Tags


ఎం కోటేశ్వరరావు


మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా ఉత్తినే తిని తొంగుంటే మడికి గొడ్డుకు తేడా ఏటుంటాది అన్న మాటలను ముత్యాలముగ్గు సినిమాతో ప్రముఖ దర్శకుడు బాపు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి తెచ్చారో తెలిసిందే. అదే మాదిరి దేశం కష్టకాలంలో ఉన్న తరుణంలో జనానికి కాస్త వినోదం పంచుదామని ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించారా ?


రోజు రోజుకూ కొత్త రికార్డులను స్ధాపిస్తూ దేశంలో కరోనా కేసులు ఒక వైపు పెరిగి పోతున్నాయి. అనేక రాష్ట్రాలలో వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉపాధి ఎంతగా పోయిందో తెలిపే లెక్కలను చూసి అప్పటి వరకు మంచి రోజులు రాక పోతాయా అనే ఆత్మ ధైర్యంతో ఉన్న నిరుద్యోగులు ఆత్మ నిబ్బరాన్ని కోల్పోతున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారిన తీరును చూసి సామాన్య జనం సామూహిక గుండెపోటుకు గురి కాకుండా ఎంతగా పతనం అయిందో అనేక సంస్ధలు, వ్యక్తులు అంచనాలతో జనాన్ని మానసికంగా సిద్దం చేస్తున్నారు. ఇరవైనుంచి ఇరవై ఆరుశాతం వరకు అంటే నాలుగో వంతు వరకు మరో విధంగా చెప్పాలంటే గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఒకటి దెబ్బతిన్నదనే రీతిలో వార్తలు వస్తున్నాయి.


ఈ స్దితిలోనే మన ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఆత్మనిర్భర నినాదమిచ్చారు. అదేమిటో అర్ధంగాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో నినాదాలిచ్చారు, ప్రధాని పొదిలో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిని కూడా రానివ్వండి చూద్దాం అన్నట్లుగా లేదా మన కెందుకులే అని గానీ మేథావుల జాబితాలో ఉన్న వారు వేచి చూస్తున్నారు. సరే వంది మాగధులు, భజన పరుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేముంది !


ఎప్పుడూ కష్టాలూ, కన్నీళ్లేనా కాస్త ఉపశమనం పొందొచ్చు కదా అన్నట్లుగా తాను నెమళ్లకు మేత ఎలా వేస్తున్నదీ, తనను చూడగానే అవి పురివిప్పి ఎలా ఆడేది, వాటిని తాను కూడా మెప్పించేందుకు మరింతగా ఆడేందుకు రకరకాల డ్రస్సులను ధరించి అలరిస్తున్నారో చూపుతూ మన ప్రధాని నరేంద్రమోడీ గత ఆదివారం నాడు (ఆగస్టు 23న) యావత్‌ ప్రపంచాన్ని ఒక నిమిషం 47సెకండ్ల పాటు రంజింప చేసే ఒక వీడియోను స్వయంగా విడుదల చేశారు. ఎన్నికల్లో పీకల్లోతు మునిగి ఉన్న మోడీ గారి జిగినీ దోస్తు ట్రంప్‌ చూశారో లేదో లేక ఇంతకంటే వినోదం రోజూ కలిగిస్తున్నాగా దీనిలో ఏముంది అని విస్మరించారో గానీ ఎలాంటి ట్వీటు స్వీటు మనకు పంచలేదు.
ప్రధాని మోడీ ఏమి చేసినా గొప్పే కనుక మన మీడియా నెమలి వీడియోకు బాగానే ప్రాచుర్యం కలిగించింది. చూడని వారి ఖర్మ చేసేదేమీ లేదు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం మిగిలి ఉంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు పాకేజీలకు అమ్ముడు పోయి కొందరు నేతలు, కొన్ని పార్టీలకు అనుకూలంగా ఎలా ప్రచార అవకాశాలు కల్పిస్తున్నాయో రోజూ వార్తల్లో చూస్తున్నాం. కేవలం భజన పరులకే అవకాశం ఇస్తే కొంతకాలానికి వాటి ముఖం చూసే వారు ఉండరు కనుక భిన్నమైన అభిప్రాయ వ్యక్తీకరణకు కూడా చోటు కల్పిస్తున్నాయి. చట్టాలు కొందరికే తప్ప అందరికీ ఒకే విధంగా వర్తించవు అనే అభిప్రాయం ప్రధాని నెమలి ఉదంతంతో వెల్లడైంది.


