Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ తయారు చేయించిన ఓట్‌ జో ఆప్‌ నుంచి కీలకమైన సమాచారం బయటకు పోతున్నట్లు కనుగొన్నారు. ఓటర్ల రాజకీయ అనుబంధాలు ఏమిటి, గతంలో వారు ఎవరికి ఓటు వేశారు అన్న సమాచారం దానిలో ఉంటుందట, ఇప్పుడు అది ఎవరికి అవసరం, ఇంకెవరికి మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్త్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కే.
గూగుల్‌ ఖాతాదారుల 2ఎఫ్‌ఏ ఎస్‌ఎంఎస్‌ కోడ్స్‌ను తస్కరించేందుకు ఇరానియన్‌ హాకర్ల గ్రూప్‌ ఒక ఆండ్రాయిడ్‌ అక్రమ చొరబాటుదారును అభివృద్ది చేసింది.
రాబోయే రోజుల్లో సమాచారాన్ని తస్కరించే అక్రమచొరబాటుదార్ల దాడులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలని బ్రిటన్‌లోని ఎన్‌సిఎస్‌సి విద్యా సంస్ధలకు సలహాయిచ్చింది.


జర్మనీలో ఒక ఆసుపత్రి సమాచార వ్యవస్ధపై జరిగిన దాడి కారణంగా కంప్యూటర్‌ వ్యవస్ధలు పని చేయలేదు. దాంతో తక్షణం చికిత్స అందించవలసిన ఒక మహిళా రోగిని మరో పట్టణంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి రావటంతో ఆమె మరణించింది.
తమ సంఘంలోని రెండు లక్షల మంది నర్సుల వ్యక్తిగత సమాచార భద్రతకు తగిన చర్య తీసుకోని కారణంగా చోరీకి గురైనట్లు కెనడాలోని అంటారియో రాష్ట్ర నర్సుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని న్యూజెర్సీ యూనివర్సిటీ హాస్పిటల్‌ సమాచార వ్యవస్ధపై జరిగిన దాడిలో 48వేల మందికి సంబంధించిన సమాచారం చోరీకి గురైంది. అమెరికా ఫెడరల్‌ కోర్టుల ఫోన్‌ వ్యవస్ధ గురువారం నాడు పనిచేయలేదు.సైబర్‌దాడుల గురించి 75శాతం మంది ఐటి ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేసినట్లు కనెక్ట్‌వైజ్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది. ఇవన్నీ తాజా వార్తల్లో కొన్ని మాత్రమే.


ఇక కంప్యూటర్‌ అక్రమ చొరబాటుదార్ల మధ్య పరస్పర సహకారం పెరుగుతున్నట్లు పాజిటివ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది.2020 సంవత్సరం రెండవ త్రైమాసికంలో జరిగిన సైబర్‌దాడుల గురించి చేసిన విశ్లేషణలో తొలి మూడు మాసాలతో పోల్చితే తొమ్మిది శాతం, 2019తో పోల్చితే 59శాతం పెరిగినట్లు, కరోనా కారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో రికార్డులను బద్దలు చేస్తూ దాడులు పెరిగినట్లు తెలిపింది. వస్తుతయారీ, పారిశ్రామిక కంపెనీలపై దాడులు పెరిగినట్లు తేలింది. తాము కోరిన మొత్తాన్ని చెల్లించని పక్షంలో తాము కాపీ చేసుకున్న లేదా తస్కరించిన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని దాడులకు పాల్పడిన వారు బెదిరిస్తున్నట్లు విశ్లేషణలో తేలింది. లాక్‌బిట్‌ మరియు రాగనర్‌ లాకర్‌ వంటి చోరీ ముఠాలు ఈ రంగంలో గాడ్‌ ఫాదర్‌ లేదా డాన్‌గా ఉన్న మేజ్‌తో జతకట్టటం, సహకరించుకోవటానికి ముందుకు వస్తున్నట్లు తేలింది. అందరూ కలసి మేజ్‌ బృందం పేరుతో తస్కరించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేస్తున్నారు. దాన్ని చూపి కంపెనీలను బెదిరిస్తున్నారు. వీటన్నింటినీ చూసినపుడు ఒకటి స్పష్టం. సమాచార చౌర్యం అన్నది ప్రపంచ వ్యాపిత సమస్య. బడా కంపెనీలు తమ ప్రయోజనాల కోసం తస్కరిస్తే, దాన్ని చోరీ చేసి బెదిరించి సొమ్ము చేసుకొనే వారు కూడా తయారయ్యారు.


