Tags
74th independence day India, Finance Capital, Narendra Modi, Neoliberalism in India, RSS-Hindutva
ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్, పాలకుల నివాసాలు శుభ్రంగా ఉన్నాయి, మన సామాన్యుల ఇండ్ల మాదిరి వర్షాలకు కురుస్తున్నట్లు వార్తలేమీ లేవు. దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది, లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగపోయినా ఎడా పెడా వేల కోట్ల రూపాయల పన్నులు, ధరల పెంపుతో జనాల జేబులు కొల్లగొడుతున్నారు.లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కరోనా నివారణ చర్యలకు రాష్ట్రాలు నిధుల్లేక నానా అగచాట్లు పడుతున్నాయి. అయినా నూతన పార్లమెంట్ భవనం, ఇతర కట్టడాలు నరేంద్రమోడీ హయాంలో నిర్మిత మయ్యాయనే కీర్తి కండూతి కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేసి కట్టేందుకు నిర్ణయించారు. దీన్ని చూస్తే హిట్లర్ గుర్తుకు వస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ఐరోపాలో ఎక్కడా లేని విధంగా జర్మనీలో గ్రేట్ హాల్ నిర్మించాలని నిర్ణయించి, నమూనాలను గీయించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో కమ్యూనిస్టుల చేతిలో పరాజయం పాలై ఆత్మహత్య చేసుకున్నాడు గానీ గెలిచి ఉంటే దాన్ని నిర్మించి ఉండేవాడు. నెహ్రూ నీటిపారుదల ప్రాజెక్టులకు, ఇతర పారిశ్రామిక సంస్దలకు నాంది పలిక ఆధునిక దేవాలయాలకు ఆద్యుడయ్యాడనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ తన ఖాతాలో ఆర్టికల్ 370 రద్దు, విగ్రహాలు, ఆయోధ్యరామ మందిరం తదితర అంశాలతో పాటు పార్లమెంట్ భవనాన్ని చేర్చి నెహ్రూ పేరును చెరిపి వేయాలన్న తాపత్రయం, ప్రయత్నం కనిపిస్తోంది.
సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే చెప్పింది !
సుప్రీం కోర్టు బాబరీ మసీదు స్ధలం రాముడికే చెందాలని తీర్పు చెప్పింది తప్ప న్యాయం చేకూర్చలేదు అనే విమర్శలు ఉన్నాయి. మసీదు కూల్చివేతను ఒక నేరపూరిత చర్యగా వర్ణించింది.దోషులను శిక్షించేందుకు విచారణను వేగవంతం చేయాలన్నది. అదే కోర్టు మరోవైపున మసీదు కూల్చివేతలో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నవారికి ఆ స్ధలంలో రామాలయనిర్మించే బాధ్యతను అప్పగించింది. అయితే అది ఒక ట్రస్టు ఆధ్వర్యాన జరగాలని తీర్పు చెప్పింది. కానీ నరేంద్రమోడీ అండ్‌కో దాన్ని ఒక అధికారిక కార్యక్రమంగా మార్చివేశారు. లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన మోడీ దీనికి హాజరు కావటాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అని తప్ప ఏమనాలి ? రామాలయ నిర్మాణం కోసం శతాబ్దాల తరబడి అనేక మంది త్యాగాలు చేశారంటూ స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చటం చరిత్రను కించపరచటం కాదా ? నరేంద్రమోడీ మాతృసంస్ధ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామి కాదు. ఉద్యమాన్ని వ్యతిరేకించింది. ఒక సంస్ధగా ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్రం పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు అని తనకు తానే ప్రశ్న వేసుకొని ఆ సంస్ధ ప్రముఖుడు నానాజీ దేశముఖ్ ఇచ్చిన వివరణే అందుకు నిదర్శ నం.
చెప్పింది చెయ్యరు- చేసేది చెప్పరు !
