ఎం కోటేశ్వరరావు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లుగా మీడియాలో నిజాయితీగల మీడియా వేరయా అని చెప్పుకోవాల్సిన రోజులు దాపురించాయి. మీడియాలో పని చేసే వారి గురించి చెప్పనవసరం లేదు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుందన్నట్లుగా ఏ మీడియాలో పని చేస్తే దాని యాజమాన్యానికి అనుగుణంగా రాయాలి, చూపాలి తప్ప పని చేసే వారికి వాస్తవాలతో పని లేదు. అందుకే మీడియా అన్నా వాటిలో పని చేసే వారన్నా విశ్వసనీయత లేని వారిగా పరిగణిస్తున్నారు.
మే, జూన్ మాసాలలో భారత-చైనా సరిహద్దుల్లో జరిగిన విచారకర పరిణామాల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు మరణించారు, 73 మంది గాయపడ్డారు, పది మంది చైనా సైనికులకు బందీలుగా పట్టుబడ్డారు. మన సైనికులు కూడా చాలా మంది చైనీయులను చంపారని, బందీలుగా పట్టుకున్నారని చెప్పటం తప్ప అటువైపు నుంచి ఎలాంటి నిర్ధారణలు లేవు. మరణించిన వారి గురించి చైనా ప్రభుత్వం బయట పెట్టటం లేదని, కుటుంబ సభ్యుల నోరు నొక్కివేసిందని మన మీడియా చెబుతోంది. పోనీ అది నిజమే అనుకుందాం. గాల్వన్ లోయలో జరిగిన ఉదంతంలో మన వారు 20 మంది మరణించటం తప్ప బందీలుగా ఎవరూ లేరని మన అధికారులు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాతే చైనా తన దగ్గర ఉన్న పదిమంది మన సైనికులను మనకు బహిరంగంగా అప్పగించింది. మన వారెవరూ బందీలుగా లేరని చెప్పిన తరువాత ఆ పదిమందిని చంపినా మన వారు నోటితో సహా అన్నీ మూసుకోవటం తప్ప చేసేదేమీ లేదు. అయినా చైనా మనవారిని మనకు అప్పగించింది.
అప్పటి వరకు మన మీడియా అల్లిన కథలకు బందీల అప్పగింత చెంపదెబ్బ అయింది. అన్నింటికీ మించి మన భూ భాగాలను చైనా అన్ని కిలోమీటర్లు ఆక్రమించింది, ఇన్ని కిలోమీటర్లు ఆక్రమించింది అని స్వయంగా చూసి వచ్చినట్లుగా మీడియా రాసింది, చూపింది. చర్చలు చేసింది, చైనా వ్యతిరేక విషాన్ని నూరిపోసింది. దేశ భక్తిని ఎంత ఎక్కువగా ప్రదర్శించుకొంటే ఒక నాడు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు చైనా వ్యతిరేకతను ఎంత ఎక్కువగా రెచ్చగొడితే అంత దేశ భక్తి అన్నట్లుగా మీడియా పోటీ పడి కేంద్ర పాలకుల మెప్పు పొందేందుకు ప్రయత్నించింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చైనా వారు మన ప్రాంతాలను ఆక్రమించలేదు అని చెప్పి మీడియాను బకరాను చేశారు. మీడియా ప్రచారాన్ని నమ్మి పైత్యం తలకెక్కించుకున్న వారి పరిస్ధితి తేలు కుట్టిన దొంగల మాదిరి తయారైంది.
