ఎం కోటేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ మరో 117 చైనా యాప్‌లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్‌టాక్ మరో 58 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్ధితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏమి చెప్పినా మనం తలూపాల్సిందే, లేకపోతే దేశద్రోహుల కింద లెక్క. చెప్పిందాన్ని నోరెత్తకుండా అంగీకరించటమే దేశభక్తి. ఆ యాప్‌లతో పాటు అమెరికా, ఐరోపా దేశాలలో తయారైన ఎన్నో ఎంతో కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రతి యాప్ వినియోగదారుల సమాచారాన్ని ఏదో ఒక దేశానికి లేదా కార్పొరేట్ కంపెనీలకు, గూఢచార సంస్థలకు చేరవేస్తున్నవే అన్నది అవునన్నా కాదన్నా తిరుగులేని సత్యం. యాప్‌లందు చైనా యాప్‌లు వేరయా అంటారా ? అయితే వాటి ముప్పు గురించి ఇప్పటి వరకు తెలియదా ? చైనా యేతర దేశాల యాప్‌లు దేశ రక్షణకు ఉపయోగపడుతున్నాయా అని ఎవరైనా అడిగారో అంతే సంగతులు, బూతులతో దాడి చేసేందుకు అసలు సిసలు దేశ భక్తులం మేమే అని తమకు తామే కితాబులు ఇచ్చుకొని, కీర్తి కిరీటాలను స్వయంగా తల మీద పెట్టుకున్న గుంపులు సిద్దంగా ఉంటాయి. అయినా విమర్శనాత్మకంగా చూడక, ప్రశ్నించక తప్పదు !
దేశ రక్షణకే కాదు, సామాజిక భద్రతకు సైతం ముప్పుగా పరిణమించిన వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. రాజీ పడకూడదు. ఎవరైనా కోరుకొనేది అదే ! అలాంటి వైఖరి, చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది చూద్దాం. పబ్‌జీ వీడియో గేమ్‌కు రూపకల్పన చేసింది ఐరిష్ జాతీయుడు. దాన్ని తీసుకొని తయారు చేసింది దక్షిణ కొరియా కంపెనీ. చైనా అతి పెద్ద మార్కెట్ కనుక దానిలో ప్రవేశించి సొమ్ము చేసుకోవాలని కొరియా కంపెనీ చైనా కంపెనీ టెన్సెంట్‌తో ఒప్పందం చేసుకొని పదిశాతం వాటా ఇచ్చింది. కంప్యూటర్లలో ఉపయోగించేది ఒకటైతే సెల్‌ఫోన్లలో ఉపయోగించే రకం మరొకటి. దాన్ని టెన్నెంట్ తయారు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెల్‌ఫోన్లలో ఆడేదాన్ని మాత్రమే నిషేధించింది. కంప్యూటర్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. సెల్‌ఫోన్ల ద్వారా వినియోగదారుల సమాచారం చైనాకు అందకూడదు, కానీ కంప్యూటర్ల ద్వారా దక్షిణ కొరియాకు చేరవచ్చు అని పరోక్షంగా నరేంద్రమోడీ సర్కార్ చెబుతున్నది. దక్షిణ కొరియా అమెరికా అడుగుజాడల్లో నడిచే దేశం. తాను సేకరించిన సమాచారాన్ని అమెరికాకు ఇవ్వకూడదు అన్న హామీని మన ప్రభుత్వం తీసుకున్నదా ? తెలియదు, తీసుకున్నట్లు ప్రభుత్వమూ చెప్పలేదు.
