Tags
Act of God, Farmers matters, Indian agri reforms, indian farmers, narendra modi promises and facts
అయ్యా నరేంద్రమోడీ గారూ !
ఒక రైతు బిడ్డగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. మీకు గానీ, మీ అభిమానులకు గానీ నచ్చకపోతే నచ్చ లేదని చెప్పండి, నేను చెప్పినదాంట్లో తప్పేమిటో చర్చించండిగానీ దేశద్రోహులు అని ముద్రవేయటం చాల బాగోదని మీ వారికి చెప్పండి. రైతులను తూలనాడిన వారికి ఈ దేశంలో భవిష్యత్ ఉండదు. వెన్ను విరగ కొడతారు.
ఉద్యోగాలు రాకపోవటానికి కుర్రాళ్లకు నైపుణ్యం లేదని ఎత్తున శిక్షణా కేంద్రాలంటూ పెద్ద హడావుడి చేశారు. నైపుణ్యం సంగతి దేవుడెరుగు ఆ పేరుతో వేల కోట్ల రూపాయలను ఆ పేరుతో స్వాహా చేశారు. కొత్త ఉద్యోగులు రాకపోగా ఉన్న ఉపాధిపోయింది. మభ్యపెట్టే కళలో మీకు మాత్రం నైపుణ్యం పెరిగిందన్నది స్పష్టం. ఆ చాతుర్యం గురించి గతంలో మా పెద్దలు ఇందిరా గాంధీ గురించి చెప్పేవారు. ఇప్పుడు మీరు ఆమెను మించిపోయినట్లు చెబుతున్నారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నే వాడు వస్తాడు. తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఇక విషయానికి వస్తా !
పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్ట సవరణ బిల్లులు ఒక మూలమలుపు అని మీరు వర్ణించారు. నిజంగానే, అయితే అది రైతులను ముంచేందుకా తేల్చేందుకా అన్నదే సమస్య. అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చెప్పిన మాట చెప్పకుండా, చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకుండా కొత్త విషయాలను జనానికి చెప్పటంలో దిట్టగా మారారు. ఈ విషయంలో మీకు మరొకరు సాటి రారు. అమెరికా అగ్రనేత అబ్రహాం లింకన్ ఒక మాట చెప్పారు. ” మీరు కొంత మంది జనాన్ని ఎల్లవేళలా, అందరినీ కొన్ని వేళల్లో వెర్రి వెంగళప్పలను చేయగలరు. అయితే మీరు అందరినీ, అన్ని వేళలా ఆ పని చేయలేరు ” అన్నారు. ఆ మాదిరిగానో మరో విధంగానో తెలియదు గానీ ఈ సారి మీ మాటలను నమ్మేందుకు సిద్దంగా లేమంటూ కరోనాను సైతం ధిక్కరించి రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మీ సిబ్బంది లేదా మీ పార్టీ వారు మీకు ఈ విషయాలు సరిగా చెబుతున్నట్లు లేదు ? లేక మీరే వినేందుకు సిద్దంగా లేరా ? ఏదైనా కావచ్చు, జనానికి మీరు ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. నా అమాయకత్వం గాకపోతే అప్రియములు రాజుగారికి చెప్పకూడదనే వంది మాగధుల లోకోక్తి మీకు తెలియకుండా ఉంటుందా ? మీ దోస్తు డోనాల్డ్ ట్రంప్ మాదిరి మీరు తరచూ విలేకర్ల సమావేశాలు పెడితే రెండోవైపు ఏం జరుగుతోందో మీకు తెలిసేది. సముద్రాలు ఇంకి పోయినా, భూమ్యాకాశాలు దద్దరిల్లినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇసుక నుంచి తైలం తీసినా, కుందేటి కొమ్ము సాధించినా పదవిలో ఉన్నంత కాలం విలేకర్ల గోష్టి పెట్టను, వారి ముందు నోరు విప్పను అని మీరు పట్టిన పంతం అనితర సాధ్యమే ! మీరు తప్ప ఇంతవరకు ప్రపంచంలో మరొక లేరు, భవిష్యత్తులో ఉండరు !