రెండు దేశాల మధ్య ఎవరికీ చెందని ప్రాంతం కొంత ఉంది, దాన్ని చైనా ఆక్రమించుకుంది కనుకనే ప్రధాని మన ప్రాంతాన్ని ఆక్రమించలేదనే ఒక ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. ఒక వేళ అదే నిజమైతే మన సైనికులను ఆప్రాంతానికి పంపి ప్రాణాలు పోయేందుకు నిర్ణయం తీసుకున్నది ఎవరు ? ఇంతకాలం ఆక్రమణకు పాల్పడని వారు ఇప్పుడెందుకు ఆ పని చేశారు అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక్కడ ఎవరికీ చెందని ప్రాంతమంటూ ఒకటి లేదు. ఒక నిర్ధారిత సరిహద్దు రేఖ లేదు. బ్రిటీష్ వారు గీచిన మక్‌మోహన్ రేఖ ఏ దేశ ఆధీనంలో ఏ ప్రాంతం ఉంది అని నిర్ధారించుకొని గీచింది కాదు, సుమారుగా నిర్ణయించారు. దాని ప్రకారం భారత్‌కు చెందినవి అనుకున్న కొన్ని ప్రాంతాలు చైనాకు చెందినవిగానూ, చైనాకు దక్కాల్సినవి అని పేర్కొన్నవి మన దేశ ఆధీనంలో ఉన్నాయి. ఆక్సారు చిన్ ప్రాంతం సరిహద్దు రేఖ ప్రకారం మనదిగా చూపారు కానీ అది ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. దానితో విబేధించిన మన దేశం దాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించింది, పర్యవసానం 1962 యుద్దం. దానిలో మొత్తంగా జరిగిందేమిటి ? చొచ్చుకుపోయిన మన సేనలను వెనక్కు కొట్టిన చైనా తన ఆధీనంలో ఉన్న ప్రాంతానికి కట్టుబడి ఉంది. దాన్ని మనదే అంటున్నాము. మరోవైపున ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్ మన ఆధీనంలో ఉంది. మక్‌మోహన్ రేఖ ప్రకారం అది చైనా ప్రాంతంగా ఉంది. అందువలన అది మా టిబెట్ దక్షిణ భాగం అని చైనా చెబుతోంది. తమది అని చెబుతోంది తప్ప ఆక్రమించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
తిరిగి మరోసారి మీడియా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటమే విషాదకరం. దాన్ని నమ్మి అనేక మంది మరోసారి చిత్తయ్యారు. జూన్‌లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు చంపిన చైనా సైనికుల సమాధులు అంటూ జాతీయ మీడియాతో పాటు తెలుగు టీవీ ఛానల్స్ కూడా ఊదరగొట్టాయి. ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. మరోసారి పప్పులో కాలేశాయి. తప్పుడు వార్తలను ప్రచురిస్తే పాఠకులకు కలిగిన విచారానికి చింతిస్తున్నామని పత్రికలు ఒకప్పుడు చిన్నదో పెద్దదో వివరణ ఇచ్చేవి. ఇప్పుడు ఆ మాత్రపు విలువలను కూడా పాటించటం లేదు.
ఇంతకీ టీవీలలో చూపిన సమాధులు జూన్‌లో మరణించిన చైనా సైనికులవి కాదు. 1962 యుద్దంలో మరణించిన చైనా సైనికులవని, అవి ఆక్సారుచిన్ ప్రాంతానికి సమీపంలో ఉన్న చైనా గ్జిన్‌జియాంగ్ రాష్ట్రంలోని కాంగ్‌క్సివా అనే చోట ఏర్పాటు చేసిన యుద్ద స్మారక కేంద్రంలో ఉన్నట్లు తేలింది. వాటిని చూపి యాంకర్లు రెచ్చిపోయారు. బిజెపి లేదా సంఘపరివార్ సంస్ధల నేతలను తలదన్నే విధంగా మాట్లాడారు. గాల్వన్‌లోయలో మన సైనికుల చేతిలో హతులైన చైనా వారికి సంబంధించి రుజువులు ఏవి అనే అడిగేవారికి సమాధానం ఇవి అన్నారు. అంతే కాదు కావాలంటే వెళ్లి లెక్కపెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ఇంకోసారి రుజువులు అడగొద్దు, వీరత్వం చూపిన మన సైనికులను అవమానించవద్దు అని ఆజ్‌తక్ టీవీ యాంకర్ రెచ్చిపోయారు. ఆచరణలో ఆజ్‌తక్ టీవీ అవమానించింది.
టైమ్స్ నౌ ఛానల్ కూడా అదే బొమ్మలను చూపింది. మన సైనికులు 35 మంది చైనా వారిని చంపారని మన దగ్గర ఇప్పటికే ఆధారాలున్నాయి, కానీ మరణాలు అంతకంటే ఎక్కువే అని చిత్రాలు చూపుతున్నాయని యాంకర్ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్‌క్సివా యుద్ద వీరుల స్మారక కేంద్రంలో 107 మంది సమాధులు ఉన్నట్లు చైనా సైన్యం అధికారికంగానే ప్రకటించింది. వాటితో పాటు 2019లో మరణించిన ఒక సైనికుని సమాధిని కూడా అక్కడే ఏర్పాటు చేశారు, దాంతో 108 ఉన్నట్లు చైనా సిసిటీవీ మిలిటరీ ఛానల్‌లో ఆగస్టు 24నే చూపారని తేలింది. అవే సామాజిక మాధ్యమంలో కూడా ఉన్నాయి. వాటిని మన టీవీల వారు తీసుకొని తాము కనుగొన్నట్లు ఫోజు కొట్టినట్లుగా తేలింది. గ్జిన్ జియాంగ్ మిలిటరీ ప్రాంతంలో ఉన్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఆ స్మారక కేంద్రానికి వెళ్లి నివాళి అర్పించటం జరుగుతుంది. అలాంటి ఒక సైనికుని చిత్రాన్ని మన టీవీలు చూపాయి. ఆ సైనికుడు విలపిస్తున్నట్లు అది గాల్వన్ లోయలో మరణించిన చైనా వారి గురించి అని మన టీవీలు వ్యాఖ్యానం చెప్పాయి. అక్కడ 107మంది సైనికుల వివరాలు, ఇతర విశేషాల గురించి ఒక వ్యాసం 2019 మార్చినెలలో ప్రచురితమైనట్లు బూమ్ వెబ్ సైట్ వెల్లడించింది.