పబ్‌జి ద్వారా వినియోగదారుల సమాచార తస్కరణ ఒక సమస్య అయితే సామాజికంగా తలెత్తే లేదా జరిగే హాని అంతకంటే పెద్దది. మరి ఈ అంశం గురించి మోడీ సర్కార్ వైఖరి ఏమిటి ? 2017లో పబ్‌జీని చైనాలో ప్రవేశపెట్టారు. కాని దానిలో ఉన్న అంశాలు యువతను తప్పుదారి పట్టించేవిగానూ, హింసాత్మక ధోరణులకు పురికొల్పేవిగా ఉండటంతో చైనా 2018లోనే నిషేధించింది. మన దేశంలో అనేక కోర్టుల్లో దీనికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నరేంద్రమోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రాజధాని అహమ్మదాబాద్, రాజకోటలో తాత్కాలికంగా నిషేధించారు. గత ఏడాదే దీని గురించి పలు రాష్ట్రాల్లో చర్చలు జరిగాయి. విద్యార్ధుల పాలిట మత్తు మందుల వంటివి, హాని కలిగిస్తున్నాయి, పిల్లల్లో హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయి అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మానసిక సమస్యలు కూడా తలెత్తాయి. అవేమీ కేంద్ర ప్రభుత్వ దృష్టిలో లేవా ?
అంతెందుకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆ దుష్ఫలితాల గురించి తెలుసు ! మహారాష్ట్రలో ఈ ఆటను నిషేధించాలని, దేశంలో సమీక్ష జరిపేందుకు నైతిక నియమావళి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముంబై హైకోర్టులో పదకొండు సంవత్సరాల బాలుడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఆ పిల్లవాడి తరఫున స్వయంగా న్యాయవాది అయిన అతని తల్లి కోర్టుకు హాజరు అవుతున్నది. ప్రధాని నరేంద్రమోడీ విద్యార్ధులు, తలిదండ్రులతో గతంలో మాటా మంతీ జరిపిన సమయంలో ఒక తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడని వాపోయింది. అప్పుడు ప్రధాని మాట్లాడుతూ అతను పబ్జివాలానా ఏమిటి అని ప్రశ్నించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ (ప్రచారం) అయింది. ఈ కేసులో ఆ ఉదంతాన్ని కూడా పిటీషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు.
హింసాత్మక ధోరణులను పెంచే అంశాలపై సమీక్ష జరిపే నైతిక నియమావళి కమిటీ సమీక్షలో పబ్‌జీ ఆట ప్రమాదకరమని భావించి ఆ కమిటీ చైనాలో నిషేధించాలని సిఫార్సు చేసింది, దాన్ని అక్కడ అమలు జరిపారు. మన దేశంలో కూడా అలాంటి కమిటీని వేసి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ముంబై కేసులో పిటీషనరు ప్రశ్నించాడు. ఇలాంటి ఆటలే పిల్లల మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నివేదికలో హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అంతే కాదు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ కూడా పబ్జీ ఆట నిషేధానికి తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇమ్మని కేంద్రాన్ని కోరింది. పబ్‌జీని జూదంగా మార్చి ఆడుతున్న పెద్ద వారిని గుజరాత్‌లో పోలీసులు అరెస్టులు కూడా చేశారు.
చైనా కమ్యూనిస్టు దేశం, నియంతృత్వం ఉంటుంది, అక్కడ ఏమైనా చేయగలరు, మనది ప్రజాస్వామిక దేశం అక్కడ చేస్తున్న మాదిరి ఇక్కడ చేయటం కుదరదు అనే వాదన ఇటీవల అనేక సందర్భాలలో కొందరు ముందుకు తెస్తున్నారు. బాధ్యతను తప్పించుకొనేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు. తప్పుదారి పడుతున్న పిల్లలను సరైన దారిలోకి తెస్తామంటే ప్రజాస్వామ్యం అడ్డుకుంటుందా ? ఒక వేళ అడ్డుకునేట్లయితే భావి తరాలను చెడగొట్టే అలాంటి ప్రజాస్వామ్యం మనకెందుకు ? పబ్‌జి యాప్‌ను నిషేధిస్తే చైనా కంపెనీ టెన్సెంట్‌కు లక్ష కోట్ల రూపాయల నష్టమని కొందరు చెబుతున్నారు. పదిశాతం వాటా ఉన్న కంపెనీకే అంతనష్టమైతే తనదని కూడా చూసుకోకుండా చైనా కమ్యూనిస్టులు దాన్ని నిషేధించారు. మరి మన ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగనిచ్చినట్లు ? పోతే పోనీయండి పిల్లలు ఏమైతే మాకేం అని పాలకులు అనుకుంటున్నారా ?
