Tags

, ,


ఎం కోటేశ్వరరావు
చైనాలోనూ మోడీయే….. వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. ” మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు ” అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.
యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.
భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.
భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.
చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.
జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.