ఇవిగో గాల్వన్‌లో మరణించి చైనా సైనికుల సమాధులు అంటూ ఇండియా టుడే టీవీ ప్రసారం చేసిన వాటిలో ఒక గూగుల్ చిత్రం ఉంది. అది 2011నాటిదని ఆల్ట్ న్యూస్ కనుగొన్నది. ఏ చిత్రం ఎప్పటిదో కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఇండియా టుడే లేదా మరొక టీవీ ఛానల్స్ దగ్గర లేవా అంటే అందరి దగ్గరా ఉన్నాయి. వాటిని నిర్ధారణ చేసుకోవచ్చు గానీ తప్పుడు ప్రచారం చేయదలచుకున్నవారికి వాటితో పనేముంటుంది. తాము ప్రత్యేకంగా సంపాదించిన ఉపగ్రహ చిత్రాలంటూ ఇటీవలి కాలంలో టీవీ ఛానల్స్, కొన్ని పత్రికలు ప్రచురిస్తున్న లేదా ప్రదర్శిస్తున్నవన్నీ మిలిటరీ లేదా ప్రభుత్వం అందచేస్తున్నవే. వాటి గురించి మీడియా చేసే వ్యాఖ్యలు తప్ప నిజంగా అక్కడ జరుగుతున్నది ఏమిటన్నది సామాన్యులకు తెలియదు.
మన మీడియా ఒక్కటే కాదు, అనేక దేశాలలో అమెరికన్ సిఐఏ ఏజన్సీలు అందించే అనేక కథనాలు, చిత్రాలను పాఠకులకు, వీక్షకుల ముందు కుమ్మరిస్తున్నాయి. అమెరికా లేదా మరొక దేశ గూఢచార, ఇతర ప్రభుత్వ సంస్ధలు ప్రచారదాడిలో భాగంగా ఇలాంటి వాటిని నిరంతరం విడుదల చేస్తుంటాయి. వాటి వనరును పేర్కొన కుండా పత్రికలు , టీవీ ఛానల్స్‌కు ఆయా దేశాల్లో ఉన్న వార్తా సంస్దలు విడుదల చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాపితంగా కుహనా వార్తలు (ఫేక్ న్యూస్) పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అనేక అంతర్జాతీయ లేదా జాతీయ స్ధాయి మీడియా సంస్దలు వచ్చిన వార్తలను సరి చూసుకొనేందుకు, వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకొన్నాయి. వచ్చిన వార్తల తీరుతెన్నుల గురించి ప్రత్యేక కథనాలను వెలువరిస్తున్నాయి.
