Tags

, ,


ఎం కోటేశ్వరరావు


కోవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. అన్ని దేశాల పాలకులకు వైరస్‌ పెద్ద పరీక్షగా మారింది. అనేక దేశాల పాలకులు, పాలక పార్టీలు జిమ్మిక్కులు చేసి జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అనే చులకన భావం ఎల్లెడలా వ్యాపించి ఉంది.


” నరేంద్రమోడీ భారత్‌కు దైవమిచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు ” అని ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం.వెంకయ్య నాయుడు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పని చేసిన సమయంలో వర్ణించారు. 2016 మార్చి 21వ తేదీన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సమయంలో ప్రవాహంలా దొర్లిన ఈ మాటలను అప్పుడు నరేంద్రమోడీ అభిమానులు వహ్వా వహ్వా అంటూ ఎంతగానో ఆనందించారు. మీడియా కూడా ప్రముఖంగానే ఈ వార్తలను ఇచ్చింది. సమావేశం ముగిసిన తరువాత కొందరు విలేకర్లు వెంకయ్య నాయుడి పొగడ్తల గురించి అడగ్గా హౌం మంత్రిగా ఉన్న రాజనాధ్‌ సింగ్‌ వెంకయ్యగారు మాట్లాడుతుండగా తాను వినలేదని తప్పించుకున్నారు. పోనీ దేశానికి దేవుడు ఇచ్చిన బహుమతిగా నరేంద్రమోడీని మీరు గానీ బిజెపిగానీ భావిస్తున్నదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తిరస్కరించారు.
దేవుడు ఇచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు అయిన నరేంద్రమోడీ ఏలుబడిలో జరగరానివి జరిగిపోతున్నాయి. ఆగస్టు 27న జిఎస్‌టి 41వ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దైవ విధి లేదా దైవిక కృత్యం( యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ ) కారణంగా కరోనా మహమ్మారి వలన పన్ను వసూళ్లు తగ్గాయని సెలవిచ్చారు. దేశానికి తానిచ్చిన ” బహుమతి ” గురించి దేవుడు మరచి పోయినట్లా ? పేదల పాలిట రక్షకుడు వలస కార్మికులను స్వ స్ధలాలకు చేర్చటంలో ఎలా ఇబ్బందులు పెట్టారో, అలవిగాని ఇబ్బందులకు, దిక్కులేని చావులకు ఎలా కారకులయ్యారో, పని కోల్పోయిన వారి కడుపు ఎలా నింపుతున్నారో యావత్‌ దేశంతో పాటు దేవుడు కూడా చూస్తేనే ఉన్నాడు కదా !


ఐదు సంవత్సరాల పాటు జిఎస్‌టి వలన నష్టపోయే రాష్ట్రాలకు అంగీకరించిన సూత్రం ప్రకారం ఎంత నష్టమైతే అంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. 2017 జూలై ఒకటి నుంచి 2022 జూన్‌ 30వరకు ఈ అవగాహన అమల్లో ఉంటుంది. అమల్లోకి వచ్చిన తేదీ నాటికి రాష్ట్రాలకు అంతకు ముందున్న అమ్మకపు పన్ను మీద ప్రతి ఏటా 14శాతం వృద్ధి ఉంటుందనే భావనతో రాష్ట్రాల ఆదాయాన్ని లెక్కించాలి. 2017 జూలై ఒకటి నాటికి వంద రూపాయలు ఆదాయం వచ్చిందనుకుందాం. మరుసటి సంవత్సరం దాన్ని రు.114గా పరిగణించాలి. ఒక వేళ ఆ మొత్తం రాకపోతే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని ప్రతి రాష్ట్రానికి కేంద్రం చెల్లించాలి. మరుసటి సంవత్సరం 114 రూపాయలు మీద పద్నాలుగు శాతాన్ని పెంచి లెక్కించితే ఆ మొత్తం రు.129.96 అవుతుంది.తరువాత రూ.148.15కు పెరుగుతుంది. ఇలా ఐదు సంవత్సరాలు పెంచుతూ అమలు జరపాలి, సదరు మొత్తాలకు ఎంత తగ్గితే అంత మొత్తాన్ని కేంద్రం ఇవ్వాలి.


