Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
స్వామినాధన్‌ కమిషన్ను ఏర్పాటు చేసిన యుపిఏ సర్కార్‌ దాన్ని అమలు జరపలేదని తాము ఆపని చేస్తున్నామని నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతోంది. రైతులకు మేలు చేసే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకు వచ్చిన రెండు వ్యవసాయ, ఒక నిత్యావసర వస్తువుల చట్ట సవరణ బిల్లులు నేతి బీరకాయలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు వంటివి అనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతున్నాయి. సంస్కరణలు వాంఛిస్తున్న వారు కూడా మేము కోరుతున్నది ఇవి కాదు, రైతులకు ఉపయోగపడేవి కాదు అంటున్నారు. రైతుల సమస్యలపై 2004 డిసెంబరు నుంచి 2006 అక్టోబరు వరకు పని చేసిన స్వామినాధన్‌ కమిషన్‌ ఐదు నివేదికలను సమర్పించింది. ఏడాది తరువాత వాటి ఆధారంగా రైతుల ముసాయిదా విధానం పార్లమెంట్‌కు సమర్పించారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల్లోని ముఖ్యాంశాలను చూస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆ పేరుతో ఏం చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.


స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల సారాంశం ఇలా ఉంది. 1991-92 వివరాల ప్రకారం గ్రామీణ కుటుంబాలలోని దిగువ 51.35శాతం కుటుంబాల వద్ద ఉన్న భూమి కేవలం 3.8శాతం కాగా, ఎగువ 14.71 శాతం ధనిక రైతుల వద్ద 64.48 54శాతం ఉంది. దిగువన ఉన్న వారిలో 11.24శాతం మందికి అసలు భూమి లేదు. ఎగువన ఉన్న 2.62శాతం మంది వద్ద 15ఎకరాలు అంతకు మించి 26.67శాతం ఉంది కనుక భూసంస్కరణలు అమలు జరపాలి.
కౌలు చట్టాలు, మిగులు భూమి, వృధాగా ఉన్న భూ పంపిణీ సంస్కరణలు చేపట్టాలి. వ్యవసాయ, అటవీ భూములను వ్యవసాయేతర అవసరాలకు కార్పొరేట్‌లకు మళ్లించటాన్ని నిరోధించాలి. అవకాశం ఉన్న చోటల్లా భూమిలేని కుటుంబాలకు కనీసం ఒక ఎకరం చొప్పున భూమి ఇస్తే పెరటి తోటలు, పశుపెంపకానికి వినియోగించుకుంటారు. జాతీయ భూ వినియోగ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి భూ వినియోగం గురించి సలహాలను అందించాలి.నీటిని ప్రజా సంపదగా పరిగణించి సమాన ప్రాతిపదికన పంపిణీకి చర్యలు తీసుకోవాలి. వర్షపు నీటిని నిల్వచేయటం, ఎండిపోయిన నీటి వనరులను పునరుద్దరించటం, మెరుగైన సాగునీటి పద్దతులు, డ్రిప్‌ఇరిగేషన్‌, నీటి చైతన్య ఉద్యమం, ప్రతి గ్రామంలో నీటి పంచాయతీలు, నీటివినియోగదారుల సంఘాల ఏర్పాటు, కరవు,వరద నిబంధనల రూపకల్పన.
రాష్ట్ర స్దాయిలో పశుదాణా, గడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు, జాతీయ పశుసంపద అభివృద్ది మండలి ఏర్పాటు, కోళ్ల పెంపకాన్ని వ్యవసాయంతో సమంగా గుర్తించటం, గృహ కోళ్ల పెంపకందార్లకు మద్దతు, చిన్న కోళ్ల పెంపక కేంద్రాల ఏర్పాటు. అందరికీ చేపలు అనే ఇతివృత్తంతో చేపల పెంపకం, పట్టటం,మార్కెటింగ్‌ గురించి శిక్షణ, సామర్ద్యకేంద్రాల ఏర్పాటు.జీవ వైవిధ్య వనరులపై సాంప్రదాయ హక్కులను గుర్తించటం, జెనోమ్‌ క్లబ్‌లు,జన్యు మార్పిడి అభివృద్ధి.
చిన్న రైతాంగం, ప్రకృతికి అనుకూలమైన పరిశోధనల నిమిత్తం జాతీయ బయోటెక్నాలజీ నియంత్రణ మండలి ఏర్పాటు. మేథో సంపత్తి హక్కుల విధానాలకు రూపకల్పన, వ్యవసాయ విపత్తు నిధి ఏర్పాటు, చిన్న, సన్నకారు రైతులకు సహకార వ్యవసాయ సేవా సంస్ధల రూపకల్పన, స్వయం సహాయక బృందాల ద్వారా బృంద వ్యవసాయ సంస్దల ఏర్పాటు, చిన్న కమతాల భూ ఖండాలకు రూపకల్పన, ఉత్పత్తిదారులు, కొనుగోలుదార్లు ఉభయులూ లబ్ది పొందే విధంగా ఒప్పంద వ్యవసాయ నిమిత్తం నిబంధనల రూపకల్పన, రైతులు లబ్దిదార్లుగా కంపెనీల ఏర్పాటు, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించే విధంగా తక్కువ వడ్డీలతో పధకాలకు రుణాలు, ఉత్పత్తి మరియు ప్రోసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు తోడ్పాటు.
ఆహారము, చిన్న రైతులకు ఆదాయ భద్రతకు తోడ్పడే విధంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధరల పరిధి విస్తరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్ధిక సంస్ధల సంయుక్త భాగస్వామ్యంలో మార్కెట్‌ ధరల స్ధిర నిధి ఏర్పాటు, గ్రామాలలో రైతు కుటుంబాలు క్షయ, ఎయిడ్స్‌ వంటి వ్యాధుల బారిన పడినపుడు ఉచితంగా ఔషధాలు అందుబాటులో ఉంచటం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర జీవనానికి తోడ్పాటు, భారత వాణిజ్య సంస్ధ ఏర్పాటు వంటి అంశాలను స్వామినాధన్‌ కమిటీ సిఫార్సు చేసింది.