చైనా సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులకు, సంస్దలకు ద్వారాలు తెరుస్తున్న సమయంలో వాటికి ఆద్యుడిగా ఉన్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. గాలి కోసం కిటికీలు తెరుస్తున్నపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసుఅన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాల నుంచి, మన దేశం నుంచీ చైనా వెళుతున్నవారిలో గూఢచారులు లేరని ఎవరైనా చెప్పగలరా ? దానికి ప్రతిగా చైనా తన పని తాను చేయకుండా ఉంటుందా ?


ఈ వాస్తవాన్ని విస్మరించి పాఠకులను, వీక్షకులను ఆకర్షించేందుకు మన మీడియా పడుతున్న పాట్లు చెప్పనలవిగావటం లేదు. తాజా విషయానికి వస్తే బెంగళూరు నగరంలోని కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రంలోని వంద కంప్యూటర్లు ఒక నెల రోజుల్లోనే రెండు సార్లు సైబర్‌ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అంటే సమాచార తస్కరణ జరిగింది. జరిగినట్లు కూడా తెలియదు. ఎలక్ట్రానిక్‌ సమాచారాన్ని ఏమీ చేయకుండానే కాపీ చేసుకొనే సౌలభ్యం గురించి తెలియని వారెవరు ? ఈ దాడి పైన చెప్పుకున్న మేజ్‌ బృందం చేసినట్లు చెబుతున్నారు. ఈ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న ఎలక్ట్రానిక్‌ పాలనకు సంబంధించి అనేక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ రహదారుల సంస్ధ సమాచార వ్యవస్ధమీద కూడా దాడి జరిగింది.ఇంకా ఇలాంటి దాడులు ఎన్ని జరిగాయో తెలియదు. ఆ వివరాలను బహిరంగంగా చెబితే ప్రభుత్వ పరువు పోతుంది కనుక అధికార యంత్రాంగం మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నది వేరే చెప్పనవసరం లేదు.
చైనాకు చెందిన సంస్ధ ఒకటి మన దేశంలోని వేలాది మంది ప్రముఖులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అక్కడి ప్రభుత్వానికి అంద చేస్తున్నదని ఒక ఆంగ్ల పత్రిక రాసిన వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం అయింది. దానిలో ఉన్న అంశాలు ఏమిటట ? పది వేల మంది ప్రముఖులకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని జెన్‌హువా అనే సంస్ధ సేకరించి విశ్లేషిస్తోందట. ఎప్పటి నుంచి ? 2018లో ప్రారంభం అంటున్నారు ? అంతకు ముందు ఎందుకు చేయలేదు ? చెప్పేవారు లేరు. అప్పటి నుంచే ఆ సమాచారం ఎందుకు అవసరమైంది. మనకు తెలియదు. మరి సమాచార సేకరణ నిజమా కాదా ? నూటికి నూరుపాళ్లు నిజమే. బహిరంగంగా తెలిసిన సమాచారమే కాదు, తెలియని సమాచారాన్ని కూడా చైనా సేకరించుతుంది. ఎందుకని ? ప్రపంచంలో ఆ పని చేయని దేశం ఏది ? ఒక్కటి కూడా లేదు. ఇదంతా బహిరంగ రహస్యమే. సమాచార చోరీ గురించి పభుత్వానికి తెలుసు అని ఐటి శాఖ చెప్పింది. మరి తెలిసిందాన్ని సంచలన విషయంగా మీడియా వారు ఎందుకు చెబుతున్నారు ? అలా చెబితే తప్ప జనాలకు కిక్కు రావటం లేదు మరి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏది చెప్పినా గిట్టుబాటు అవుతుందన్న లాభాపేక్ష. అమెరికా ఇతర దేశాల గురించి రాస్తే ఢిల్లీ ప్రభువులకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయం. కమ్యూనిస్టు వ్యతిరేకత సరే సరి !
కొద్ది సంవత్సరాలు వెనక్కు వెళితే 2010లో చేరి అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే కుర్రాడు (37) సిఐఏ, ఎన్‌ఎస్‌ఏ వంటి సంస్ధలు సేకరించిన వందల కోట్ల ఫైళ్లను ప్రపంచానికి బహిర్గతం చేశాడు. అమెరికా నగరం వాషింగ్టన్‌లోని మన రాయబార కార్యాలయం, న్యూయార్క్‌లోని మన ఐరాస కార్యాలయాల కంప్యూటర్‌ వ్యవస్ధలోకి చొరబడిన అమెరికన్‌ ఎన్‌ఎస్‌ఏ ప్రభుత్వ ఆదేశాలు, ఇతర సమాచారాన్ని తస్కరించింది.గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌, యాహూ వంటి బడా ఐటి కంపెనీలు సేకరించిన అమెరికనేతర దేశాలకు చెందిన సమాచారం మొత్తం అమెరికాకు చేరిపోయింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.


