Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
పారిశ్రామిక విప్లవ కాలంలో యజమానులు ప్రవేశపెట్టిన యాంత్రిక మగ్గాలు తమ ఉపాధిని హరించటంతో పాటు, ప్రాధాన్యతను తగ్గిస్తాయని, వాటి మీద పని చేసే నైపుణ్యంలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారని బ్రిటన్‌లోని నిపుణులైన చేనేత కార్మికులు భావించారు. వాటిని విధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారణకు వచ్చి అదే పని చేశారు. చరిత్రలో యంత్రవిధ్వంసక కార్మికులుగా మిగిలిపోయారు. పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేని తొలి రోజుల్లో అది జరిగింది.


ప్రపంచంలో సోషలిజం, కమ్యూనిజం గురించి గత రెండు శతాబ్దాలుగా తెలిసినప్పటికీ వాటిని వ్యతిరేకించే నిరంకుశ శక్తుల ఆలోచన యంత్రవిధ్వంసకుల స్ధాయినిదాటలేదని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆ కార్మికులకు దిక్కుతోచక యంత్ర విధ్వంసం చేస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దిక్కుతోచక చిహ్నాల నిషేధానికి పాల్పడుతున్నారా ?
కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తీ, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తీ, కొడవలిని కార్మిక-కర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపినదాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటిమీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? లేదా, పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు.


పచ్చి మితవాదులైన తండ్రీ కొడుకులు తాము కమ్యూనిస్టు వ్యతిరేకులమని బహిరంగంగానే గతంలో ప్రకటించుకున్న నేపధ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆశ్చర్యమేమీ కాదు. కమ్యూనిస్టులు, నాజీలు ఒకటే అనేందుకు రుజువులు ఇవిగో అంటూ నాటి సోవియట్‌లోని ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులు కరవుకు కారకులయ్యారని ఒక చిత్రాన్ని, నాజీల చిత్రహింసలకు సంబంధించి ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశాడు. అయితే కరవు అని చెప్పిన చిత్రం బ్రిటీష్‌ ఇండియాలోని బెంగాల్‌ కరవుకు సంబంధించింది. కొందరు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ ఎడ్వర్డ్‌ వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించాడు. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అంటూ గతంలో ప్రకటించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారకుడయ్యాడు.


కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలను ఓడించేందుకు సోవియట్‌ కమ్యూనిస్టులు తమ రక్తాన్ని ధారపోశారన్న నిజం దాస్తే దాగేది కాదని పేర్కొన్నది.


తమ భావజాలాన్ని వ్యక్తపరిచేందుకు విధించే ఈచర్యలను తాము సహించబోమని, ప్రజల్లో తమ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసింది.ఇవి బ్రెజిల్‌ ప్రజాస్వామిక స్వేచ్చ, సామాజిక ఉద్యమాల మీద దాడి తప్ప మరొకటి కాదన్నది. కమ్యూనిస్టులను అరెస్టులు చేయాలని, హతమార్చాలని తండ్రీ కొడుకులు, వారితో కుమ్మక్కయిన జనరల్‌ హామిల్టన్‌ మౌరో చూస్తున్నారని వారి ఆటలను అరికట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని కమ్యూనిస్టు యువజన సంఘం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌,మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు.తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు.

బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీ(పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టు చిహ్నాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్ధిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్ర భుత్వం నానాటికీ ప్రజావ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది.
గత ఎన్నికలలో మితవాద బోల్సనారో అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానాలలో ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరిస్తున్నది. దానిలో భాగంగానే బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరో భాగస్వామి అయిన చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మంత్రులు బహిరంగంగానే చైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న బ్రెజిల్‌-అమెరికా సంబంధాలను కాపాడాలనే పేరుతో ఎడ్వర్డ్‌ బోల్జానో ఒక ఉపన్యాసం చేశాడు. ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చు అనే పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెనెజులా గురించి అభూత కల్పనలతో సంక్షేమ చర్యలకు వ్యతిరేకంగా వక్తలు ఉపన్యాసాలు చేశారు. అంతకు ముందు గ్లోబలిజం-కమ్యూనిజం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాంటివే క్యూబాకు వ్యతిరేకంగా కూడా నిర్వహించారు.


కమ్యూనిస్టు వ్యతిరేకతకే బ్రెజిల్‌ ప్రభుత్వం పరిమితం కాలేదు. క్రైస్తవ విలువల పేరుతో అబార్షన్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇప్పించారు. విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది.
ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తోంది. రెండవ యుద్ద ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌ ఒక ఎత్తుగడగా జర్మనీతో చేసుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపుతూ నాజీలు – కమ్యూనిస్టులూ ఒకటే అనే పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్నాయి. నాజీలు సోవియట్‌ మీద జరిపిన దాడి, కమ్యూనిస్టుల చేతుల్లోనే నాజీలు నాశనమైన చరిత్రను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లే అని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్లకోసం నానా గడ్డీ కరుస్తున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.


బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పారిశ్రామిక విప్లవకాలంలో యంత్రాలను విధ్వంసం చేసినంత మాత్రాన ఆ క్రమం ఆగలేదు, పెట్టుబడిదారీ విధానం మరింతగా యాంత్రిక విధానాలతో ముందుకు పోతున్నది. ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా తమకు తామే ప్రాధమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.


బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ శక్తులను హతమార్చక తప్పదు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని సుత్తీ, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండాగాక పోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదన్నది చరిత్రలో ఉంది. వియత్నాం కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ వియత్నాం వర్కర్స్‌ పార్టీ ప్రధమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రోతొలుత క్యూబా ప్రజా పార్టీలో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.పాపులర్‌ సోషలిస్టు పార్టీ పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపధ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టును అని కాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వరంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. మన దేశంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పని చేసిన విషయం తెలిసినదే. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.