Tags

, ,


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న అమెరికాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గత వారం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మండలిలోని 15 మందికి గాను 13 మంది ఇరాన్‌ మీద తిరిగి ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు లేఖలు అందచేశారు.2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించించిదని ప్రకటించేందుకు ఐరాస ప్రధాన కార్యాలయానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు ఈ లేఖలు శరా ఘాతం మాదిరి తగిలాయి. అయితే తాము ఏకపక్షంగా ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. అయితే ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగినందున ఆంక్షలను అమలు జరపాలని కోరే హక్కును కోల్పోయిందని పదమూడు మంది పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు18తో ఆయుధాల విక్రయంపై ఇరాన్‌ మీద ఉన్న ఆంక్షల గడువు ముగియనుంది. భద్రతా మండలి ఆమోదం పొంది ఉంటే మరికొంత కాలం ఆంక్షలు కొనసాగేవి. ఈ పరిస్ధితిపై చర్చించేందుకు సమావేశం కావాలని రష్యా ప్రతిపాదించింది. తాము హాజరు కావటం లేదని ట్రంప్‌ ప్రకటించాడు.


కిందపడినా తనదే పై చేయి అన్నట్లుగా అమెరికా తప్పుడు వాదనకు పూనుకుంది. తాను ఒప్పందం నుంచి వైదొలిగినా 2015లో సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం ఒప్పందం ప్రకారం భద్రతా మండలి ఆమోదించిన తీర్మానంలో సాంకేతికంగా తాము కూడా సంతకం దారుగా ఉన్నందున తిరిగి ఆంక్షలను విధించాలని కోరే హక్కు తమకు ఉన్నదని ట్రంప్‌ సర్కార్‌ విఫలవాదన చేసింది. ఆ వాదనను తిరస్కరిస్తున్నట్లు అమెరికా మిత్రరాజ్యాలైన జర్మనీ, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ స్పష్టం చేశాయి. అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించిన సభ్యదేశాలలో రష్యా, చైనా,జర్మనీ, బెల్జియం, వియత్నాం, నైగర్‌, సెయింట్‌ విన్‌సెంట్‌, గ్రెనడైన్స్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఎస్తోనియా, ట్యునీసియా ఉన్నాయి.కేవలం డొమినికన్‌ రిపబ్లిక్‌ ఒక్కటే ఈ సమస్యపై లేఖను ఇవ్వాల్సి ఉంది. అయితే అంతకు ముందు జరిగిన చర్చలో ఇరాన్‌ మీద ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను బలపరచిన దేశం అదొక్కటే కావటంతో లేఖను కూడా అదే మాదిరి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
భద్రతా మండలిలో తగిలిన ఎదురు దెబ్బతో దిమ్మతిరిగిన మైక్‌ పాంపియో ఉక్రోషం వెళ్లగక్కుతూ యూరోపియన్లు అయాతుల్లాల వైపు ఉండేందుకు నిర్ణయించుకున్నారని నోరు పారవేసుకున్నాడు.భద్రతా మండలిలో అమెరికన్లు అపహాస్యం పాలయ్యారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. డెబ్బయి అయిదు సంవత్సరాల ఐరాస చరిత్రలో తమ శత్రువు ఇంతగా ఒంటరి పాటు కావటం గతంలో జరగలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.అయినా తాను తగ్గేది లేదని ట్రంప్‌ ప్రకటించాడు. తామేం చేసేది త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించాడు.