ప్రపంచ వ్యాపితంగా 97 బిలియన్లు అంటే 9,700 కోట్ల సమాచార అంశాలను అమెరికా చోరీ చేసిందని గార్డియన్‌ పత్రిక ఆరేండ్ల క్రితం వెల్లడించింది. దాని దౌత్యవేత్తలు, గూఢచారులు పంపిన నివేదికలు కూడా వాటిలో ఉన్నాయి. అమెరికన్లు తమ శత్రువుల సమాచారాన్ని మాత్రమే సేకరించి మిత్రులను మినహాయించలేదు. శత్రుదేశంగా పరిగణించే ఇరాన్‌ నుంచి 1400 కోట్లు, మిత్ర దేశమైన పాకిస్ధాన్‌ నుంచి 1350 కోట్లు, పశ్చిమాసియాలో అత్యంత సన్నిహిత దేశమైన జోర్డాన్‌ నుంచి 1270 కోట్లు, ఈజిప్టు నుంచి 760, మన దేశం నుంచి 630 కోట్ల ఫైళ్ల సమాచారాన్ని తస్కరించింది.


మన దేశం తమకు మిత్ర దేశమని చెబుతూనే రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించిన సమాచారాన్ని, వాణిజ్య అంశాలు ప్రత్యేకించి అణు, అంతరిక్ష కార్యక్రమాలను అమెరికా సేకరించినట్లు హిందూ పత్రిక వెల్లడించింది. ఇంటర్నెట్‌ నుంచి 630, టెలిఫోన్ల నుంచి 620 కోట్ల వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. ఆరు సంవత్సరాల నాడు ఈ వివరాలు వెల్లడైనపుడు ప్రొఫెసర్‌ గోపాలపురం పార్ధసారధి అనే మాజీ సీనియర్‌ దౌత్యవేత్త మాట్లాడుతూ హిందూ పత్రిక ప్రకటించిన వార్తల గురించి ఎవరూ ఆశ్చర్య పడనవసరం లేదని, ప్రతివారూ ప్రతి ఒక్కరి మీద నిఘావేస్తారు, కొంత మంది మంచి పరికరాలను కలిగి ఉండవచ్చు, వారి సౌకర్యాలు మనకు గనుక ఉంటే మనమూ అదే పని చేస్తామని గట్టిగా చెప్పగలను అని గార్డియన్‌ పత్రికతో చెప్పారు.