2022-23 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మీరు గతంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. దాని గడువు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. 2015-16 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏడు సంవత్సరాల్లో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని మీరు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ తయారు చేసిన ఒక పత్రంలో పేర్కొన్నారు. దీనికి గాను ఏటా వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు దాని ప్రస్తావన లేకుండా కొత్తవిషయాలు చెబుతున్నారు. పాత వాగ్దానం మరచిపోయినట్లుగా కనిపిస్తోంది, దేని మీదా నిలకడ కనిపించటం లేదు. అందుకే మాకు అనుమానం. ఈ విషయంలో మీకు మీరే సాటి కదా ! నల్లధనం అన్నారు, పెద్ద నోట్లను రద్దు చేశారు. సాధించిందేమిటో మీ నోట మేం వినలేదు. గుజరాత్ తరహా అభివృద్ధి అన్నారు, అదీ అంతే, అచ్చే దినాలన్నారు. చచ్చేదినాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మన్‌కీ బాత్‌లో కుక్కలను పెంచాలని పిలుపు ఇచ్చారు. ఆకలో అన్నమో రామచంద్రా అని జనం అంటుంటే పోషకాహారం తినాలని చెప్పారు. ఎమితిని సెపితివి కపితము అన్నట్లుగా అలా ఎందుకు మాట్లాడుతున్నారో, మీకు ఏమైందో అని మేమంతా జుట్టు పీక్కుంటున్నాము.
కరోనాతో నిమిత్తం లేకుండానే మీ అచ్చేదిన్‌లోనే ఒక్క ఏడాది కూడా నీతి అయోగ్ చెప్పిన 10.4శాతం వృద్ధి రేటు లేదు. అసలు మొత్తం జిడిపి వృద్ధి రేటే ఆ స్దాయిలో లేదు. అయితే ఈ కాలంలో విత్తనాల బిల్లు, నగదు బదిలీ, కనీస మద్దతు ధరల పెంపు, జీరో బడ్జెట్, సహజ వ్యవసాయ సాగు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల వ్యాపార సంఘాల గురించి మీరు, మీ మంత్రులు ఎన్ని కబుర్లు చెప్పారో ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటారా ? అవన్నీ పక్కన పెట్టి కొత్త విషయాలు చెబుతున్నారు ? నిజమే, ఇన్ని తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని సాగుపనులు ముగిసిన తరువాత పిచ్చాపాటీలో మేము అనుకుంటూ ఉంటాం.
మాట్లాడితే స్వామినాధన్ పేరు చెబుతారు. కనీస మద్దతు ధరల నిర్ణయంలో ఆయన కమిటీ చేసిన సిఫార్సును గత పాలకులు, మీరూ పట్టించుకోలేదు.విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ కూలీలు, దున్నకం,కుటుంబ సభ్యుల శ్రమ, భూమి కౌలును పరిగణనంలోకి దీసుకొని ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉండగా దాన్ని నీరుగార్చారు. చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య సహాయతా సంఘం(సఫాక్) పేరుతో ఒక సంస్ధను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి అలాంటి ఉత్పత్తిదారుల సంఘాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అవిగాక కొత్తగా ఐదువేల కోట్ల రూపాయలతో 2023-24 నాటికి పదివేల నూతన సంఘాలను ఏర్పాటు చేయతలపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు వేల సంస్ధలను నాబార్డ్ ఏర్పాటు చేసింది. ఇవన్నీ సహకార సంఘాల వంటివే. గతంలో భూస్వాములు, ధనిక రైతులు సహకార వ్యవస్ధలను ఎలా నాశనం చేసిందీ చూశాము. అయితే సహకార సంఘాలకు, వీటికీ తేడా ఉంది. వీటికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు, హామీ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంస్ధలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గతంలో ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మూతపడ్డాయి, అనేకం నామమాత్రంగా పని చేస్తున్నాయి. సఫాక్ ఇటీవల విడుదల చేసిన ఒక పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం 30శాతం సంస్దలు మాత్రమే బతికి బట్టగలుగుతున్నాయి, 20శాతం జీవన పోరాటం చేస్తున్నాయి. మిగిలిన కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయి, కార్యకలాపాలను ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ప్రతి సభ్యుడికీ రెండువేల రూపాయల చొప్పున లేదా ఒక సంస్దకు గరిష్టంగా 15లక్షలకు మించకుండా మాచింగ్ గ్రాంట్, రెండు కోట్ల రూపాయల వరకు రుణం ఇస్తుంది. ఈ పరిమితుల కారణంగా అనేక సంస్ధలు చిన్న స్ధాయిలో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయి. అయినా కంఠశోష గాకపోతే మీకు ఈ విషయాలు తెలియవా ? కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లులు చట్ట రూపం దాల్చిన తరువాత బడాకంపెనీలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతాయి. పెద్ద కంపెనీలే బడా సంస్ధల దెబ్బకు తట్టుకోలేకపోతున్నపుడు వాటితో రైతు సంస్ధలు ఏమేరకు బతికి బట్టకడతాయన్నది మా ప్రశ్న.
