Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
ఇతరులపై ఆధారపడకుండా స్వంత శక్తులు, స్వంత వనరులతో అభివృద్ది చెందాలంటూ ఆత్మనిర్భర భారత్‌ అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచం కోసం తయారీ (మేక్‌ ఫర్‌ వరల్డ్‌) అని పిలుపునిచ్చారు. ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలమైనందున బహుశా ఆ పేరును ఉచ్చరించేందుకు ఇచ్చగించక లేదా పాత నినాదాలకు పాతరేసి కొత్త నినాదాల జాతరను ముందుకు తేవటంలో మోడీ చూపుతున్న అసమాన ప్రతిభకు ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. నిజానికి రెండు నినాదాల అర్ధం, లక్ష్యం ఒక్కటే. విదేశాల కోసం భారత్‌లో వస్తు తయారీ. ఈ కొత్త నినాద మోజు ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు మరో కొత్త నినాదం మన చెవులకు వినిపిస్తారో ఎదురు చూద్దాం.


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం నుంచి రెండు సంవత్సరాల పాటు ఉండే సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో భారత్‌కు 192కు గాను 184 ఓట్లు రావటం మన పరపతి పెరుగుదలకు నిదర్శనమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీన్లో కాస్త హుందాతనం తగ్గినట్లు అనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఐదు స్దానాలకు ఐదు దేశాలు మాత్రమే రంగంలో ఉన్నాయి కనుక ఏకగ్రీవంగా జరిగినట్లే. అయినా నిబంధనావళి ప్రకారం ఓటింగ్‌ జరిగింది. మన దేశానికి 184 వస్తే మెక్సికోకు 187 వచ్చాయని గమనించాలి. అంటే మనకంటే మెక్సికో ఎక్కువ పలుకుబడి కలిగిన దేశం అనుకోవాలా ? గౌరవనీయమైన ప్రధాని నరేంద్రమోడీ గారికే వదలివేద్దా !
ఆగస్టు పదిహేను అన్నది ఒక పండుగ రోజు కాదు. దీక్షాదినంగా పాటించాల్సిన రోజు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని నిత్యం కాపాడుకోవాల్సి ఉంది. ఆ ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నందున ప్రతి స్వాతంత్య్రం దినానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ దాన్ని కాపాడు కొనేందుకు దీక్ష పూనాల్సిందే. దేశంలోని నాలుగు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్ధలైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌ పదవుల్లో తొలిసారిగా సంఘపరివార్‌కు చెందిన వారే ఉన్నారు.


తప్పులు చేసేందుకు సైతం అవకాశం ఇవ్వని స్వేచ్చ విలువైనది కాదు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పారు. అనేక రాష్ట్రాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండగా స్వాతంత్య్రానికి 73 సంవత్సరాలు నిండాయి, 74వ దినోత్సవం జరుపుకున్నాము. మహాత్ముడిని హత్య చేసిన భారత తొలి మతోన్మాద ఉగ్రవాది నాథూరామ్‌ గాడ్సేను మరొక దేశంలో అయితే అక్కడికక్కడే కాల్చి చంపి ఉండేవారు. కానీ అతగాడిన కోర్టులో ప్రవేశపెట్టటమే కాదు, గాంధీని తానెందుకు హతమార్చిందీ చెప్పుకొనేందుకు స్వేచ్చ ఇచ్చిన వ్యవస్ధ మనది. ఆ ప్రకటననే ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌, ఒక ఖురాన్‌ మాదిరి అచ్చువేసి మహాత్ముడిని హతమార్చటం ఎలా సమర్ధనీయమో చూడండి అని చెప్పేందుకు ప్రచారంలో పెట్టిన శక్తులకు, వాటిని హస్తభూషణాలుగా చేసుకొనేందుకు కూడా ప్రస్తుతం ఈ దేశంలో స్వేచ్చ ఉంది. మరోవైపు ప్రభుత్వ విధానాలను, పాలకపార్టీల వైఖరులను విమర్శించటమే దేశద్రోహం అన్నట్లుగా చిత్రించి దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టే ప్రమాదకర పరిస్ధితి కూడా ఉంది.


ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
మెజారిటీ పౌరుల నిర్ణయమే ప్రజాస్వామిక తీర్పు. కానీ జరుగుతున్నదేమిటి ? మైనారిటీ తీర్పే మెజారిటీని శాసిస్తున్నది. ఇది గతంలో కాంగ్రెస్‌ హయాంలో, వర్తమానంలో బిజెపి ఏలుబడిలో అయినా అదే జరుగుతున్నది. 2014లో బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల రీత్యా విజయం సాధించింది, 2019లో ఘన విజయం సాధించింది.2014-19కి తేడా ఏమిటి ? ఆరుశాతం ఓట్లు పెంచుకొని 2019లో 37.4శాతం ఓట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఉండగా, దాని మిత్రపక్షాలకు వచ్చిన ఓట్లు కలుపుకుంటే 45శాతం. అంటే 55శాతం మంది దానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మొత్తం 29 రాష్ట్రాలలో 17 చోట్ల మాత్రమే పోలైన ఓట్లలో సగానికి మించి దానికి వచ్చాయి. ఒక్క వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌ లేదా ఇప్పుడు బిజెపి లేదా వాటికి మద్దతు ఇస్తున్న పార్టీలు గానీ ఎన్నికల సంస్కరణల గురించి చెబుతాయి తప్ప డబ్బు, ప్రలోభాల ప్రమేయం లేని దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానం కావాలని అడగటం లేదు.


ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నాము !
” మనం అంటే ప్రజాస్వామ్యాలు యూదుల విషయంలో ఒక వైఖరిని తీసుకొనే స్ధితిలో లేవు.ఈ సామ్రాజ్యాలలో చదరపు కిలోమీటరుకు పది మంది జనం కూడా లేరు. అదే జర్మనీలో చదరపు కిలోమీటరుకు 135 మంది నివాసితులున్న చోట వారికి చోటు కల్పించాలట ” ఇది 1939 జనవరి 30న నాజీ హిట్లర్‌ తనను వ్యతిరేకించే దేశాలను ఉటంకిస్తూ చేసిన ప్రసంగంలోని అంశం.
మన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు 2002 సెప్టెంబరు తొమ్మిదిన గుజరాత్‌ గౌరవ యాత్ర బేచారాజ్‌లో ప్రవేశించిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ యాత్రలో మాట్లాడుతూ ” మనం బేచారాజ్‌కు నిధులు కేటాయించితే వారు మెచ్చరు. మనం నర్మద నీటిని శ్రావణమాసంలో తీసుకువస్తే అప్పుడు కూడా వారు మెచ్చరు. కాబట్టి ఏమి చేయాలి? మనం పునరావాస కేంద్రాలను నడపాలా ? బహిరంగ పిల్లల ఉత్పత్తి కేంద్రాలను తెరవాలా ” అన్నారు. మనం ఐదుగురం-మనకు 25 మంది అంటూ ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ చేసిన ప్రఖ్యాత ప్రసంగంలోని ఆణిముత్యాలివి.
జాతీయ మైనారిటీ కమిషన్‌ ఈ విద్వేష ప్రసంగానికి సంబంధించి వివరాలు కావాలని నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మోడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్న పికె మిశ్రా ఇదే విషయమై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రసంగానికి సంబంధించి ఏ విధమైన టేపులు లేదా రాతపూర్వకంగా ఏమీ లేనందున తాము జాతీయ మైనారిటీ కమిషన్‌కు పంపేందుకేమీ లేవని చెప్పాడు. ఇదేదో శతాబ్దం క్రితం జరిగింది కాదు. అధికారిక ఆధారాలు నాశనం చేయటం చేయటం లేదా అసలు లేకుండా చేసినందున అసలు ఇలాంటి ప్రసంగాన్ని మోడీ చేయలేదని బుకాయించినా చేసేదేమీ లేదు. అయితే పత్రికలు, టీవీలు వాటిని రికార్డు చేశాయి, ప్రచురించాయి, ప్రసారం చేశాయి గనుక తెలుసుకోగలుగుతున్నాము. అందుకే పని చేసే మీడియా అంటే నరేంద్రమోడీకి గిట్టదు. పాకేజ్‌లతో లేదా ముందే తయారు చేసిన ఫలానా ప్రశ్నలు మాత్రమే అడగాలి అన్న నిర్దేశాలకు అంగీకరించిన భజన మీడియా ప్రతినిధులతోనే ఇప్పటి వరకు మోడీ మాట్లాడారు తప్ప, ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టిని కూడా పెట్టలేదు, ఎందుకంటే ఏటికి ఎదురీదే జర్నలిస్టులు ఇంకా మిగిలే వారు ఉన్నారు గనుక, ప్రశ్నలు అడుగుతారు గనుక అని వేరే చెప్పనవసరం లేదు.
2007జనవరిలో మొహరం పండగ సందర్భంగా జరిగిన మతకలహంలో రాజకుమార్‌ అగ్రహారి అనే యువకుడు మరణించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని అప్పుడు గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాధ్‌ వెళ్లి ” కొంత మంది హిందువుల ఇళ్లు, దుకాణాలను తగులబెడితే ప్రతిగా అదేపని చేయకుండా ఆపాలని అనటంలో నాకు విశ్వాసం లేదు. ” అని మతవిద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆయన దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి, అవసరమైతే నరేంద్రమోడీని తప్పించి ప్రధాని అభ్యర్ధిగా రంగంలో తెచ్చేవారిలో తొలి వ్యక్తిగా ప్రచారంలో ఉన్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న అనేక మంది బిజెపి నేతలు ఇలాంటి ప్రచారాలకు పెట్టింది పేరు.
మేము హిట్లర్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా పొగిడామా అని సంఘపరివార్‌ శక్తులు ఎదురుదాడి చేస్తాయి. ఇలాంటి విద్వేషపూరిత ప్రచారం చేసేవారికి ఉత్తేజమిచ్చేది ప్రపంచంలో హిట్లర్‌ తప్ప చరిత్రలో మరొకరు లేరు. పేరు చెప్పనంత మాత్రాన బహిరంగంగా ఆరాధించనంత మాత్రాన గుండెల్లో గుడి కట్టిందెవరికో తెలియనంత అమాయకంగా మన సమాజం ఉందా ? ఇవి ఫాసిస్టు లేదా నాజీల ధోరణులు కావా ?


