Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
మానవాళి చరిత్రలో రాజ్యము – అధికారము ఉనికిలోకి వచ్చిన తరువాత కుట్రలు, కుట్ర సిద్దాంతాలు వాటి వెన్నంటే తలెత్తాయి. అధికారం లేని వారు లేదా బలహీనులు కుట్ర సిద్ధాంత ఆశ్రయం పొందుతారు అన్నది కొందరి అభిప్రాయం. దీనికి విస్తృత అర్ధం, భిన్న భాష్యాలు చెప్పవచ్చు. వాటితో అందరూ ఏకీభవించాలని లేదు. ప్రపంచంలో నిరంతరం కుట్ర సిద్దాంతాలు పుడుతూ జనారణ్యంలో కలియ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవిధంగా చెప్పాలంటేే వాటితో లబ్ది పొందాలనుకొనే బలమైన శక్తులు వాటిని ముందుకు తెస్తాయి.


కమ్యూనిజం ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది కనుక దాన్ని అడ్డుకోవాలన్న కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తీసుకువచ్చింది బలవంతులైన సామ్రాజ్యవాదులే. అది వాస్తవం కాదని గ్రహించలేని వారు దాన్ని నిజమే అని నమ్మి ఆ సిద్దాంతానికి ఊతమివ్వటాన్ని చూస్తున్నాము. తరువాత కాలంలో సోషలిస్టు సోవియట్‌ను బూచిగా చూపి భయపెట్టటం ఎరిగిందే. ప్రాంతీయంగా పశ్చిమాసియాలో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను మారణాయుధాలను గుట్టలుగా పోసిన బూచాడిగా చూపిన వైనం మన కళ్ల ముందే జరిగింది. ఇప్పుడు చైనా బూచిని ముందుకు తెచ్చారు. దాన్ని అర్దం చేసుకోలేని వారు ఆశ్రయం ఇస్తున్నారు. కుట్ర సిద్దాంత వైరస్‌ ఒకసారి ఎవరిలో అయినా ప్రవేశించిందంటే అది కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా మన దరిచేరదు. కానీ కుట్ర సిద్దాంత వైరస్‌కు అలాంటివేమీ ఉండదు. ఒకరి వాట్సాప్‌లో ప్రవేశించినా, చెవి అప్పగించినా చాలు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.


ప్రస్తుతం మన దేశంలో బిజెపి వంటి సంఘపరివార్‌ సంస్ధలు. మీడియా, సామాజిక మాధ్యమం చైనా బూచిని జనాల మెదళ్లకు ఎక్కిస్తున్నదా ? తమ అనుభవంలోకి వచ్చిన దాని బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. చైనా నుంచి ముప్పు వస్తోందంటూ అనేక దేశాలను రెచ్చగొడుతూ, కూడగడుతూ అంతర్జాతీయంగా అమెరికా అటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చైనా అణ్వాయుధాలు ప్రపంచానికి ఆటంకంగా ఉన్నాయని, నౌకా దళంలో చైనా తమను మించి పోయిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగన్‌ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇవి చైనా మిలిటరీ ముప్పు అనే కుట్ర సిద్ధాంత అంశాలే.
ఇలాంటి ప్రచారం అమెరికా ఉత్తిపుణ్యానికే చేయదు. రక్షణ ఖర్చును ఇబ్బడి ముబ్బడి చేసేందుకు దేశీయంగా పార్లమెంట్‌ మీద వత్తిడి తేవటం, ముప్పును ఎదుర్కోవాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలి, అంటే యుద్ద పరిశ్రమల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టేందుకు మానసికంగా జనాన్ని ఒప్పించే ఎత్తుగడ దీనిలో ఉంది. మిలిటరీ రీత్యా చైనా విజయవంతంగా ఎన్నో మార్పులు చేసిందని పొగడటం అంటే అమెరికాలోని సామాన్యులను భయపెట్టటమే. ఇవన్నీ నిజానికి పాతబడిన విద్యలే. అమెరికన్లను బురిడీ కొట్టించేందుకు తమను తాము నిందించుకొనేందుకు సైతం సిద్ద పడతారు. దానితో వారికి పోయేదేమీ లేదు. ఉదాహరణకు అమెరికా నిద్రపోతుంటే చైనా ఆయుధాలతో ఎదిగిపోయింది అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో చేసిన వ్యాఖ్య దానిలో భాగమే. వాస్తవానికి అది అతిశయోక్తి తప్ప వేరు కాదు. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు, తామే కాదు తమ స్నేహితులు కూడా నిద్రపోయారని చెప్పాడు. అదే సమయంలో అమెరికా స్నేహితులు, అనుయాయులు కలిస్తే చైనా కంటే ఎంతో బలం కలిగి ఉన్నామని పాంపియో చెప్పాడు.ఇది చైనాను బెదిరించటం.


ఇటీవలి కాలంలో తాను నాయకత్వం వహిస్తున్న నాటో కూటమి ఖర్చును రక్షణ పొందుతున్న దేశాలే ఎక్కువ భాగం భరించాలని ట్రంప్‌ బహిరంగంగా వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. తాము 70శాతం ఖర్చు చేస్తుంటే మొత్తం ఐరోపా సభ్యదేశాలు 30శాతమే చెల్లిస్తున్నాయని ట్రంప్‌ రుసురుసలాడాడు. అయితే ఖర్చు ఎక్కువ భాగం అమెరికన్‌ సిబ్బందికి, ఆయుధాలకే ఖర్చు అవుతున్నందున తాము అదనంగా చెల్లించాల్సిన పనిలేదని నాటో దేశాలు బదులిచ్చాయి. ఇప్పుడు చైనా బూచిని చూపటం అంటే ఆసియాలోని దేశాలకు రక్షణ కల్పిస్తున్న తమ ఖర్చులో సింహభాగాన్ని భరించాలని అమెరికన్లు కోరటమే.


ఖండాంతర, నియంత్రిత క్షిపణులను చైనా మిలిటరీ తయారు చేసిందని, అవి అమెరికాకు ముప్పు తెస్తాయని, రాబోయే పది సంవత్సరాలలో ఇప్పుడున్న రెండువందల అణ్వాయుధాలు రెట్టింపు అవుతాయని పెంటగన్‌ పేర్కొన్నది. నిజానికి ఏ దేశం దగ్గరైనా అలాంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో మిలిటరీ ఉన్నతాధికారులందరికీ కూడా తెలియదు. ఊహాగానాలు తప్ప సంఖ్యను ఎన్నడూ బయట పెట్టరు. ఇలాంటి అంకెలన్నీ చీకట్లో బాణాలు వేయటం తప్ప మరొకటి కాదు. ” గతంలో చైనాకు క్షిపణులు ఎక్కువ అవసరం ఉండేది కాదు. కానీ చైనాను తన వ్యూహాత్మక పోటీదారుగా అమెరికా పరిగణిస్తున్నది. ఈ నేపధ్యంలో తగినన్ని ఆయుధాలను సమకూర్చుకోని పక్షంలో చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ” పెంటగన్‌ నివేదిక గురించి చైనా రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అవసరం అనుకుంటే చైనా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అణ్వాయుధాలను తయారు చేయగల స్ధితిలో ఉంది. అయితే తన 140 కోట్ల జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచే మహత్తర కృషికి అది ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప వనరులను ఆయుధాల కోసం దుర్వినియోగం చేయటం లేదు.


