ఎం కోటేశ్వరరావు
తన ప్రత్యేక లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మిస్తున్నామని ప్రకటించిన చైనా తాజాగా మరో ముందడుగు వేసింది.శాస్త్ర పరిశోధనా పత్రాల సమర్పరణలో తొలిసారిగా అమెరికాను అధిగమించి మొదటి స్ధానంలో ఉన్నట్లు గతవారంలో వెల్లడైన సమాచారం తెలిపింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది.
ఏ దేశంలో అయినా శాస్త్ర పరిశోధనాఅభివృద్ధికి ఇచ్చే ప్రోత్సాహం, అందుకు గాను ప్రభుత్వాలు చేసే ఖర్చు ఆ దేశ వాణిజ్య, మిలిటరీతో సహా అన్ని రకాల అభివృద్ధికి సోపానాలుగా మారతాయన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో చైనా సాధిస్తున్న విజయాలతో బెంబేలెత్తిన అమెరికా పాలకవర్గం మరో ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపింది. దానిలో భాగంగానే రెండు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష వాణిజ్య పోరును ప్రారంభించింది. ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకలు, ఇతర యుద్ద నౌకలను తరలించి చైనాను రెచ్చగొట్టేందుకు, ఆ ప్రాంత దేశాలన్నింటినీ కూడగట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. నిజానికి అమెరికా ఈ చర్యలను ఇప్పటికిప్పుడు ప్రారంభించలేదు. ఎప్పుడో పునాదులు వేసింది, ఇప్పుడు ప్రపంచానికి బాగా కనిపిస్తున్నాయి. ఒక వైపు రాజకీయంగా, మిలిటరీ రీత్యా తన చర్యలను తాను తీసుకుంటూనే అత్యంత కీలకమైన శాస్త్ర పరిశోధనా రంగాన్ని నిరంతరాయంగా అభివృద్ధి చేసేందుకు పూనుకోవటమే చైనా విజయ కారణంగా చెప్పవచ్చు.
2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. అమెరికాలోని క్లారివేట్‌ అనలిటిక్స్‌ సంస్ధ అందచేసిన సమాచారం ప్రాతిపదికన జపాన్‌ జాతీయ శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన విధాన సంస్ద పైన పేర్కొన్న విశ్లేషణ చేసింది. పరిశోధనా, శాస్త్ర పత్రాల సంఖ్య స్ధిరంగా ఉండదు, మూడు సంవత్సరాల సగటును తీసుకున్నారు. అయితే జపాన్‌ విశ్లేషణకు ముందే అమెరికా జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ తమ దేశాన్ని చైనా అధిగమిస్తోందని అంచనా వేసింది. అయితే ఈ రంగంలో పోటీ కారణంగా ఒక దశలో ముందున్న దేశం మరొక దశలో వెనుకబడవచ్చు. మొత్తంగా పురోగమించే ధోరణి కొనసాగుతోందా లేదా అన్నదే ముఖ్యం. చైనాలో అది కనిపిస్తోంది.
జనాభాలో ప్రధమ స్ధానంలో ఉన్న చైనా తమ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రారంభించిన మహత్తర సోషలిస్టు యజ్ఞంలో ఏ రంగాన్ని వదలకుండా తనదైన శైలిలో స్ధిరంగా ముందుకు పోతుండటమే ఈ పురోగతికి కారణం అని చెప్పవచ్చు. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నల్లమందు కాదు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు. 1996-98 సంవత్సరాలతో పోలిస్తే శాస్త్రీయ పత్రాల సమర్పణ 18రెట్లు పెరగ్గా 2006-08 సంవత్సరాలతో పోల్చుకుంటే 3.6 రెట్లు పెరిగింది. పత్రాలు సమర్పించటం ఒక్కటే ప్రమాణంకాదు, వాటి నాణ్యత కూడా ముఖ్యమే. 2017లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన పదిశాతం పత్రాలలో అమెరికన్లు ప్రచురించినవి 24.7శాతం ఉండగా చైనీయులవి 22శాతం ఉన్నాయి. అదే తొలి ఒకశాతం పత్రాలలో కూడా ఈ దేశాల వాటా 29.3 మరియు 21.9శాతం చొప్పున ఉండటం విశేషమే కాదు, రెండు దేశాల మేథావుల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలియచేస్తున్నది.