దేశంలో జరుగుతున్నదేమిటి ?
ఒక వ్యవస్ధను ధ్వంసం చేయాల్సి వస్తే దాని అవసరం ఏమిటో చెప్పాలి. జనాన్ని ఒప్పించాలి. కొద్ది మంది పెట్టుబడిదారులు అత్యధికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు గనుక ఆ వ్యవస్ధను ధ్వంసం చేయాలని కమ్యూనిస్టులు నిరంతరం దాని గురించి చెబుతూ ఉంటారు, తమ అంతిమ లక్ష్యం దోపిడీ వ్యవస్ధ నిర్మూలనే అని, అది జరగకుండా దోపిడీ అంతం కాదని బహిరంగంగానే చెబుతారు. వారి అవగాహనతో ఏకీభవించటమా లేదా అన్నది వేరే విషయం. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతూ కొన్ని శక్తులు నిరంతరం దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించటాన్ని చూస్తున్నాం. దానికి మూలమైన అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దుర్వినియోగం చేయటం, నీరు గార్చటం, దిగజార్చటం, చివరికి వాటి మీద విశ్వాసం లేకుండా చేసి అసలు ఈ రాజ్యాంగాన్నే మార్చివేయాలి, కఠినంగా ఒక వ్యవహరించే ఒక నియంత కావాలి అని జనం చేతనే అనిపించే విధంగా వారి చర్యలుంటున్నాయి. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది.


మెజారిటీ వర్గ పాలనా ? మెజారిటీ మత పాలనా ?
ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్ధలున్నాయని చెప్పుకొనే ప్రతి దేశంలోను ప్రజాస్వామిక వ్యవస్ధలు వత్తిళ్లకు, దాడులకు గురవుతున్నాయి.నిరంకుశ పోకడలున్న పాలకులు రోజు రోజుకూ పెరుగుతున్నారు.మొదటి ప్రపంచ యుద్దం ముగిసి వందేళ్లు గడచాయి.మొదటి ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ పరిణామాల్లో తొలి సోషలిస్టు రాజ్యం సోవియట్‌ రష్యా ఏర్పడింది. మెజారిటీ కార్మికవర్గానికి ప్రాతినిధ్యం వహించే కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది కనుక దాన్ని తొలి శ్రామికరాజ్యం అన్నారు. దాని స్ఫూర్తితో అనేక దేశాల స్వాతంత్య్ర ఉద్యమాల్లో భాగస్వాములుగా ఉన్న వారు కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేశారు.


ఇదే సమయంలో అనేక దేశాల్లో ఫాసిస్టు, నాజీ శక్తులు కూడా రంగంలోకి వచ్చాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అలాంటి శక్తే అన్నది అనేక మంది విమర్శ. దాని మైనారిటీ, కమ్యూనిస్టు వ్యతిరేకత ముందు బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడటం ముఖ్య అంశంగా లేదు. అందుకే స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంది. బ్రిటీష్‌ వారికి అనుకూలంగా కూడా వ్యవహరించిన చరిత్ర ఉంది. వ్యక్తులుగా తొలి రోజుల్లో ఉద్యమంలో పాల్గొన్న వినాయక దామోదర్‌ సావర్కర్‌ వంటి వారు జైలు జీవితాన్ని భరించలేక నాటి బ్రిటీష్‌ పాలకులకు లొంగిపోయి సేవ చేస్తామని రాసిన లేఖలు తరువాత బహిర్గతం అయ్యాయి. హిందూరాజ్య స్ధాపన నినాదంతో సంఘపరివార్‌ మెజారిటీ రాజ్య స్ధాపన లక్ష్యంగా పని చేస్తోంది.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత ఇటలీ, జర్మనీ,జపాన్‌లలో అంతకు ముందున్న ప్రజాస్వామిక వ్యవస్ధలను కూల్చివేసి ముస్సోలినీ, హిట్లర్‌, టోజో వంటి నియంతలు రంగంలోకి వచ్చారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్దాల మధ్య రెండు దశాబ్దాల కాలంలో ఒక వైపు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌తోక పాటు కొన్ని దేశాల్లో ఫాసిస్టు శక్తులు కూడా బలపడ్డాయి. మహా ఆర్ధిక మాంద్యం పెట్టుబడిదారీ వ్యవస్ధలను అతలాకుతలం చేసింది. ఫాసిస్టు శక్తులు అటు సోషలిజానికి ఇటు పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న అమెరికా, ఐరోపా దేశాలకూ ముప్పుగా పరిణమించటంతో ఆ రెండుశక్తులు కలసి రెండవ ప్రపంచ యుద్దంలో ఫాసిజాన్ని ఓడించాయి. సోవియట్‌ యూనియన్‌ భారీ మూల్యం చెల్లించి, ఫాసిజం ఓటమిలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. దీని పర్యవసానం అనేక దేశాలు సోషలిస్టు వ్యవస్ధలోకి మరలాయి. ప్రత్యక్ష వలసలు రద్దయి స్వాతంత్య్రం పొందాయి.


తరువాత కాలంలో ద్రవ్య పెట్టుబడి ప్రపంచాన్ని పెద్ద ఎత్తున ఆవరించింది. దానికి మద్దతుగా కొన్ని చోట్ల నియంతృత్వ పోకడలు పెరగటం ప్రారంభమైంది.గతంలో పెట్టుబడిదారీ విధానం మధ్య తలెత్తిన తీవ్ర పోటీ ఫాసిజాన్ని ముందుకు తెచ్చింది. అయితే ఫాసిజం, మిలిటరీ నియంతలకు కాలం చెల్లింది కనుక ద్రవ్య పెట్టుబడిదారీ విధానం నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చింది. దాన్ని అమలు జరిపేందుకు లాటిన్‌ అమెరికాలో మిలిటరీ నియంతలకు పట్టం కట్టారు. వాటికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావటంతో ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించటం కోసం వారిని వదిలించుకొని కొత్త శక్తులను రంగంలోకి తెచ్చారు. ఇదే సమయంలో నయా ఉదార వాదం కంటే ఫాసిస్టు విధానమే పరిష్కారం అని చెప్పే నయా ఫాసిస్టు లేదా ఫాసిస్టు తరహా నయా ఫాసిస్టు శక్తులు అనేక ఐరోపా దేశాల్లో ముందుకు వచ్చాయి, గణనీయమైన విజయాలను కూడా సాధిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మన దేశంలో బిజెపి విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి రిపబ్లికన్‌ పార్టీ మితవాదులు, శ్వేతజాతి దురహంకారులు నరేంద్రమోడీకి సహజమిత్రులుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
స్వేచ్చ పరిరక్షకురాలిగా నయా ఉదారవాదం ఫోజు పెడుతుంది. స్వేచ్చామార్కెట్‌కు హామీ ఇస్తుంది. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. గత కొద్ది సంవత్సరాలలో ఈ అవగాహనకు విరుద్దంగా అనేక దేశాలు తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలే దానికి నిదర్శనం. ఇంతే కాదు ఆయా దేశాల అర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలలో పాలకుల జోక్యం, నియంత్రణలను పరిమితం చేసేందుకు నయా ఉదారవాదం పూనుకుంది.గతంలో పెట్టుబడిని పాలకులు నియంత్రిస్తే ఇప్పుడు పెట్టుబడే పాలకులను నియంత్రిస్తోంది. ఇది ఒక్క ఆర్ధిక రంగానికే కాదు, సామాజిక, రాజకీయ రంగాలకూ విస్తరిస్తోంది.


నయా ఉదారవాద విధానాలకు భిన్నంగా పాలకులను నియంత్రించటాన్ని ” ఆర్డోలిబరలిజం ” అంటున్నారు. ఆర్డర్‌ మరియు లిబరలిజం అనే రెండు పదాలను కలిపి అలా పిలుస్తున్నారు. ఉదారవాద విధానాలకు భంగం కలగ కుండా ఆదేశాలు(ఆర్డర్‌) జారీ చేయటం. ఇది నయాఉదారవాదాన్ని ముందుకు తెచ్చే ద్రవ్యపెట్టుబడిదారుల ఆదేశమే. మన దేశంలో ద్రవ్య నియంత్రణ మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) పేరుతో 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చిన చట్టం దీనిలో భాగమే. రుణ, ద్రవ్యలోటు, ఆదాయలోటు, ద్రవ్యోల్బణ లక్ష్యాలను నిర్ణయించటం దీనిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ద్రవ్య రంగంలో మరింతగా ద్రవ్య పెట్టుబడిదారులకు అవకాశాలను కల్పిస్తున్నది.


ద్రవ్య పెట్టుబడి – కార్మికోద్యమం !
నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చిన ద్రవ్య పెట్టుబడి కార్మికోద్యమాన్ని సహించదు.1991లో సరళీకరణ ప్రారంభమైన తరువాత కార్మిక సంఘాలను దెబ్బతీసేందుకు ప్రారంభమైన చర్యలు ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. దేశ వ్యవస్ధలను,సంపదలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మరియు దేశీయ పెట్టుబడిదారీ-భూస్వామ్యశక్తులకు మరింతగా అప్పగించేందుకు గత ఆరు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ మరింత వేగంగా పని చేస్తోంది. ఈ విధానాల వలన జనం ముఖ్యంగా పని చేయగలిగిన యువత నష్టపోతోంది. ఒక వైపు మేకిన్‌ ఇండియా పేరుతో ఉపాధి అవకాశాలను పెంచి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆచరణలో ఉపాధి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి, రెండు పార్టీల వెనుకా చేరే లేదా విడిగా ఉండే ప్రాంతీయ పార్టీలకు దేశంలో అమలు జరుపుతున్న విధానాల పట్ల మొత్తంగా ఎలాంటి పేచీ లేదు. ఈ పార్టీలను ఆడిస్తున్నది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి-దేశీయ పెట్టుబడిదారులన్నది వాస్తవం. ఈ పార్టీలు తమ ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకు అధికారం కోసం కొట్టుకోవటానికి, వ్యవస్ధలను దిగజార్చటానికి, డబ్బు, ప్రలోభాలతో ఎన్నికలను తొత్తడం చేయటం వంటి అక్రమాలను అంగీకరిస్తారు తప్ప విధానాలను మార్చేందుకు అనుమతించరు. గతంలో కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పుడు అదేపని బిజెపికి చేస్తున్నాయి. రేపు ఆ పార్టీ జనం నుంచి దూరం అయిందనుకుంటే తిరిగి కాంగ్రెస్‌కు లేదా మరొకశక్తికి మద్దతు ఇచ్చి రంగంలోకి తెచ్చేందుకు పూనుకుంటాయి.


నియంతలు, ఫాసిస్టులు -ఎన్నికలు !
నియంతలు, ఫాసిస్టుల లక్షణం ఎన్నికలను ప్రహసనంగా మార్చటం లేదా అసలు నిర్వహించకపోవటం, తమ వ్యతిరేకుల అణచివేతకు ప్రయివేటు సైన్యాలను ఏర్పాటు చేయటం వంటివి ఉన్నాయి. తాము ఓడిపోతాము అనుకుంటే ఎన్నికల రద్దు లేదా మరొక పద్దతిలో ప్రజాతీర్పును వమ్ము చేయటాన్ని చూశాము. మన దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి 1976లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసింది, పార్లమెంట్‌, అసెంబ్లీ వ్యవధిని పొడిగించింది. ఇది ఫాసిస్టు చర్యలను పోలి ఉంది. అయితే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసి తిరిగి ఎన్నికలను జరపకతప్పలేదు. అదే పక్కా ఫాసిస్టులు, నియంతలు అలాంటి అవకాశం ఇవ్వరన్నది చరిత్ర.


బిజెపి విషయానికి వస్తే దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌. ఐరోపా దేశాల్లో నియంతలు ఏర్పాటు చేసిన ప్రయివేటు ఆర్మీకి అనుకరణగా, తిరోగామి భావాలతో ఏర్పాటు అయింది. అయితే 2004 బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలకులు తాము విజయం సాధిస్తామనే ధీమాతో ఎన్నికలను నిర్వహించి ఓటమి పాలయ్యారు. 2019లో బిజెపి ఓడిపోనుంది లేదా తగినంత మెజారిటీ రాదనే వాతావరణం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా లేదు. అయితే ఎన్నికల్లో విజయం సాధించటానికి జనాన్ని మభ్యపరిచేందుకు చేయాల్సిందంతా చేసింది. అనేక రాష్ట్రాలలో పాగా వేసేందుకు అన్ని రకాల అవినీతి, అక్రమ పద్దతులను అనుసరిస్తోంది.మెజారిటీ రాని చోట ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతరం ప్రయత్నించటాన్ని చూస్తున్నాము.


చరిత్ర వక్రీకరణ – కొత్త పుంతలు !
చరిత్ర నిర్మాతలు జనం, అయితే చరిత్రకు భాష్యం చెప్పేది పాలకవర్గం. అది ఎల్లవేళలా తమకు అనుకూలంగానే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అని మహాకవి శ్రీశ్రీ పురోగామి భాష్యం చెబితే మతాల ఆధిపత్యంగా మనువాదులు చిత్రించటాన్ని చూస్తున్నాము. మార్పును కోరుతూ 2014లో తమ నరేంద్రమోడీని చూసి జనం ఓటేశారని, ఆ మార్పును కొనసాగించాలని కోరుతూ 2019లో మరిన్ని సీట్లు కట్టబెట్టారని ఆయన మద్దతుదారులు చెబుతారు. మార్పు అంటే ఏమిటి అన్నది బ్రహ్మపదార్ధం. కోరుకున్న వారికి, పరిశీలిస్తున్నవారిక ఒక పట్టాన అర్ధం కావటం లేదు.
దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చిందని అందరికీ తెలుసు. దానికి ఉన్న పరిమితులను గుర్తిస్తూనే కమ్యూనిస్టులు బూర్జువా స్వాతంత్య్రంగా పరిగణిస్తున్నారు. అయితే అది నిజమైన స్వాతంత్య్రం కాదని తామే అసలు సిసలు కమ్యూనిస్టులం అని చెప్పుకొనే నక్సలైట్స్‌ చెబుతారు. చిత్రం ఏమిటంటే బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక ఇతర సంస్ధలు కూడా ఇదే మాదిరే అది నిజమైనది కాదంటూనే తమ నరేంద్రమోడీ పాలనతోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని కొత్త భాష్యం చెబుతారు. తాజాగా వందల సంవత్సరాల తరువాత రాముడు విముక్తి పొందాడని వర్ణిస్తూ , ఆలయ నిర్మాణానికి మోడీ భూమి పూజను దానికి జతచేశారు.గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దుతున్నారన్న ప్రచారం తెలిసిందే. చరిత్రను తిరస్కరించటం, వక్రీకరించటం అంటే ఇదే. విమర్శ, భిన్నాభిప్రాయం కలిగి ఉండటం ప్రజాస్వామ్య లక్షణం. కానీ వాటిని దేశద్రోహం, దేశ వ్యతిరేకతగా అంతర్గత శత్రువులుగా చిత్రించుతున్నారు. 1991తరువాత కమ్యూనిస్టు బాధితుల పేరుతో ప్రచారంచేస్తున్న మితవాద శక్తులు, ఫాసిస్టులు, నాజీల లక్షణాలివి.


బిజెపి చెబుతున్న నూతన భారత్‌ అనేది కొత్తది కాదు. 1925లో ఏర్పడిన నాటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదే. ఇప్పుడు ఆ గళం పెరిగింది కనుక నేటి తరాలకు అది కొత్తగా, వినసొంపుగా ఉండవచ్చు. పార్లమెంట్‌ను ఒక ప్రహసనంగా మార్చారు. కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు ఉదయం మంత్రివర్గ సమావేశంతో ప్రారంభమైన సాయంత్రానికి పార్లమెంట్‌ ఆమోదంతో సంపూర్ణం గావించారంటే బిజెపి తలుచుకుంటే మొత్తం రాజ్యాంగాన్ని కూడా ఇలాగే మార్చివేయగలదు, దానికి వంతపాడే ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తేలిపోయింది. ఇలాంటి ఆక్మసిక, ఆగంతుక చర్యలు నియంతల ఏలుబడిలో తప్ప ప్రజాస్వామిక దేశాల్లో ఇంతవరకు ఎక్కడా జరగలేదు.


భిన్నమైన పార్టీ అంటే ఏమిటి ? ఆచరణ ఎలా ఉంది ?
దేశ చరిత్రలో విశ్వాసాల ప్రాతిపదికన వివాదాస్పద తీర్పులు ఇవ్వటం, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరు పాలకపార్టీ సిఫార్సుతో రాజ్యసభ సభ్యుడు కావటం న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం సడలే పరిణామాలు. ఎన్నికల కమిషన్‌లో జోక్యం, సిబిఐ, ఇడి, విజిలెన్స్‌ విభాగాలను ప్రత్యర్ధుల మీద ప్రయోగించటం వంటి చర్యలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ దుర్వినియోగం గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమైంది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా వాటిని వినియోగిస్తున్నది. తమ పార్టీలో అంతా పరి శుద్దులు, పులుకడిగిన ముత్యాలే ఉన్నట్లు, ప్రత్యర్ధి పార్టీలన్నీ అవినీతి పరులతో నిండిపోయినట్లు చిత్రిస్తున్నారు. తాము ఓడిపోయిన చోట ఇతర పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతర ప్రయత్నాలు, ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయించటం అలాంటి అవకాశం లేనపుడు డబ్బు, ఇతర ప్రలోభాలతో లోబరుచుకొని తిమ్మిని బమ్మిని చేయటం చూస్తున్నదే.
నోరు తెరిస్తే ఆధారం లేని హేతు బద్దతకు, శాస్త్రీయ పరీక్షకు నిలవని ఆశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం చూస్తున్నాము. పురాతన కాలంలోనే ఇంథనంతో పని లేని విమానాలుండేవని, ప్లాస్టిక్‌ సర్జరీ చేసి వినాయకుడికి ఏనుగు తల అంటించారని, కృత్రిమ పద్దతులలో కౌరవులకు జన్మనిచ్చారని, తాజాగా అప్పడాలు తింటే కరోనా వైరస్‌ తగ్గుతుందని చెప్పేవరకు చేయని ఆశాస్త్రీయ ప్రచారం లేదు. ఇది యువతలో ప్రశ్నించే లేదా ఉత్సుకతను చూపే తత్వాన్ని దెబ్బతీస్తున్నది. ఈ మేరకు విద్యారంగాన్ని కూడా తమ అజెండాకు అనుగుణ్యంగా రూపొందించేందుకు పూనుకున్నారు. (కానసాగింపు – 74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ ! )