Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా మన దేశ రైతాంగానికి అనేక వైపుల నుంచి ముప్పు ముంచుకు వస్తోంది. ఏ కష్టం వచ్చినా కాచుకొనే ప్రభుత్వం ఉంటే అదొక తీరు. బాధ్యతల నుంచి తప్పుకొంటున్న పాలకులు ఒక వైపు ఉంటే రైతాంగాన్ని నిలువు దోపిడీ చేసే శక్తులు మరోవైపు కమ్ముకు వస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వ సేకరణ, కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ద్వారా ధనిక దేశాల కార్పొరేట్‌ సంస్దలు తెస్తున్న వత్తిడికి ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోయారా ? దాన్ని నీరుగార్చే చర్యల్లో భాగంగానే సంస్కరణల పేరుతో వ్యవసాయ, నిత్యావసర వస్తువుల చట్టాలలో సవరణలు చేశారా ? యావత్‌ వినియోగదారులు, రైతాంగ ప్రయోజనాలను ఫణంగా పెట్టారా ? మరోవైపు అమెరికాతో కుదరబోతోందని చెబుతున్న ఒప్పంద రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఒక వేళ కుదిరితే దాని బాటలోనే ఇంకా ఏ దేశాలు ఏ గొంతెమ్మ కోరికలు కోరతాయో తెలియదు. ఇవన్నీ చుట్టుముడుతున్న ప్రశ్నలు, సమస్యలు.


వ్యవసాయ ఉత్పత్తుల పన్నులలో మార్పులు చేర్పులు గురించి ముందుగానే తెలియచేయాలన్న కెనడా తదితర దేశాల ప్రతిపాదనను మన దేశం వ్యతిరేకించింది. అలా చేస్తే అది సట్టాబేరాలకు, ఇతర అక్రమ లావాదేవీలకు దారి తీస్తుందని, ఆహార ధాన్యాల నిల్వల మీద ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. పారదర్శకత, వర్తించే పన్నుల గురించి అంచనాలకు వచ్చేందుకు వీలుగా ముందుగానే పన్నుల వివరాలు వెల్లడించాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్య దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ తరఫున కెనడా ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధలోని వ్యవసాయ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న వ్యవసాయ మంత్రుల సమావేశ అజండాను ఖరారు చేసేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముందుగానే పన్నుల వివరాలను వెల్లడిస్తే పండ్లవంటి తాజా ఉత్పత్తులకు ఎంతో మేలు జరుగుతుందని బ్రెజిల్‌ పేర్కొన్నది. ఈ మూడు దేశాల, అదేమాదిరి అభిప్రాయాన్ని ముందుకు తెచ్చిన రష్యా ప్రతిపాదనకు అమెరికా, అర్జెంటీనా, న్యూజిలాండ్‌, ఉరుగ్వే,ఉక్రెయిన్‌ కూడా మద్దతు తెలిపాయి. మనదేశంతో పాటు దక్షిణాఫ్రికా, ఈజిప్టు వ్యతిరేకించాయి.ఈ దేశాలు వ్యక్తం చేసిన కొన్ని అంశాలతో తాము కూడా ఏకీభవిస్తున్నట్లు చైనా పేర్కొన్నది.


ఈ సమావేశంలోనే మన ప్రభుత్వం ఇస్తున్న పంచదార రాయితీలు, రవాణా, మార్కెటింగ్‌ రాయితీల గురించి, ఆహార నిల్వల ప్రభావం ఏమిటంటూ మిగతా దేశాలు ఆరాతీశాయి. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల పరిమితిని అతిక్రమించి అమెరికాలో ఇస్తున్న 34బిలియన్‌ డాలర్ల రాయితీల సంగతేమిటని మన దేశంతో సహా అనేక దేశాలు ప్రశ్నించాయి. మన ప్రభుత్వం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం రైతులకు రాయితీలు ఇవ్వటమేనని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దం కనుక ఆ విధానాన్ని ఎత్తివేయాలి లేదా ధరలను తగ్గించాలని అమెరికా, ఐరోపా యూనియన్‌ తదితర దేశాలన్నీ ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. తమ చర్యలు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆ వాదనలను ఇప్పటి వరకు మన దేశం తిరస్కరిస్తూ వస్తోంది.


వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో కనీస మద్దతు ధరల కంటే తక్కువకు ఎవరూ కొనటానికి వీలులేదు. దీని ర్ధం వ్యాపారులు పోటీ పడి ఎక్కువకు కొనుగోలు చేయవద్దని కాదు. చమార్కెట్‌ యార్డుల పరిధిలో కొనుగోలు చేసే వారి మీద పర్యవేక్షణ ఉంటుంది. తాజాగా చేసిన సవరణల ప్రకారం యార్డుల పరిధిని కుదించారు. ఆ పరిధి వెలుపల ఎవరైనా ఎలాంటి సెస్‌ చెల్లించకుడా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ధరలను పర్యవేక్షించే యంత్రాంగం ఉండదు. ఒప్పంద వ్యవసాయం చేసేందుకు కూడా అనుమతిస్తున్నందున రైతులు-వ్యాపార సంస్ధల మధ్య ఒప్పందంలో కనీస మద్దతు ధరల అంశం- ప్రస్తావనే ఉండదు. కంపెనీలు ఏదో ఒక సాకుతో ధరలు దిగ్గొస్తే అధికారులను ఆశ్రయించటం తప్ప న్యాయస్ధానాలకు వెళ్లే అవకాశం లేదు. అధికార యంత్రాంగం ఎవరివైపున ఉంటుందో తెలిసిందే.


