంగాణా రాష్ట్ర సిఎం చంద్రశేఖరరావుతో సహా మంత్రులు, ఇతరులు సదరు కంపెనీలకు భూములను కూడా సిద్దం చేశామని, రావటమే తరువాయి అన్నట్లుగా ప్రకటనలు చేసిన అంశాన్ని గుర్తు చేయాలి. తెలంగాణా సిఎం ఒక్కరే కాదు, అనేక రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. తరువాత అదే చైనాలో తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని, వస్తాయని చెప్పిన కంపెనీలు అసలు బయటకు వచ్చాయో లేదో వచ్చినా ఏ దేశానికి వెళ్లాయో చెప్పిన వారు లేరు.
చైనా కంపెనీల గురించి పక్కన పెడితే మన దేశానికి చెందిన వారు అంకుర కంపెనీలను మన దేశంలో కాకుండా అమెరికా లేదా మరొక దేశంలో ఏర్పాటు చేయటానికి కారణాలు ఏమిటి అన్నది సమస్య. సరిహద్దు వివాదం తలెత్తిన తరువాత మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుమతులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను చేసిన విషయం తెలిసిందే. అది చైనాను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెల వరకు ఏర్పాటు చేసిన చైనాకు చెందిన 227 అంకుర సంస్ధలలో విదేశాలలో స్ధాపించినవి కేవలం 16 మాత్రమే, మిగిలినవన్నీ చైనాలోనే పెట్టారు. అరవైకి పైగా సంస్ధలను మన వారు ఏర్పాటు చేస్తే ముందే చెప్పుకున్నట్లు వాటిలో 40 విదేశాల్లోనే అంటే మన ఐఐటిల్లో చదువుకొని కంపెనీలను మాత్రం విదేశాల్లో పెడతారు. వారిలో దేశభక్తిని నింపటంలో మన పాలకులు విఫలమయ్యారా లేక దేశంలోని పరిస్ధితులు బాగోలేవని విదేశాలకు వెళ్లిపోయారా ?
మన దేశంలోని 21 అంకుర సంస్ధల విలువ 73.2 బిలియన్‌ డాలర్లు. వీటిలోని పదకొండు కంపెనీలలో చైనాకు చెందిన ముగ్గురు పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో మన వారు ఏర్పాటు చేసిన సంస్దల విలువ 99.6బిలియన్‌ డాలర్లు. వీటిలో ఎక్కువ భాగం అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలోనే ఉన్నాయి. ప్రపంచంలోని 29 దేశాలలోని 145 నగరాల్లో 586 అంకుర సంస్ధలు ఉన్నాయి. మన దేశంలోని 21యూనీకార్న్‌ సంస్దలలో ఎనిమిది బెంగళూరులో ఉండటంతో అంకుర సంస్ధల రాజధానిగా దాన్ని పిలుస్తున్నారు. మన దేశంలో అలాంటి సంస్ధలలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్‌ను 2017లో ఏర్పాటు చేశారు. దాని తరువాత మరొక సంస్ధ లేదు. ఒక అంకుర సంస్ధ యూనీకార్న్‌ స్ధాయికి చేరుకోవాలంటే భారత్‌లో 7, అమెరికాలో 6.5, చైనాలో 5.5సంవత్సరాల వ్యవధిని తీసుకుంటున్నది. బహుశా ఈ కారణంగానే మన దేశానికి చెందిన వారు మన దేశం వెలుపలికి పోతున్నట్లు చెప్పవచ్చు.
చైనాకు చెందిన ఆలీబాబా 5, టెన్‌సెంట్‌, డిఎస్‌టి గ్లోబల్‌ మూడేసి భారత యూనీకార్న్‌ సంస్ధలలో పెట్టుబడులు పెట్టాయి.జపాన్‌కు చెందిన సాప్ట్‌బ్యాంక్‌ తొమ్మిదింటిలో, అమెరికా సంస్ధ టైగర్‌ గ్లోబల్‌ ఐదు కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. మన దేశానికి చెందిన యూనీకార్న్‌ అంకుర సంస్ధలను ఏర్పాటు చేసిన వారిలో 36 మంది ఐఐటియన్లు కాగా వారిలో ఎక్కువ మంది ఢిల్లీ ఐఐటికి చెందిన వారు ఉన్నారు. దేశంలోని మొత్తం 104 మంది యూనీకార్న్‌ సంస్ద స్ధాపకులు ఉంటే వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మహిళలు.