క్షిపణులు లేదా రాకెట్ల ద్వారా ప్రయోగించే ఆయుధాల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి ఒక దేశ సైనిక పాటవాన్ని లెక్కించటం ఒక పద్దతి. చైనా మరో రెండువందలను తయారు చేయనుంది గనుక తమకు ముప్పు అని అమెరికా చెబుతున్నది. కానీ తన దగ్గర దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఆయుధాలను యావత్‌ ప్రపంచానికి ముప్పుగానా లేక శాంతి కోసం తయారు చేసిందా ? స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2020 వార్షిక నివేదిక అమెరికా మోహరించిన అణ్వాయుధాలు 1,750, ఇతరంగా 4,050, అమ్ముల పొదిలో మరో 5,800 ఉన్నాయని పేర్కొన్నది. రష్యాతో ఒప్పందంలో భాగంగా కొన్ని మధ్యంతర శ్రేణి ఆయుధాలను ఉపసంహరించిన తరువాత పరిస్ధితి ఇది. 2019లో అమెరికా స్వయంగా చెప్పినదాని ప్రకారం దాని దగ్గర మొత్తం 6,185 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 2,385 వినియోగానికి స్వస్తి చెప్పారు లేదా నాశనం చేశారు. మోహరించిన ఆయుధాలు 1365. వీటిని చూపే అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. బయటకు వెల్లడించనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటి ముందు చైనా వద్ద ఉన్న ఆయుధాలెన్ని, అది తెచ్చే ముప్పు ఎంత ?


నిజానికి ఒక దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఎదుటి దేశం మీద ప్రయోగిస్తే సర్వనాశనం తప్ప ఏ దేశమూ మిగలదు. చైనా దగ్గర కూడా గణనీయంగా అణ్వాయుధాలు ఉన్నాయి గనుకనే అమెరికా దూకుడు తగ్గిందన్నది వాస్తవం, అయితే మానసిక ప్రచారదాడి కొనసాగుతూనే ఉంటుంది.1980 దశకం నుంచీ చైనా వద్ద రెండువందలకు మించి అణ్వాయుధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వాటి సంఖ్యను పెంచటం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం స్టాక్‌ హౌం సంస్ధ సిప్రి మరియు అమెరికన్‌ సైంటిస్ట్స్‌ ఫెడరేషన్‌ 320 ఉన్నట్లు జోశ్యం చెప్పాయి. కనుక పెంటగన్‌ కొత్తగా కనుగొన్నదేమీ లేదన్నది స్పష్టం.గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా ఒక్కటే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పిన దేశం. అంతే కాదు అణ్వాయుధాలు లేని దేశాల మీద వాటిని ప్రయోగించబోమని, బెదిరించబోమని కూడా ప్రకటించింది.


పెంటగన్‌ అంచనా ప్రకారం భూమి మీద నుంచి ఖండాంతరాలకు ప్రయోగించే క్షిపణులు చైనా వద్ద 1250కు పైగా ఉన్నాయి. అవి 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని చెబుతోంది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ప్రకారం అమెరికా మధ్యంతర శ్రేణి క్షిపణుల తయారీ నిలిపివేసింది. చైనా బూచిని చూపి ట్రంప్‌ సర్కార్‌ ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. ఈ చర్య మరింతగా ఆయుధ పోటీని పెంచేదే తప్ప తగ్గించేది కాదు. రాడార్లు పసి గట్టకుండా, ధ్వని లేకుండా వేగంగా ప్రయాణించే అమెరికన్‌ బాంబర్లను కూడా కూల్చివేయగల రష్యా ఎస్‌-400 దీర్ఘ శ్రేణి ఆయుధం అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయనుంది. చైనా త్వరలో వీటన్నింటినీ అధిగమించే ఆయుధాలను రూపొందిస్తున్నదని పెంటగన్‌ నివేదిక పేర్కొన్నది.