గత ఏడాది అంటే 2020 మార్చి నెల వరకు నష్టం మొత్తాన్ని చెల్లించిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి చెల్లింపులను నిలిపివేసింది. నలభై ఒకటవ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశానికి నివేదించిన వివరాల ప్రకారం 2020-21 సంవత్సరానికి మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గుతుందని, జిఎస్‌టి సెస్‌ ద్వారా రూ.65వేల కోట్ల మేరకు సమకూరుతుందని, నిఖర ఆదాయ లోటు రూ.2.25లక్షల కోట్లని చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రం చెల్లించాలన్నది రాష్ట్రాల డిమాండ్‌. అయితే రుణాలు తీసుకొని నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకొంటే తరువాత ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని దానికి గాను రెండు పద్దతులలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని కేంద్రం కోరింది. దీనికి గాను వారం రోజుల గడువును రాష్ట్రాలు కోరాయి.


సాధారణ పరిస్ధితుల్లో అవగాహన ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని అయితే ఆ మొత్తం సెస్‌ నిధి నుంచి తప్ప ఇతర ఖాతాల నుంచి చెల్లించకూడదని అటార్నీ జనరల్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.అయితే దైవిక కృత్యాల ద్వారా ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాలన్న నిబంధన లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశంలో వాదించారు. అదే పల్లవిని బిజెపి పాలిత రాష్ట్రమైన అసోం ఆర్ధిక మంత్రి హేమంత బిస్వాస్‌ శర్మ అందుకున్నారు. వారం తరువాత రాష్ట్రాలు ఏమి చెబుతాయి అన్న అంశాన్ని పక్కన పెడితే దైవిక కృత్యం పేరుతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు చెల్లించాల్సిందేమీ లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే దేవుడి పేరుతో శఠగోపం పెట్టటాన్ని రాష్ట్రాలు ఎలా పరిగణిస్తాయి, పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. లోటును పూడ్చుకొనేందుకు రాష్ట్రాలకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. జిఎస్‌టి పరిధిలో లేని మద్యం, చమురు, మరికొన్ని వస్తువులపై ఇప్పటికే రాష్ట్రాలు గరిష్టంగా పన్ను వసూలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డీజిలు, పెట్రోలు ధరల విధానాన్ని పక్కన పెట్టి వాటిమీద పన్నులను పెంచటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా ధరలు పెంచుతూ వినియోగదారుల జేబులు కొడుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాలు నిధుల లేమితో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అందుకోసం వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని పట్టించుకోకుండా మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం, రాష్ట్రాలు మద్యం ధరలను విపరీతంగా పెంచిన తీరును చూశాము. ఇప్పుడు రానున్న రోజుల్లో జిఎస్‌టి ఆదాయం తగ్గటం ఖాయమని తేలిపోయినందున వివిధ వస్తువులపై జిఎస్‌టిని పెంచినా చేసేదేమీ లేదు. పెట్రోలు, డీజిలు ధరలను భరిస్తున్నట్లే జనం జిఎస్‌టి పెంపుదలకు కూడా నోరెత్త కుండా అలవాటు పడాల్సి ఉంటుంది.