2018 మార్చినెల తరువాత తొమ్మిది నెలల కాలంలో చైనా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వీడియో గేమ్‌ను కూడా అమ్మకానికి అనుమతించలేదని ఆ విధానాన్ని 2019లో కూడా కొనసాగిసాంచవచ్చని 2018 డిసెంబరు 13న ఒక పత్రికలో కెవిన్ వెబ్ అనే విలేకరి రాశారు. ప్రభుత్వ విధానాలకు వీడియో గేమ్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించి అభిప్రాయం చెప్పేందుకు ఒక నైతిక నియమావళి కమిటీని కూడా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నైతికత గురించి కబుర్లు చెప్పే మన పాలకులు ఇంతవరకు అలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. సౌత్ చైనా మోర్నింగ్ పోస్టు అనే హాంకాంగ్ నుంచి వెలువడే పత్రికను నడుపుతున్నది కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టుల పట్ల దానికి సానుభూతి కూడా ఉన్నట్లు మనకు కనపడదు. అలాంటి పత్రిక రాసిన కథనం ప్రకారం 2018 మార్చినెలలో హింసాత్మక, ఇతరంగా దురుసుగా వ్యవహరించటాన్ని ప్రోత్సహించే సినిమాలు, వీడియోగేమ్‌లు, యూ ట్యూబ్ సీరీస్ లేదా చిత్రాలను, నూతన మీడియా విభాగం కిందికి వచ్చే అన్నింటినీ సమీక్షించేందుకు చైనా సర్కార్ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దాన్నుంచి అనుమతులు వచ్చే వరకు కొత్త వాటిని వేటినీ అంగీకరించకూడదని నిర్ణయించింది.అంతకు ముందు అనుమతించిన వాటి మీద కూడా ఆంక్షలు విధించింది.
చైనా సెంట్రల్ టీవీ ( మన దూరదర్శన్ వంటిది) వెల్లడించిన సమాచారం ప్రకారం నైతిక విలువల సమీక్ష కమిటీ 20గేమ్‌లను సమీక్షించి తొమ్మిదింటిని తిరస్కరించింది. మిగిలిన వాటిలో మార్పులను సూచించింది. కొన్ని వీడియో గేమ్‌లు పిల్లలను వ్యసన పరులుగాను, పని పాటలు లేని వారిగానూ మారుస్తాయనే విమర్శ చైనాలో వచ్చింది. 2018లో వీడియో గేమ్‌లపై 34 బిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో గేమ్స్ తయారీ సంస్ధ చైనా కంపెనీ టెన్సెంట్. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దాని ఆదాయం 200 బిలియన్ డాలర్లు పడిపోయింది. పిల్లలు అదే పనిగా గేమ్స్‌లో మునిగి పోకుండా ఉండేందుకు వారిని గుర్తించి వ్యవధిని పరిమితం చేసే అంటే నిర్ణీత వ్యవధి తరువాత గేమ్‌లు ఆగిపోయే విధంగా సాప్ట్‌వేర్‌లో మార్పులు కూడా టెన్సెంట్ కంపెనీ చేసింది. చైనాను ఆర్ధికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మన సర్కార్ యాప్‌లను నిషేధించింది. కానీ అంతకంటే ముందే చైనా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తమ కంపెనీకి ఎంత నష్టం వచ్చినా ఆ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ నేత అనుకుంటున్న నరేంద్రమోడీ లేదా ఆయన సలహాదారులు, పెద్ద యంత్రాంగం వీటన్నింటినీ గమనిస్తున్నదా ? నిజంగా గమనిస్తే పబ్‌జీ వంటి ప్రమాదకరమైన వీడియో గేమ్‌ల మీద చర్య తీసుకొనేందుకు సరిహద్దులో చైనాతో సమస్య వచ్చేంత వరకు ఆగాలా ? అందువలన పబ్‌జీ గురించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తెలియని విషయము కాదు అన్నది స్పష్టం. తలిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, కోర్టులలో కేసులు ఎందుకు దాఖలు అవుతున్నాయో పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా ? కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు చైనాను దెబ్బతీసేందుకు నిషేధం అని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే చిత్తశుద్ధి సమస్య ముందుకు వస్తున్నది. జాతిని ఏకత, శీలముతో నిర్మిస్తాము అని చెప్పుకొనే సంఘపరివార్ కుటుంబంలో పెరిగిన వారే ఇప్పుడు దేశంలోని అని ప్రధాన పదవులలో ఉన్నారు. పబ్‌జీ గాక పోతే దాని తాతల వంటి ప్రమాదకర వీడియో గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి, మరి వాటి సంగతేమిటి ?