నేరుగా (సబ్సిడీ) నగదు బదిలీ పధకం వలన తమ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, గతంలో మాదిరే సబ్సిడీ ధరలకే ఎరువులను అందించాలని నీతి అయోగ్ తరఫున జరిపిన ఒక సర్వేలో 64శాతం మంది రైతులు చెప్పినట్లు తేలింది. అయితే దీన్ని అంగీకరిస్తే సబ్సిడీల ఎత్తివేతకు సోపానమైన నేరుగా నగదు బదిలీ పధకాన్ని నిలిపివేయాల్సి వస్తుందని గాకపోతే దాన్ని ఎందుకు అంగీకరించలేదో చెబుతారా ? నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది అని గతేడాది పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక ప్రభుత్వ నివేదిక వచ్చింది. పకోడీలు అమ్మేవారికి కూడా ఉపాధి కల్పించినట్లే, అలాంటి వాటిని లెక్కల్లోకి తీసుకోలేదని అప్పుడు చెప్పారు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా దాన్నే ఆమోదించారు. నేరుగా సబ్సిడీ బదిలి గురించి అబ్బే అబ్బే ఇది సమగ్రమైన సర్వే కాదు, తగినంత మంది లబ్దిదారులను ప్రశ్నించలేదు అని నివేదికను తిరస్కరిస్తున్నట్లు 2019నవంబరు 19న పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు చెప్పించిన మీ చతురతను ఎలా మరచిపోగలం !
జీరో బడ్జెట్, సేంద్రీయ వ్యవసాయం పేరుతో మీ బిజెపితో కలసి పాలన సాగించిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. అది రైతాంగ ఆదాయాలు రెట్టింపు కావటానికి, రైతులు రుణ విముక్తులు కావటానికి తోడ్పడుతుందని చెప్పారు.ఈ తరహా వ్యవసాయాన్ని చేయించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు 2018లో పెద్ద హడావుడి చేశారు. ఎనభై లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు లేని సేంద్రీయ వ్యవసాయాన్ని 60లక్షల మంది రైతులు 2024 నాటికి సాగిస్తారని చెప్పారు. ఏమైనట్లు ? దేశంలో ఇప్పుడు దాని ఊసే ఎత్తటం లేదేమి ? ఆవు పేడ, మూత్రం పేరుతో రాజకీయాలు చేయటం తప్ప మీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా వాటితోనే పంటలు పండిస్తున్నారా ? ఇప్పుడు మీరు చెబుతున్న కార్పొరేట్ లేదా కాంట్రాక్టు వ్యవసాయం ఆవు పేడ, మూత్రంతోనే చేయిస్తారా ? అమాయక రైతులం మీరు ఏం చెప్పినా వినక చస్తామా ?
కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు వీధుల్లోకి వచ్చారు. దీని వెనుక మార్కెట్లు రద్దయితే ఆదాయం కోల్పోయే వ్యాపారులు ఉండి నడిపిస్తున్నారని మీ పార్టీ బిజెపి ప్రచారం చేస్తోంది. ఒక వైపు మార్కెట్లను రద్దు చేస్తామని మేమెక్క డ చెప్పాం అంటారు , ఏంది సారూ ఇది ! ఆందోళనకు దిగిన వారు దేశద్రోహులని మీవారే సామాజిక మాధ్యమంలో దాడి చేస్తున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి ప్రధాన కారణం ఈ రంగానికి సబ్సిడీలను రద్దు లేదా గణనీయంగ కోత పెట్టటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవటం, తగిన ధరలు లేకపోవటం, దిగుబడులు పెరగకపోవటం, పరిశోధనలను పక్కన పెట్టటం వంటి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాపారుల దోపిడీ అనేది ఒక కారణం మాత్రమే. పాలకులకు చిత్తశుద్ది ఉంటే దాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి కనుక ఏదో ఒక సాకు చూపాలి. రైతులకు ప్రత్యక్షంగా కనిపించేది వ్యాపారులు, వారి అక్రమాలే కనుక వారిని చూపి మీరు చేయదలచుకున్నది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాం. పార్లమెంటులో మాదిరి వ్యవసాయ చట్టాలను మా మీద రుద్దటం సాధ్యం కాదని సవినయంగా మనవి.
వ్యవసాయ మార్కెట్ యార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. అక్కడ వ్యాపారం చేసే వారు విధిగా ప్రభుత్వం వద్ద నమోదు కావాలి. అక్కడ జరిగే లావాదేవీల వలన ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేస్తే ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దళారులను అరికట్టేందుకే జాతీయ ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్ (ఇనామ్)ను ప్రవేశపెడుతున్నట్లు మీరు 2016లోనే చెప్పారు. అనేక రాష్ట్రాలకు చెందిన మార్కెట్లను వాటితో అనుసంధానం చేశారు. మొత్తం 2,500 మార్కెట్ కమిటీలకు గాను 585 ఈ వ్యవస్ధలో ఉన్నాయి. (బీహార్‌లో వాటిని 2006లోనే రద్దు చేశారు) ఇప్పటివరకు దాని వలన గతం కంటే రైతులు పొందిన ప్రయోజనాలు ఏమిటో ఎవరైనా రైతులకు వివరించారా ? అది నిజంగా ప్రయోజనకరంగా ఉంటే అన్నింటినీ అనుసంధానించాలని వత్తిడి తెచ్చి ఉండేవారు కాదా ?ఈ పాటికి రైతులు మొత్తం ఆ వ్యవస్ధ ద్వారానే లావాదేవీలు ఎందుకు జరపటం లేదు ?
ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పాలి. మార్కెట్ యార్డుల వెలుపల వాణిజ్య లావాదేవీలు జరిపితే వ్యాపారులు పన్ను చెల్లించాలి. ఇప్పుడు మీరు మార్కెట్ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో తెలుగుదేశంతో పోటీపడి మరీ మద్దతు ఇచ్చారు. జగన్ నవరత్నాల అమలుకు ఇప్పటికే డబ్బు లేదు. ఇప్పుడు మార్కెట్ల ఆదాయం కూడా పోతే ఏం చేస్తారో తెలియదు. ఆదాయ నష్టానికి కేంద్రం ఒక్క పైసా కూడ ఇవ్వదు మరి. సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి అన్నట్లుగా జగన్ కష్టాలు జగన్‌వి పాపం !
ఆంధ్రప్రదేశ్‌ను మీరూ కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు కలసి పోటీ బడి విభజించాయి. అప్పుడు నా సామిరంగా పార్లమెంటులో మీ వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్ వంటి నేతలు చేసిన హడావుడి, అబ్బో చూడవలసిందేగానీ చెప్పతరం కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఐదు సంవత్సరాలు పెడతామని మన్మోహన్ సింగ్ చెబితే మీ వెంకయ్య నాయుడు హడావుడి చేసి ఐదును పదేండ్లకు ఒప్పించటానికి చెమటోడ్చాల్సి వచ్చినట్లు చెప్పారు. తరువాత మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా అదే చెప్పారు. తీరా జరిగిందేమిటి ? ప్రత్యేక హౌదా లేదూ పాడూ లేదు. కాంగ్రెస్ నేతలు విభజన చట్టంలో పెట్టి ఉంటే సాధ్యమయ్యేది నేరం వారిదే అంటూ తప్పించుకున్నారు. దాని గురించి మరోసారి మాట్లాడవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇప్పటి సిఎం జగన్మోహనరెడ్డిగారికీ తెగేసి చెప్పారు.