చైనా పత్రాలను విశ్లేషించినపుడు భౌతిక శాస్త్రాలైన రసాయన, ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ మరియు గణితాల గురించి ఎక్కువగా ఉంటే అమెరికా నుంచి క్లినికల్‌ మెడిసిన్‌ మరియు మౌలిక జీవ శాస్త్రాలపై కేంద్రీకరణ కనిపిస్తోంది. 2018 వివరాలను పరిశీలించినపుడు అమెరికాలో పరిశోధన-అభివృద్ధికి 581 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఐదుశాతం ఎక్కువ. అదే చైనాలో 554 బిలియన్‌ డాలర్లు ఉండగా అంతకు ముందు కంటే పదిశాతం ఎక్కువగా ఉంది.2000 సంవత్సరం నుంచి 2018 మధ్య విశ్వవిద్యాలయాల మీద చైనాలో చేసిన ఖర్చు 10.2 రెట్లు పెరగ్గా అదే అమెరికాలో ఇదే కాలంలో కేవలం 1.8రెట్లు మాత్రమే పెరిగింది.
పరిశోధనాఅభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2000 సంవత్సరం నుంచి మొత్తం పెరుగుదలకు చైనా 32శాతం, అమెరికా 20, ఐరోపా యూనియన్‌ 17శాతం వాటాను సమకూర్చాయి. ప్రస్తుతం చైనా ప్రపంచంలో అతిశక్తివంతమైన సూపర్‌ కంప్యూటర్‌, అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌ తయారీలో ఉంది. జీన్స్‌ పరిశోధనకు పెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చైనాలో పరిశోధనకు చేస్తున్న భారీ ఖర్చు, అనేక నూతన ఆవిష్కరణలకు దారి తీస్తున్నప్పటికీ నోబెల్‌ బహుమతులు మాత్రం అమెరికా, ఇతర దేశాల వారికే ఇప్పటివరకు దక్కాయి. 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు.
వర్తమాన చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం ముందుకు పోవటానికి ప్రాధాన్యత ఇచ్చి జాతీయ లక్ష్యాల బాటను నిర్దేశించాడు. ఆ మేరకు 1993లో ఒక చట్టాన్ని కూడా రూపొందించారు. పరిశోధన-అభివృద్ధి కేటాయింపు ఒక శాతం కంటే తక్కువగా ఉండటాన్ని గమనించి చైనా ప్రభుత్వం 2001-05 మధ్య 1.5శాతం ఖర్చు చేయాలని నిర్దేశించింది.2020లో ఆ మొత్తం రెండున్నర శాతానికి పెరిగింది.
శాస్త్ర పరిశోధనలో జపాన్‌ వెనుకబడింది, 64,874 పత్రాలతో నాలుగో స్ధానంలో ఉంది. అయితే పత్రాల నాణ్యత విషయంలో తొమ్మిదో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది.ప్రకటించిన లక్ష్యాల మేరకు పెట్టుబడుల పెట్టటంలో వైఫల్యమే దీనికి కారణం, పర్యవసానంగా పరిశోధకుల సంఖ్య కూడా పడిపోయింది.
చైనా మొత్తంగా పరిశోధనా పత్రాల సమర్పణలో ముందున్న స్ధితికి నిదర్శనంగా ఉన్నత స్ధాయి నాణ్యత గల రసాయన పరిశోధనా పత్రాల సమర్పణలో నేచర్‌ ఇండెక్స్‌లో కూడా తొలిసారిగా ఒకటవ స్ధానంలో నిలిచింది. అగ్రశ్రేణి పది దేశాల్లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టింది. మన దేశం తొలి పదింటిలో స్ధానం పొందినప్పటికీ సుదూరంగా ఉంది. 2018లో చైనా 6,183.75 పాయింట్లతో ముందుండగా వరుసగా అమెరికా 5,371.32, జర్మనీ 1,673.35, జపాన్‌ 1,275.58, బ్రిటన్‌ 1,023.58,ఫ్రాన్స్‌ 671.93, దక్షిణ కొరియా 615.12, భారత్‌ 501.38, కెనడా 464.62, స్పెయిన్‌ 460.21 చొప్పున సాధించాయి. ఎనభై రెండు పత్రికలలో ప్రచురితమైన అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్ధానంలో ఉన్న అమెరికా తొలిసారిగా రెండవ స్ధానానికి పడిపోయింది. 2017చైనా అభివృద్ధి 17.9శాతం ఉంటే అమెరికా 6.2శాతం దిగజారింది. జపాన్‌ 12.6శాతం, బ్రిటన్‌ 10.8శాతం చొప్పున తగ్గుదల నమోదు చేశాయి.