అనేక మంది నిపుణులు, సంస్ధలు, సర్వేలు దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం గురించి పెదవి విరుస్తున్నాయి తప్ప ఆశాభావం వెలిబుచ్చటం లేదు. కానీ అధికారపక్షం బిజెపి మాత్రం దేశం వెలిగిపోనుందని చెప్పటం గమనించాల్సిన అంశం. ఆగస్టు 22న ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ఒక ట్వీట్‌ చేసింది. దానికి మద్దతుగా సమాచారం ఉన్న చిత్రాన్ని కూడా జత చేసింది. ట్వీట్‌లో ఇలా ఉంది. ” కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రధాన దేశాలన్నీ తిరోగమన వృద్ధితో ప్రపంచం ఆర్ధికంగా రక్తమోడుతూ తంటాలు పడుతుండగా 2020లో సానుకూల వృద్దితో వెలిగిపోయే చోట భారత్‌ ఉంటుంది. వేగంగా అభివృద్ది చెందుతున్న దేశ స్దాయిని అది నిలబెట్టుకుంటుంది ” అని పేర్కొన్నది.
పైన పేర్కొన్న అభిప్రాయాన్ని బలపరుస్తూ బిజెపి విడుదల చేసిన చిత్రంలో ” కోవిడ్‌-19 సమయంలో భారత అసమాన ఆర్ధిక పోరాటం ” అని ఒక నినాదం ” 2020లో ప్రపంచంలోని పెద్ద ఆర్ధిక వ్యవస్దలలో అత్యధిక జిడిపి అభివృద్దిని నమోదు చేసేందుకు భారత్‌ నడుం కట్టింది ” అని మరొక నినాదాన్ని రాశారు. వాటి కింద భారత్‌ 1.9శాతం, చైనా 1.2 శాతం చొప్పున వృద్ది చెందుతాయని, అమెరికా 5.9, జర్మనీ 7, ఫ్రాన్స్‌ 7.2, ఇటలీ 9.1, స్పెయిన్‌ 8, జపాన్‌ 5.2, బ్రిటన్‌ 6.2 , కెనడా 6.5 శాతాల చొప్పున తిరోగమన వృద్ధి నమోదు చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంకెలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఐఎంఎఫ్‌ అంకెలకు, ఇతర సంస్దల అంచనాలకు తేడాలుంటాయి. వాటి గురించి పేచీ లేదు. ఈ అంకెలతో బిజెపి జనాన్ని తప్పుదారి పట్టించింది అన్నదే గమనించాల్సిన అంశం. ఇదే బిజెపి ఏప్రిల్‌ 15న చేసిన ఒక ట్వీట్‌లో ఇదే అంకెలతో భారత అభివృద్ది గురించి పేర్కొన్నది. అప్పటి చిత్రంలో 2021లో పైన పేర్కొన్న దేశాల ఆర్ధిక వ్యవస్ధలు పురోగమనంలో ఉంటాయని ఐఎంఎఫ్‌ అంకెలను పేర్కొన్నది. ఇప్పుడు వచ్చే ఏడాది అంచనాలను తొలగించి వర్తమాన సంవత్సరానికి నాలుగు నెలల క్రితం వేసిన అంచనాలు తాజావి అన్నట్లుగా పాత అంకెలనే బిజెపి ఆగస్టు 22న ట్వీట్‌ చేసింది. ఇది తప్పుదారి పట్టించటం తప్ప నిజాయితీ కాదు.


ఈ ఏడాది మిగిలిన కాలమంతా తీవ్ర ఆర్ధిక మాంద్యంలో ఉంటుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో మాత్రమే కోలుకోవటం ప్రారంభం కావచ్చని ఆగస్టు 18-27 మధ్య రాయిటర్స్‌ వార్తా సంస్ద నిర్వహించిన అభిప్రాయసేకరణలో ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తిని చూస్తే సమీప భవిష్యత్‌లో కోలుకొనే అవకాశాలు కనిపించటం లేదని, ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున జనం దగ్గర పొదుపు చేసుకున్న మొత్తాలు కూడా కరిగిపోతాయని, తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 18.3శాతం కుంగిపోనుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మూడు నెలల్లో వృద్ధి రేటు మూడుశాతం మాత్రమే ఉండవచ్చని చెప్పారు. కరోనాకు ముందు స్ధితికి చేరుకొనేందుకు ఏడాది పట్టవచ్చని 80శాతం మంది ఆర్ధికవేత్తలు చెప్పారు. మిగిలిన వారు రెండు సంవత్సరాలకు పైగా పట్టవచ్చని మిగిలిన వారు చెప్పారు.


ప్రతి ఏటా ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌లో ఒకసారి, సెప్టెంబరు లేదా అక్టోబరులో రెండవ సారి ఆర్ధిక వ్యవస్ధల గురించి అంచనాలు, జోశ్యాన్ని వెల్లడిస్తుంది. అయితే కరోనా కారణంగా జూన్‌లో కూడా అంచనాలను సవరించింది. దాని ప్రకారం 2020లో చైనాలో ఒక శాతం పురోగమనం, మన దేశంలో 4.9శాతం తిరోగమనంలో ఉంటుందని పేర్కొన్నది. కానీ బిజెపి మాత్రం 1.9శాతం పురోగమనం అని వెలిగిపోతున్న చోట దేశం ఉందని, వేగంగా అభివృద్ది చెందుతున్నదని ఐఎంఎఫ్‌ పేరుతో బుకాయిస్తున్నది ! తప్పుడు విధానాలతో కరోనాతో నిమిత్తం లేకుండానే దేశాన్ని దిగజార్చిన వారు, కరోనా పేరుతో ఎంతకైనా దిగజారేందుకు సిద్ద పడుతున్నారా ?