Tags

,


ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం మన ప్రధాని నరేంద్రమోడీని చైనీయులు తమ నేతల కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారని అక్కడి అధికార దినపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే వెల్లడించిందని ఒక కల్పిత వార్తను కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు ప్రచురించాయి. ఆహా ఓహౌ అని కొందరు సంబరాలు చేసుకున్నారు. నిజానికి ఆ సర్వే గురించి సదరు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ ప్రస్తావనే లేదు.


ఇప్పుడు అలాంటి వారందరికీ దిమ్మ దిరిగే స్పందన మన దేశంలో వెల్లడైందని చెప్పవచ్చు. ఆగస్టు 30 ఆదివారం నాడు మన ప్రధాని మన్‌కీ బాత్‌ – మనసులోని మాట – ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే మోడీ అభిమానుల్లో ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. దీని భావమేమి రామచంద్ర ప్రభూ ! అయిష్టత ప్రకటించిన వారందరూ విదేశీయులే, కేవలం రెండు శాతం దేశీయులు మాత్రమే వారిలో ఉన్నారు అని బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ సెలవిస్తే, ఇదంతా కాంగ్రెస్‌ చేయించింది అని బిజెపి కేంద్ర ప్రతినిధి విజరు సోంకర్‌ శాస్త్రి తమతో వ్యాఖ్యానించినట్లు ” ది ప్రింట్‌ ” పేర్కొన్నది.
నెటిజన్లు అయిష్టత ప్రకటించిన విషయాన్ని ఏ సీతారామ్‌ ఏచూరో, రాహుల్‌ గాంధీయో లేదా మరొకరో చెప్పలేదు. నరేంద్రమోడీ ప్రచారం కోసం ప్రభుత్వం, బిజెపి ఏర్పాటు చేసిన అధికారిక ఛానల్స్‌ స్వయంగా వెల్లడించిన సమాచారమే. ఆ ఛానళ్లకు ఖాతాదారులుగా చేరిన వారిలో అత్యధికులు బిజెపి కార్యకర్తలు లేదా నరేంద్రమోడీ అభిమానులే ఉంటారన్నది తెలిసిందే. తాజా స్పందన ద్వారా తమ మనసులో ఉన్న మాటలను మోడీ విస్మరిస్తున్నారని అభిమానులు ఆగ్రహిస్తున్నారా ? ఏమిటీ అసందర్భ ప్రసంగాలని విసుక్కుంటున్నారా ?


మనసులోని మాట పేరుతో ప్రధాని కార్యాలయ యంత్రాంగం లేదా పార్టీ యంత్రాంగం రాసి ఇచ్చిన దానిని చెబుతున్నారో లేక నిజంగా తన మనసులోని మాటనే చెబుతున్నారో మనకు తెలియదు. మనకు కనిపించేది, వినిపించేది మోడీయే కనుక అవి స్వంత భావాలుగానే పరిగణించాలి. ఇంత వరకు ప్రతినెలాఖరులో 68 సార్లు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. ప్రభుత్వ సామాజిక మాధ్యమ ఖాతాలతో పాటు దూరదర్శన్‌, రేడియో కేంద్రాలు, బిజెపి అధికారిక యూట్యూబ్‌ ఛానల్స్‌, మరికొన్ని ఛానల్స్‌ కూడా ప్రసారం చేస్తున్నాయి.