పైన పేర్కొన్న అంశాలలో గత ఆరు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటంటే ముఖ్యమైన అంశాల జోలికి పోలేదనే చెప్పాలి. వాటిని అమలు జరపకుండా సిఫార్సులను అటక ఎక్కించి మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించి వాటి వెలుపల ప్రయివేటు కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు అవకాశమిస్తూ చట్ట సవరణలు చేశారు. మార్కెట్‌ కమిటీలు, వాటి పరిధి నిర్ణయం రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎక్కడో ముంబై, ఢిల్లీలో ఒక చోట నమోదు చేసుకుంటే చాలు దేశమంతటా కొనుగోళ్లు చేయవచ్చు. అంటే మరోకొత్త దళారీ వ్యవస్ధకు నాంది పలుకుతున్నట్లే . ఇంట్లో ఎలుకలుంటే అవి చేరకుండా కప్పులను మార్చుకోవాలి, మరొక చర్యతో వాటిని లేకుండా చేసుకోవాలి తప్ప ఇండ్లనే ఎవరైనా కూల్చివేస్తారా ! తగులబెడతారా ?

ఒప్పంద వ్యవసాయం, ఎక్కడైనా రైతు తన పంటను అమ్ముకొనే ఏర్పాటు వంటి చర్యల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయివేటు పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా వాణిజ్య సులభతరానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి, అయినా విదేశీ పెట్టుబడులు రాలేదు, స్వదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి ఎందుకు కాలేదు ? 2006లోనే బీహార్‌లో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేశారు. మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర కూడా రాక నష్ట పోయిన రైతులు బీహార్‌లో ఈ ఏడాది జూన్‌ చివరి వారంలో కరోనాను కూడా లెక్కచేయకుండా మొక్కజొన్న హౌమం చేసి నితీష్‌కుమార్‌-బిజెపి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మొక్కజొన్నల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కారణంగా మార్కెట్‌ కుదేలయిన విషయం తెలిసిందే. దీని గురించి తెలంగాణా హైకోర్టులో కేసు దాఖలైన సంగతీ తెలిసిందే.


వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవసరమైన గోదాముల ఏర్పాటును ప్రభుత్వాలు దాదాపు నిలిపివేశాయి. ఇదే సమయంలో ప్రయివేటు పెట్టుబడులు రాలేదు. మెట్రో వంటి సంస్ధలు బడా పట్టణాల్లో ఏర్పాటు చేసిన పెద్ద దుకాణాలు, గోదాములు తప్ప గ్రామీణ ప్రాంతాలలో కొత్తవేమీ రాలేదు. నిత్యావసర వస్తువుల నిల్వలపై ప్రభుత్వాల ఆంక్షల కారణంగా తాము గోదాములను ఏర్పాటు చేయటం లేదని బడా సంస్దలు చెబుతున్నాయి. వాటికోసమే అనేక వస్తువులను నిత్యావసరాల జాబితా నుంచి, నియంత్రణ నుంచి ఎత్తివేశారు.
మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించారు. తెలుగు రాష్ట్రాల్లో పాత తాలుకా కేంద్రాలు లేదా కొన్ని పెద్ద ప్రాంతాలలో మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటి వెలుపల కొనుగోలు చేసే బడా సంస్దకు రైతులు తమ సరకులను ఎక్కడికి తరలించాలి? లేదా సదరు సంస్ధ వారే గ్రామాలకు వచ్చి తమ స్వంత ఏర్పాట్లు చేసుకుంటారా ? పన్నులు, కమిషన్లకు పోతున్న మొత్తాలు రైతుల ధరల్లో ప్రతిబింబిస్తాయా? కనీస మద్దతు ధరలకు కంపెనీలు కట్టుబడి ఉంటాయా ? ఒప్పంద వ్యవసాయం కింద రైతులు అమ్మే సరకుల ధరలు వాటి కంటే ఎక్కువ ఉంటాయా ? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.


ఇక గ్రామాలకు ప్రయివేటు పెట్టుబడులు వస్తాయన్న అంశాన్ని చూద్దాం. కేరళలో ఎప్పటి నుంచో మార్కెట్‌ యార్డులు లేవు. అయితే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్లను ఏర్పాటు చేసింది తప్ప ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. కేరళలో టీ, కాఫీ, రబ్బరు,కొబ్బరి, సుగంధ ద్రవ్యాల వంటి వాణిజ్య పంటలే ఎక్కువ, అయినా పెట్టుబడులు ఎందుకు రాలేదు ? ముందే చెప్పుకున్నట్లు బీహార్‌లో పద్నాలుగేండ్ల క్రితం మార్కెట్‌ యార్డులు రద్దయ్యాయి. అక్కడి గ్రామాలకు వచ్చిన పెట్టుబడులేమిటో బిజెపి పెద్దలు చెప్పగలరా ? అధికారంలో ఉన్నది ఆ పార్టీ, మిత్రపక్షమే.
కేంద్ర బిల్లులు రాకముందే బిజెపి ఏలుబడిలోని గత మహారాష్ట్ర ప్రభుత్వం 2016లోనే పండ్లు, కూరగాయలను మార్కెట్‌ యార్డుల నుంచి తప్పించింది.2018లో చట్టాన్ని మరింత నీరుగార్చి ఒక ఆర్డినెన్స్‌ ద్వారా ఆహార, పశు సంపద లావాదేవీలను యార్డుల వెలుపల అనుమతించింది. అక్కడ కూడా ప్రయివేటు పెట్టుబడుల జాడలేదు.