ప్రపంచంలో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మీద కొత్త యుద్దం మొదలైంది. పది సంవత్సరాల క్రితం వరకు చైనా ఈ రంగంలోకి వస్తుందని లేదా తమకు పోటీ ఇస్తుందని అమెరికా వంటి దేశాలు ఊహించలేదు. చైనా వారికి తెలివి తేటలు లేవు, ఫ్యాక్టరీల్లో గొడ్డు చాకిరీ చేస్తారు గానీ వారికి ఆంగ్లం రాదు, ఆంగ్లం రాకుండా కృత్రిమ మేథలో ప్రవేశించలేరు అన్న భ్రమలున్నవారికి దిమ్మతిరిగేలా చైనా ముందుకు వచ్చింది. రాజకీయ రంగంలో ఎవరు ఎటు వుండాలో తేల్చుకోవాల్సిన సమయాల మాదిరి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోటీలో కూడా అమెరికా – చైనాల మధ్య ఏ పక్షంలో ఉండాలో దేశాలూ, కంపెనీలు తేల్చుకోవాల్సిస తరుణం వచ్చిందని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎస్ విశ్లేషకులు జిల్ దిసిస్ జూలై11న రాసిన దానిలో పేర్కొన్నారు. ఫలానా యాప్, పరికరం ఫలానా దేశానిది అయితే కొనవద్దు అనే ఆంక్షలకు, ఇతర దేశాల మీద వత్తిళ్లకు శ్రీకారం చుట్టింది అమెరికా. ఇది రాబోయే రోజుల్లో పెట్టుబడిదారీ దేశాల్లోనే కొత్త విబేధాల సృష్టికి నాంది పలకటం ఖాయం.
అమెరికాతో సహా అనేక దేశాలు చైనాతో వాణిజ్యలోటులో ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు రాజకీయంగా చైనా వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా,బ్రెజిల్, సౌదీ అరేబియా, స్విడ్జర్లాండ్, ఒక దేశం కాకున్నా తైవాన్ ప్రాంతం చైనాతో వాణిజ్యంలో మిగుల్లో ఉన్నాయి. అందువలన ఎవరు ఎటు ఉండాలో తేల్చుకోవాల్సిన స్ధితే వస్తే ఈ దేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్ధలు నష్టాలు మూటగట్టుకొని లేదా మడి గట్టుకొని చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంటాయా లేక అనుకూల వైఖరిని తీసుకుంటాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు రావటం అనివార్యం.తటస్ధ వైఖరి తీసుకున్నా అది అమెరికాకు ఓటమే అవుతుంది. టిక్‌టాక్ యాప్ చైనా కంపెనీది అయినప్పటికీ దాని సిఇఓ అమెరికన్. మన దేశం దాన్ని నిషేధించిన తరువాత మా భద్రతకు సైతం ముప్పే అంటూ అమెరికా పల్లవి అందుకుంది. నిజంగా ముప్పు అనుకుంటే చైనా కంపెనీకి ఒక అమెరికన్ సారధ్యం వహించటం నిజంగా ఆశ్చర్యమే. అదే అమెరికా దాన్ని తమ దేశంలోని కార్పొరేట్లకు విక్రయించాలని కోరిన విషయం కూడా తెలిసిందే.