ప్రధాని మన్‌కీ బాత్‌ కబుర్లను వినేందుకు తొలి నెలల్లో చాలా మంది ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు కూడా వింటున్నవారు ఉండవచ్చు. తరువాత అదొక తద్దిన కార్యక్రమంగా మారిందని భావించిన వారు లేకపోలేదు. ఇది మామూలు విషయంగా మారింది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ వార్త. మరి సంచలనం ఏమిటి అంటారా ? మనిషి కుక్కను కరవటం, సంఘటన జరిగిన తరువాత ఆ మనిషి మనోభావాలు ఎలా ఉన్నాయి, తనను కరచిన మనిషి గురించి కుక్క ఏమైనా స్పందించిందా వంటి ప్రశ్నలు వేసే యాంకర్ల తీరు తెన్నులు సరేసరి. ప్రధాని మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని అభిమానించటం సాధారణ అంశం. సంచలనం ఏమిటి ?
ఆగస్టు 30నాటి మన్‌కీ బాత్‌ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే ఎక్కువగా ఉండటమే సంచలన వార్త. గంట గంటకూ తిరస్కరించిన వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల వెల్లడి అవకాశాన్నే నిలిపివేయటం మరింత పెద్ద సంచలన వార్త. ఎందుకిలా జరిగిందో తెలియదుగానీ ఊహించుకోవచ్చు. స్పందనను పర్యవేక్షించే అధికార యంత్రాంగానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందన్నది స్పష్టం. తమనేతకు మరుసటి రోజు ఏమి నివేదిస్తే ఎలాంటి స్పందన, పర్యవసానాలు వుంటాయో తెలియక అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల బటన్‌ పని చేయకుండా నిలిపివేశారన్నది స్పష్టం.


మీడియాలో దీని మీద అనేక వార్తలు వచ్చాయి. కొన్ని సంస్ధలు కనపడీ కనపడకుండా వార్తలను ఇచ్చాయి. లాజికల్‌ ఇండియన్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దీని గురించి ప్రచురించిన ఒక కధనం గురించి చూద్దాం. నీట్‌, జెయియి పరీక్షల మీద తలెత్తిన ఆగ్రహం కారణంగా బిజెపి యూ ట్యూబ్‌ ఛానల్లో అత్యంత అనిష్టత లేదా అయిష్టత ( నిఘంటువులో అసహ్యించుకున్న అని కూడా ఉంది) చూపిన వీడియోగా ప్రధాని మన్‌కీ బాత్‌ తయారైందనే శీర్షికతో కధనాన్ని వెలువరించింది. దానికి దృష్టాంతంగా విద్యార్ధుల ట్వీట్లు కొన్నింటిని ఉటంకించింది.


టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ముంబై మిర్రర్‌ కూడా ప్రముఖంగానే దీన్ని విశ్లేషించింది. మన్‌కీ బాత్‌ వీడియో విడుదల అయిన 24 గంటల తరువాత వివరాలను చూస్తే బిజెపి ఛానల్‌లో 79 వేల మంది ఇష్టత చూపారని, 5.34 లక్షల మంది అనిష్టత చూపారని పేర్కొన్నది. ప్రధాన మంత్రి అధికారిక యూ ట్యూబ్‌ ఛానల్లో 39వేల మంది ఇష్టత, 85వేల మంది అయిష్టత చూపారని పేర్కొన్నది.
సోమవారం రాత్రి పది గంటల సమయానికి బిజెపి ఛానల్లో 29లక్షల మంది చూస్తే వారిలో అభిమానించిన వారు 1.2లక్షలు, అయిష్టత వ్యక్తం చేసిన వారు 7.4లక్షలని ది ప్రింట్‌ తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవార మంతా బిజెపి అభిమానులు పని కట్టుకొని అభిమానం వ్యక్తం చేసిన తరువాత పరిస్దితి ఇది అని గమనించాలి.
ఇక వ్యాఖ్యల విషయానికి వస్తే మచ్చుకు కొన్ని చూద్దాం. ౖ” ప్రియమైన ప్రధాని గారూ మీరు జెయియి, నీట్‌ గురించి మాట్లాడతారని నేను అనుకున్నాను. నాకు ఒక సంవత్సరాన్ని వృధా చేసినందుకు కృతజ్ఞతలు ” ఇది లాజికల్‌ ఇండియన్‌ పేర్కొన్నది. ” 2019లో నా కుటుంబం అతనికి ఎందుకు ఓటు చేసిందా అని ఇప్పుడు నేను విచారిస్తున్నాను. ఇంత హీనమైన ప్రధానిని ఎన్నడూ చూడలేదు. హెచ్‌ఆర్‌డి మంత్రి 80శాతం మంది విద్యార్ధులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెబుతున్నారు. దీని అర్ధం మేము పరీక్షలను కోరుకుంటున్నామని కాదు.ఈ మనిషికి నేను మరోసారి ఓటు వేయను ” అని కిరణ్‌ మోరే అనే విద్యార్ధి ట్వీట్‌ చేసినట్లు ముంబై మిర్రర్‌ పేర్కొన్నది.
” మీరు నా దేశాన్ని నాశనం చేశారు. మీ పార్టీకి ఓటు వేసినందుకు ప్రతిక్షణం విచారిస్తాము. నా జీవిత కాలంలో ఈ కుహనా నటుడ్ని సమర్ధించను” అని ఒకరు, ” కుర్రాళ్లూ ఈ ఏడాదిని ఎన్నడూ మరిచి పోవద్దు. గోడీ (మోడీ ప్రభుత్వాన్ని కొందరు అలా పిలుస్తున్నారు) ప్రభుత్వం 30లక్షల మంది విద్యార్దుల ఆర్తనాదాలను, డిమాండ్లను ఎలా అణచివేసిందో కూడా మరవవద్దు.2024లో మనమేమిటో చూపాలి ” అన్న ట్వీట్లను కూడా ముంబై మిర్రర్‌ ప్రచురించింది.