వ్యవసాయ రంగ నిపుణులు అశోక్‌ గులాటీ చెబుతున్న అంశాల సారం ఇలా ఉంది. తాజా బిల్లులు వ్యవసాయరంగం, సేకరణ, సరఫరా గొలుసుకట్టు ఆటతీరునే మార్చివేస్తాయి. ఇదొక పెద్ద సంస్కరణ, మంచి ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాలి. చివరి క్షణంలో అధికారులు దీన్ని పాడు చేసే అవకాశం ఉంది.1943లో కొరత, కరవు ఏర్పడినపుడు నిల్వలకు సంబంధించిన పరిమితులు పెట్టారు. నిత్యావసర వస్తువుల చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు వందశాతం ధరలు పెరిగినపుడు వారు తిరిగి పరిమితులు పెట్టవచ్చు. ఇప్పుడు మనం మిగులుతో ఉన్నాము. అందువలన పునరాలోచన దృక్ఫధంతో చూడాలి.
ఇది ప్రధానంగా ధరల స్ధిరీకరణ మరియు మార్కెట్‌ తిరిగి పనిచేసేందుకు తలపెట్టిన సంస్కరణ. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలపై నియంత్రణలకు నిత్యావసర సరకులు చట్టం ప్రభుత్వానికి ఎలాగూ అధికారం ఇస్తుంది. ఇప్పుడు నవీకరించిన గోదాముల మీద పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పంటలు మార్కెట్‌కు వచ్చిన తరువాత ఇప్పుడు పెద్ద ఎత్తు ధరలు పడిపోవు, ఏడాది పొడవునా స్ధిరంగా ఉంటాయి. రైతులు ప్రయివేటురంగం మరియు ప్రభుత్వ కనీస మద్దతు ధరలలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లలో వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు, రైతులకు మరొక అవకాశం లేదు.
ప్రస్తుతం మార్కెట్‌ యార్డుల పరిధిలో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు లేదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించారు. ఒక అనుమతితో దేశంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు.వ్యాపారులు ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలు లేదా సహకార సంస్ధలు, వ్యవసాయదారుల సంస్ధల కేంద్రాలలో కొనుగోలు చేయవచ్చు. అముల్‌ కంపెనీ ప్రతి రైతు వద్దకు వెళ్లి పాలు కొనుగోలు చేయదు. రైతులు తాము కోరుకున్న ధర ఎక్కడ వస్తే అక్కడ, చెల్లింపులు సకాలంలో జరిపేవారికి విక్రయించుకోవచ్చు.
ఇప్పుడు మార్కెట్‌ యార్డులలో రెండు నిమిషాల లావాదేవీలకు కమిషన్‌ ఏజంట్లు అధికారికంగా ఎనిమిదిశాతం(ముంబై వాషి లేదా అజాద్‌పూర్‌ మార్కెట్‌) తీసుకుంటున్నారు. అనధికారికంగా రెండు వైపులా మొత్తం 14-15శాతం ఉంది. కమిషన్‌ మొత్తాలను నిర్ణయించేది ఎవరు ? మార్కెట్‌ కమిటీ అంటే రాజకీయవేత్తలు-మాజీ ఎంఎల్‌ఏ లేదా ప్రస్తుత ఎంఎల్‌ఏ లేదా వారి దగ్గరివారు కావచ్చు, ఇప్పుడు అసమర్ధ అవినీతి గుత్తాధిపత్యం బద్దలు కానుంది.
తదుపరి అడుగు ఒప్పంద వ్యవసాయానికి అనుమతి. ఇప్పుడు రైతులు మంద మందలుగా సాగు చేస్తున్నారు, అది ఆకస్మికంగా ధరలు పడిపోవటానికి కారణం అవుతోంది. దీన్ని నిరోధించేందుకు పంట చేతికి వచ్చిన తరువాత తమకు వచ్చే ధర ఎంతో రైతులు ఒక అంచనాకు రావాలి.ఒప్పంద వ్యవసాయంతో రైతుల విక్రయ ధర ముందే నిర్ణయం అవుతుంది. పండ్లు, పూల విషయానికి వస్తే నిర్ణీత నాణ్యత లభిస్తుంది. ప్రస్తుతం వినియోగదారు చెల్లిస్తున్న దానిలో రైతుకు మూడో వంతు మాత్రమే లభిస్తోంది. అదే 60శాతం లభిస్తే మనం ఎంతో గొప్పపని చేసినట్లే, ఇది ఇప్పటికే పంచదార, పాలవిషయంలో జరుగుతోంది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్దలో 46శాతం తరుగు ఉంటోందని శాంతకుమార్‌ కమిటీ చెప్పింది.పేదలు నేరుగా నగదు తీసుకుంటారా మరొకటా అనేది వారినే ఎంచుకోనివ్వండి. వారు గుడ్లు లేదా రొట్టె తినదలచుకున్నారా లేక మద్యం తాగుతారా అన్నది వారికే వదలివేద్దాం. నేరుగా మహిళలకు నగదు బదిలీ చేస్తే ఆసక్తికరమైన మార్గదర్శకాలకు దారి తీస్తుంది. మరోసారి చెబుతున్నా, సంస్కరణలు ఎంతో పెద్దవి, మంచి ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూద్దాం.


గతంలో నూతన ఆర్ధిక సంస్కరణలనో మరొకటనో మార్పులు తలపెట్టిన ప్రతివారూ ఇదే కబుర్లు చెప్పారు.ఆచరణ అందుకు భిన్నంగా జరిగింది. నూతన ఆర్ధిక సంస్కరణలు వ్యవసాయం గిట్టుబాటుగాక రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురికొల్పాయి. యజమానులు వ్యవసాయం మానుకోవటం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గటం తదితర కారణాలతో కౌలు రైతులు పెద్ద ఎత్తున పెరిగారు. యాజమాన్య లేదా రక్షిత హక్కులు లేని కారణంగా ప్రభుత్వం అందించే రైతు బంధు, కిసాన్‌ సమ్మాన్‌ వంటి పధకాలేవీ వారికి వర్తించటం లేదు. ఎరువులకు ఇస్తున్న నామ మాత్ర సబ్సిడీ కూడా యజమానుల ఖాతాలకే జమ అవుతున్న కారణంగా నేరుగా నగదు బదిలీ వద్దని వారు చెబుతున్నా వినిపించుకోవటం లేదు.