భద్రతా మండలి తీర్మాన తిరస్కరణతో గల్ఫ్‌ ప్రాంతంలో తలెత్తిన పరిస్ధితి గురించి చర్చించేందుకు చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, అమెరికా, ఇరాన్‌కు రష్యా చేసిన ప్రతిపాదన మేరకు జరిగే వీడియో సమావేశంలో తాను పాల్గొనకపోవచ్చని ట్రంప్‌ చెప్పాడు. సమావేశ ప్రతిపాదనను చైనా స్వాగతించింది. 2018లో సంయుక్త సమగ్రకార్యాచరణ పధకం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత దానిలో అమెరికా భాగస్వామి కాదని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఈ పధకానికి తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని అమెరికా చర్యను తాము సమర్ధించలేమని, ఒప్పందానికి మద్దతు యత్నాలకు ఇది పొసగటం లేదని పేర్కొన్నాయి. ఒప్పందానికి అనుగుణంగా లేని చర్యలనుంచి వెనక్కు తగ్గాలని తాము ఇరాన్‌పై వత్తిడి తెస్తామని మూడు దేశాలు స్పష్టం చేశాయి.
తమ మిత్రులుగా ఉన్న ఇ3(బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌) దేశాలు ఇరాన్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వకపోవటం తమకు ఆశాభంగం కలిగించిందని ఇజ్రాయెల్‌ వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌తో మంగళవారం నాడు సమావేశమైన ఇజ్రాయెల్‌ మంత్రి అషెకెనాజీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ఇరాన్‌ స్పందించిన తీరు ఈ ప్రాంత భద్రతకు ముప్పు తెచ్చేదిగా ఉందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.
మూడు అణువిద్యుత్‌ కర్మాగారాలలో అణుశుద్ధి కార్యక్రమం నుంచి ఇరాన్‌ వైదొలిగితే దానికి పరిహారంగా ఆంక్షల తొలగింపు, ఇతర సహాయం చేస్తామంటూ భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ భాగస్వాములుగా 2015లో ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.2018లో దీన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అయితే ఇరాన్‌ గనుక ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే దానిలో భాగస్వాములైన ఏ దేశమైనా తనంతటతానుగా 2007నాటి భద్రతా మండలి తీర్మానంలో పేర్కొన్న ఆంక్షల విధింపునకు చర్య తీసుకోవచ్చనే నిబంధన కూడా ఉంది. 2007నాటి తీర్మానంలో తాము భాగస్వాములం కనుక ఆ మేరకు ఆంక్షలు విధించవచ్చనే వితండవాదానికి అమెరికా దిగింది.అది ఒప్పందానికి కట్టుబడి ఉన్న ఇతర భాగస్వాములకు తప్ప వైదొలగిన అమెరికాకు లేవని మిగిలిన దేశాలు చెబుతున్నాయి. ఎవరూ తమను అనుసరించకపోయినా తాము ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా అంటోంది. నిజానికి 2018 తరువాత అమెరికా అదరగొండితనంతో తన ఆదేశాలను పాటించని దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తానని బెదిరిస్తోంది. దానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు సైతం మినహాయింపులేదని అమెరికా చెప్పటంతో మన దేశం భయపడి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.
అయితే అమెరికా బెదిరింపులకు భయపడి మిగతా దేశాలేవీ ఇరాన్‌తో సంబంధాలను వదులుకోలేదు. అంతర్జాతీయ నిబంధనలు, తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామే తప్ప ఇరాన్‌తో సంబంధాలను వదులుకొనేది లేదని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రియబకోవ్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిని కొన్ని ముడుల మధ్య బంధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా చర్య అక్రమం అని చైనా పేర్కొన్నది. అంతే కాదు పాతిక సంవత్సరాల వ్యవధిలో ఇరాన్‌లో 400 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్దం