క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో చైనా ఇతర దేశాలకంటే ఎంతో ముందుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెఫెయి విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 50కిలోమీటర్ల దూరంలోని ఆప్టికల్‌ ఫైబర్‌ సముదాయాలతో క్వాంటమ్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అంటే ఒక సముదాయంలో ఏదైనా మార్పు జరిగితే మిగతా వాటిని అది ప్రభావితం చేస్తుంది. ఇంత దూరంలోని వాటిని అనుసంధానించటం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఈ ప్రయోగం జయప్రదమైతే ఇంటర్నెట్‌ రంగంలో మరో విప్లవానికి దారి తీయనుంది. క్వాంటమ్‌ కమ్యూనికేషన్స్‌, కృత్రిమ మేథ, బయోటెక్నాలజీ, జనోమ్‌ ఇంజనీరింగ్‌లో చైనా ఎంతో పురోగతి సాధించింది. గతంలో చైనా దిక్సూచి, కాగితం, ముద్రణ, తుపాకి మందు విషయాల్లో ప్రపంచంలో ముందున్న విషయం తెలిసిందే.
సాంస్కృతిక విప్లవం పేరుతో 1960దశకంలో అమలు చేసిన కొన్ని దుందుడుకు చర్యల కారణంగా అనేక విశ్వవిద్యాలయాలను మూసివేశారు. పరిశోధన కుంటుపడింది. మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ 1978లో ప్రారంభించిన సంస్కరణల తరువాత తిరిగి పరిశోధన ఊపందుకుంది. తొలి రోజుల్లో ఇతర దేశాలను అనుసరించిన చైనా ఇప్పుడు కొన్ని రంగాలలో ఇతరులు తనను అనుసరించే స్ధితికి చేరుకుంది. ప్రపంచంలోని 137 పరిశోధనా రంగాలలో చైనా 33 చోట్ల ముందుంది.
చైనా తరువాత 1991లో మన దేశం కూడా నూతన ఆర్ధిక సంస్కరణల పేరుతో కొన్ని చర్యలను తీసుకుంది. అవి ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో మనం చూస్తూనే ఉన్నాము. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగిస్తున్నాయి. యువతలో శాస్త్రీయ ఆలోచనలను రేకెత్తించాల్సిన పాలకులు, వారికి మార్గదర్శకులుగా ఉన్నవారు వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చూసే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనలు, భావాలను ముందుకు తెచ్చేవారి మీద సామాజిక మాధ్యమంలో దాడులు చేస్తున్నారు. విద్యార్దుల్లో సృజనాత్మక శక్తులను మొద్డుబారేట్లు చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం చైనా ప్రారంభించిన సంస్కరణలు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి నమ్మని వారు, వారు నిజం చెప్పటం లేదని భావించే వారు ఇప్పటికీ ఉండవచ్చు, ఇక ముందు కూడా ఉంటారు. నిత్య అనుమానితులతో ఏ సమాజం ముందుకు పోదు, వారిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. సంస్కృత గ్రందాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు ? గోమూత్రం తాగే వారిని తాగనివ్వండి-దేశానికి నష్టం లేదు. ఆవు పేడ పూసుకొనే వారిని పూసుకోనివ్వండి జనానికి నష్టం లేదు. మూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పి రుజువుకాని అంశాలను జనం మెదళ్లకు ఎక్కించవద్దు. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకండి ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వకండి !! దేశాన్ని, సమాజాన్ని మరికొన్ని శతాబ్దాలు వెనక్కు నెట్టకండి !!!