జూన్‌లో భారత-చైనా సరిహద్దులో జరిగిన ఉదంతాల గురించి వెలువడిన వీడియోలు, వార్తల గురించి బిబిసి విభాగం అదే పని చేసి కుహనా వార్తలు, కుహనా వీడియోలు, దృశ్యాల గురించి జూన్ 19న ఒక ప్రత్యేక కధనాన్ని వెలువరించింది. రెండు దేశాల సైనికులు దెబ్బలాడుకుంటున్న దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్ అయింది. గాల్వన్ నది లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ అని నమ్మిన వారు దాన్ని చూసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వీడియో 2017 ఆగస్టులో, 2019 సెప్టెంబరులో కూడా అదే విధమైన సమాచారంతో యూట్యూబ్‌లో పోస్టు అయినట్లు బిబిసి తెలిపింది. ఏడాది క్రితం కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను గాల్వాన్ లోయ ఉదంతానికి అంటగట్టి ప్రచారం చేశారు. అదే విధంగా టిక్‌టాక్‌లో చైనా భాషలో ఉన్న ఒక వీడియోను కూడా అలాగే చిత్రించారు. దానిలో భారతీయ సైనికుడిని చైనా వారు తిడుతున్నట్లు, వెళ్లిపొమ్మని దబాయిస్తున్నట్లు ఉంది. జనవరిలో యూట్యూబ్‌లో పోస్టు అయిన ఆ వీడియోను తాజా ఉదంతంగా ఒక కాంగ్రెస్ నేత ప్రచారంలోకి తెచ్చారు. పోనీ సదరు వీడియో లడఖ్ ప్రాంతానిదా అంటే అదీ కాదు, అక్కడికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సంబంధించింది.ఒక సైనికుడి మృతదేహానికి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను గాల్వన్ ఉదంతానికి జత చేసి ప్రచారం చేశారు. మేనెలలో లే-లడఖ్ ప్రాంతంలో ఒక ప్రమాదంలో మరణించిన సైనికుడికి సైనిక లాంఛనాలతో మహారాష్ట్రలోని స్వంత పట్టణంలో జరిపిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో అది. గాల్వన్ లోయలో భారత సైనికుల మృతదేహాలంటూ హల్ చల్ చేసిన మరికొన్ని చిత్రాలను కూడా బిబిసి టీమ్ పరిశోధించింది. 2015లో నైజీరియా సైనికులపై అక్కడి బోకో హరామ్ తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి చిత్రాలవి. వాటిని పాకిస్ధాన్ వెబ్‌సైట్ కూడా ఒకటి ఉపయోగించింది. అనేక మంది సైనికుల శవపేటికలకు సంబంధించిన మరో చిత్రాన్ని కూడా అదే వెబ్‌సైట్‌లో పెట్టి అది పుల్వామా దాడిలో మరణించిన భారత సైనికులని పేర్కొన్నారు. అది కూడా తప్పుడు చిత్రమే నంటూ పాఠకులను బిబిసి హెచ్చరించింది.
ప్రపంచంలో కల్పిత వార్తలు, రాజకీయ నేత అబద్దాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా తయారయ్యాయి. అతి పెద్ద కల్పిత వార్తల తయారీ కేంద్రాలకు అమెరికా నిలయం. అదే విధంగా రాజకీయ నేతల్లో అతి పెద్ద అబద్దాల కోరు డోనాల్డ్ ట్రంప్. ఇతగాడి గురించి అక్కడి పత్రిక వాషింగ్టన్ పోస్ట్ చెప్పిన సత్యం. అబద్దాల సునామీ అనే శీర్షికతో గార్డియన్ పత్రిక ట్రంప్ 20వేల అబద్దాలను పూర్తి చేసిన సందర్భంగా వాషింగ్టన్ పోస్టు చెప్పిన అంశాలను ఉటంకిస్తూ జూలై 13న ఒక వార్తను రాసింది. జూలై 9న రికార్డు స్ధాయిలో ట్రంప్ 62 అబద్దాలను ఆడి అబద్దాల రికార్డును నమోదు చేసినట్లు వాషింగ్టన్ పోస్టు వాస్తవాల నిర్ధారిత విభాగం పేర్కొన్నది. అలాంటి ట్రంప్, అమెరికా మనకు జిగినీ దోస్తు, భాగస్వామి అని మనలను తనతో పాటు కైలాసానికి తీసుకుపోతుందన్నట్లుగా మన మీడియా చిత్రిస్తోంది.