అవుతోంది. ఒప్పందం ప్రకారం తమకు చేస్తామన్న సాయం రానపుడు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇరాన్‌ చెబుతోంది. తాము పూర్తి స్ధాయి అణుశుద్ధి చేస్తున్నపుడు విధించిన వాటి కంటే తీవ్రమైన ఆంక్షలను ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటున్నది. అణురియాక్టర్లలో వినియోగించే అణు ఇంధనాన్ని ఐదుశాతానికి మించి శుద్ది చేయకూడదు. ఒప్పందం ప్రకారం 3.67శాతం మించకూడదు. అయితే ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినందున మిగతా సభ్యదేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై వత్తిడి తెచ్చేందుకు ఇరాన్‌ 4.5శాతానికి పెంచింది
2015లో అంగీకరించిన దానికి మించి అదనపు నిబంధనలను తాము అంగీకరించేది లేదని మంగళవారం నాడు ఇరాన్‌ స్పష్టం చేసింది. ఐరాస అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ ప్రతినిధి(ఐఏఇఏ) బృందం సోమవారం నాడు ఇరాన్‌ పర్యటనకు వచ్చింది. బహిర్గతం చేయకుండా నిల్వ చేసిన లేదా ఉపయోగించిన అణుపదార్ధాల తనిఖీకి అనుమతించాలని ఆ బృందం కోరుతోంది. గత ఏడాది వరకు ఒప్పందానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ వ్యవహరిస్తున్నట్లు ఐరాస బృందం నివేదించింది. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత పరిమితికి మించి అణు శుద్ధి చేస్తున్నట్లు బహిరంగంగానే ఇరాన్‌ చెబుతోంది. తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామని అణుశక్తి సంస్ద ప్రతినిధి బృంద నేత రాఫెల్‌ గ్రాసీతో కలసి టెహరాన్‌లో విలేకర్లతో మాట్లాడిన ఇరాన్‌ ప్రతినిధి అలీ అక్బర్‌ సలేహీ స్పష్టంగా చెప్పారు. రెండు అణుకేంద్రాలను తనిఖీ చేయాలని ఐఏఇఏ కోరుతోంది. గత ఏడాది వాటి తనిఖీని ఇరాన్‌ అడ్డుకుందని, వాటిలో ఒక దానిని 2004లో పాక్షికంగా ధ్వంసం చేశారని, మూడవదానిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అణుకేంద్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామనే ఆరోపణలను తాము ఖండిస్తున్నామని, ఒప్పందానికి తాము కట్టుబడే ఉన్నామని ఇరాన్‌ చెబుతోంది
టెహరాన్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని ఇరాన్‌ అతి పెద్ద నాటంజ్‌ యురేనియం శుద్ధి కర్మాగారంలో గత నెలలో జరిగిన పేలుడు, చెలరేగిన అగ్ని విద్రోహచర్యల్లో భాగమే అని ఇరాన్‌ అణు శక్తి సంస్ధ చెబుతోంది. కేంద్రం పరిసరాలలో చెలరేగిన మంటలకు సైబర్‌ దాడులు కారణం కావచ్చని తొలుత అధికారులు భావించారు. అక్కడ మరింత ఆధునిక పరికరాలను అమర్చుతామని ప్రకటించారు. ఇక్కడ యురేనియం శుద్ధిని మరింతగా పెంచినట్లు, ఇది 2015 ఒప్పంద ఉల్లంఘనే అని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు కథనాలను వెల్లడించాయి. ముందే చెప్పుకున్నట్లు తక్కువ శాతం శుద్ధి మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఆయుధ తయారీకి ఉపయోగించే యురేనియం 90శాతం ఉన్నట్లు ఆరోపించాయి. ఒప్పందం ప్రకారం నాంటజ్‌లో 2026వరకు 5,060 సెంట్రిఫ్యూజస్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఫోర్డోలోని భూగర్భ కేంద్రంలో 2031 వరకు ఎలాంటి శుద్ధి చేయకూడదు. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత నాంటజ్‌లో ఆధునిక సెంట్రిఫ్యూజస్‌ను రెట్టింపు చేసిందని, ఫోర్డోలో సెంట్రిఫ్యూజస్‌లోకి హెక్సాఫ్లోరైడ్‌ గ్యాస్‌ను ఎక్కిస్తున్నారని చెబుతున్నారు.ఇప్పుడు భద్రతా మండలితో నిమిత్తం లేకుండా అమెరికా ప్రకటించిన ఆంక్షల గురించి రానున్న రోజుల్లో పరిణామాలను చూడాల్సి ఉంది.