అచ్చేదిన్ (మంచి రోజులు) అని నినాదమిచ్చిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఎన్నికల తరువాత అసలు ఆ మాటను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా గుజరాత్ అభివృద్ది నమూనాను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పారు. దాని ప్రస్తావనా లేదు. విదేశాల్లో దాచుకున్న దొంగ సొమ్మును తీసుకువస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి, ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. అదేమైందో తెలియదు. నిరుద్యోగం 40 సంవత్సరాల రికార్డు స్ధాయికి చేరింది అని ప్రభుత్వ గణాంకాల నివేదిక తేల్చింది. అయితే అదంతా తప్పుల తడక, కల్పించిన ఉపాధిని పరిగణనలోకి తీసుకోలేదు, ఉదాహరణకు పకోడీల తయారీ కూడా ఉపాధికల్పనలో భాగమే అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు, సరైన లెక్కల పద్దతిని రూపొందించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎన్నికల తరువాత అదే నివేదికను ఆమోదించారు. కొత్త గణాంకాలను తెచ్చిందీ లేదు.2019 పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం ఆరునెలల పాటు తొక్కిపెట్టింది.2011-12 సంవత్సరాలలో 467.7 మిలియన్‌లుగా ఉన్నకార్మికశక్తి 2017-18 నాటికి 461.5మిలియన్లకు తగ్గిపోయారు. వ్యవసాయ రంగంలో 29.3 మిలియన్ల మంది ఉపాధి కోల్పోగా వారిలో 24.7 మిలియన్ల మంది మహిళలే ఉన్నారు. అయినప్పటికీ పాలకులు మహిళా ఉద్దరణ, విజయగాధల గురించి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఉపాధి తగ్గిపోయినట్లు ఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయం .రూపొందించిన నివేదికలో నాలుగు దశాబ్దాల రికార్డు స్ధాయి 6.1.శాతానికి నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నది. దీనికి 2016లో నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణం అన్నది దాని సారాంశం. దాన్ని ఎన్నికల ముందు విడుదల చేస్తే నష్టదాయకం కనుక తొక్కి పెట్టారు.
నరేంద్రమోడీ హయాంలో జిడిపి పెరుగుదల మొదలు అనేక గణాంకాలు వివాదాస్పదం అయ్యాయి. ఏది నిజమో కాదో తెలియని సందిగ్ద స్దితిలో జనాన్ని పెట్టారు. మోడీ గణానికి కావాల్సింది అదే. అలాంటి పరిస్ధితిలో తమ ప్రచార యంత్రాంగం ద్వారా అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలన్నది ఎత్తుగడ. లెక్కించే పద్దతి సరిగా లేదు, మేము సాధించిన వృద్ధి గణాంకాల్లో చేరటం లేదని చెబుతున్న మోడీ సర్కార్ ఇంతవరకు సరైన పద్దతిని ఎందుకు రూపొందించలేకపోయింది.అంతచేతగాని స్ధితిలో మన యంత్రాంగం, ప్రధాని సలహాదారులు ఉన్నారా ? లేదూ కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఉన్న విధానం ప్రకారం రూపొందించిన అంకెలను అంగీరించాలి, జనానికి అందించాలా లేదా ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించేదేమిటి అంటే తరువాత కాలంలో లావాదేవీలన్నీ నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. దానికోసమే అయితే యావత్ జనాన్ని అంత ఇబ్బంది పెట్టటం ఎందుకు, ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయటమెందుకు? నల్లధనాన్ని బయటపెట్టేందుకు అని చెప్పిన పెద్దలు అసలా మాటనే మరచిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి గురించి దేశం ఏమి ఆశిస్తుంది? ఆచరణలో ఎన్ని లావాదేవీలు నమోదు అవుతున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా చిన్న దుకాణదారులందరూ రెండున్నరశాతం అదనంగా వసూలు చేస్తున్నందున వినియోగదారులు నగదు చెల్లింపుకే మొగ్గు చూపుతున్నారు. రియలెస్టేట్ రంగంలో లెక్కల్లో చూపుతున్నది ఎంతో నల్లధనం ఎంత చెల్లిస్తున్నారో బహిరంగ రహస్యం. అనేక దుకాణాల్లో కార్డు చెల్లింపులను అంగీకరించటం లేదన్నదీ తెలిసిందే. బిజెపి ఎన్నడూ కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎంత నాటకీయంగా ఆపని చేసిందో చూశాము
అభివృద్ధికి ఆటంకం కార్మిక చట్టాలా – పాలకుల విధానాలా ?
దేశంలో అభివృద్ది కుంటుపడటానికి, ముందుకు పోయేందుకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాపలాగా ఉన్న ఒక కుక్కను తప్పించాలంటే దాన్ని పిచ్చిదని ప్రచారం చేయాలన్నట్లుగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేదా నీరు గార్చి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి దోపిడీని స్వేచ్చగా కొనసాగనివ్వాలన్నది అసలు లక్ష్యం. ముందే చెప్పుకున్నట్లు ద్రవ్య పెట్టుబడి, నయా ఉదారవాద విధానం కార్మికుల హక్కులను, బేరమాడే, పోరాడేశక్తిని సహించదు.