ట్రంప్‌గారూ మీరు ఇన్ని అబద్దాలు ఆడుతున్నందుకు ఎప్పుడైనా విచారించారా అని భారత సంతతికి చెందిన విలేకరి ఎస్‌వి డాటే ఆగస్టు 13న ప్రశ్నించినట్లు గ్లోబల్ న్యూస్ అనే ఒక వెబ్‌సైట్ వార్తను రాసింది. విలేకర్లతో మాట్లాడి సమయాన్ని వృధా చేయటం ఎందుకు, యావత్ సమయాన్ని దేశభక్తిలోనే గడిపేస్తా అన్నట్లుగా అధికారానికి వచ్చిన తరువాత ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని నిరంతర తపనశీలి మన ప్రధాని నరేంద్రమోడీ అన్న విషయం తెలిసిందే. కానీ ట్రంప్ వేరు తరచూ విలేకర్లతో మాట్లాడతారు. అలాంటి ఆగస్టు 13నాటి సమావేశంలో మామూలుగానే కరోనా వైరస్, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్ గురించి మాట్లాడిన తరువాత( నిజాలా అబద్దాలా అనేది కాసేపు పక్కన పెడదాం) అఫింగ్టన్ పోస్టు విలేకరిగా అధ్యక్ష భవన వార్తలను రాసే ఎస్‌వి డాటేను ప్రశ్నలు అడగండి అని ట్రంప్ స్వయంగా ఆహ్వానించాడు. కొన్ని వందల మంది విలేకర్లు ఉంటారు గనుక ప్రశ్నించే అవకాశం అందరికీ రాదు. మనవాడు తబ్బిబ్బు అయి తేరుకొని అధ్యక్ష మహౌదరు మూడున్నర సంవత్సరాలలో అమెరికా జనానికి మీరు చేసిందాన్ని గురించి అన్నీ అబద్దాలే చెప్పినందుకు ఎప్పుడైనా విచారించారా అని అడిగాడు. అన్నీ అంటే ఏమిటి అని ట్రంప్ తిరిగి ప్రశ్నించాడు. అదే అన్నీ అబద్దాలు, నమ్మశక్యం కాని అంశాలు చెప్పారు అని డాటే పునశ్చరణ గావించాడు. వాటిని ఎవరు చెప్పారు అని ట్రంప్ రెట్టించాడు. మీరే, లక్షల కొద్దీ ఉన్నాయి అని డాటే నొక్కి వక్కాణించాడు. కొద్ది సేపు మౌనంగా ఉన్న ట్రంప్ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మరొక విలేకరిని మాట్లాడాలని అడిగారు.
డోనాల్ట్ ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేయక ముందు రిపబ్లికన్ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్ అబద్దాల గురించి ప్రశ్నించేందుకు తాను ఐదు సంవత్సరాల పాటు వేచి చూశానని విలేకర్ల సమావేశం తరువాత ఎస్‌వి డాటే ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్రంప్-తన మధ్య జరిగిన సంభాషణను కూడా ట్విటర్‌లో పెట్టాడు. మరుసటి రోజు ఉదయానికే దాన్ని 38లక్షల మంది వీక్షించారు. అలాంటి ప్రశ్నలను మన విలేకర్లలో కొందరైనా అడిగే వారు ఇప్పటికీ ఉన్నారు, కానీ, అసలు అడిగేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ అవకాశం ఇస్తారా ? ఒక వేళ మారు మనసు పుచ్చుకొని ఇచ్చినా అడిగిన విలేకరి ఉద్యోగం ఆఫీసుకు వెళ్లేంతవరకు అయినా ఉంటుందా ?
ఈ నేపధ్యంలో చైనా-భారత్ సరిహద్దు ఘర్షణలు లేదా మరొక అంశం మీద గానీ సామాజిక మాధ్యమాల్లో, వాటిని ఆధారం చేసుకొని సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాల్లో కధనాలను వెలువరించుతున్న వాటి పట్ల జనం జాగ్రత్త వహించకపోతే తప్పుడు అభిప్రాయాలను బుర్రలోకి ఎక్కించుకొనే ప్రమాదం ఉంది. చైనాతో, పాకిస్ధాన్‌తో మనకు సమస్యలున్నాయి గనుక వాటి గురించి ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఇలాంటి ప్రచారం జరుగుతోందా ? సామాజిక మాధ్యమంలో ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశాలమీదనే జరుగుతుంటే అలాగే అనుకోవచ్చు. కానీ గత ఆరు సంవత్సరాలలో మన దేశంలో బిజెపి, నరేంద్రమోడీ గురించి అనుకూల తప్పుడు ప్రచారాలు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక తప్పుడు ప్రచారాలు తక్కువేమీ కాదు. సామాజిక మాధ్యమం పెద్ద ఎత్తున విస్తరించింది, ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినందున వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటివి వినియోగంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించటమే పనిగా పెట్టుకున్న సంస్ధలు, పార్టీలు అందుకోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి. బిజెపి, దానికి సంబంధించిన మరికొన్ని సంస్ధలు ప్రచారంలోకి తెచ్చిన విద్వేష పూరిత, రెచ్చగొట్టే, ఇతర సమాచారాన్ని అడ్డుకోవద్దని తమ సిబ్బందికి చెప్పినట్లు ఫేస్‌బుక్ అధికారులు తాజాగా అంగీకరించిన అంశం తెలిసిందే. అందువలన ఎవరైనా అలాంటి అంశాలను నిర్ధారించుకోకుండా రెచ్చి పోవద్దు, పొరబాటు అభిప్రాయాలకు రావద్దని మనవి.