Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.