ప్రస్తుతం యాప్‌ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా తీవ్ర పోటీ నెలకొన్నది. యాప్‌లు వస్తువులను తయారు చేయవు. వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఉపయోగపడతాయి. వినోదం లేదా సమాచారం, ఆటల వంటి వాటిని వినియోగదారులకు చేరుస్తాయి. వాటి ద్వారానే డబ్బు సంపాదించవచ్చు. ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న లేదా కొత్తగా పుట్టుకు వస్తున్న బిలియనీర్లు ఈ రంగం నుంచి వచ్చిన వారే అత్యధికులు. ఇప్పుడు యాప్‌ల సునామీని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ విభాగాన్ని విశ్లేషిస్తున్నవారు చెబుతున్నమాట. యాప్ అనీ అనే ఒక సంస్ధ రూపొందించిన నివేదిక ప్రకారం 2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ యాప్ ఆర్ధిక వ్యవస్ధలో మొబైల్ యాప్స్ మరియు గేమ్స్ మీద 50 బిలియన్ డాలర్ల మేర వినియోగదారులు ఖర్చు చేశారు.అంతకు ముందు ఆరునెలలతో పోలిస్తే పదిశాతం ఎక్కువ. ప్రపంచ వ్యాపితంగా కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపధ్యంలో మే నెలలో రికార్డు స్ధాయిలో 9.6బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ప్రపంచ వ్యాపితంగా 1.6లక్షల కోట్ల గంటల పాటు వినియోగదారులు ఆరునెలల కాలంలో మొబైల్స్‌తో కాలక్షేపం చేశారని అంచనా.రానున్న రోజుల్లో కొత్త అంశాలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలను చూసేందుకు వినియోగదారులు పోటీ పడతారని భావిస్తున్నారు. ప్రపంచ యాప్‌ల సునామీకి, అమెరికా-చైనాల పోటీకి ఇదే కారణం.
కరోనా వైరస్ ఒక వైపు ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్నది అన్నది ఒక చేదు నిజం. ఇదే సమయంలో గతంలో ఏ వైరస్ చూపని ప్రభావం జన జీవితాల మీద చూపుతున్నది అంటే అతిశయోక్తి కాదు. సెల్ ఫోన్ లేకుండా రోజువారీ జీవనం గడవదు అనుకొనే పరిస్ధితి రావటానికి కరోనా వైరస్ ముందు పది సంవత్సరాలు పడుతుందని అని అంచనా వేశారు అనుకుందాం. కరోనా ఆ వ్యవధిని రెండు మూడు సంవత్సరాలు తగ్గించి వేసిందని తాజా అంచనా. కొద్ది సంవత్సరాల క్రితం పుడుతున్న పిల్లలు ముందు అమ్మా అనటం కంటే అమ్మాయి అంటున్నారని జోక్‌లు పేలాయి. చందమామను చూపి పిల్లలకు తిండి తినిపించే తల్లులు పాత సినిమాలు, కథల్లో మాత్రమే కనిపిస్తారు. సెల్ ఫోన్లు చూపి తినిపించే వారు ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నారు. కరోనా ఈ పరిణామాన్ని మరింత వేగవంతం కావించింది. సెల్ ఫోన్ లేకుండా బడికి వెళ్లం అని పిల్లలు మారాం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇప్పటికే టెలికాం రంగంలో చైనా దూసుకుపోతున్నది. ఐదవతరం ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానంలో చైనా హువెయి కంపెనీ ముందున్నది. భద్రతా కారణాలను సాకుగా చూపి దాని పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయవద్దని