Tags
BJP hypocrisy, Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation, TRS government
ఎం కోటేశ్వరరావు
చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.
చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.
ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.
ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?
1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.
ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?
నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్. నిజాం రజాకార్ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్. 1947 ఆగస్టు 15న ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?
విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్ మార్చ్ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.
కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్ జెయన్ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్ క్లోజ్ అయింది.
తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్ రైతాంగం కూడా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్ కూడా ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్ రాజ్యం గానీ, కాశ్మీర్ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.
హైదరాబాద్, కాశ్మీర్ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.
” భారత రాజ్యాంగ సభలో చేరేందుకు తిరస్కరించిన సంస్థానాలలో కాశ్మీరు ఒకటి. మంత్రివర్గ పధకం కింద ఏర్పాటైన ఆ సభ 1946 డిసెంబరు నుంచి పని చేస్తున్నది. ఏ రాష్ట్రమైనా అలా తిరస్కరిస్తే దాన్ని శత్రుపూరిత చర్యగా పరిగణించాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ హెచ్చరించినప్పటికీ మహరాజు తిరస్కరించారు. సంస్థానాధీశులకు స్వతంత్రంగా ఉండే హక్కుకు నిర్ద్వంద్వంగా ముస్లిం లీగు మద్దతు ప్రకటించటం రాజ్యాంగ సభలో చేరకూడదనే రాజు మూర్ఖత్వాన్ని మరింత బలపరించింది.1947 జూన్ 17న ముస్లింలీగ్ నేత మహమ్మదాలీ జిన్నా ఈ మేరకు ప్రకటించారు. జమ్ము -కాశ్మీరు గనుక స్వతంత్ర దేశంగా ఉండదలచుకుంటే పాకిస్తాన్ స్వాగతిస్తుందని, స్నేహపూరిత ఒప్పందాలు చేసుకుంటుందని 1947 జూలై 11న మరింత స్పష్టంగా వెల్లడించారు.
విడిపోవటం ఖాయమని స్పష్టమైన తరువాత మహరాజు(కాశ్మీర్) భారత్‌లో చేరే మానసిక స్థితిలో లేరు. జమ్ము మరియు కాశ్మీర్ పేర్కొంటున్నదానిని హిందూ రాజ్యంగా ఉంచాలని, లౌకిక భారత్‌గా గుర్తింపు ఉండకూడదని, విలీనం చేయకూడదని రాజుకు విధేయులుగా ఉన్న జమ్మూలోని హిందూ నేతలు రాజుకు మద్దతు ఇచ్చారు.ఆల్ జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్య హిందూ సభ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పూర్వ అవతారము) 1947 మే నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహారాజు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ విలీనం గురించి ఇప్పుడు చేస్తున్నదానికి తరువాత చేయాల్సినదానికి తమ మద్దతు ఉంటుందని దానిలో పేర్కొన్నారు.1947 మే నెలలోనే ఆల్ జమ్మూ మరియు కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడు చౌదరి హమీదుల్లా ఖాన్ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కాశ్మీర్ స్వాతంత్య్రాన్ని ప్రకటించాలని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మహరాజును కోరారు. దీనికి ముస్లింలంతా సహకరిస్తారని, స్వతంత్ర మరియు ప్రజాస్వామిక కాశ్మీర్ దేశానికి తొలి రాజ్యాంగబద్ద పాలకుడిగా మహరాజుకు మద్దతు ఇస్తామని హామీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ మీద దాడికి వస్తే దేశంలోని ముస్లింలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపడతారు, అవసరమైతే భారత్ సాయం కూడా కోరతామని చెప్పారు. నాతో సహా భారత్‌కు అనుకూలంగా గళమెత్తిన వారందరినీ హిందూ వ్యతిరేకులు, ద్రోహులు అని హిందూ దురహంకారులు ఖండించారు.భారత్‌లో విలీనం కావాలని, షేక్ అబ్దుల్లాను విడుదల చేయాలని ముల్కరాజ్ సరాఫ్ సంపాదకత్వంలోని జమ్మూ దినపత్రిక రణవీర్ రాసినందుకు 1947 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.”
ఈ వివరాలను ఎపిలోగ్ అనే పత్రిక 2010 నవంబరు సంచికలో ప్రత్యక్ష సాక్షి అనే శీర్షికతో 2005లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న, జమ్మూకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బలరాజ్ పూరీ రాశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్, హిందూత్వ వాదుల నిజస్వరూపం. ఇప్పుడు వారు దేశ సమగ్రత గురించి జనాలకు సుభాషితాలు చెబుతున్నారు. ఈ విద్రోహకర పాత్ర దాస్తే దాగేది కాదు. నేటి తరాలకు చరిత్రపట్ల ఆసక్తి లేదనే భావంతో పచ్చి అవాస్తవాలు, ద్రోహాన్ని కప్పి పుచ్చుకొనేందుకు దేశంలో మరింతగా సామాజిక విభజనను రెచ్చగొట్టేందుకు విషపు బీజాలు నాటారు. అవి ఇప్పుడు వృక్షాలుగా మారి విషఫలాలను ఇస్తున్నాయి.
సెప్టెంబర్ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.
నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు రఫీ అహ్మద్ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్ స్టిల్ ఎగ్రిమెంట్) 1947 నవంబర్ 29న చేసుకుంది.
ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.
యూనియన్ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.
సెప్టెంబరు 17ను తెలంగాణా విమోచన పేరుతో బిజెపి, సమైక్యతా దినంగా తెలంగాణా ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణా రైతాంగం సాధించుకున్న హక్కులను హరించిన విద్రోహ దినంగా పరిగణించిన కమ్యూనిస్టులు బిజెపి ఇతర కొన్ని శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న పూర్వరంగంలో వారు కూడా ఈ సందర్భంగా సభలు జరిపి జనాన్ని చైతన్య పరిచేందుకు, నైజాం సంస్థాన విలీనంలో చెరగని కమ్యూనిస్టుల పాత్రను వివరించేందుకు నిర్ణయించారు.
రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.
గమనిక : 2020 సెప్టెంబరు 17న రాసిన ఈ విశ్లేషణను నవీకరించి తిరిగి పాఠకులకు అందించటమైంది