నెమలి జాతీయ పక్షి. దాన్ని స్వేచ్చగా ఉండనివ్వాలి తప్ప ఎవరూ మచ్చిక చేసుకో కూడదు. దేశంలో ఉన్న చట్టాల ప్రకారం అది నేరం. 2017లో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, గడ్డి కుంభకోణం ఫేం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంటికి రెండు నెమళ్లను తీసుకు వచ్చారు.1972 వన్య ప్రాణి రక్షణ చట్టం ప్రకారం అలా తీసుకురావటం నేరమని, కేసు బనాయించి శిక్షించాలని బీహార్‌ బిజెపి అప్పుడు ఆందోళన చేసింది. ఇటీవలనే బిజెపి నేస్తం నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు నుంచి లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్‌జెడిలో చేరిన శ్యామ్‌ రాజక్‌ అనే నేత ప్రధానిని తప్పు పట్టారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని ప్రతి ఒక్కరూ విధిగా అనుసరించాలి, ప్రత్యేకించి ప్రధాని దాన్ని అమలు జరపాలి అని చెప్పారు.


మన ఆర్ధిక వ్యవస్ధ రక్తమోడుతోంది. రోజుకు వెయ్యి మంది కరోనాతో మరణిస్తున్నారు, 70వేల మందికి సోకుతోంది. ఇలాంటి సమయంలో ప్రధాని సామాజిక మాధ్యమంలో అలాంటి వీడియోను విడుదల చేయటం ఎబ్బెట్టుగా ఉంది, జనం ఇబ్బందుల్లో ఉన్నపుడు రోమన్‌ పాలకులు పరిహాసం చేసినట్లుగా ఉంది అని ఆర్‌జెడి ఎంపీ మనోజ్‌ ఝా స్పందించారు.


నెమళ్లను పక్కనుంచుకుంటే ఇబ్బందులు తొలుగుతాయని, అదృష్టం వరిస్తుందని లాలూ ప్రసాద్‌ యాదవుకు జ్యోతిష్కులు చెప్పారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవటం, కేసులు చుట్టుముట్టటంతో 2017లో అధికారంలో ఉన్న తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్న అటవీశాఖ నుంచి రెండు నెమళ్లను తెప్పించారు. దేశ ఆరోగ్యం బాగోలేదు, ఆర్ధిక వ్యవస్ద దెబ్బతిన్నది తప్ప నరేంద్రమోడీకి అలాంటివేమీ లేవు. లాలూ నెమళ్లను తెప్పించటం మీద బిజెపి రభస చేసింది. అయితే నెమళ్లు కీటకాలను తింటాయని అందువలన పాట్నాలోని ముఖ్యమంత్రి, గవర్నరు, ఇతర ప్రముఖుల నివాసాల్లో వంద నెమళ్లను విడుదల చేయాలని చేసిన నిర్ణయం మేరకే ఆ పని చేశామని అధికారులు సమర్ధించుకున్నారు. అయితే రెండు రోజుల తరువాత తన నివాసంలో వదలిన రెండు నెమళ్లు ఎగిరిపోయాయని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విలేకర్లతో చెప్పి వివాదానికి ముగింపు పలికారు. అవి పాట్నాలోని సంజయ గాంధీ బయలాజికల్‌ పార్కుకే చేరుకున్నాయని వార్తలు రావటం ఆ ఉదంతంలో కొసమెరుపు. అయితే అదే సమయంలో కృష్ణ జింక వివాదంలో సల్మాన్‌ ఖాన్‌ కేసు ప్రముఖంగా మీడియాలో వచ్చిన నేపధ్యంలో ఇది జరిగింది. వివాదాస్పదం కావటంతో తప్పనిసరై లాలూ మీద కేసు నమోదు చేశారు గానీ, నివాసంలో ఎలాంటి నెమళ్లు దొరకలేదని కూడా విచారణలో తేల్చారు.


తాజాగా ప్రధాని మోడీ నెమళ్ల వ్యవహారం వెలుగులోకి రావటంతో బిజెపి, మీడియా కొత్త పల్లవి అందుకుంది. లాలూ ప్రసాద్‌ నెమళ్లను పంజరంలో ఉంచారు. ప్రధాని మోడీ నివాసంలో అవి స్వేచ్చగా తిరుగుతున్నాయి అని బిజెపి ప్రతినిధి రజనీ రంజన్‌ పటేల్‌ సమర్ధించుకున్నారు. ఒక్క ప్రధాని నివాసంలోనే కాదు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నెమళ్లు స్వేచ్చగా తిరగటాన్ని చూడవచ్చు అని కూడా చెప్పారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా నరేంద్రమోడీ ఉదయ వ్యాహ్యాళి సమయంలో నెమళ్లు ఆయన్ను అనుసరిస్తాయని, అవి స్వేచ్చగా ఉండేందుకు నివాసంలో పెద్ద పంజరాల వంటివి ఏర్పాటు చేశారని కూడా మీడియా రాతగాళ్లు కొందరు పేర్కొన్నారు. ప్రధాని నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న లోఢ గార్డెన్స్‌ నెమళ్ల పుట్టుక కేంద్రంగా ఉందని అందువలన ఆప్రాంత మంతటా నెమళ్లు తిరగటం సహజమని దానిలో భాగంగానే ప్రధాని నివాసంలోకి వచ్చి పోతుంటాయని రాస్తున్నారు. ఇది రోజువారీ వ్యవహారమే అని స్వయంగా ప్రభుత్వ సంస్ధ ప్రసార భారతి న్యూస్‌ సర్వీసు ఒక ట్వీట్‌లో పేర్కొన్నది.