అమెరికా తన అనుంగు దేశాలను ఆదేశిస్తున్నది. యాప్‌లను కూడా ఇదే సాకుతో అడ్డుకో చూస్తున్నది. గాల్వన్ లోయ ఉదంతాలకు ముందు మన దేశానికి టిక్‌టాక్, పబ్‌జి, తదితర చైనా యాప్‌ల నుంచి ముప్పు ఉందని ప్రభుత్వం చెప్పలేదు. వెనెజులా, ఇరాన్ మీద కక్ష గట్టిన అమెరికా మనదేశాన్ని తన వైపు తిప్పుకుంది. అమెరికా బెదిరింపులకు లొంగి మనం ఆ రెండు దేశాల నుంచి చమురు కొనుగోలు ఆపి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము. ఐదవతరం టెలికాం టెక్నాలజీ విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకున్నాము.చైనా కంపెనీలను టెండర్లలో పాల్గొన కుండా నిషేధించటంతో పాటు పెట్టుబడులను కూడా అడ్డుకుంటూ నిబంధనలను రూపొందించారు. మనం చైనా వ్యతిరేక శిబిరం అంటే అమెరికా టెంట్‌లోకి దూరేందుకు గాల్వన్ లోయ ఉదంతాలు ఒక సాకు తప్ప మరొకటి కాదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఒక నాడు కృత్రిమ మేధ రంగంలో ఐబిఎం, ఆపిల్, మైక్రోసాప్ట్ వంటి అమెరికన్ కంపెనీలు తప్ప మరొక పేరు వినిపించేది కాదు. ఇప్పటికీ అవి రంగంలో ఉన్నప్పటికీ చైనా కంపెనీలు ముందుకు దూసుకు వచ్చాయి. మేడిన్ చైనా 2025 పేరుతో చైనా ఉన్నత స్ధాయి సాంకేతిక పరిజ్ఞానంలో పట్టుసాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. పశ్చిమ దేశాల మీద ఆధారపడకూడదనే ప్రధాన అంశం దానిలో ఉంది. అందుకే తీగలతో పనిలేని ఫోన్లు, ఇంటర్నెట్, మైక్రోచిప్స్, రోబోరంగంలో బిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెడుతున్నది.2019లో చైనా చేసుకున్న దిగుమతుల్లో పదిహేను శాతం లేదా 306 బిలియన్ డాలర్ల విలువగల చిప్‌సెట్లను చైనా దిగుమతి చేసుకుంది. ఈ నేపధ్యంలోనే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ట్రంప్ ప్రారంభించాడు.అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి తమకు సాంకేతిక పరిజ్ఞానం అందదు అనే నిర్ణయానికి చైనా వచ్చింది. పైన చెప్పుకున్నట్లు పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా అభివృద్ధి పిలుపుకు నేపధ్యం ఇదే.
ప్రపంచంలో తొలి సారిగా అణుబాంబును తయారు చేసింది, ప్రయోగించి భయపెట్టింది అమెరికా. అయితే నాటి సోవియట్ నేత స్టాలిన్ తాపీగా బాంబును తయారు చేయించి, అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసి ముందుకు పోయిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం తప్పుకాదు. తన వాణిజ్య ప్రయోజనాల కోసం టిక్‌టాక్ లేదా పబ్‌జి, మరొక కంపెనీ ఏదైనా చైనాకు దూరంగా జరిగినా ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ వారికి వచ్చే నష్టం లేదు. కొత్త కంపెనీలను రంగంలోకి తెస్తారు తప్ప అయ్యో అంతా అయిపోయిందని చేతులు ముడుకు కూర్చోరు. సాంకేతిక రంగంలో చైనా ఏమీ లేని స్దితి నుంచి ప్రారంభం అయిందని గుర్తుంచుకోవాలి.
చాలా వివరాలు సమకూర్చినందుకు ధన్యవాదాలు
LikeLike