ప్రధాని తన మనసులోని మాటలో లక్షలాది మంది విద్యార్ధులు, వారి తలిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోలేదన్నది పైన పేర్కొన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్ధుల్లో ఆగ్రహం కారణంగా ఇలాంటి స్పందన వచ్చిందని ఇదేదో తాత్కాలికం అన్నట్లుగా చిత్రించే యత్నం కనిపించింది. విద్యార్ధులైనా మరొకరైనా అధికారిక చానళ్లలో ఖాతాదారులుగా చేరిన వారే మోడీ అంటే అభిమానులే కదా ! లేదూ వారంతా కొత్త వారు, తాజా మన్‌కీ బాత్‌ విని అలా స్పందించారని అనుకోవాలా ? అదైనా నరేంద్రమోడీకి ప్రతికూల స్పందనే కదా ! పరీక్షలు రాసేందుకు సిద్దమైన విద్యార్ధుల కుటుంబాలు, స్నేహితుల్లో ఇదొక ప్రధాన చర్చ నీయాంశం అయిందా లేదా ? ఇలాంటి స్పందన గత మన్‌కీ బాత్‌లకు ఎందుకు రాలేదు ? ఒక వేళ వచ్చినా పట్టించుకోకుండా నేను ఏమి చెప్పినా జనం నోరు మూసుకొని వింటారనే భావం ప్రధానిలో ఆయన యంత్రాంగంలో చోటు చేసుకుందా ? ఈ స్పందనతో బిజెపి నేతల మైండ్‌ బ్లాంక్‌ అయినట్లు కనిపిస్తోంది. కాస్త బాణీ మార్చారు. మోడీ వీడియో మీద అయిష్టతకు నెహ్రూయే కారణం అని చెప్పకుండా కాంగ్రెస్‌ అన్నారు. కాంగ్రెస్‌కు విదేశాల్లో అందునా అధికార ప్రతిపక్ష స్ధాయి కూడా లేని కాంగ్రెస్‌కు అంత పలుకుబడి ఉందా లేక నరేంద్రమోడీ వెలుగు ఆరిపోతోందా ? గతంలో నరేంద్రమోడీకి వచ్చిన మద్దతులో విదేశాల నుంచి ఎంత స్వదేశాల నుంచి ఎంతో వివరిస్తే బాగుండేది. కాంగ్రెస్‌కు అంత సత్తా ఉంటే 67 నెలలు ఏమీ చేయకుండా 68వ వీడియో మీద ఎందుకు కేంద్రీకరించింది అన్న ప్రశ్నకు కూడా బిజెపి నేతలు సమాధానం చెప్పాలి. అభిప్రాయాలను ఇలా తారు మారు చేయటం సాధ్యం అయితే గతంలో బిజెపి కూడా నరేంద్రమోడీకి అనుకూలంగా అదేపని చేసినట్లే కదా !