ఈ నేపధ్యంలోనే 1991 నుంచి ఒక పధకం ప్రకారం కార్మిక చట్టాల సంస్కరణల గురించి ప్రచార దాడి ప్రారంభించారు. మన కేంద్ర ప్రభుత్వం 45, అన్ని రాష్ట్రాలూ కలిపి మరో 170వరకు కార్మిక చట్టాలను చేశాయి. వీటిలో అత్యధిక భాగం కార్మికశక్తిలో పదిశాతానికి అటూ ఇటూగా ఉండే సంఘటిత కార్మికుల కోసం రూపొందించినవే. అసంఘటిత కార్మికులకు ఉన్న రక్షణ నామమాత్రం. అయినప్పటికీ పదిశాతం కార్మికులకు ఉన్న చట్టాలు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో వలస కార్మికులు ఎందరున్నారో, వారికి ఎలాంటి రక్షణ లేదని కరోనా లాక్‌డౌన్ సందర్భంగా రుజువైంది. అసలు వారెంత మంది ఉన్నారో, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కేంద్రం లేదా రాష్ట్రాల వద్ద సమాచారమే లేదు, రికార్డులు అంతకంటే లేవు. కరోనా నివారణ కాలేదు కానీ కార్మికశాఖ డొల్లతనం, పాలకుల బండారం బట్టబయలైంది.
కార్మిక చట్టాలను సంస్కరించవద్దని ఎవరూ చెప్పటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటిదంటే తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన జాబితా అంకెల్లో చూపుతుంది. అలాగే సంస్కరణలు అంటే ఉన్నవాటిని మరింత మెరుగుపరచటం గాకుండా అసలు పూర్తిగా ఎత్తివేయటంగా తయారైంది. పారిశ్రామిక, వాణిజ్య సంస్దలలో తనిఖీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడుతోంది బాబూ అని కార్మికులంటే యజమానులకు అనుగుణ్యంగా అసలు తనిఖీలనే ఎత్తివేశారు. యాజమాన్యాలు నిబంధనలను సక్రమంగా అమలు జరపటం లేదంటే చట్టాల అమలు గురించి యజమానులు స్వయంగా అఫిడవిట్లు ఇస్తే చాలన్నట్లుగా చెబుతున్నారు.
కోర్టులు ఏ దేశంలో ఏ పాలనా వ్యవస్ధ ఉంటే దాని విధానాలకు అనుగుణ్యంగానే నడుచుకుంటాయన్నది ప్రపంచ అనుభవం. ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే వారికే కాదు యావత్ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె హక్కు లేదిప్పుడు అంటే అతిశయోక్తి కాదు. సమ్మెను ఒక ఆయుధంగా వాడుతూ అత్యధిక సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులు వ్యాఖ్యానించాయి. సమ్మె ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించాయి.
పరస్పర విరుద్ద వాదనలు !
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి పరస్పర విరుద్ద వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న లోపాల కారణంగా తలెత్తుతుంది అని కమ్యూనిస్టులు చెబుతారు. కాదు మేము వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉత్పాదకత పెరుగుతుంది, మాలాభాలు పెరుగుతున్నాయి, పని చేసే వారు ఎక్కువ మంది అవసరం లేదు, అందువలన నిరుద్యోగం పెరుగుతుంది అని యజమానులు, వారికి మద్దతు ఇచ్చే వారు చెబుతారు. ఇదే వాదన చేసే వారు కార్మిక చట్టాలు, కార్మికులకు హక్కులు కలిగించటం వలన వారు వేతనాల పెంపుదల కోసం, హక్కుల కోసం డిమాండ్లు చేస్తారు. వారి చర్యలు ఉత్పత్తికి ఆటంకంగా మారతాయి, ఉత్పాదక ఖర్చులు పెరుగుతాయి అని చెబుతారు. ఒక వైపు యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించామని చెప్పేవారు ఇక్కడ వేతనాలు పెరిగితే ఖర్చు పెరుగుతుంది అని వాదిస్తారు.