చైనా నౌకాదళంలో 350 యుద్ద ఓడలు, జలాంతర్గాములున్నాయని, సంఖ్యరీత్యా ప్రపంచంలో పెద్దదని, కొన్ని రంగాలలో తమకంటే ముందున్నదని, తమ వద్ద 293 మాత్రమే ఉన్నాయని పెంటగన్‌ పేర్కొన్నది. ఇది కూడా మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. అమెరికా వద్ద ఉన్న ఆధునిక యుద్ద ఓడలతో పోల్చితే చైనా బలం తక్కువే. అమెరికా వద్ద భారీ అణ్వాయుధాలను ప్రయోగించే పదకొండు బడా యుద్ద నౌకలు ఉన్నాయి. ఒక్కొక్కదాని మీద 80 యుద్ద విమానాలను ఉంచేంత పెద్దవి ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా నౌకాదళం విస్తరించినప్పటికీ అణ్వాయుధేతర విమానవాహక నౌకలు రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో క్షిపణులును కూల్చివేసే విధ్వంసక క్షిపణులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనా నిర్మిస్తున్న నౌకలు అమెరికా వద్ద ఉన్నవాటి కంటే పెద్దవిగా ఉండబోతున్నాయని పశ్చిమ దేశాలు జోశ్యాలు చెబుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఇప్పటికే చైనా అనేక రంగాలలో నిరూపించింది.


అమెరికా కనుసన్నలలో పని చేసే జపాన్‌, దక్షిణ కొరియా ఇటీవలి కాలంలో విమానవాహక నౌకలతో సహా అనేక భారీ యుద్ద నావలను రంగంలోకి దించాయి. చైనా దగ్గర ఉన్న చిన్న తరహా యుద్ద నావలు కలిగించే భారీ నష్టాన్ని పెంటగన్‌ పరిగణనలోకి తీసుకోవటం లేదని ఒక విశ్లేషకుడు వాపోయాడు, అమెరికాను హెచ్చరించాడు. వెయ్యి అంతకు పైగా టన్నుల సామర్ధ్యం ఉన్న తీర రక్షక గస్తీ నౌకలు చైనాలో గత పది సంవత్సరాలలో 60 నుంచి 130కి పెరిగితే అమెరికా వద్ద 70 మాత్రమే ఉన్నాయని,రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న సైనీకీకరణ గావించిన చేపల పడవలను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.
పెంటగన్‌ నివేదిక వచ్చిన సమయంలోనే చైనా విమాన వాహక రెండవ యుద్ద నౌక షాండోంగ్‌ శిక్షణ విన్యాసాలను ప్రారంభించింది. ఇది గత ఏడాది డిసెంబరులో నౌకాదళంలో చేరింది. తొలి నౌక లయనింగ్‌ కూడా పచ్చ సముద్రంలో సంచరిస్తున్నది. ఒకేసారి రెండు యుద్ద నౌకలు విన్యాసాలు జరపటం ఇదే తొలిసారి. తైవాన్‌ నుంచి అమెరికా పిచ్చిపనులు చేసేట్లయితే సమన్వయంతో వాటిని అరికట్టేందుకు వీలుకలుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ రెండు నౌకల సంచారం ఎందుకనే విషయాన్ని చైనా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే జోశ్యాలు వెలువడ్డాయి. షాండోంగ్‌ యుద్ద విమానాలతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, లయనింగ్‌ తన రేవు నుంచి ఎక్కువ దూరం ప్రయాణించనందున సాధారణ శిక్షణ కార్యక్రమాలకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. రెండు నౌకలు సమీపం నుంచి అదే విధంగా దూరం నుంచి సమన్వయం చేసుకోవటం గురించి కూడా పరీక్షలు జరుపుతాయి.


జాతీయ వాదం ప్రపంచానికి ఎంతటి చేటు తెచ్చిందో అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలతో మానవాళి చవి చూసింది. అందువలన జాతీయ వాదానికి గురైన ఏ జాతీ ప్రశాంతంగా లేదు, ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. జాతీయ వాదం వేరు దేశభక్తి వేరు. జాతీయవాదాన్నే దేశభక్తిగా చిత్రించి జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి.


బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే నాడు జాతీయవాదం-దేశ భక్తి. నేడు అసలు సిసలు దేశభక్తులుగా చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు నాడు అవి పట్టలేదు. ఒక దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత జాతీయవాదం ముందుకు వస్తే దాని స్వభావం భిన్నంగా ఉంటుంది. జర్మనీలో ముందుకు తెచ్చిన జాతీయవాదాన్ని నాజీలు దేశభక్తిగా ప్రచారం చేశారు. ఐరోపాలో ఉన్న జర్మన్‌లు, జర్మనిక్‌ భాష మాట్లాడేవారందరూ ఒకే దేశంగా ఉండాలి. జర్మన్‌ జాతి ఔన్నత్యాన్ని నెలకొల్పాలి. యూదులు, పోల్స్‌, రుమేనియన్లు అల్పజాతి వారు కనుక వారిని జర్మన్‌ గడ్డ నుంచి పంపివేయాలి. ఇదే నాజీల దేశభక్తి. దీన్ని ఆమోదించిన వారు జాతీయవాదులు, దేశభక్తులు.ఈ వాదాన్ని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, జర్మనీలో వారికి చోటు లేదు, ఇదీ తీరు. హిట్లర్‌ జాతీయ వాదాన్ని సమర్ధించిన వారు దేశభక్తులు, వ్యతిరేకించిన కమ్యూనిస్టులను జర్మన్‌ ద్రోహులని ఆరోజు చిత్రహింసల పాలు చేశారు.


చైనాతో మన సరిహద్దును బ్రిటీష్‌ వారి హయాంలో వివిధ సందర్భాలలో అధికారులు ఇష్టమొచ్చినట్లు గీశారు. ఒకరు గీసినదానిలో ఆక్సారుచిన్‌ చైనా ప్రాంతంగా మరొక దానిలో మనదిగా ఉంది. అదే విధంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌ అంతర్భాగంగా, బ్రిటీష్‌ ఇండియా భాగంగా పేర్కొన్న సందర్భాలున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ఆ ప్రాంతాన్ని బ్రిటీష్‌ ఇండియా సర్కార్‌ ఆధీనంలో ఉన్నదానిని టిబెట్‌ స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. బ్రిటీష్‌ వారితో టిబెట్‌ పాలకులు చేసుకున్న ఒప్పందాలను వేటినీ చైనా పాలకులు అంగీకరించలేదు. తమ సామంత రాజ్యానికి అలాంటి హక్కులేదని వాదించారు. ఒప్పందాలు అమలు కూడా కాలేదు. సరిహద్దులను ఖరారు చేసుకోవాలని నాడు చైనా గానీ బ్రిటీష్‌ ఇండియా గానీ పూనుకోలేదు.


అంతెందుకు మన దేశంలో ఆశ్రయం పొందిన 14 దలైలామా 1959లో తిరుగుబాటు చేసి మన దేశానికి పారిపోయి రావటానికి ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెప్పాడు. ఆ తరువాత 2003లో కూడా వాస్తవానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌కు చెందిందని చెప్పాడు.


1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది, 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. తరువాత కాలంలో సరిహద్దుల సమస్య ముందుకు వచ్చింది. రెండు దేశాలూ తమ వైఖరే సరైనదే అనే విధంగా వ్యవహరించాయి. దానికి తోడు దలైలామా సమస్య తోడై అది యుద్దానికి దారి తీసింది. వివాదం తెగలేదు. అయితే పరిష్కారం కావాలి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి. అందుకు సంప్రదింపులు పరిష్కారం తప్ప ఆయుధాలు మార్గం కాదు. 1962లో యుద్ద సమయంలో అన్ని పార్టీలు జాతీయవాదానికి గురై చైనాను దురాక్రమణదారుగా పేర్కొని యుద్దాన్ని సమర్ధించాయి. సిపిఐ జాతీయ నాయకత్వం దీని గురించి ఒక వైఖరి తీసుకోవాల్సివచ్చింది. ఆ సమయంలో జరిగిన చర్చలలో కొందరు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరిని పార్టీ ప్రకటించాలని ప్రతిపాదించారు. మిగిలిన వారు యుద్దాన్ని సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే వైఖరి తీసుకున్నారు. అప్పటికి సైద్దాంతిక విభేదాల గురించి చర్చ తప్ప పార్టీలో చీలిక లేదు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన పార్టీనేతలను, ఆ అభిప్రాయాన్ని బలపరిచిన వారిని దేశ వ్యాపితంగా నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. తరువాత వారంతా సిపిఎంగా ఏర్పడ్డారు.