సామాజిక మాధ్యమాల్లో బిజెపికి మద్దతు బండారం ఏమిటో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బయట పెట్టింది. తాజాగా మరికొన్ని వివరాలను వెల్లడించింది. బిజెపికి 2014 ఎన్నికల్లో తాము ప్రచారం చేశామని ఫేస్‌బుక్‌ భారత అధికారిణి అంఖీదాస్‌ పేర్కొన్న విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆగస్టు 30వ తేదీ వార్తలో పేర్కొన్నది. బిజెపి రాజకీయవేత్తలు, వ్యక్తిగతంగా హిందూ మతవాదులు, బృందాల విద్వేష ప్రచారానికి నిబంధనల ఉల్లంఘన నిబంధనను పాటించవద్దని తమ సిబ్బందికి అంఖీదాస్‌ ఆదేశాలు ఇచ్చినట్లు గతంలో అదే పత్రిక వెల్లడించింది. మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకు నిబంధనల ఉల్లంఘన రూల్స్‌ను వర్తింప చేస్తే ఫేస్‌బుక్‌ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి కనుక చూసీ చూడనట్లు వ్యవహరించాలని ఆమె అదేశించినట్లు బయటపడింది.2014లో మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ఆమె చేసిన ఒక పోస్టులో ” అతని సామాజిక మాధ్యమ ప్రచారానికి మనం అగ్గి అంటించాం, తరువాత చరిత్ర తెలిసిందే అని పేర్కొన్నారు. మరొక పోస్టులో మోడీని ఉక్కు మనిషిగా వర్ణించారు. భారత రాజ్య సోషలిజాన్ని ఓడించటానికి దిగువ స్ధాయి నుంచి చేసిన పనికి 30 సంవత్సరాలు పట్టింది అని కాంగ్రెస్‌ ఓటమి గురించి పేర్కొన్నట్లు అమెరికా పత్రిక వెల్లడించింది.

ఆగస్టు నెల మనసులోని మాటలో చెప్పిందేమిటి ? సెప్టెంబరును పోషకాహార నెలగా పరిగణిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సుభాషితం చెప్పారు. ఫ్రెంచి విప్లవ కాలంలో జనానికి రొట్టెలు కూడా దొరక్క రాణి మేరీ ఆంటోనెటెకు విన్నవించుకున్నపుడు రొట్టెలు దొరక్క పోతే కేకులు తినొచ్చు కదా అని ప్రశ్నించిందట. ప్రజలతో సంబంధాలు లేని పాలకుల స్పందన బాధ్యతా రాహిత్యం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. మనం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్ధాయికి చేరుకున్నామని మన మంత్రులు తమ జబ్బలను తామే చరుచుకొంటున్నారు. జనానికి కొనుగోలు శక్తి లేకపోతే ఆహార ధాన్యాలు మిగిలిపోతున్నాయి తప్ప ఎక్కువై కాదు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. ఈ స్ధితిలో ఒక నెలను పోషకాహార మాసంగా ప్రకటించటం ఏమిటి ?


ప్రధాని నోటి నుంచి మరొక ఆణిముత్యం కుక్కలను, అదీ దేశీయ జాతులను పెంచండి. ఒక వైపు దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా దిగజారనుందో ప్రభుత్వం లెక్కలు ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు ప్రధాని నోటి నుంచి ఇలాంటి సందేశం రావటంతో జనం విస్తుపోతున్నారు. దేశంలో ఎలుకలు రైతుల పంట పొలాల్లో తరువాత గోదాముల్లో ఆహార ధాన్యాలను ఎంత నష్టపరుస్తున్నాయో తెలిసిందే. పది నుంచి 20శాతం వరకు ఉంటుందనే ఆ నష్టాన్ని అరికట్టేందుకు ఎలుక నివారణ సాధ్యంగాకపోతే పిల్లులను పెంచాలని పిలుపు ఇచ్చినా ఒక అర్ధం వుంటుంది. అదే విధంగా దోమలతో ఎంత మంది అనారోగ్యం పాలవుతున్నారో, ఎంత నష్టం జరుగుతోందో తెలుసు. దోమల నివారణ పిలుపు ఇచ్చినా అదో అందం. కుక్కలను అదీ దేశీయ కుక్కలను పెంచాలనటం ఏమిటో అర్ధం కాదు. కుక్కలు దేశీయమా విదేశీయా అని కాదు పోలీసు, మత్తుపదార్ధాలు, ఇతర అవాంఛనీయ కార్యకలాపాలను పసిగడతాయా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ కూడా జాతీయ భావనలను చొప్పిస్తున్నారా ?