ఉత్పత్తి పడిపోవటానికి కార్మిక సమ్మెలు కారణం కానేకాదు. 2011లో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 83శాతం ఉండగా క్రమంగా తగ్గుతూ పెరుగుతూ కరోనాకు ముందు 2019లో 76శాతం ఉండగా ఈ ఏడాదిలో ప్రస్తుతం 68శాతానికి పడిపోయింది.2003 నుంచి 2014వరకు సమ్మెలు 75శాతం తగ్గితే, పని దినాల నష్టం 90శాతం తగ్గింది. 2014లో 119 సమ్మెలు జరిగితే తరువాత రెండు సంవత్సరాలలో 106,93కు తగ్గాయి. 2017 జనవరి-అక్టోబరు మధ్య కాలంలో 82 జరిగాయి. ఇటీవలి కాలంలో వాణిజ్య సులభతర సూచికలో ఎన్నో పాయింట్ల మెరుగుదల ఉంది, నరేంద్రమోడీ ఏ ప్రధానీ చేయనన్ని విదేశీ పర్యటనలు చేసి సంబంధాలు మెరుగుపరచినట్లు, దేశ ప్రతిష్టను పెంచినట్లు చెప్పటాన్ని విన్నాం. అయినా మన ఎగుమతులు పెరగకపోగా పడిపోయాయి. దీనికి కార్మికులు కారణం కాదు. అయినా కార్మిక చట్టాలను మరింతగా సంస్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎగుమతి ఆధారిత, ప్రత్యేక ఆర్ధిక ప్రాంతాలలో చట్టాలు పని చేయవు, ఇప్పుడు వాటిని ఇతర అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారా ? అనుమానం అక్కర లేదు.
అప్రెంటిస్‌ల పేరుతో చట్టబద్దంగానే శ్రమశక్తిని దోచుకొనేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. కనీసం 15శాతం అప్రెంటిస్‌లు ఉండాలి. అంటే వారికి ఎలాంటి చట్టాలు, చట్టబద్ద వేతనాలు వర్తించవు. స్టైఫండ్ మాత్రమే ఇస్తారు.రిజిస్టర్లు, ఇతర రికార్డుల నిర్వహణలో కూడా మినహాయింపులు ఇచ్చారు గతంలో 19 మంది కార్మికులున్న ఫ్యాక్టరీలు, సంస్ధలకు ఇలాంటి వెసులుబాటు ఇస్తే నరేంద్రమోడీ గారు ఆ సంఖ్యను 40కి పెంచారు.
మన కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేసేందుకు స్వదేశీ-విదేశీ కంపెనీలకు విచ్చల విడి అధికారాలను ఇచ్చేందుకు పూనుకున్నారు. మన దేశం మీద విదేశాలకు ఆసక్తి ఏమిటి, ఎందుకు ? ఉదాహరణకు జర్మనీలో గంటకు సగటున 35యూరోలు ఉన్నది. అంటే 41.5డాలర్లు. అందువలన మన దేశంలో గంటకు రెండు డాలర్లు ( రు.150 ) ఇచ్చినా ఇబ్బంది లేదన్నది విదేశీ పెట్టుబడిదార్ల లెక్క. రోబోలను వినియోగించినా గంటకు నాలుగు డాలర్లు అవుతుందని అందువలన రోబోల మాదిరి పని చేసే భారతీయ కార్మికులను వినియోగించుకోవటమే లాభం అని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు కావాలి గనుకనే, పెద్ద సంఖ్యలో గతంలో పాలిటెక్నిక్‌లను ప్రోత్సహిస్తే తరువాత తామర తంపరగా ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. నైపుణ్య అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటం కూడా దీనిలో భాగమే.
జర్మనీలో నాజీలు ప్రపంచ యుద్దంలో జర్మనీ పొందిన పరాజయాన్ని పరాభవంగా చిత్రించి జనాల్లో జాతీయ ఉన్మాద భావనలను రెచ్చగొట్టారు. తిరిగి పూర్వ ప్రాభవాన్ని నెలకొల్పాలనే మనోభావాన్ని చొప్పించారు. మన దేశంలో అదే పద్దతుల్లో పన్నెండు వందల సంవత్సరాలుగా హిందువులు బాధితులు అనే ప్రచారాన్ని సంఘపరివార్ సంస్దలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. పూర్వ వైభవాన్ని పునరుద్దరించాలని దానికి హిందూత్వ అని పేరు పెట్టారు. దాన్ని అంగీకరించని వారు దేశం వదలి పోవాలని హెచ్చరిస్తుంటారు. చరిత్రకు మతం రంగు పులుముతున్నారు. దేశంలో పాలన మత ప్రాతిపదికనే జరిగినట్లయితే మెజారిటీ ముస్లింలు ఉన్న కాశ్మీరులో రాజు హిందువు ఎలా అయ్యాడు ? మెజారిటీ జనం హిందువులుగా ఉన్న హైదరాబాద్, మైసూరు, జునాగఢ్ వంటి సంస్దానాలలో ముస్లింలు పాలకులుగా వందల సంవత్సరాలు ఎలా ఉన్నారు ?