ఆ వాదనలతో విబేధించాల్సిన అవసరం లేదు. కేవలం 107 సెకన్ల వీడియోలో ఫ్రధాని ఆరుసార్లు వేర్వేరు దుస్తులతో కనిపించటం విశేషం. యాదృచ్చికంగా నెమళ్లు వచ్చినపుడు వాటికి వేయటానికి ఎలాంటి ఆహారం అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఒక వేళ తరచూ వస్తున్నందున వేయటానికి కొన్ని గింజలను అందుబాటులో ఉంచుకున్నారను కోవాలి. కానీ దృశ్యాలను చూసినపుడు అలా అనిపించటం లేదు. ఆరు రకాల దుస్తులను మార్చుకున్నారంటే ఫొటో లేదా నెమలితో దృశ్యాల చిత్రీకరణకు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటే, ఎంతో సమయం వెచ్చిస్తే తప్ప సాధ్యం కాదు. వీటన్నింటిని బట్టి ప్రచారం కోసమే ఇదంతా చేసినట్లుగా కనిపిస్తోంది.
ప్రధాని నెమళ్ల వ్యవహారం చూడగానే మీడియాలో జర్మన్‌ హిట్లర్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు, వ్యాఖ్యలు దర్శనమిచ్చాయి.పిల్లలు, పిల్ల జింకలు, కుక్క పిల్లలతో ఎంతో ప్రేమగా ఉన్న హిట్లర్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అవన్నీ తాను ఎంత సున్నిత మనస్కుడనో అని ప్రపంచానికి చూపేందుకు హిట్లర్‌ తయారు చేయించిన ప్రచార చిత్రాలన్నది తెలిసిందే. నిజానికి అంత సున్నిత మనస్కుడైతే యూదులను హతమార్పించిన తీరు అంత భయంకరంగా ఉంటుందా ? పిల్లలు,స్త్రీలు, వృద్దులు అనే విచక్షణ లేకుండా మారణకాండ సాగించిన దుర్మార్గుడని తెలిసిందే. అయితే హిట్లర్‌ కుక్కల ప్రియుడు అన్నది నిజం. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్దంలో పరాజయాన్ని తట్టుకోలేక ప్రియురాలు ఎవా బరూన్‌తో కలసి ఆత్మహత్య చేసుకోబోయే ముందు తనకు ఇష్టమైన బ్లోండీ అనే పేరుతో పిలుచుకున్న జర్మన్‌ షెపర్డ్‌ కుక్కకు సైనైడ్‌ విషమిచ్చి చంపినట్లు వెల్లడైంది.


నరేంద్రమోడీ నెమళ్ల ప్రియుడా లేక నివాసంలో వచ్చినందున వాటికి ఆహారం వేశారా అన్నది ఒక అంశం. ప్రధాని నిత్యం ఉదయాన్నే నడుస్తారు గనుక ప్రతి రోజూ వచ్చి వాలే నెమళ్ల గురించి లేదా వాటికి వేసే ఆహారం నిత్యకృత్యమైతే ఎన్నడూ మీడియాలో రాలేదు,నిజంగా అంత పక్షి ప్రేమికుడే అయితే దాన్ని వెల్లడించటానికి ఆరు సంవత్సరాల వ్యవధి ఎందుకు తీసుకున్నట్లు ? మోడీ వీడియో గురించి సామాజిక మాధ్యమంలో మిశ్రమ స్పందన వెల్లడైంది. సమర్ధించిన వారు ఉన్నారు. ధైర్యం కలిగిన అధికారులెవరైనా ఉంటే అలా నెమళ్లను మచ్చిక చేసుకోవటం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరం అని ప్రధానికి చెప్పండి అన్నది వాటిలో ఒకటి. ప్రచారం కోసం తప్ప మరొకటి కాదన్నది మరొక అభిప్రాయం. సామాన్య జనం కరోనా మహమ్మారి బారిన పడినపుడు, ఆర్ధికంగా దేశం దిగజారిన స్దితిలో ఇలాంటి వీడియోలను స్వయంగా తానే విడుదల చేయటం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటి గురించి నరేంద్రమోడీ స్వయంగా మాట్లాడతారని ఎవరూ భావించటం లేదు, కనీసం తన చర్య గురించి ట్విటర్‌లో అయినా స్పందించలేదు.అయినా ఆపని చేస్తే నరేంద్రమోడీ ఎలా అవుతారు ?