దేశభక్తి పేరుతో రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఫ్‌ు, ఇతర సంస్దలు చైనా వ్యతిరేక వైఖరిని తీసుకొని, యుద్దాన్ని వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించాయి. కానీ తరువాత కాంగ్రెస్‌ పాలకులు, జనతా పార్టీలో చేరి అధికారంలో భాగస్వాములైన జనసంఘనేతలు, తరువాత బిజెపిగా అధికారానికి వచ్చిన వారూ చేసిందేమిటి ? సరిహద్దు సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రెండు వైపులా తుపాకులు పేల కూడదని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర సంస్ధల నేతలు చైనా వ్యతిరేక ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. దానికి మీడియా తోడైంది సరే. 1962లో యుద్దాన్ని సమర్దించి జాతీయవాదానికి గురైన సిపిఐ ఇప్పుడు ఆ వైఖరిని సవరించుకున్నది. సిపిఎం మాదిరే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే వైఖరినే తీసుకున్నది.
అనేక దేశాలలో కమ్యూనిస్టులు ఇలాంటి సమస్యలు వచ్చినపుడు జాతీయవాదానికి లోను కాకుండా ఒక సూత్రబద్ద వైఖరిని తీసుకున్నారు. పాలస్తీనాను ఆక్రమించి స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా అడ్డుకుంటున్న పాలకుల వైఖరిని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నది. అక్కడి యూదుదురహంకారులు కమ్యూనిస్టులను దేశద్రోహులని నిందిస్తున్నా, దాడులకు పాల్పడినా కమ్యూనిస్టులు తమ వైఖరిని మార్చుకోలేదు.


చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుత చర్చలు-ఇచ్చిపుచ్చుకోవటాలు తప్ప మరొక పరిష్కారం అసాధ్యం. ఈ విషయం ప్రతిపార్టీకీ తెలుసు. అయినప్పటికీ పైకి జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నాయి. మే, జూన్‌ మాసాలలో కొత్తగా చైనా వారు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పారు. తీరా మన ప్రధాని అఖిలపక్ష సమావేశంలో అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించారు. తాజాగా మన ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు వస్తున్న చైనా వారిని పసిగట్టిన మన మిలిటరీయే చొరవ తీసుకొని కొన్ని కొండలను ఆధీనంలోకి తెచ్చుకుందని ప్రకటించారు. అసలేం జరుగుతోంది అన్నది తెలియటం లేదు.


యుద్దం వద్దు అన్న వారిని మన మిలిటరీ సత్తాను అవమానించే వారిగా చిత్రిస్తూ దాడి చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ శక్తి అమెరికా. అలాంటి దేశం జరిపిన యుద్దాలలో ఎక్కడైనా విజయం సాధించిందా ? అలాంటపుడు చైనా మనలను గానీ, మనం చైనాను గానీ యుద్ధంలో ఓడించి సమస్యలను పరిష్కరించుకోగలమా ? మన దగ్గర ఉన్న నాలుగు రూకలను అటు అమెరికా లేదా రష్యా మరొక దేశం నుంచో కొనుగోలు చేసే ఆయుధాలకు సమర్పించుకోవటం తప్ప మరొకటేమైనా జరుగుతుందా ? మన ప్రాంతాలను చైనాకు అప్పగించాలని ఎవరూ కోరటం లేదు. గతంలో లేదు భవిష్యత్‌లో కూడా ఉండదు. దేశభక్తి గురించి ఏ పార్టీ మరొక పార్టీకి బోధలు చేయాల్సిన,నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భిన్న అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కాదు. ఉద్రేకాలకు లోనుకాకుండా ఆలోచించాల్సిన సమయమిది. గతంలో ప్రపంచంలో జరిపిన అనేక యుద్దాలు ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా జాతీయ దురహంకారంతో చేసినవే. అలాంటి వైఖరికి జనం మూల్యం చెల్లించాలా ?