2013లో నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ మంత్రుల సమావేశ నిర్ణయం ప్రకారం 2023వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, రవాణా, మార్కెటింగ్‌ రాయితీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తరువాత రద్దు లేదా పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీని పర్యవసానాలు రైతులకు హానికరంగా ఉంటాయి తప్ప మరో తీరులో ఉండే అవకాశం లేదు.
అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ నెల రోజుల క్రితం చెప్పారు. వచ్చిన వార్తలు, జరుగుతున్న చర్చల తీరుతెన్నులను చూస్తే ముందుగా ఒక పరిమిత ఒప్పందం తరువాత సమగ్ర ఒప్పందం జరగబోతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానిక సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఒక ఆర్డినెన్స్‌ అనేది అత్యవసర సందర్భాలలో మాత్రమే ఉపయోగించే అధికారం. వ్యవసాయ సంస్కరణలు అలాంటివి కాదు. ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి దానికి తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం. అమెరికాతో ఒప్పందం కుదరితే అది మన వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావం చూపనుందని చెబుతున్నారు. అనేక దేశాలతో అది కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ దాని కార్పొరేట్‌ ప్రయోజనాలకే అనుకూలంగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు.


ప్రపంచంలో అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో మన దేశం మిగులుతో ఉంది. దాన్ని సమం చేసేందుకు మన దేశం మీద వత్తిడి తెచ్చి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు బంద్‌ చేయించి తన చమురును మనకు విక్రయిస్తున్నది. త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికా వ్యవసాయ సరకులు మన దేశాన్ని ముంచెత్తటం ఖాయం.
చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.2018లో అమెరికా 7,15,491 టన్నుల పాలపొడి, 5,45,890 టన్నుల పన్నీరు పొడి ( పాలవిరుగుడు), 3,48,561టన్నుల జున్ను, 3,92,166 టన్నుల పాలచక్కెర(లాక్టోజ్‌)ను ఎగుమతి చేసింది. చైనాతో లడాయి కారణంగా అమెరికా పదిశాతం ఎగుమతిని కోల్పోయింది. దీంతో అమెరికాలో రికార్డు స్ధాయిలో ఆరులక్షల టన్నులకు జున్ను నిల్వలు పేరుకుపోయాయి. ఇది మన దేశంలో పన్నెండు సంవత్సరాల జున్ను వినియోగానికి సమానమని అంచనా. ఇప్పుడు మన వంటి దేశాలకు పాడి ఉత్పత్తులను ఎగుమతి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
దేశంలో పన్నీరు పొడి ధర కిలో రు.130-150 మధ్య ఉండగా 30శాతం దిగుమతి పన్ను ఉన్నప్పటికీ కిలో రు.70కంటే తక్కువ ధరకే ప్రతి నెలా వెయ్యి టన్నుల మేరకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. పన్నీరు, జున్నుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాల పొడి ధర మన దేశంలో రు.280-300 మధ్య ఉంది. కొందరు పన్నీరు పొడిని కూడా పాలపొడిగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల నుంచి గనుక పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే మన పాల రైతాంగం పరిస్ధితి ఏమిటి ? దిగుమతి పన్ను 30శాతానికి మించి పెంచినా అమెరికా లేదా న్యూజిలాండ్‌ వంటి దేశాలు ఇస్తున్న సబ్సిడీల కారణంగా మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువ ధరకే దిగుమతి చేసుకోవచ్చు. దాంతో మన పాలరైతులు పాడి పరిశ్రమకు దూరం కావాల్సిందే. ప్రపంచ వ్యాపితంగా జున్ను తయారీలో దూడల పేగుల్లోంచి తీసిన పదార్దాన్ని తోడు కింద వినియోగిస్తారు. మన దేశంలో అలా వినియోగించటం చట్టవిరుద్దం. అయితే దిగుమతి చేసుకొనే దానిలో అలాంటి తోడు వినియోగించారా లేదా అన్నది తయారీదారులు చెబితే తప్ప తెలుసుకోవటం కష్టం.అమెరికా, ఐరోపా దేశాల్లో ఆవులకు వేసే దాణాలో జంతువుల ఎముకలతో తయారు చేసిందాన్ని వినియోగిస్తారు. అలాంటి వాటితో తయారు చేసిన పదార్ధాలు మన దేశానికి ఇప్పటికే దొడ్డిదారిన వస్తున్నాయి. ఇది ఒక విధంగా కొన్ని తరగతుల వినియోగదారులను మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వాటిని కస్టమ్స్‌ సిబ్బంది గుర్తించలేరు.వ్యవసాయం తరువాత మన దేశంలో పాడి రైతులు ఎక్కువ. పాలకూ కనీస సేకరణ ధర నిర్ణయించాలని చాలా కాలం నుంచి రైతులు కోరుతున్నారు. అయితే తమకటువంటి ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో స్పష్టం చేసింది.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. 2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ?


