Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


నిజమే, ఏ మాటకామాటే చెప్పుకోవాలి. తమ్ముడు మనోడైనా ధర్మం ధర్మమే కదా ! మట్టి పిసుక్కునే రైతులను చూపితే ఎక్కువ రేటింగ్స్‌ వస్తాయా ? అందాలను ఆరబోసే సినీ తారలను చూపితే నాలుగు కాసులు రాలతాయా ? రైతులను చూపితే జనం చూడని లోక్‌సభ-రాజ్యసభ టీవీల్లాగా ఛానళ్లన్నీ మారిపోవూ ? కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన వారి సంగతేమిటి ? కళ కళకోసమా ! ప్రజల కోసమా ? టీవీలు యజమానుల లాభాల కోసమా ? జనం కోసమా ? మాదక ద్రవ్యాల నిరోధ విభాగం వాటిని అరికట్టేందుకా లేక ప్రధాన సమస్యలనుంచి జనాన్ని పక్కదారి పట్టించి పాలక పార్టీలకు ఉపయోగ పడేందుకు సాధనంగా పని చేస్తోందా ? ప్రతి వ్యవస్ధనూ, సంస్ధనూ తమ ప్రయోజనాలకోసం వినియోగించుకోవటం పాలక పార్టీల్లో నానాటికీ పెరిగిపోతున్న స్ధితిలో దేన్నయినా కాదని ఎవరు చెప్పగలరు.


కరోనాకు ముందే దేశం ఆర్ధికంగా దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో అనూహ్య పరిణామాలు, పర్యసానాలు సంభవిస్తున్నాయి. గత కొద్దినెలలుగా చూస్తే మీడియాలో వాటి గురించి చర్చ ఎక్కువ జరిగిందా ? సినీతారల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించారా ? వ్యవసాయ సంస్కరణలు అతి పెద్దవని ప్రభుత్వమే చెప్పింది. వాటి మంచి చెడ్డల గురించి కేంద్రీకరించాలా తారల మాదక ద్రవ్యాల గురించి ఎక్కువ చర్చ చేయాలా ? దేశంలోని సెలబ్రిటీలు, ప్రముఖులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని సుశాంత సింగ్‌ రాజపుత్‌తోనే మాదక ద్రవ్యాల నిరోధ బ్యూరోకు కొత్తగా తెలిసిందా ?


తమ ప్రాభవం పేరుతో ప్రారంభించిన సంస్కరణలు పాతిపెట్టటానికే దారితీస్తాయని రైతులు ఈనెల 25వ తేదీన దేశ వ్యాపితంగా ఆందోళన జరిపారు. జాతీయ స్ధాయిలో ఒకే ఒక్క ఎన్‌డిటివీ ఛానల్‌ మాత్రమే ఎక్కువ మంది చూసే ( ప్రైమ్‌ టైమ్‌ ) సమయాన్ని రైతుల ఆందోళన, చర్చలకు కేటాయించగా మిగతా వాటి గురించి ఏమనుకోవాలి ? పోనీ అవి మూసుకొని ఉన్నాయా లేవే ! దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌, శ్రద్దాకపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరుల పార్టీలు,వాటిలో సేవించారని చెబుతున్న మాదక ద్రవ్యాలు, వాటిని ఎవరితో కలసి సేవించారనే అంశాల గురించి మల్లగుల్లాలు పడ్డాయి. కాస్తకటువుగానే ఉన్నా ఒక విషయం చెప్పాలి. మన జనం ముఖ్యంగా టీవీలను వీక్షించేవారు గంజాయి వంటి వినోద కార్యక్రమాలు, సీరియళ్లకు అలవాటుపడిపోయారు. వార్తా ఛానళ్లలో విషయం కంటే వివాదాలు ఎక్కువగా ఉండే చర్చలకు పరిమితం అవుతున్నారు. ఈ స్ధితిలో వారి మనో భావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఏమాత్రం ఆకర్షణ లేని రైతులను, వారి సమస్యలను చూపితే అనవసరంగా పాలక పార్టీల ఆ గ్రహానికి గురికావటం తప్ప ఛానళ్లకు ఒరిగేదేముంది?
ఇండియా టుడే టీవీ ప్రైమ్‌ టైమ్‌లో దీపిక, సారా, శ్రద్ధకపూర్‌కు కొత్తగా సమన్లు ఇవ్వలేదు, ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత సింగ్‌ మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని సారా చెప్పిందని, ఐదు గంటల పాటు ప్రశ్నించినా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు దీపిక అంగీకరించలేదంటూ కాలంగడిపారు. టైమ్స్‌ నౌ ఛానల్లో చైనా, పాకిస్ధాన్‌ అనూహ్యమైన కాలం అనే అంశం గురించి చర్చ జరిపారు.మన భూమిని మన దేశం స్వాధీనం చేసుకుందా ?చైనా, పాక్‌ తప్పుదారి పట్టించే ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలి అంటూ చర్చచేశారు.


రిపబ్లిక్‌ టీవీ, రిపబ్లిక్‌ భారత్‌ టీవీలు సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌ ఆత్మహత్య మాదక ద్రవ్యాల దర్యాప్తుకు దారి తీసిన విధానాల గురించి కేంద్రీకరించాయి. ఎన్‌డిటివీ కూడా మాదక ద్రవ్యాల విచారణ గురించి చర్చించింది. అయితే మాదక ద్రవ్యాల గురించి ఎంత శ్రద్ద ? అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆజ్‌తక్‌ టీవీ విషయానికి వస్తే తాను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు దీపిక అంగీకరించినట్లు తెలిసిందని నివేదించింది. ముగ్గురు తారలు సమాధానాలు ముందుగానే సిద్దం చేసుకొని వచ్చారని, ఎన్‌సిబి వాటితో సంతృప్తి చెందలేదని చెప్పింది. అంతే కాదు. సుశాంత సింగ్‌తో కలసి సారా అలీఖాన్‌ ఎన్నిసార్లు థాయలాండ్‌ వెళ్లింది, ఎన్నిసారు అతని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించింది అనే ప్రశ్నలతో మరో కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఏ రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఎలా ఆందోళన జరిపారు అనే సమాచారం కంటే ఇవి పసందుగా ఉంటాయి కదా !


హిందీ మీడియా బిజెపి కనుసన్నలలో పని చేస్తున్నదా అన్నట్లుగా రైతుల ఆందోళన పట్ల వ్యవహరించిందని పరిశీలకులు పేర్కొన్నారు. రైతులకు మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలను తూలనాడుతూ పాలక బిజెపి నేతలు ఉపయోగించిన భాష, పదజాలాన్ని స్వంతం చేసుకొని ఆ విమర్శలు సరైనవే అని పాఠకులకు నూరిపోసేందుకు ప్రయత్నించాయి. ప్రభుత్వం ముందుకు తెచ్చిన బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ ప్రారంభం నుంచీ పాలకపార్టీకి అనుకూలమైన శీర్షికలతో పాఠకుల ముందుకు వచ్చాయి. రాజ్యసభ మర్యాద మంటగలిసింది అని దైనిక్‌ జాగరణ్‌, రాజ్యసభలో మర్యాద ఉల్లంఘన అని రాష్ట్రీయ సహారా,భంగపడ్డ పార్లమెంట్‌ మర్యాద అంటూ హిందూస్ధాన్‌ శీర్షికలను పెట్టాయి. దాదాపు అన్ని పత్రికలు ప్రతిపక్షాలను ప్రతినాయకులుగా చూపేందుకు పోటీపడ్డాయి. ప్రతిపక్షాలు అదుపుతప్పి వ్యవహరించాయని తమ స్వంత కథనాల్లో ఆరోపించాయి. బిల్లుల గురించి ప్రతిపక్షాలు ఏమి చెప్పాయో పాఠకులకు అందచేయాలన్న కనీస ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా ఊగిపోయిన హిందీ పత్రికలతో పోల్చితే ఆంగ్ల పత్రికలు కాస్త దుస్తులుండేట్లు చూసుకున్నాయి. టెలిగ్రాఫ్‌ పత్రిక మూజువాణితో బిల్లులకు ఆమోదం- మూగపోయిన ప్రజాస్వామ్యం అంటూ విమర్శనాత్మక శీర్షిక పెట్టింది.
బ్రిటన్‌లో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అది రాణీగారీకి విధేయతతోనే ఉంటుంది. మన దేశంలో మీడియా ఇప్పుడు అలాగే తయారైందని చెప్పవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పట్ల రాణీగారి ప్రతిపక్షం మాదిరే వ్యవహరిస్తున్నది. పాలకపార్టీ పాకేజ్‌లే దీనికి కారణం. పార్లమెంట్‌ సమావేశాల వార్తలను సేకరించేందుకు అన్ని ప్రధాన స్రవంతి మీడియా విలేకర్లు ప్రత్యక్షంగా వెళతారు. మైకులను పనిచేయకుండా నిలిపివేసినపుడు ఏమి మాట్లాడిందీ వినలేకపోవచ్చుగానీ సభలో ఏమి జరుగుతోందీ ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.

రాజ్యసభలో ఓటింగ్‌ జరపాలన్న డిమాండ్‌ జరిగిన అంశాలపై పాలక బిజెపి లేదా దాని అనుచర, భజన పార్టీలు బయట చర్చల్లో ఎలా అయినా చిత్రీకరించి మాట్లాడవచ్చు. కానీ మీడియా సభ్యులు స్పీకర్‌ ఎలా అణచివేసిందీ ప్రత్యక్షంగా చూశారు. అయినా వార్తల్లో భిన్నంగా ఎందుకు రాసినట్లు ? ప్రతిపక్షాన్ని ఎందుకు నిందించినట్లు ? రాజ్యసభలో పాలకపార్టీ ఒక పధకం ప్రకారమే మైకులను నిలిపివేయించిందన్నది స్పష్టం. దానికి నిరసన వ్యక్తమైంది. పాలక పార్టీ మైకులను నిలిపివేయగానే ప్రతిపక్ష సభ్యులు కేకలు వేశారు. ఏమిటి అని అడగాల్సిన స్పీకర్‌ అలాంటిదేమీ చేయకుండా మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించేశారు.రభస జరిగినపుడు ప్రతిపక్ష సభ్యులు ఏమి అడిగారో ఏమిటో విలేకర్లు వివరణ తీసుకోవచ్చు. అది చట్టసభల వార్తలను సేకరించే వారికి సాధారణ విషయమే. వార్తలను ఏకపక్షంగా రాయకుండా తమ వ్యాఖ్యలను జోడించకుండా రెండు వైపుల వారు ఏమి చెప్పిందీ రాయవచ్చు. కానీ వ్యవసాయ బిల్లుల సమయంలో అలా జరగలేదు.


సభలో జరిగిందేమిటి ? రాజ్యసభ టీవీలో నమోదైన దృశ్యాల ప్రకారం జరిగిన తీరు ఇలా ఉంది.మధ్యాహ్నం 1.07 నుంచి 1.26వరకు రికార్డయింది. సిపిఎం సభ్యుడు కెకె రాగేష్‌ బిల్లులను సెలెక్టు కమిటీకి పంపాలని ప్రతిపాదించిన తీర్మానంపై మూజువాణి ఓటుతో తిరస్కరించినట్లు ఉపాధ్యక్షుడు హరివంశ్‌ ప్రకటించినపుడు ఓటింగ్‌ జరపాలని రాగేష్‌ కేకలు వేశారు. ప్రతిపక్ష సభ్యుల వైపు నుంచి కనీసం మూడు సార్లు ఓటింగ్‌ కోరినట్లు వినిపించింది. ఓడిపోయినట్లు ప్రకటించిన తరువాత రెండు సార్లు వినిపించింది. తరువాత తృణమూల్‌ సభ్యుడు ఓ బ్రియెన్‌ కోరినపుడు అదే జరిగింది. ఆ సమయంలో ఓటింగ్‌ కోరే వారు తమ స్ధానాల నుంచి అడగాలని హరివంశ్‌ చెప్పటం కనిపించింది. తరువాత డిఎంకె సభ్యుడు శివ తీర్మానాన్ని కూడా అలాగే తిరస్కరించారు. ఆ సమయంలో మైక్‌ నిలిపివేశారు. అయినా ఓటింగ్‌ జరపాలని తన స్ధానం నుంచి శివ కేకలు వేసినా వినిపించుకోలేదు. అసమయంలో ముఖానికి తొడుగు వేసుకొని ఉన్నందున చెప్పింది అర్దం కాలేదు అనుకుంటే వివరణ అడగవచ్చు. అసమయంలోనే ఒక సభ్యుడు కోరినా ఓటింగ్‌ జరపాలనే నిబంధనను చూపేందుకు స్పీకర్‌ వద్దకు తృణమూల్‌ సభ్యుడు ఓ బ్రియన్‌ వెళ్లారు. దాన్ని అవాంఛనీయ చర్యగా చిత్రించారు. ఓటింగ్‌కు తిరస్కరించిన కారణంగానే ఇదంతా జరిగిందన్నది స్పష్టం. రాజ్యసభలో జరిగిన పరిణామాల గురించి సంపాదకీయాలు రాసిన ఆంగ్ల పత్రికలన్నీ సభ ఉపాధ్యక్షుడు హరివంశ నారాయణ సింగ్‌ ఓటింగ్‌కు తిరస్కరించిన తీరును తప్పు పట్టాయి. వ్యవసాయ బిల్లులను సమర్ధించిన హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక సైతం సభలో పాలక పార్టీ వ్యవహరించిన తీరును తప్పుపట్టక తప్పలేదు. బిల్లులను సెలెక్టు కమిటీకి పంపాలన డిమాండ్‌ను ఆమోదించి ఉండాల్సిందని పేర్కొన్నది.


తమ గోడును కేంద్రానికి వినిపించండంటూ చేసిన రైతుల వేడు కోళ్లను మీడియా పట్టించుకోలేదు. సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఆత్మహత్య కేసుతో ప్రమేయం ఉందన్న ఆరోపణలున్న ఒక నటి చెప్పిన సమాచారం పేరుతో బాలీవుడ్‌ తారలను ప్రశ్నించేందుకు మాదక ద్రవ్యాల నిరోధ బ్యూరో పిలిపించింది. విచారణకు పిలిపించినంత మాత్రాన వారు నేరం చేసినట్లు కాదు. కనీసం నిందితులు కూడా కాదు. కానీ మీడియా చేస్తున్న హడావుడి, వార్తలు ఇస్తున్న తీరు తమ పరువును మంటగలుపుతున్నాయని ప్రశ్నించటం పూర్తయి, తగుచర్య తీసుకొనేంత వరకు ఆ విషయాలు మీడియాలో రాకుండా చూడాలని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అంతకు ముందే సంయమనం పాటించాలని కోర్టు చెప్పిన తరువాత కూడా మీడియా దాన్ని ఉల్లంఘించిందని తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన గోప్యతను మంటగలుపుతున్నారని, తాను విచారణ అధికారులకు అందచేసిన ప్రకటనను కోర్టు కనుక పరిశీలిస్తే తన మీద ఎలాంటి తప్పుడు ప్రచారం జరుగుతోందో అర్ధం అవుతుందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.
రైతుల సమస్యలను విస్మరించి సినీతారల మీద కేంద్రీకరించిన మీడియా గురించి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినీతారల వ్యక్తిగత నడవడి లేదా దురలవాట్ల గురించి కొత్తగా మీడియా చెప్పాల్సిందేమీ లేదు. అందరికీ తెలిసిందే, ఎందరో జీవితాలను నాశనం చేసుకున్నారు. ఆ మాటకు వస్తే రాజకీయం, మీడియా ప్రతి రంగంలోనూ అలాంటి అవాంఛనీయ ధోరణులతో ప్రవర్తించేవారు ఉన్నారు. మీడియా రాజకీయ నేతల మీద కేంద్రీకరిస్తే అధికారంలో ఉన్న పెద్దలు సిబిఐ,ఇడి,ఎన్‌ఐఏ,ఆదాయపన్ను శాఖలను మీడియా సంస్ధల మీదకు దించుతారు. ఇవాళ మీడియా యజమానులు-రాజకీయ నేతలు మీకది, మాకిది అన్నట్లుగా పంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


దీపికా పదుకోన్‌ విషయంలో పాలకపార్టీ నేతలకు ప్రత్యేకంగా ఆగ్రహం కూడా ఉంది. పద్మావత్‌ సినిమా ఒకటైతే, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్దులపై ఎబివిపి స్వయంగా లేదా జరిపించిన దాడుల సమయంలో బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ బాధిత విద్యార్ధులకు మద్దతు ప్రకటిస్తూ విశ్వవిద్యాలయ ప్రాంగణానికి రావటం బిజెపి పెద్దలకు మింగుడు పడలేదు. ఇప్పుడు ఏదో విధంగా ఆమెను ఇరికి ంచి బదనాం చేయాలని చూస్తున్నారా అన్న అనుమానాలను కూడా కొందరు లేవనెత్తారు. మీడియాలో ఆమెను గంటల తరబడి విచారించిన తీరు మీద చేసిన హడావుడిని చూస్తే అటు రేటింగ్‌ పెంచుకోవటంతో పాటు పాలకపార్టీ పెద్దలను సంతృప్తి పరచేందుకు మీడియా పెద్దలు ప్రయత్నించారా ? ఏ మాటకామాటే చెప్పుకోవాలి. దేన్నీ కాదనలేం మరి !