పార్లమెంట్‌లో చర్చనూ విస్మరించారు. నిత్యం దేవుడి గురించి చెప్పే మీరు వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాన్ని ఖాతరు చేయలేదు. వ్యవసాయ చట్ట సవరణల్లో కనీస మద్దతు ధర గురించి, పంటల సేకరణ హామీలను చేర్చకుండా బిల్లులను ఆమోదించారు. మరోవైపు అబ్బే అవేమీ రద్దు కావు అని నమ్మమంటున్నారు. ఒక్క మాట అడిగితే ఏమనుకోరుగా సారూ ! మీరు దేవుడు అని మా వెంకయ్య నాయుడు గారు గతంలో వర్ణించారు. జిఎస్‌టి విషయంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య చట్టబద్దమైన ఒప్పందం కుదిరింది. ఐదేండ్ల పాటు పన్ను ఆదాయం తగ్గితే కేంద్రం భర్తీ చేస్తుందని దానిలో అంగీకరించారు. మన నిర్మలమ్మగారు దేవుడి లీల కారణంగా తగినంత ఆదాయం రాలేదు కనుక కేంద్రం చేసేదేమీ లేదు, కావాలంటే అప్పులిప్పిస్తాం అప్పు ఎలా కావాలో తేల్చుకోండి అన్నారు. అదేంటి సారూ మీరు దేవుడై ఉండి ఇంతవరకు మాట్లాడలేదు. పోనీ అదేమి నిర్మలమ్మా అలా మాట్లాడావేమిటి, ఆ లీల లేదా పాపం నాకు అంటుకోదా అన్ని అంతర్గతంగా కూడా ప్రశ్నించినట్లు లీకుల వార్తలు కూడా రాలేదు.
నిత్యావసర సరకుల చట్టాన్ని కూడా సవరించారు. ఏ సరుకును ఎంతైనా నిల్వచేసుకోవచ్చు. విపరీతంగా ధరలు పెరిగినపుడు మాత్రమే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇదేంటి సారు, నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వటం ఎందుకు, ధరలు విపరీతంగా పెరిగేంతవరకు చోద్యం చూడటం ఎందుకు ? అప్పుడు ఆంక్షలు ఎందుకు ? దీన్నే మేము నక్క పోయిన తరువాత బొక్క కొట్టటం అంటాం. మేం పండిస్తాంగానీ, వినియోగదారులంగా కూడా ఉంటాం. అంటే మా పంటలను మేమే అదానీ, అంబానీ, అమెజాన్‌లకు అమ్ముకోవాలి వారి దగ్గర నుంచి అధిక ధరలకు కొనుక్కోవాలా ఏంది సారూ. దీన్నే గోడదెబ్బ చెంపదెబ్బ అనుకుంటాం మేము. పాలనా జోక్యం తక్కువ పేరుతో మమ్మల్ని ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా కార్పొరేట్లకు అప్పగిస్తూ చట్టాలు చేసి మీ చేతులు మీరు దులుపుకొని పోతే రేపు మాగతేంగాను ? జిఎస్‌టి మాదిరే రేపు మాకు సైతం అన్యాయం జరిగితే, అప్పుడు కూడా అంతా దైవ లీల, విధి వైపరీత్యం, మనం నిమిత్త మాత్రులం, దేవుడు ఆడించినట్లు ఆడటం, అనుభవించటం తప్ప విధి లేదా తలరాత మార్చలేం అంటే మా గతేంగాను సారూ ?
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు