Tags

, ,


ఎం కోటేశ్వరరావు


సరిహద్దుల్లో ఏం జరుగుతోందో తెలియటం లేదు గానీ మన టీవీ ఛానల్స్‌, పత్రికలు మాత్రం చైనాకు ‘దడ’ పుట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసినవారు, చదివిన వారు నిజంగానే నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే యుద్దం వచ్చేస్తోంది, మనం విజయ పతాక ఎగరేయబోతున్నట్లుగా హడావుడి కనిపిస్తోంది. ఒక వైపు చైనాకు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు, చేయాల్సిందే. ఇదే సమయంలో మరోవైపు రికార్డు స్ధాయిలో ఆర్ధిక వృద్ధి రేటు పతనం. ఎంతసేపూ ఆత్మనిర్భర పధకం గురించి చెప్పటమే తప్ప ఇంతవరకు ఆత్మవిశ్వాసం కలిగించే మాట ఒక్కటంటే ఒక్కటి కూడా మన ప్రధాని లేదా ఆర్ధిక మంత్రి నోటి నుంచి ఎందుకు వెలువడటం లేదు ? దీనికి అంత ప్రాధాన్యత లేదని భావిస్తున్నారా ?


నరేంద్రమోడీ కోసం ప్రపంచం చూస్తోంది అని బిజెపి భజనపరులు చెబుతారు. అది నిజం. శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నది ఒక సామెత. ప్రపంచ దేశాల మధ్య సహకారం- ప్రపంచ ఆర్ధిక అభివృద్దికి చేసిన కృషికిగాను మన ప్రధాని నరేంద్రమోడీకి కొరియా ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. అదేమిటో అది తీసుకున్న తరువాత మన ఆర్ధిక వృద్ధి రేటు క్రమంగా దిగజారటం ప్రారంభమైంది. త్రైమాసిక వృద్ధి రేటు 8.2 నుంచి 3.1శాతానికి దిగజారింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో తాత్కాలిక అంచనా ప్రకారం 23.9శాతం దిగజారింది. వాస్తవంలో ఎంత అన్నది నవంబరు 27న ప్రకటించే వివరాల్లో గానీ తెలియదు. అందువలన మోడీ పాలనలో భారతదేశం ఇలా ఎందుకు దిగజారిందా అని ప్రపంచం ఎదురు చూస్తున్నది.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా కరోనా పోరు పేరుతో ఎంతగట్టిగా కంచాలు, రేకులతో మోతలు మోగించి, దీపాలు ఆర్పించి-వెలిగించి ఒకటికి రెండు సార్లు సంకల్పం చెప్పించిందీ చూశాము. దీపాల వెలుగుతో కరోనా అంతరించి పోతుంది అని చెప్పిన పండితుల జోశ్యం ఏమైందో చూస్తున్నాము. రోజుకు దాదాపు లక్ష కేసులతో ప్రపంచంలోనే అగ్రదేశ స్దాయికి చేరబోతున్నది. ఇప్పటికే బ్రెజిల్‌ను అధిగమించి రెండవ స్దానంలోకి దేశాన్ని చేర్చారు. అతి త్వరలోనే అమెరికాను సైతం అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది అని యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోందన్నది నిజం. సరిహద్దు వివాదంలో ఇప్పుడు చైనాతో ఏం చేయబోతున్నారో అని కూడా ప్రపంచం చూస్తోంది.


ఆర్ధిక పరిస్ధితి గురించి లీకులు ఇచ్చి కథలు రాయించేందుకు ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. అందువలన చైనా-సరిహద్దు వివాదం-మిలిటరీ గురించి రంజుగా మీడియాకు అందిస్తున్నారు. అలాంటి వాటిలో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ఒకటి. మన సైన్యంలో ప్రత్యేక విభాగాలుగా చెప్పుకొనేవి ఏడెనిమిది ఉన్నాయి. వాటి కార్యకలాపాలు, బడ్జెట్‌ వివరాలు పార్లమెంట్‌కు కూడా చెప్పనవసరం లేనప్పటికీ వాటన్నింటికీ చట్టబద్దత ఉంది. దీనికి అది లేదు. అయితే ఇతర ఖర్చులు అనే పేరుతో ఈ దళానికి నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నట్లుగా మనం భావించాలి.


పత్రికలు చందాదారుల సంఖ్యను, ఛానళ్లు రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పడుతున్న తాపత్రయంలో అతిశయోక్తులతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయని చెప్పక తప్పదు.ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పేరుతో పని చేస్తున్న దళం చైనాకు దడపుట్టిస్తున్నదని మీడియా చెబుతోంది. దాని గురించి ఒక పత్రిక ఇలా రాసింది.” ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ భారత సైన్యంలో భాగం కాదు. ఆ దళం చేసే సాహసాలకు,త్యాగాలకు బహిరంగంగా గుర్తింపు ఉండదు. అదంతా రహస్యం. ఆ దళం చేసే పని కూడా రహస్యమే. సైన్యానికి కూడా ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ కదలికలు తెలియవు. ప్రధాన మంత్రి కార్యాలయం(పిఎంఓ) పరిధిలో ఈ దళం పని చేస్తుంది. రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఆదేశాలతో ముందుకు సాగుతుంది. అప్పగించిన బాధ్యతలను గప్‌చుప్‌గా పూర్తి చేస్తుంది. ” ఇలా సాగింది.
దీన్ని సూటిగా చెప్పాలంటే ఒక కిరాయి సాయుధ బృందం తప్ప మరొకటి కాదు. ఇది రహస్యంగా పని చేస్తుందని చెబుతున్నారు గనుక ఎన్ని ప్రాణాలు పోయినా, ఎంత నష్టం జరిగినా బయటకు తెలిసే అవకాశం కూడా లేదు. చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకని ? అసలు వీరు మన పౌరులే కాదు. చైనా నుంచి వచ్చిన వారికి మానవతా పూర్వక లేదా మతపరమైన కారణాలతో ఆశ్రయం ఇచ్చిన మనం వారిని చైనాకు వ్యతిరేకంగా వినియోగించుకుంటున్నాము. దీని గురించి కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా అంగీకరిస్తే అంతర్జాతీయంగా తలెత్తే సమస్యలకు సమాధానాలు ఉండవు. ఇప్పుడు చైనాతో వివాదంలో తొలిసారి దాన్ని వినియోగించటంలో ఇది కూడా ఒక కారణమా ?


దీని గురించి రాసిన జర్నలిస్టులకు, ప్రచురించిన పత్రికలకు, ఛానళ్లకు తెలియకపోవచ్చు లేదా తెలిసినా తెలియనట్లు వ్యవహరించవచ్చు గానీ ఈ కిరాయి బాపతు వ్యవహారం బహిరంగ రహస్యం. 1959లో టిబెట్‌లో విఫల తిరుగుబాటు చేసిన దలైలామాను మన దేశానికి తరలించటంలో అమెరికన్‌ సిఐఏ శిక్షణలో తయారైన ముఠాలు కీలక పాత్ర పోషించాయి. మన దేశం, అమెరికా, నేపాల్‌లో తిరుగుబాటు టిబెటన్లకు శిక్షణ ఇచ్చి దాడులు చేయించారు. ఆ ముఠాలకు చైనా సైన్యం చుక్కలు చూపింది. 1962లో చైనాతో యుద్దం యుద్దంలో ఓడిపోయిన కసి లేదా పరాభవంతో ఉన్న మన ప్రభుత్వం తరువాత కాలంలో వారితో సరిహద్దుల్లో దాడులు, విద్రోహ కార్యకలాపాలు చేయించేందుకు ఆ ముఠాలను సంఘటితపరచి చేరదీసింది.
ఇది జరిగి 58 సంవత్సరాలు అవుతున్నది. ఈ దళంలో ప్రారంభంలో చేరిన వారు కూడా ఇంకా పని చేస్తున్నారట. ఒక వేళ అదే నిజమైతే అమెరికా సిఐఏ శిక్షణ పొందిన వారిని మనం పోషించటం, అందునా కీలకమైన ‘ రా ‘ పర్యవేక్షణలోనా ? ఇది అసలు సిసలు దేశభక్తులకు తగినపనేనా ? సిఐఏ పెంచి పోషించిన వారు అమెరికాకు విధేయులుగా ఉంటారా మన దేశానికా ?


మరొక విధంగా చూస్తే దాని తొలి తరం వారు ఇరవై -పాతిక సంవత్సరాల ప్రాయంలో చేరారు అనుకుంటే వారి వయస్సు ఇప్పటికి 78-83 సంవత్సరాలు ఉంటుంది. అతిశయోక్తులు గాకపోతే వారు చైనాకు దడపుట్టిస్తారా ? అరవై సంవత్సరాల క్రితం శరణార్ధుల పేరుతో వచ్చిన సామాన్యులు లేదా సిఐఏ శిక్షణలో తయారైన ముఠాలకు చెందిన సంతానం మన దేశంలోనే పుట్టి పెరిగింది. వారు కూడా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిన వారుగానే ఉంటారు. టిబెట్‌లో పుట్టి పెరిగిన వారంటే కొండలు, కోనల గురించి తెలిసిన వారనుకోవచ్చు. మన దేశంలోని కర్ణాటక, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాలలోని శరణార్ధి శిబిరాలలో పుట్టి పెరిగి పైన చెప్పిన ముఠాలలో చేరిన వారికి టిబెట్‌ అనుపానులు ఎలా తెలుస్తాయి ? ఇలాంటి ముఠాలను భారతదేశం చేరదీసిందని చైనీయులకు తెలియదా ? అలాంటి వారిని కనిపెట్టేందుకు టిబెట్‌లోనే పుట్టి పెరిగిన వారిని చైనా సైన్యంలోకి తీసుకోదా, వారికి శిక్షణ ఇవ్వదా, వారి ముందు వీరు ఏ విషయంలో సరితూగుతారు ?


ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు, దేశంలోని పచ్చి మితవాదుల ఆధ్వర్యంలో నడిచే ” స్వరాజ్య ” పత్రిక సెప్టెంబరు 3న రహస్య ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ గురించి ఒక విశ్లేషణ రాసింది. ఆ దళాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి చైనాకు వ్యతిరేకంగా ఎన్నడూ వినియోగించలేదని, అయితే అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నదని తాజాగా తొలిసారి లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సో దక్షిణ ప్రాంతాన్ని మన దేశం ఆక్రమించుకోవటంలో ధైర్యంగా ముందుకు పోయి దాని అసలు కర్తవ్యాన్ని నెరవేర్చిందని పేర్కొన్నది. టిబెట్‌లో రహస్యంగా విద్రోహకార్యకలాపాలను సాగించటం, చైనా అధికార యంత్రాంగలోకి చొరబడటం వంటి కార్యకలాపాలకు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. పారాచూట్ల ద్వారా శత్రు ప్రాంతాల్లో దిగటంలో కూడా వీరికి శిక్షణ ఇచ్చారు. 1971లో అంతర్యుద్దం సందర్భంగా నేటి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ కొండ ప్రాంతాల్లో ఉన్న పాక్‌ సైన్యంపై దాడులు చేసేందుకు వీరిని వినియోగించారని తరువాత దాన్ని రహస్యంగా ఉంచారని, ఎట్టకేలకు ఇప్పుడు దాని ఉనికిని అంగీకరిస్తూ చైనాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని స్వరాజ్య విశ్లేషకుడు పేర్కొన్నారు.


ఇదే స్వరాజ్య పత్రిక 2018 మార్చి 25న ” టిబెట్‌ తిరుగుబాటు దినం: టిబెట్‌లో సిఐఏ ఎందుకు తనకార్యకలాపాలను నిలిపివేసింది ? ” అనే పేరుతో ఒక విశ్లేషణ ప్రచురించింది. అందువలన ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ వ్యవహారం రహస్యం కాదు అని వేరే చెప్పనవసరం లేదు. 1959 మార్చి 10న టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు వెనుక సిఐఏ హస్తం గురించి దీనిలో రాశారు. అదే నెల 21న తిరుగుబాటు ముగిసింది. దలైలామా అదృశ్యమై అరుణాచల్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో మన దేశంలో ప్రత్యక్షమయ్యాడు. హిందీ-చీనీ భాయి భాయి అన్నట్లుగా ఉన్న సమయంలో చైనా మనతో యుద్దానికి తలపడిందని అనేక మంది విమర్శిస్తారు. దానికంటే ముందే చైనా వ్యవహారాల్లో నాటి నెహ్రూ ప్రభుత్వం వేలు పెట్టిన విషయాన్ని స్వయంగా దలైలామా ప్రవాసంలో స్వేచ్చ పేరుతో రాసిన తన ఆత్మకథలో పేర్కొన్నాడు. తన సోదరుడు 1956లో భారత్‌లో సిఐఏ ఏజంట్లతో సమావేశమయ్యాడని, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారని తెలిపాడు. టిబెట్‌ మాదిరి భౌతిక పరిస్ధితులు ఉండే అమెరికాలోని కాంప్‌ హాలే ప్రాంతానికి టిబెటన్లను తరలించి సిఐఏ శిక్షణ ఇచ్చింది. వారికి ఆయుధాలు, నిధులు ఇచ్చి నేపాల్‌ ద్వారా టిబెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనేక మంది చైనా సైనికుల చేతిలో హతమయ్యారన్నదీ బహిరంగ రహస్యమే. నేపాల్‌లో ఆ తిరుగుబాటుదార్లకు ఉపాధి కల్పించేందుకు, సిఐఏ కార్యకలాపాల కేంద్రంగా వినియోగించేందుకు నేపాల్‌లోని పోఖ్రాన్‌ నగరంలో ఒక హౌటల్‌ను కూడా సిఐఏ నిర్మించి ఇచ్చింది.


దలైలామా, అనుచరగణానికి ఘనస్వాగతం పలికిన నెహ్రూ ప్రభుత్వ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగానే చైనా పరిగణించింది. అయితే రాజకీయంగా ఆశ్రయం కల్పిస్తే వచ్చే సమస్యలకు భయపడి సిఐఏ రూపొందించిన పధకం మేరకు ఒక మతపెద్దగా పరిగణించి ఎర్రతివాచీ పరిచారు. నాటి నుంచి నేటి వరకు టిబెటన్లు రాజకీయ శరణార్ధులు కాదు, మతపరమైన వారిగా పరిగణించి మానవతా పూర్వక రక్షణ పొందుతున్నారు. రాజకీయ ఆశ్రయం కల్పించే దమ్ము, ధైర్యం మన 56 అంగుళాల ఛాతీకి కూడా లేకపోయింది. అ పని చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న భయమే కారణం. ఇదే చేయలేని వారు చైనాతో యుద్దానికి తలపడగలరా అన్నది సమస్య.


1972 ఫిబ్రవరి 21న అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌, చైనా అధినేత మావో మధ్య చారిత్రాత్మక సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రచ్చన్న యుద్ద క్రీడలో తమను పావులుగా వాడుకున్నారని తరువాత దలైలామా అమెరికన్లపై మండి పడ్డారు. చైనాకు ఎక్కడ కోపం వస్తుందో నని దలైలామాను చాలా సంవత్సరాల పాటు అమెరికాకు రానివ్వలేదని కూడా గమనించాలి.
అప్పుడు అమెరికా పావులుగా వాడుకుంటే ఇప్పుడు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పేరుతో ఉన్న టిబెటన్లను భారత్‌ బలిపశువులుగా ఉపయోగిస్తున్నదని, అదేమీ మెరుపు దళం కాదని చైనా నిపుణులు వ్యాఖ్యానించారు. ఆరువేల మందితో ఈ దళాన్ని ఏర్పాటు చేసినట్లు మన మీడియాలో వార్తలు వచ్చాయి తప్ప నిర్దారణ కాదు. ఇదే సమయంలో గరిష్టంగా వెయ్యి మంది కంటే లేరని చైనా నిపుణులు చెబుతున్నారు. రెండు అంచనాల్లోనూ అతి ఉండవచ్చు. భారత సైన్యం విదేశీ సైనికులను, అందునా టిబెటన్లను అసలు విశ్వసించదని, వారి స్ధాయి చాలా తక్కువగా ఉంటుందని, జీవనోపాధిగా టిబెటన్లు ఈ దళంలో చేరతారని చైనా నిపుణుడు గ్లోబల్‌ టైమ్స్‌తో చెప్పాడు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ,పశ్చిమ దేశాల మీడియా రాసిన వార్తల్లో భారత్‌లోని ప్రవాస టిబెట్‌ ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌ఎఫ్‌కు మద్దతు ఇస్తున్నదని, భారత సైన్యంతో భుజం భుజం కలిపి చైనా మిలిటరీతో పోరాడుతున్నట్లు రాసినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రవాస టిబెటన్ల ప్రభుత్వం పేరుకు తప్ప ఉనికిలో లేదని, ఈ సమయంలో వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నించవచ్చని, ప్రవాస టిబెటన్లతో కుమ్మక్కై భారత దేశం టిబెట్‌ను తురుపు ముక్కగా వినియోగించుకోవటం అంటే తన కాళ్లమీద తానే కాల్చుకోవటం వంటిదని పేర్కొన్నది.