మన దేశంలో కోట్లాది కుటుంబాలకు కనీస సౌకర్యాలు లేవు గానీ ప్రస్తుతం ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. వాట్సాప్ గురించి వేరే చెప్పనవసరం లేదు. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటున్న బిజెపి కుహనా వార్తలను ప్రచారం చేసేందుకు పెద్ద యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్‌లో వచ్చిన వాటిని నమ్మకూడదని ఒక వైపు అనుకుంటూనే పదే పదే ఆ సమాచారం వస్తుండటంతో తమకు తెలియకుండానే నమ్ముతూ బుర్రను ఉపయోగించని విద్యావంతులైన వారెందరో ఉన్నారు. వాట్సాప్‌కు భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా మార్చిన వినియోగదారులయ్యారు.
బిజెపి, దాని విధానాలను విమర్శించే జర్నలిస్టులను ప్రెస్టిట్యూట్స్(పత్రికా వ్యభిచారులు), ముజాహిదిన్స్, రెడ్ తాలిబాన్స్ ఇలా అనేక పదాలతో అవమానిస్తున్నారు. బెదిరిస్తున్నారు, లొంగని గౌరీలంకేష్ వంటి వారిని హతమార్చుతున్నారు. మీడియాను నియంత్రించే కార్పొరేట్లు సహజంగానే తమ ప్రయోజనాల కోసం మీడియాను పాకేజ్‌లకు, ప్రలోభాలకు అప్పగించే శారు.
ఫాసిస్టు, నాజీజాన్ని పెంచి పోషించిన శక్తులు తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రయివేటు దళాలను ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని సందర్భాలలో ప్రత్యర్ధులను హతమార్చేందుకు కిరాయిహంతకులను కూడా వినియోగించుకున్నాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు విశ ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్ వంటివి అలాంటివే. గౌరీ లంకేష్, కులుబుర్గి, నరేంద్ర దబోల్కర్ వంటి వారిని కాషాయ భావజాలంతో ఉన్మాదులైన వారు లేదా వారు ఉపయోగించిన కిరాయి హంతకులు హతమార్చారు. గోరక్షకులు, హిందూత్వ పరిరక్షకుల పేరుతో ఎవరికి వారే దళాలుగా ఏర్పడటం ప్రత్యర్ధులు లేదా మైనారిటీ మతాలకు చెందిన వారిని హత్యలు చేయటాన్ని చూశాము.
మన దేశంలో ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయని చెప్పేవారు కొందరున్నారు. కాదు ఫాసిస్టు తరహా ధోరణులు నానాటికీ ప్రబలుతున్నాయనే వారు మరికొందరు. లేదు లేదు అసలైన ప్రజాస్వామ్యం ఇదే అని నమ్మబలుకుతున్నవారు ఎందరో ఉన్నారు. నువ్వేమిటో తెలుసు కోవాలంటే నీ గురించి ఆలోచించుకో అని సుప్రస్దిద్ద గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ చెప్పాడు. అందువలన ఎవరేమి చెప్పినా, రాసినా, దృశ్యరూపంలో ప్రదర్శించినా ముందు వాటిని ‘సహనంతో ‘ వ్యక్తపరచనివ్వాలి, వినాలి, చదవాలి, చూడాలి. అలాంటి పరిస్ధితి దేశంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ మెదడుకు పదును పెట్టాలి. ఈ నేపధ్యంలో వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను, దేశంలో వ్యక్తమౌతున్న కొన్ని ధోరణుల తీరు తెన్నులను చూశారు. ప్రపంచ వ్యాపితంగా ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- మితవాదం జమిలిగా ముందుకు వస్తున్నాయి. మన దేశంలో వాటికి మతోన్మాదం కూడా తోడైంది. కనుక పరిణామాలు, పర్యసానాలు ఎలా ఉంటాయి అన్నది ఎప్పటికప్పుడు జాగరూకులై ఉండాల్సిందే ! ముందే చెప్పుకున్నట్లు తద్దినం మాదిరి ఒక్క స్వాతంత్య్ర దినం రోజునే కాదు, నిరంతరం ప్రతి ఒక్కరూ ఆలోచించినపుడే స్వాతంత్య్రం నిలుస్తుంది. ( తొలి భాగం – 74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్ ఇండియాకు పాతర -మేక్ ఫర్ వరల్డ్ జాతర ! )