Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
బాంక్‌ ఆఫ్‌ చైనా మన ప్రయివేటు ఐసిఐసిఐ బ్యాంకులో 15 కోట్ల రూపాయల విలువగల వాటాలను కొనుగోలు చేసింది. దీని మీద దేశంలో కొందరు గగ్గోలు లేవనెత్తారు. ఇంకేముంది సదరు బ్యాంకును చైనా మింగేసింది అన్నట్లుగా చిత్రించారు. ఇంతకూ అది ఎంత అంటే ఆ బ్యాంకు వాటాలలో 0.006శాతం మాత్రమే.
అమెరికాకు చెందిన ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ద అమెజాన్‌ గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని సంస్ధలను, వ్యాపారాన్ని మింగివేస్తున్నది. టాటా గ్రూప్‌కు చెందిన వెస్ట్‌లాండ్‌ అనే ప్రచురణ, పుస్తకపంపిణీ సంస్దలో 26శాతం వాటాలను 9.5 కోట్ల రూపాయలకు 2016 ఫిబ్రవరిలో కొనుగోలు చేసింది. మిగిలిన 74శాతం వాటాలను కూడా తీసుకుంటానని అంగీకరించింది. 2018లో టాప్‌జో అనే కంపెనీని 4 కోట్లడాలర్లకు (అంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువ) కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ మోర్‌ అనే పేరుతో ఒక సూపర్‌ మార్కెట్‌ దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసింది. వారి నుంచి ఒక సంస్ద దాన్ని రూ.4,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంస్ధ నుంచి 49శాతం వాటాలను అమెజాన్‌ కొనుగోలు చేసి పెద్ద సంఖ్యలో దుకాణాల ఏర్పాటుకు పూనుకుంది.
పార్టిసిపేటరీ నోట్స్‌ పేరుతో విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్‌ మార్కెట్లో ఏ కంపెనీ వాటాలను అయినా కొనుగోలు చేయవచ్చు, లాభం అనుకున్నపుడు అమ్ముకొని వెళ్లిపోవచ్చు. ఒక దశలో మన దేశాలో ఇలాంటి పెట్టుబడులు నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు చేరాయి. ఇలా బడా కార్పొరేట్‌లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన సంస్ధలను మింగివేస్తూ లాభాలను తరలించుకుపోతుంటే చైనా బ్యాంకు కేవలం 15 కోట్ల రూపాయల వాటాలను కొన్నందుకు గగ్గోలు పెట్టటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఏనుగులను దూరే కంతలను వదలి చీమలు దూరే వాటి మీద కేంద్రీకరించినట్లు అనుకోవాలా ? ఇది దేశ భక్తా లేక చైనా వ్యతిరేకతా ? ఇలా ప్రశ్నించటాన్ని చైనా అనుకూలం అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఐసిఐసి అయినా హెచ్‌డిఎఫ్‌సి అయినా మరొక కంపెనీ అయినా వాటాలు, ఆస్ధులను అమ్మకానికి పెట్టటమా లేదా అన్నది వేరే అంశం. బహిరంగ మార్కెట్‌లో ఎవరైనా శక్తి ఉన్నవారు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఏ విదేశీ సంస్ధ అయినా మన ప్రభుత్వం అనుమతించిన మేరకు లాభాలను తరలించుకుపోయేదే తప్ప మరొకటి కాదు.
