Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు
ప్రతి ఉగాదికి పంచాంగం చెప్పే పండితుల గురించి మనకు తెలిసిందే. వాటిలో సానుకూల అంశాలు తప్ప ప్రతి కూల అంశాలు సాధారణంగా చోటుచేసుకోవు. మహా అయితే కరవుల గురించి చెబుతారు. రాజకీయ పార్టీలకు పంచాంగం చెప్పే వారు ప్రతికూలంగా చెబితే వారు కార్యాలయాల గేటును ఎలా దాటుతారో వారికే తెలియదు. కనుక అది కూడా బి పాజిటివ్‌గానే ఉంటుంది.


ఉగాది పంచాంగానికి భిన్నంగా ప్రపంచానికి లేదా దేశాలకు ముప్పుగా పరిణమించే వారు లేదా పరిణామాల గురించి చెప్పేరాజకీయ జోశ్యులు కూడా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పని చేసే యూరేసియా గ్రూప్‌ వాటిలో ఒకటి. 2020లో ప్రపంచ రాజకీయ ముప్పుగురించి జనవరిలో ఒక విశ్లేషణను వెలువరించింది. తరువాత మార్చినెలలో దానిని నవీకరించింది. అయినా తొలి పది ముప్పు జాబితాలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా అమెరికా గడ్డమీద పని చేస్తున్న సంస్ధ గనుక ప్రపంచానికి అమెరికా నుంచి తలెత్తే ప్రధాన ముప్పు జాబితాలో అక్కడి రాజకీయాలను చేర్చదు. కానీ ఈ ఏడాది దానికి భిన్నంగా తొలి ప్రపంచ రాజకీయ ముప్పుగా అమెరికా అంతర్గత రాజకీయాలని పేర్కొనటం విశేషం. రెండవదిగా సాంకేతిక రంగం, వాణిజ్యంలో చైనా-అమెరికా యుద్దం, మూడవదిగా అమెరికా-చైనా రాజకీయ వ్యవస్ధల మధ్య ముదురుతున్న వైరం, నాలుగవదిగా కార్పొరేట్‌ సంస్ధల పోరు, ఐదవదిగా నరేంద్రమోడీ వైఖరిని పేర్కొన్నది.


ఈ జోశ్యం లేదా రాజకీయ అంచనాలకు అనుగుణ్యంగానే తొలి ఎనిమిది నెలల్లో దాదాపు వాటి చుట్టూనే పరిణామాలు జరగటాన్ని గమనించవచ్చు. జనవరి నాటికి కరోనా వైరస్‌ అంశం యూరేసియా గ్రూప్‌ పరిగణనలో లేదు. మార్చినాటికి సవరించినా అప్పటికి అంతగా సమస్య తీవ్రతరం కాలేదు. ప్రపంచ రాజకీయ ముప్పుకు సంబంధించి తొలి ఐదు అంశాలలో పక్కాగా మొదటిది డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో, రెండవది ఆ పెద్ద మనిషి జిగినీ దోస్త్‌ నరేంద్రమోడీకి చెందాయి.మరో రెండింటిలో ట్రంప్‌కు మద్దతుగా నరేంద్రమోడీ ఉండటం యాదృచ్చికమా ? పధకం ప్రకారం జరిగిందనుకోవాలా ? నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ట్రంప్‌ ఎన్నికైతే పాత కౌగిలింతలు కొనసాగుతాయి, సర్వేలు చెబుతున్నట్లుగా జోబిడెన్‌ గెలిస్తే నరేంద్రమోడీ కొత్త ప్రియుడి ప్రసన్నం కోసం ప్రయత్నించాల్సిందే.
2020లో మోడీ తన రెండవ పదవీ కాలంలో ఆర్ధిక అజెండాను ఫణంగా పెట్టి వివాదాస్పద సామాజిక విధానాలను ముందుకు తెస్తారని, మతపరమైన, ఒంటెత్తువాదంతో అస్దిర పరిస్ధితి ఏర్పడుతుందని, విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా యూరేసియా నివేదిక పేర్కొన్నది. ఆర్టికల్‌ 370రద్దు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఏఏ వంటి అంశాలను మరింత ముందుకు తీసుకుపోతారనే జోశ్యం దానిలో ఉంది. అయితే అనూహ్యంగా కరోనా సమస్య ముందుకు రావటంతో అవి తాత్కాలికంగా తెరవెనుకకు పోయాయి. విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తున్నదే.


రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి ఆర్ధిక అంశాలను విస్మరించి వివాదాస్పద సామాజిక అంశాలను ముందుకు తెచ్చారనేందుకు తార్కాణంగా గత ఏడాది తొలి మూడు నెలల కాలంలో 8శాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగవ త్రైమాస కాలానికి 4.2శాతానికి పడిపోవటం తెలిసిందే. యూరేసియానే కాదు అనేక మంది ఆర్ధిక వేత్తలు చెప్పినట్లు ఈ దిగజారుడుకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. అనేక మంది ముందే హెచ్చరిస్తున్నా మందగమనం తప్ప మాంద్యం లేదని ప్రభుత్వం బుకాయించిందే తప్ప వాస్తవాన్ని అంగీకరించలేదు. వరుసగా ఆరునెలల పాటు ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో పయనిస్తే దాన్ని అధికారయుతంగా మాంద్యం అని పరిగణిస్తారు. ఇప్పుడు దేశం వర్తమాన ఆర్దిక సంవత్సరం తొలి మూడుమాసాల్లో ( ఏప్రిల్‌-జూన్‌) తిరోగమనం అన్నది స్పష్టం కాగా అది ఏ స్దాయిలో ఉందో ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేవుడు నైవేద్యం తినడనే వాస్తవం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లుగా ఆర్ధిక దిగజారుడు ముందే తెలుసు గనుక కార్పొరేట్లకు రాయితీలతో వర్తమాన సంవత్సర బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా రాకపోయినా దానితో ఫలితం ఉండేది కాదు. కరోనా రావటంతో ఇప్పుడు అసలు విషయాన్ని దాచి పెట్టి కరోనా పేరుతో విదేశాంగ విధానం, ఆర్ధిక రంగాలలో జాతీయ వాదానికి తెరతీసి దేశ పౌరుల దృష్టిని మళ్లించేందుకు పూనుకున్నారు.


ప్రపంచీకరణ నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతారు. లేనట్లయితే ఆ క్రమంలో దాని ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ మద్దతు దెబ్బతింటుంది అని ప్రముఖ అమెరికన్‌ ఆర్ధిక వేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ హెచ్చరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎలాంటిదో కరోనా వైరస్‌ నిరూపించింది.దాని కంటే ముందే ప్రపంచీకరణ సంగతి తరువాత ముందు మన సంగతి మనం చూసుకుందామని ప్రతి దేశం రక్షణాత్మక చర్యలకు, జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పీఠీన ఉంటే మన దేశం, నరేంద్రమోడీ కూడా అదే బాటలో ఉన్నారు.

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ (స్ధానిక తయారీ వస్తువులనే అడగండి) అని మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు, సరిహద్దు సమస్యను సాకుగా చూపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు వంటివి వాటిలో భాగమే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొన్ని జాతీయవాద ధోరణులను చూద్దాం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆ నినాదంతోనే ప్రచారం చేశాడు. దానిలో భాగంగానే చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించింది. చైనా వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలపై, ఇతర దేశాలపై తాను ఆంక్షలను ప్రకటించటమే కాదు, తన ఆంక్షలను ఇతరులు కూడా పాటించాలని లేనట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటానని అమెరికా బెదిరిస్తున్నది. ఇరాన్‌ నుంచి మన దేశం చమురు కొనుగోలు నిలిపివేయటానికి ఈ బెదిరింపే కారణం.


గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అనుసరిస్తున్న వైఖరితో తలెత్తిన పర్యవసానాల కారణంగా ఇతర మార్కెట్లలో ప్రవేశించేందుకు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో చైనా తన పధకాలను ముందుకు తీసుకుపోతున్నది. కొందరు దీనిని విస్తరణవాదం అని చిత్రిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బ్రిటన్‌ వంటి దేశాలు విస్తరణవాదంలో భాగం మనవంటి అనేక దేశాలను వలసలుగా చేసుకున్నాయి. చైనా ఏ దేశాన్నీ ఆక్రమించలేదు. మిగతా దేశాల మాదిరి వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుంటోంది.


అమెరికా, జపాన్‌లను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేని ఐరోపా దేశాలు సమిష్టిగా వ్యవహరించేందుకు ఐరోపా యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.అయినా సభ్యదేశాలన్నీ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగానే యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగింది. వస్తువుల కోసం చైనా, లేదా ఆసియా దేశాల మీద ఆధారపడకూడదనే ధోరణి ఐరోపాలో పెరుగుతోంది. ఐరోపా జాతీయవాదంతో ఐరోపా యూనియన్‌ ముందుకు పోతున్నది.
ఆర్ధిక జాతీయవాదానికి ముద్దు పేరు ఆర్ధిక దేశభక్తి. ఆర్ధిక జనాకర్షక నినాదాలు, చర్యలు ఆచరణలో భాగం. తొలి రోజుల్లో స్వేచ్చా మార్కెట్‌ ఛాంపియన్‌గా ముందున్న నరేంద్రమోడీ ఇప్పుడు దానికి వ్యతిరేకమైన వైఖరిని అనుసరిస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రపంచీకరణలో భాగమైన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు తిరస్కరించటం వాటిలో ఒకటి.( దానిలో చేరితే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి) తాజాగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల ఆంతర్యమిదే. ఈ రోజు చైనాతో ప్రారంభం కావచ్చుగానీ ఆర్ధిక జాతీయవాదం మరింత ముదిరితే అది మిగతా దేశాల పెట్టుబడులకు, వస్తువులకు సైతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్ధానిక వస్తువులనే అడగండి, ఆత్మనిర్భరత పేరుతో స్ధానికంగా అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలనే నినాదాలతో మన దేశం కూడా రక్షణ చర్యలకు పూనుకుంది. దీన్నో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలను సడలించి 200 కోట్ల రూపాయల లోపు వస్తువులు, సేవలను విదేశాల నుంచి పొందకూడదని నిర్ణయించింది. చైనా నుంచి పెట్టుబడులను నిరోధించేందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీన్ని ఆర్దిక జాతీయవాదం అంటున్నారు.


జాతీయవాదానికి అనుగుణ్యంగా ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే అవసరాలను తీర్చుకొనేందుకు తీసుకొనే చర్యలను తప్పుపట్టనవసరం లేదు. కొన్ని సందర్భాలలో తప్పదు. ప్రపంచీకరణలో భాగంగా అమలు జరుపుతున్న ఉదారవాద విధానాలు అన్ని దేశాలకూ ఉపయోగపడటం లేదు. దానికి మన దేశమే చక్కటి ఉదాహరణ. ఇతర దేశాల వస్తువులన్నీ మన దేశంలో కుమ్మరిస్తున్నారు. ఫలితంగా స్ధానిక చేతివృత్తులు, పరిశ్రమలు, చివరికి వ్యవసాయం మీద కూడా ప్రతికూల ప్రభావాల పడ్డాయి.జాతీయ వాదాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు, కానీ జాతీయోన్మాదాన్ని ఎలా చూడాలి. పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకు వస్తారు.


జాతీయవాదంలో భాగంగా పోలీసు, మిలటరీ కాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత వస్తువుల జాబితాలో పండ్లు తోముకొనే కోల్గేట్‌ పేస్ట్‌ వంటి బహుళజాతి సంస్దల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేవీ చైనా ఉత్పత్తులు కాదు. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్రమోడీ అధికారానికి రాగానే ఈ చర్యలెందుకు తీసుకోలేదు? టిక్‌టాక్‌ లేదా ఇతర చైనా యాప్‌లు మన భద్రతకు ముప్పు అని ఆకస్మికంగా గుర్తుకు రావటం ఏమిటి ? అదే నిజమైతే దానికి మోడీ అండ్‌కోను విచారించాలా లేదా ?