అంకుర సంస్ధలలో తగ్గుతున్న పెట్టుబడులు !
మన దేశంలోని అంకుర సంస్ధలలో వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తొలిసారిగా పెట్టుబడులు ఆగస్టు మొదటి వారంలో కేవలం 92లక్షల డాలర్లకు పడిపోయినట్లు యువర్‌ స్టోరీ.కామ్‌లో వచ్చిన ఒక విశ్లేషణ పేర్కొన్నది. జూలై చివరి వారంలో 6.3 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడులు బలహీనంగా ఉన్నప్పటికీ ఇంత తక్కువగా రావటం ఇదే తొలిసారి. ఈ వారంలో కేవలం తొమ్మిది సంస్దలకే పెట్టుబడులు వచ్చాయి. రుణ ఒప్పందం ఒక్కటీ లేదు.ఇతర సంస్ధలకు వచ్చిన పెట్టుబడులన్నీ గతంలో కుదిరిన ఒప్పందాల మేరకు వచ్చినవిగా ఉన్నాయి.
ప్రపంచంలో యూనీకార్న్‌ అంకుర సంస్ధల సంఖ్య మరియు విలువ రీత్యా అమెరికా తరువాత చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు రావటం, ప్రయివేటు రంగం నుంచి పెట్టుబడులు, ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం కారణాలుగా సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక ఒక విశ్లేషణలో పేర్కొన్నది. చైనాలో తొలి తరం అంకుర సంస్దలకు విదేశాలకు చెందిన సాప్ట్‌బ్యాంక్‌, యాహూ, నాస్పర్స్‌ వంటి సంస్ధలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. తరువాత గత దశాబ్ది నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్ధలు, విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ప్రధానంగా ఉంది. ఆర్ధిక మద్దతు మాత్రమే కాకుండా సంస్దల నిర్వహణకు స్నేహపూర్వక వాతావరణం ఉందని కూడా ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికా నుంచి అధ్యయనం చేసిన ఎంబియే కార్యక్రమాలతో పాటు సాంప్రదాయక చైనా పద్దతులను మేళవించి అనేక కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా దాటి విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. విదేశాల్లో చదువుకున్న వారు స్వదేశానికి తిరిగి రావటంతో పాటు దేశీయంగా అనేక మంది కళాశాల గ్రాడ్యుయేట్లు ప్రతిఏటా ప్రతిభావంతుల సముదాయంలో చేరుతున్నారు. తొలి రోజుల్లో చైనా అంకుర సంస్దలు ఇతరులను కాపీ చేసినట్లు కనిపించినా తరువాత చైనా తరహాగా ప్రాచుర్యం పొందాయి. బైడు ( చైనా గూగుల్‌), దిదీ చుక్సింగ్‌( చైనా ఉబెర్‌) ఉరు చాట్‌ (చైనా వాట్సాప్‌) వాటిలో కొన్ని. ప్రపంచంలోని యూనీకార్న్‌ అంకుర సంస్దల విలువ 1.9లక్షల కోట్ల డాలర్లు, ఇది ఇటలీ జిడిపికి సమానం.