కరోనా నేపధ్యంలో వాక్సిన్‌ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకొని అత్యవసరమైన వాటికే ఖర్చు చేస్తున్నారని ప్రపంచం నలుమూలల నుంచి వార్తలు వస్తున్న సమయంలో ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయాలని , మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. వాటిని కొనుగోలు చేసే వారు ఉండాలి కదా ! బొమ్మల కంటే సెల్‌ఫోన్ల మార్కెట్‌ ఎక్కువ, ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ వదలి ఒక ప్రధాని బొమ్మల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమే. బొమ్మలైనా, మరొకటైనా తయారు చేయవద్దని గత ఆరు సంవత్సరాలలో మన దేశంలోని వారిని ఎవరు అడ్డుకున్నారు. అదేమీ కొత్తగా పెరుగుతున్న మార్కెట్‌ కాదే ! నిజంగా అలాంటి మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు ఉంటే మన దేశంలోని తయారీదారులు ప్రధాని పిలుపు ఇచ్చే వరకు ఆగుతారా ?
కరోనాకు ముందు, కరోనా సమయంలో, తరువాత కూడా తమ ప్రభుత్వం చేయబోయే పనుల గురించి నరేంద్రమోడీ, మంత్రులు ఎన్నడూ దాచుకోలేదు. రైళ్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, బీమా, చమురు సంస్ధలు, గనులు, ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతిదానిని ప్రయివేటీకరణ చేయటం గురించి నిరంతరం చెబుతూనే ఉన్నారు. వీటన్నింటినీ వదిలించుకున్న తరువాత నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు ఇంక చేసేదేమి ఉంటుంది ? పనేమీ లేకపోతే నెమలి ఆటలను చూపుతామని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే సూచన ప్రాయంగా జనానికి చెప్పారు. అనేక చోట్ల భారీ వర్షాలతో జనం వరదలు, ఇతర వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతుంటే ఒక్క రాష్ట్రాన్ని అయినా ప్రధాని సందర్శించకుండా నెమళ్లకు మేత వేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న సందేశం ఇప్పటికే జనంలోకి పోయిందా లేదా ?


నెమలిని పెంచటం చట్టరీత్యా నేరం కనుక మరోసారి అలాంటి ఆటలు ప్రధాని నుంచి రాకపోవచ్చు. మంత్రులకు పనేమీ ఉండదు కనుక కోతులు, కొండముచ్చులను ఆడించటం, పగటి వేషాలతో తుపాకి రాముడిలా, వీరతాళ్లతో పోతురాజుల్లా జనాన్ని అలరించటం, సాము గరిడీలకు దిగినా ఆశ్చర్యం లేదు ! ఆ చర్యలతో కడుపునింపుకొనే పొట్టగొట్టినట్లు అవుతుంది. ఇలాంటి వినోదం కోసమే అయితే మోడీ అండ్‌కోను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా ? ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి, ఏడాది క్రితం మరోసారి అధికారం కావాలని నరేంద్రమోడీ ప్రజలను కోరింది దేనికి ? ప్రజలు ఆయనను చూసి దేనికి ఓటు వేశారు ? ప్రజలెదుర్కొంటున్న తక్షణ లేదా ప్రధాన సమస్యలను వదలి ఇలాంటి కబుర్లను మన్‌కీ బాత్‌లో చెబితే వినటానికి సిద్దంగా లేరనేందుకు తాజా మన్‌కీ బాత్‌ వీడియోపై వెల్లడైన వ్యతిరేక స్పందన ఒక సూచిక. నెమళ్లను ఆడించటానికి, కుక్కలను పెంచండి, ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయండి, పౌష్టికాహారం తీసుకోండనే సుభాషితాలను వినేందుకా ఓటు వేసింది అని ఆలోచించాల్సిన సమయం వచ్చిందా లేదా ? ఆలోచించండి !!