దేశంలో 1991నుంచి నూతన ఆర్ధిక విధానాలకు తెరతీశారు. అప్పటి వరకు లేని స్వదేశీ జాగరణ మంచ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి తెచ్చింది. నూతన ఆర్ధిక విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు గనుక, తామూ దేశ ప్రయోజనాలకోసమే పని చేస్తామని చెప్పేందుకు ఆ సంస్ధను ఏర్పాటు చేశారు. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమిటి ?


చైనా వస్తువులను విధిగా కొనాలన్న నిబంధనలేవీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విధించలేదు. ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలేవీ చైనా వస్తువుల గురించి లాబీయింగ్‌ జరపలేదు, దిగుమతి చేసుకోవాలని అడగలేదు. చైనా పెట్టుబడుల విషయం కూడా అంతే. గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడి కావటానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన అవకాశాలు తప్ప తమ వస్తువులు కొనమని,పెట్టుబడులు తీసుకోవాలని చైనా వైపునుంచి వత్తిడేమీ లేదు. లేదా అమెరికా మాదిరి ప్రతీకార చర్యలు ఉన్నట్లు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు.


అన్ని దేశాలూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో భాగస్వాములుగా ఉన్నపుడు దాని నిబంధనలను అమలు జరపటం వాటి విధి. లేకపోతే బయటకు వచ్చే స్వేచ్చ ఉంది. కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరుపుతోందని భావిస్తున్నారు కనుక ఆ పార్టీ విధానాల మంచి చెడ్డల గురించి సహజంగానే ఆసక్తి ఉంటుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా పెట్టుకుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏ బంధం ఉందని బిజెపి ప్రతినిధి బృందాలు చైనా పర్యటనకు వెళ్లినట్లు ? నోరు తెరిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం అంటారు.


భారత్‌-చైనా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అందువలన రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు,ఇతర అనేక అంశాల గురించి రెండు దేశాలను పోల్చటం నరేంద్రమోడీ అధికారంతో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో జరుగుతోంది.చైనాతో మన దేశాన్ని పోల్చటాన్ని కొందరు దేశ ద్రోహంగానూ, చైనా భక్తిగానూ వర్ణిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో ఆ దాడి ఎక్కువగా ఉంది. చైనాతో మన దేశాన్ని పోల్చి ఎక్కువగా మాట్లాడుతున్నదెవరు ? నరేంద్రమోడీ ప్రధాని అయిన ఆరునెలల్లోపే చైనాను సందర్శించిన బిజెపి బృందాలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే రాజకీయ పాఠశాలలను ఎందుకు సందర్శించాయి. మేము కూడా కమ్యూనిస్టు పార్టీ మాదిరే పార్టీని విస్తరిస్తామని, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందెవరు? చైనా కమ్యూనిస్టు పార్టీతో పోల్చుకున్నదెవరు?


చైనాను పక్కకు నెట్టి ప్రపంచానికి వస్తువులను అందిస్తామంటూ మేకిన్‌ ఇండియా, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అని, త్వరలో జిడిపి రేటులో చైనాను అధిగమిస్తామని చెబుతున్నదెవరు ? ప్రతి ఏటా అనుకూలంగానో వ్యతిరేకంగానో చైనా వస్తువుల గురించి మాట్లాడుతున్నది వారే. అంతెందుకు 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సర్వేలో చైనా మాదిరి ఉపాధి, అభివృద్ది గురించి దాదాపు పదిపేజీలు కేటాయించి రాసినవారెవరు ? దీన్ని పోలిక అంటారా మరొకపేరుందా ?ఒక వేళ అదే దేశద్రోహం అయితే సంఘపరివార్‌ శక్తులే తొలి దేశద్రోహులు అవుతారు. చైనాను పక్కన పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాల సరసకు దేశాన్ని తీసుకుపోతామని చెబుతారు. దాన్నేమంటారు ? పోలిక తప్పు కాదు. అయినా పోల్చిన వారిని దేశవ్యతిరేకులు అంటున్నారంటే జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప అది జాతీయవాదమా ? జాతీయోన్మాదమా ?