అనేక సంస్ధలు ఇప్పుడు చైనా నుంచి కాపీ చేస్తున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. దానికి పెద్ద ఉదాహరణ టిక్‌టాక్‌.అలాంటి దానిని ప్రతి దేశం ఎందుకు తయారు చేసుకోకూడదు అన్నంతగా అది ప్రాచుర్యం పొందింది.అలాగే చైనా ఫోన్లు, గతంలో చౌకరకం ఫోన్లకు మారుపేరుగా చైనా ఉంటే ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఫోన్లు మన మార్కెట్‌ను ఎలా ఆక్రమించాయో తెలిసిందే. ఇప్పటి వరకు చైనా కంపెనీలుగా పేరు గాంచినవి అనేక అంతర్జాతీయ కంపెనీలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని తొలి ఐదు పెద్ద అంకుర సంస్దలలో చైనాకు చెందినవి నాలుగు ఉన్నాయి.అలీబాబాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ 150 బిలియన్‌ డాలర్ల విలువతో ఈ ఏడాది హరున్‌ గ్లోబల్‌ యూనీకార్న్‌ సూచికలో అగ్రస్ధానంలో ఉంది. అగ్రస్దానంలో ఉన్న అమెరికాలో ఇలాంటి కంపెనీల సంఖ్య 233, చైనా కంటే ఆరు ఎక్కువ. ఈ ఏడాది అమెరికా 30, చైనా 21 కంపెనీలను జత చేశాయి. ఈ రెండు దేశాల మధ్య పోటీ తీవ్ర స్ధాయిలో ఉంది. ఒక వైపు రెండు దేశాలూ వాణిజ్య యుద్దం మరోవైపు సాంకేతిక పరిజ్ఞాన పోటీ యుద్దంలో నిమగమయ్యాయి. సెప్టెంబరు 15లోగా తమ కార్పొరేట్‌ కంపెనీలకు టిక్‌ టాక్‌ను విక్రయించని పక్షంలో అమెరికాలో నిషేధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా సమాచారాన్ని చైనా తస్కరిస్తున్న దాఖలాలు లేవని సిఐఏ నివేదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చైనా సంస్ధలను ఏదో రక్షణ, చౌర్యం అంటూ ఏదో ఒక పేరుతో నిషేధించేందుకు అమెరికా లేదా మన వంటి మరొక దేశం పూనుకోవటం వెనుక చైనా సంస్ధలను ఆర్ధికంగా దెబ్బతీయాలన్న ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం చైనాకు చెందిన 39 యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఇ కామర్స్‌ రంగంలో ఉన్నాయి.
యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఏ నగరంలో ఎన్ని ఉన్నాయన్నది చూస్తే 93తో బీజింగ్‌ అగ్ర స్ధానంలో ఉండగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో 68, షాంఘైలో 47, న్యూయార్క్‌లో 33, షెంజెన్‌లో 20 ఉన్నాయి. ఒక ప్రాంతంగా చూస్తే అమెరికాలోని సిలికాన్‌ వాలీలో 121ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులను రాకుండా చూసేందుకు తీసుకున్న చర్యల ప్రభావం కనిపిస్తోంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల(ఎన్‌బిఎఫ్‌సి) ఏర్పాటుకు పలు సంస్దలు చేసుకున్న దరఖాస్తులను రిజర్వుబ్యాంకు తాజాగా తిరస్కరించింది. మారిషస్‌లో నమోదైన చైనా వెంచర్‌ కాపిటల్‌ మరియు ప్రయివేటు ఈక్విటీ ఫండ్స్‌ ఈ దరఖాస్తులు చేసుకున్నాయి. ద్రవ్య లావాదేవీల అక్రమాలను నిరోధించటంలో మారిషస్‌ నిబంధనలు పటిష్టంగా లేవనే కారణంతో ఆ దరఖాస్తులను తిరస్కరించినట్లు చెబుతున్నారు. అయితే వీటిని తిరస్కరించలేదని సమీక్ష చేసేందుకు చాలా సమయం పడుతుందని పక్కన పెట్టినట్లు మరో వార్త.
అంకుర సంస్దలను ఏర్పాటు చేసే మన వారు మన గడ్డ మీద కాకుండా అమెరికా లేదా మరొక దేశానికి ఎందుకు పోతున్నారు ? అదే చైనాకు చెందిన వారు విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చి తమ స్వంత గడ్డమీద సంస్ధలను ఏర్పాటు చేసేందుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన పాలకుల మీద విశ్వాసం లేకనా లేక విధానాల్లో స్ధిరత్వం లేదా ? గత కాంగ్రెస్‌ పాలకుల కంటే తాము భిన్నమని బిజెపి చెబుతోంది, అయినా పరిస్దితిలో మార్పు ఎందుకు రాలేదు ?