ఒప్పంద వ్యవసాయం గురించి స్వామినాధన్‌ కమిషన్‌ కూడా సూచించినప్పటికీ తలెత్తే సమస్యలను కూడా వివరించింది. పంటల కొనుగోలుదారులు తక్షణ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు. లాభాలు వచ్చే ఎగుమతి ఆధారిత పంటలకు మాత్రమే ఒప్పందం చేసుకుంటారు. ఆహార భద్రత గురించి పట్టదు. పెద్ద రైతులతోనే ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తారు. పర్యవసానం చిన్న రైతులు పెద్ద రైతులతో ఒప్పందానికి నెట్టబడతారు. కొత్త దొంతర ఏర్పడుతుంది.


కేరళలో ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి ఒక కేసును చూద్దాం. నేలతాడి అనే ఔషధ మొక్కను సఫేద్‌ ముస్లీ అని కూడా అంటారు. 2004లో అంబికా దేవి అనే చిన్న రైతు తన ఒకటిన్నర ఎకరాలలో దాన్ని సాగు చేసేందుకు నందన్‌ బయోమెట్రిక్స్‌ దాని అనుబంధ సంస్ధ హెర్బ్స్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. కనీసం కిలో వెయ్యి రూపాయలకు ఉత్పత్తిని కొనాలనే ఒప్పందం కుదిరింది.కంపెనీ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. దీని గురించి 2008లో కేరళ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. తమ మధ్య కుదిరిన ఒప్పందం వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోకి రాదని వాదించింది. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంది. అక్కడ కూడా చుక్కెదురైంది. అలాంటి రైతులను వినియోగదారుల రక్షణ చట్టం నుంచి మినహాయించటం చట్టాన్ని వెక్కిరించటమే అని కోర్టు పేర్కొన్నది.


కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన బిల్లు ఈ కేసును పరిగణనలోకి తీసుకోలేదని, రైతులకు వినియోగదారు రక్షణ కల్పించలేదని అందువలన ఇది పెద్ద లోపమని చెబుతున్నారు. అందువలన కోర్టుల నుంచి రైతులు రక్షణ పొందలేరు. రక్షణ లేదు అయినా ఒప్పంద వ్యవసాయం వద్దంటే రైతులు ఆగుతారని అనుకోలేము. ఆకర్షణ, ప్రలోభాలకు లొంగిపోయి ఒప్పందం చేసుకొన్న తరువాత కంపెనీ మోసం చేస్తే చేయగలిగేదేమీ ఉండదు. అధికార యంత్రాంగం ఎవరి పక్షాన ఉంటుందో తెలిసిందే. అందువలన ప్రభుత్వం ప్రతి ఒప్పందంలో మూడవ పక్షంగా చేరితేనే రక్షణ ఉంటుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్న ప్రభుత్వాలు అలాంటి ఒప్పందాలలో చేరతాయా ? తాజా బిల్లుల్లో అలాంటి సూచనలేమీ లేవు ? అలాంటపుడు పాలకుల మాటలను ఎలా నమ్మాలి ?స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులన్నీ అమలు చేసిన తరువాత అవసరమైతే మిగతా సంస్కరణల గురించి ఆలోచించవచ్చు.


ఇక అశోక్‌ గులాటీ వంటి వారు చెబుతున్న నేరుగా నగదు బదిలీ గురించి చూద్దాం. ఇది సబ్సిడీల కోత లేదా నామ మాత్రం గావించటానికి ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ముందుకు తెచ్చిన పద్దతులు. గత ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ 70వేల కోట్ల రూపాయలకు అటూ ఇటూగా మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక్క యూరియా తప్ప మిగిలిన వాటిపై ధరల నియంత్రణ ఎత్తివేసింది. మార్కెట్లో ఎంత ధర పెరిగినా ఆ 70వేల కోట్లనే సర్దుబాటు చేస్తున్నారు తప్ప పెంచటం లేదు. ఇదే పద్దతిని అన్ని సబ్సిడీలకు వర్తింప చేసే ఎత్తుగడతో కేంద్రం ముందుకు పోతోంది. ఇప్పుడు తలపెట్టిన విద్యుత్‌ సంస్కరణల లక్ష్యం కూడా అదే. వినియోగదారుకు అందచేసేందుకు ఒక యూనిట్‌కు అయ్యే ఖర్చులో 20శాతానికి మించి రాయితీలు ఇవ్వకూడనే నిబంధనను ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కారణంగానే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం షరతులు విధించింది. అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే రైతుల సంక్షేమం, సాధికారత పేరుతో తీసుకుంటున్న చర్యల వెనుక ఆంతర్యం, సంస్కరణల పర్యవసానాలు ఏమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా రైతులు ఉన్నారా ?