వలస పాలనను వ్యతిరేకించటం స్వాతంత్య్రానికి ముందు జాతీయవాదం. ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, డచ్‌, పోర్చుగీసు, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలలో జాతీయ వాదం ముందుకు వచ్చింది. తమ దేశం ప్రపంచంలో పై చేయి సాధించాలంటే ప్రపంచాన్ని ఆక్రమించాలనేది వాటి జాతీయ వాదం. చైనా,జర్మనీ, దక్షిణకొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడుతూ వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలను కోవటంలో తప్పు లేదు. వాటిని పక్కకు నెట్టి ఆ స్ధానాన్ని మనమే ఆక్రమించాలనుకుంటే అది సమస్యలకు దారి తీస్తుంది. నాడు జాతీయవాదంతో ఐరోపా దేశాలు పోటీపడి తొలుత ప్రాంతీయ యుద్ధాలు తరువాత ప్రపంచ యుద్ధాలకే పాల్పడ్డాయి. వస్తు తయారీ జాతీయ వాదం ముదిరితే అది వాణిజ్య యుద్దాలకు దారి తీస్తుంది.


అమెరికాను మరోసారి అగ్రస్ధానంలో నిలబెడతానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మంచి రోజులు తెస్తానని మన నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఇద్దరూ విఫలమయ్యారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంలోనూ అదే రికార్డు. వైరస్‌ నివారణ రాష్ట్రాల బాధ్యత అని తప్పించుకొనేందుకు పూనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మహమ్మారులు చుట్టుముట్టినపుడు దేశపాలకులు తమ బాధ్యత లేదని తప్పించుకుంటే కుదరదు. జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోతానని నరేంద్రమోడీ చెప్పారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా సాధిస్తారా ? ఏ క్షణంలో అయినా కరోనా కేసుల్లో మన దేశాన్ని అమెరికా సరసన చేర్చే దిశలో ఉన్నారు. నరేంద్రమోడీ ఘోరవైఫల్యంగా ప్రపంచం కరోనా విస్తరణను చూస్తున్నది. అదే విధంగా కరోనా వైరస్‌ను తక్కువ చేసి మాట్లాడటం ట్రంప్‌ ఏలుబడిలోని అమెరికా చరిత్రలో అతి పెద్ద గూఢచర్య వైఫల్యంగా చరిత్రలో నమోదైంది. చరిత్రలో అమెరికా ఎంత ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదో అదే బాటలో భారత్‌ కూడా పయనిస్తున్నది. రెండింటికీ కరోనా ఒక్కటే కారణం కాదు. రాకెట్‌ మాదిరి అమెరికాలో ఆర్ధిక స్దితి తిరిగి దూసుకుపోనుందని ట్రంప్‌ కనీసం మాటలైనా చెబుతున్నారు. నరేంద్రమోడీ నుంచి ఒక్క మాటైనా విన్నామా ?


డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఒకే కంచం-ఒకే మంచం స్నేహితుల మాదిరి ఉన్నారు. ఇద్దరూ తమ వైఫల్యాలను లేదా ఆర్ధిక, కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకు వచ్చారు. ఒక రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తున్నదనే పేరుతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో చైనా యాప్‌లను మోడీ నిషేధించారు. ఇలా ఇద్దరు స్నేహితులూ ప్రజాకర్షక జాతీయవాద పులి స్వారీ చేస్తున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేనట్లయితే దానికి బలికావాలి ! ఇద్దరు స్నేహితులకు ఆ సత్తా ఉందా ?