ఇప్పుడు చిన్న చిన్న దేశాలను సైతం కొనుగోలు చేయగలిగిన బడా కార్పొరేట్‌లు మన మార్కెట్‌ను తమ స్వంతం చేసుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఒక నాడు గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు చట్టాలు చేసిన మన దేశం ఆరోగ్యకరమైన ఆ విధానాన్ని విస్మరించి అంతర్జాతీయ సంస్దల వత్తిడి లేదా ఆదేశాల మేరకు ఆ చట్టాన్ని రద్దు చేసి పోటీ కమిషన్‌ పేరుతో కొత్త చట్టాలను చేశాయి. దానిలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకొనే వారు లేరు. ఒక వైపు తీవ్ర ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు మూల మూలకూ తమ దుకాణాల గొలుసును విస్తరించేందుకు విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌లు కండలు పెంచుతూ కసరత్తు చేస్తున్నాయి. ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లుగా పెద్ద ఎత్తున స్వయం ఉపాధికల్పిస్తున్న కిరాణా దుకాణాల భవిష్యత్‌ నానాటికీ ప్రశ్నార్ధకంగా మారుతూ ఉపాధి సమస్యను ముందుకు తెస్తోంది. మన దేశంలో అతి పెద్ద కార్పొరేట్‌ సంస్ధ అయిన రిలయన్స్‌, అమెరికాలో అతి పెద్ద సంస్ధ అయిన అమెజాన్‌ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు గోదాలోకి దిగాయి. రానున్న రోజుల్లో పోటీ ఏ విధంగా సాగుతుందో, పర్యవసానాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారుతోంది.
రిలయన్స్‌ కంపెనీ అధిపతి ముకేష్‌ సంపాదన గంటకు ఏడు కోట్ల రూపాయలు కాగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ తొమ్మిది రెట్లు అంటే గంటకు 63 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా.రిలయన్స్‌ కంపెనీ విలువ గత ఏడాది 140 బిలియన్‌ డాలర్లు కాగా అమెజాన్‌ విలువ 991.6బిలియన్‌ డాలర్లు. ఆసియాలోనే అతి పెద్ద ధనవంతుడైన ముకేష్‌ అంబానీ నిన్నా మొన్నా తన కంపెనీల్లో వాటాలను అమ్మి దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర ( దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయలు) ధనం కూడ బెట్టుకున్నట్లు, తన కంపెనీలకు అప్పులు లేకుండా చేసుకున్నట్లు వార్తలు చదివాం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు వాటిని కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే ముకేష్‌ తానే అనేక కంపెనీల కొనుగోళ్లకు దిగారు. అమెజాన్‌తో పోటీ పడేందుకు తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు పూనుకున్నారు. రోగులు దుకాణాలకు పోకుండా ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే ఔషధాలను అందచేసే నెట్‌మెడ్స్‌ అనే కంపెనీలో 620 కోట్లకు మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు ఇది రాసిన సమయానికి చదివాము. ఇప్పటికే అమెజాన్‌ రంగంలో ఉంది. వచ్చే ఐదు సంవత్సరాలలో పాలు సరఫరా చేసే కంపెనీతో సహా అనేక సంస్ధలను తన సామ్రాజ్యంలో కలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాది. రిలయన్స్‌ సంస్ధ జియో ఫోన్లతో పాటు ఇప్పుడు జియో మార్ట్‌ కంపెనీ ద్వారా కిరాణా సరకులను ఇండ్లకు అందచేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. వాల్‌ మార్ట్‌ కంపెనీ ఇప్పటికే 16 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ 5.5 బిలియన్‌ డాలర్ల రంగంలోకి దిగాయి. స్వదేశీ డిమార్ట్‌ కూడా పోటీకి సన్నద్దం అవుతోంది. ఉల్లిపాయల మొదలు ఆర్ధిక సేవల వరకు దేన్నీ వదిలేందుకు ఇవి సిద్ధంగా లేవు.
మోటారు వాహనాల బీమా పాలసీలను ఎలాంటి పత్రాలతో నిమిత్తం లేకుండా కేవలం రెండు నిమిషాల్లో పునరుద్దరించే సేవలను అమెజాన్‌ ప్రారంభించింది. త్వరలో అమెజాన్‌ మెడికల్‌ షాపులు కూడా రాబోతున్నాయి.దాన్లో ఇంగ్లీషు మందులతో పాటు మూలికా ఔషధాలు కూడా ఉంటాయి. చైనాలో ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన ఈ సంస్ధ ఇప్పుడు మన మార్కెట్‌ మీద కేంద్రీకరించింది.
రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి బడా సంస్ధలన్నీ జన సమ్మర్దం ఎక్కువగా ఉండే పట్టణాల మీదే కేంద్రీకరిస్తున్నాయి. పని వత్తిడిలో ఉండే వారు, ధనికులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రిలయన్స్‌ జియో మార్ట్‌లో కొద్ది వారాల్లోనే రోజుకు రెండున్నరలక్షల ఆర్డర్లు వచ్చాయి. రెండు వందల పట్టణాలకే ప్రస్తుతం ఉన్న ఈ సేవలను విస్తరిస్తే ఇంకా పెద్ద మొత్తంలో స్పందన వస్తుంది. అయితే కూరగాయలు చెడిపోవటం, కొన్ని వస్తువుల జాడ లేకపోవటం, వాటికి నగదు వాపస్‌ ఆలస్యం కావటం వంటి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు పూనుకున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న డిమార్డ్‌ దుకాణాల్లో ఇస్తున్న రాయితీలు ఇప్పుడు వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు రిలయన్స్‌, అమెజాన్‌ వంటి సంస్ధలన్నీ రాయితీల జల్లులతో వినియోగదారులను ఆకట్టుకోబోతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఏడాది చందా చెల్లించిన వారికి ఆ సంస్ధ ద్వారా ఏ వస్తువును కొనుగోలు చేసినా ధరల తగ్గింపుతో పాటు రవాణా చార్జీల రాయితీ అదనంగా ఇస్తున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న బిగ్‌ బజార్‌ కంపెనీలో అమెజాన్‌కు వాటా ఉంది. రిలయన్స్‌ కూడా కొంత వాటాను దక్కించుకొనేందుకు పూనుకోగా అమెజాన్‌ అడ్డుపడుతోంది. అమెజాన్‌ ప్రస్తుతం ఒక్కో వ్యాపార రంగం గురించి ఒక్కొక్క పట్టణంలో ప్రయోగాలు, పరిశీలనలు జరుపుతోంది. ఉదాహరణకు పూనాలో ఇండ్లకు పండ్లు, కూరగాయల సరఫరా. మార్కెట్‌ తీరు తెన్నులు అవగతం అయిన తరువాత తన గొలుసును విస్తరించబోతున్నది.
రిలయన్స్‌ ఇప్పటికే తన దుకాణాల ద్వారా తాజాగా ఇండ్లకు సరఫరా చేస్తున్నది. రైతుల నుంచి నేరుగా ఇప్పటికే కొనుగోలు చేస్తుండగా మరింత ఎక్కువ చేసేందుకు పూనుకుంది. జియో కనెక్షన్‌ రేట్లు తగ్గించటం, ఫోన్లకు రాయితీల వంటి చర్యల ద్వారా మిగతా నెట్‌ వర్కులను దెబ్బతీసిన రిలయన్స్‌ ఇప్పుడు రేట్లు పెంచింది. తన కంటే ఆర్ధికంగా అన్ని విధాలా పెద్ద దైన అమెజాన్‌తో ఎలా ఢకొీంటుందో చూడాల్సి వుంది. స్ధానికంగా ఉండే కిరాణా దుకాలతో అనుసంధానించి ఆన్‌లైన్‌ ఆర్డర్లను పెద్ద ఎత్తున సంపాదించేందుకు ఒప్పందాలు చేసుకోనుంది. అంటే ప్రస్తుతం ఉన్న కిరాణా దుకాణాలు రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి కంపెనీల సరకులను సరఫరా చేసే కేంద్రాలుగా మారనున్నాయి. దీని వలన ఆ బడా సంస్దలు మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కంపెనీల పోటీకి నిలువలేని దుకాణదారులు కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఆ కంపెనీల ఏజంట్లుగా మారిపోవటం అనివార్యంగా మారే దృశ్యం కనిపిస్తోంది. అయితే ఇదంతా తెల్లవారేసరికి జరిగిపోతుందని కాదు గానీ, సాంప్రదాయ కిరాణా దుకాణాలు ముందుగా పెద్ద పట్టణాలలో మనుగడ సమస్యలను ఎదుర్కోనున్నాయి.ప్రస్తుతం మన దేశంలో గొలుసుకట్టు షాపులు లేదా ఆన్‌లైన్‌(ఇకామర్స్‌) ద్వారా గానీ కేవలం 12శాతం లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. బడా సంస్దలన్నీ రాబోయే 20సంవత్సరాల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకొని తమ పధకాలను రూపొందిస్తున్నాయి.
ప్రధాన నగరాలలో రిటైల్‌ వ్యాపారులకు వస్తువులను విక్రయిస్తున్న జర్మన్‌ మెట్రో సంస్ధ ఇప్పుడు దాన్ని మరింత విస్తరించి కిరాణా దుకాణదారులకు సరకులను సరఫరా చేసేందుకు ఆలోచిస్తున్నది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పంపిణీదారు పాత్ర పోషించనుంది. ఇదే మాదిరి వాల్‌మార్ట్‌, అమెజాన్‌ కూడా హౌల్‌సేల్‌ వ్యాపారంలోకి దిగాలని చూస్తున్నాయి. రిలయన్స్‌ తన జియో ఖాతాదారులు, అదే విధంగా అది నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌18పేరుతో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న వివిధ టీవీ ఛానళ్ల వీక్షకులు, రిలయన్స్‌ ఫ్రెష్‌ ఖాతాదారులతో మరింతగా తన కార్యకలాపాలను పెంచుకొనేందుకు చూస్తోంది.చౌకదుకాణాలతో ఒప్పందాలు చేసుకొని వాటి ద్వారా సరఫరా చేయాలని యోచిస్తున్నది. అంతే కాదు కొన్ని చోట్ల స్టాక్‌ పాయింట్ల ఏర్పాటు, ఐదువేల దుకాణాలతో ఇప్పటికే ఒప్పందం చేసుకుందన్న వార్తలు వచ్చాయి. పదివేల కిరాణా దుకాలతో ఒప్పందాలకు ఫ్యూచర్‌ గ్రూపు కూడా ఆలోచిస్తున్నది. అమెజాన్‌ 17,500 దుకాణాలతో, ఫ్లిప్‌కార్ట్‌ 15వేల కిరాణా దుకాణాల ద్వారా సెల్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి ఆలోచిస్తున్నది. అనేక వేల దుకాణాల ద్వారా ఈ కంపెనీలన్నీ ఆన్‌లైన్‌ వాణిజ్యం జరిపేందుకు పూనుకున్నాయి. ఈ ఏర్పాట్ల ద్వారా విదేశీ, స్వదేశీ బ్రాండ్‌ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. పర్యవసానంగా వాటి లావాదేవీలు పెరుగుతున్నాయి.
నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న గొలుసుకట్టు షాపులు ఇస్తున్న రాయితీలు వినియోగదారులను సహజంగానే ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా గొలుసుకట్టు షాపులకు వెళ్లేందుకు వినియోగదారుల సంఖ్య మీద పరిమితులు విధించటంతో అనేక మంది తిరిగి ముఖ్యంగా పట్టణాల్లోని కిరాణా దుకాణాలను ఆశ్రయించారు. నిబంధనలను సడలించిన తరువాత తిరిగి మామూలు స్ధితికి చేరుకుంటున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో దాదాపు 70లక్షల కిరాణా దుకాణాలు ఉన్నట్లు అంచనా. కుటుంబ సభ్యులతో పాటు సగటున ఒక్కొక్క దుకాణం ఇద్దరికి ఉపాధి కల్పించినా దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది పని చేసే అవకాశం ఉంది.