అమెరికా తస్కరించిన సమాచారాన్ని బయట పెట్టటానికి మూడు సంవత్సరాల ముందు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికన్‌ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ న్యూ ఢిల్లీ వచ్చి ఆరు రోజులు ఉన్నాడు. కంప్యూటర్ల నుంచి సమాచార నైతిక తస్కరణ, సాఫ్ట్‌వేర్లను తెలుసుకోవటం ఎలా అనే అంశం మీద శిక్షణ పొందాడు. అంటే మన దేశంలో అలాంటి నిపుణులకు కొదవ లేదన్నది స్పష్టం. సమాచారాన్ని నిల్వ చేసే పద్దతులు తెలుసుకోవటం ఎలానో, కంప్యూటర్లలోకి దొంగలు ఎలా ప్రవేశిస్తారో, వారిని ఎలా నిరోధించాలో కూడా విద్యార్ధులకు శిక్షణ అవసరమే మరి. తమ దగ్గరకు వచ్చే వారు ఏ లక్ష్యంతో వస్తున్నారో శిక్షణా సంస్దలు తెలుసుకోలేవు. చాకుతో మామిడి, కూరగాయలను ఎలా కోయవచ్చో చెప్పటంతో పాటు అవసరం అయితే దాన్నే ఆత్మరక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతారు. అది తెలిసిన వారు దారి తప్పినపుడు నేరానికి ఉపయోగించటంలో ఆశ్చర్యం ఏముంది?


ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ తాను భారత్‌ వెళుతున్నట్లు అక్కడ సమాచార నిల్వ, తస్కరణ వంటి అంశాల్లో శిక్షణ పొందబోతున్నట్లు అమెరికా భద్రతా అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడని ఒకవైపు చెబుతారు. తీరా అతను రహస్య సమాచారాన్ని బయట పెట్టిన తరువాత అమెరికా ఎన్‌ఎస్‌ఏ చెప్పిందేమిటి ? తమ కాంట్రాక్టు ఉద్యోగిగా అంటే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్నోడెన్‌ను నియమించే సమయంలో సిఐఏ అధికారులు క్షుణ్ణంగా మంచి చెడ్డల గురించి ప్రశ్నించకుండానే ఎంపిక చేశారట. అతను విదేశాలకు దేనికి వెళ్లాడు, ఏం చేశాడు, అతన్ని కలిసిన, కలుస్తున్న వ్యక్తులెవరు ? వారెలాంటి వారు తదితర అంశాలను పట్టించుకోలేదని, జాగ్రత్త చేయాలంటూ 17లక్షల రహస్య ఫైళ్లను అతనికి అప్పగించారని తెలిపింది. అయితే అతను సిఐఏ కాంట్రాక్టరుగా, సాంకేతిక సహాయకుడిగా భారత్‌ వస్తున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి స్పష్టంగా తెలుసు. తాను వ్యాపారనిమిత్తం భారత్‌ వచ్చానని స్నోడెన్‌ చెప్పినట్లు అతనికి శిక్షణ ఇచ్చిన కోయింగ్‌ సొల్యూషన్స్‌ సిఇఓ రోహిత్‌ అగర్వాల్‌ చెప్పాడు. తాము సిఐఏ గూఢచారులమనిగానీ, దాని తరఫున వచ్చామని గాని ఎక్కడా వెల్లడించవద్దని సిఐఏ అధికారులు జారీ చేసిన మార్గదర్శక సూత్రాల్లోనే ఉంది కనుక స్నోడెన్‌ తాను వ్యాపారినని చెప్పాడు.అలాంటి వారందరూ ఏ దేశం వెళితే అక్కడి అమెరికా రాయబార కార్యాలయాల్లోనే పని చేస్తారు అన్నదీ బహిరంగ రహస్యమే.
సమాచారాన్ని సేకరించేందుకు, గూఢచర్యం కోసం కొన్ని కంపెనీలనే కొనుగోలు చేయటం అందరికీ తెలిసిందే.1970లో క్రిప్టో ఏజి అనే స్విస్‌ కంపెనీని అమెరికా, జర్మనీ గూఢచార సంస్ధలు కొనుగోలు చేసి వంద దేశాలల్లో వేగుల కార్యకలాపాలకు దాన్ని వేదికగా చేసుకున్నాయి. అయితే రెండు దేశాల అధికారుల మధ్య పరస్పర అనుమానాలు తలెత్తి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. సిఐఏ సిబ్బందిలో కొంత మందికి జర్మన్‌ భాష రాకపోవటం కూడా దీనికి కారణమైంది.


ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ను కూడా ఉపయోగించుకొని వాటి ద్వారా వివిధ దేశాలకు వెళుతున్న సమాచారాన్ని తెలుసుకున్నట్లు గార్డియన్‌ పత్రిక బ్రిటన్‌ గూఢచార సంస్ధ చేసిన నిర్వాకం గురించి వెల్లడించింది. అది తాను సేకరించిన సమాచారాన్ని అమెరికా ఎన్‌ఎస్‌ఏకు అంద చేసింది. రోజుకు 60 కోట్ల మేర ఫోన్‌ సంభాషణలు, సమాచారానికి సంబంధించిన అంశాలను అందచేసేది. సముద్ర గర్భంలో వేసిన ఇటలీలోని ఆప్టిక్‌ కేబుళ్ల కేంద్రాల నుంచి వీటిని సేకరించారు. ఇదంతా చట్టబద్దమే అని ఈ కుంభకోణం వెల్లడైనపుడు బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొన్నది. సమాచారాన్ని 30 రోజుల పాటు నిల్వచేసి విశ్లేషణ చేసిన తరువాత అవసరమైన వాటిని ఉంచుకొని మిగిలిన వాటిని పారవేసేవి. అందువలన ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వ సంస్ధలు ఫోన్‌ కంపెనీలు, ప్రయివేటు కంపెనీల ద్వారా సంబంధించిన సమాచారాన్ని పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. అందువలన ఫోన్ల ద్వారా, టిక్‌టాక్‌ వంటి ఆప్‌ల ద్వారా సమాచారాన్ని చైనా లేదా మరొక దేశం సేకరించటం రహస్య వ్యవహారమేమీ కాదు. ప్రతి దేశమూ చేస్తున్నదే.
అమెరికా ప్రపంచ వ్యాపితంగా 61వేల హాకింగ్‌లకు అమెరికన్లు పాల్పడినట్లు ఆరు సంవత్సరాల క్రితం హాంకాంగ్‌ పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు బయటపెట్టింది. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు కొన్ని అంశాల మీద భిన్నంగా మాట్లాడినా అమెరికా చేస్తున్న అన్ని అక్రమాలకు బాసటగా నిలుస్తున్న ఐరోపా యూనియన్‌ దేశాల కూటమితో సహా అమెరికా ఏ దేశాన్నీ వదలలేదు. ఎవరినీ నమ్మకపోవటమే దీనికి కారణం. చివరికి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్లను కూడా దొంగచెవులతో విన్నట్లు పత్రికలు రాయటంతో బెర్లిన్‌లోని అమెరికా రాయబారిని పిలిపించి సంజాయిషీ అడిగారు. ఇదేం మర్యాద అంటూ ఆమె నాటి అధ్యక్షుడు ఒబామాతో ఫోన్లో మాట్లాడారు.

దొంగచెవులు, గూఢచర్యం వంటి పనులకు 2013లో అమెరికా 5,300 కోట్ల డాలర్ల( దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు) కేటాయించింది. రోజుకు 20కోట్ల వర్తమానాలను అమెరికా ప్రపంచవ్యాపితంగా సేకరించినట్లు 2014జనవరిలో గార్డియన్‌ పత్రిక రాసింది. మన ఆధార్‌ కార్డులు, వాటిని మన బ్యాంకు ఖాతాలు, ఇతర పధకాలకు అనుసంధానం చేసినందున వాటిలో ఉన్న సమాచారం మొత్తం చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన బతుకులన్నీ బజార్లో ఉన్నట్లే ! వ్యక్తిగత సమాచార తస్కరణకు ఎవరు పాల్పడినా గర్హనీయమే, ఖండించాల్సిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ చేస్తున్నదే అన్నది పచ్చి నిజం ! ఇక్కడ సమస్య పదివేల మంది మీద నిఘావేసింది అన్న చైనా గురించి గుండెలు బాదుకుంటున్న వారికి ప్రపంచ జనాభా పడక గదుల్లో కూడా ఏం జరుగుతోందో తెలుసుకొనే అమెరికా బడా చోరీలు, చోరుల గురించి పట్టదేం ?