అమెరికా నుంచి ఇప్పటికే పండ్లు, కూరగాయలను మనం దిగుమతి చేసుకుంటున్నాము, అవి పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన వ్యవసాయ చట్టాల సవరణల్లో ఒప్పంద వ్యవసాయం గురించి చెప్పింది. భారీ ఎత్తున అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో పోటీ పడి మన దేశం పండ్లు, కూరగాయలు, పూలను ఎగుమతి చేసే స్ధితిలో ఉందా ? మన రైతాంగాన్ని దెబ్బతీసే దిగుమతులు ఎందుకు, విదేశీ కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇచ్చి మన దేశం నుంచి ఎగుమతులెందుకు ?
అమెరికా లేదా మరొక దేశంతో వ్యవసాయ ఉత్పత్తుల గురించి మన దేశం కుదుర్చుకోబోయే ఒప్పందంలో ఇప్పుడున్న దిగుమతి పన్నులను తగ్గించకుండా అమెరికా అంగీకరిస్తుందా ? తగ్గిస్తే మన రైతుల సంగతేమిటి ? ఉదాహరణకు యాపిల్‌ పండ్లపై మన దేశం విధిస్తున్న పన్ను 50శాతం ఉన్నపుడు 2018 జనవరి నుంచి జూన్‌ 15 మధ్య అమెరికా నుంచి 78లక్షల బాక్సులను దిగుమతి చేసుకున్నాము. పన్ను మొత్తాన్ని 70శాతానికి పెంచటంతో మరుసటి ఏడాది అదే కాలంలో దిగుమతులు 26లక్షల బాక్సులకు పడిపోయాయి. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉంటేనే కాశ్మీర్‌, హిమచల ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోని యాపిల్‌ రైతులకు మేలు జరుగుతుంది. అదే తగ్గిస్తే ?


మనం పత్తిని ఎగుమతి చేస్తున్నాం-ఇదే సమయంలో భారీ సబ్సిడీలు ఇస్తున్న అమెరికా పత్తిని మన మిల్లు యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక వ్యవసాయ ఉత్పత్తుల పరిస్ధితి ఇదే, పన్ను తక్కువగా ఉన్నపుడు ఇబ్బడి ముబ్బడిగా మన కార్పొరేట్‌ లేదా వాణిజ్య ” దేశభక్తులు ” దిగుమతి చేసుకొని మన రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. రైతాంగం కన్నెర్ర చేయటంతో పాలకులు పన్నులు పెంచాల్సి వస్తోంది. దాంతా కాస్త ఊరట కలుగుతోంది. ఈ దోబూచులాట ఎంతకాలం ? రైతులు ఆరుగాలం పంటలు పండించాలా ? ప్రతిక్షణం పాలకుల విధానాల మీద కన్నువేసి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయాలా ?


ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే.


బర్డ్‌ ఫ్లూ సమస్య తలెత్తినపుడు 2007లో మన దేశం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. మన కోళ్ల పరిశ్రమ రక్షణ కోసం ఆ సమస్య తొలగిన తరువాత కూడా అది కానసాగింది. అయితే ఆ చర్య నిబంధనలకు విరుద్దం అంటూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసి 2014లో అమెరికా గెలిచింది. దాంతో నరేంద్రమోడీ సర్కార్‌ 2017లో నిషేధాన్ని ఎత్తివేసింది. దిగుమతులపై వందశాతం పన్ను విధించింది. అయినప్పటికీ మన మార్కెట్లో దొరికే వాటి కంటే చౌక కావటంతో కోడి కాళ్ల దిగుమతులు ప్రారంభం అయ్యాయి. ఆ పన్ను మొత్తాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. అదే జరిగితే మన బాయిలర్‌ కోళ్ల ఫారాలు, వాటికి రుణాలు ఇస్తున్న బ్యాంకులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి.


అమెరికా ఇప్పటికే మధ్య అమెరికాలోని చిలీ వంటి దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ప్రాతిపదికనే మన దేశం కూడా ఒప్పందం చేసుకోవాలని వత్తిడి వస్తోంది. అదే జరిగితే వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది. అది ఒక్క అమెరికాకే పరిమితం కాదు. మనతో వాణిజ్య సంబంధాలున్న మిగతా దేశాలు కూడా అదే విధమైన రాయితీలు కోరతాయి. విత్తన వాణిజ్యం మీద ప్రస్తుతం ఉన్న నియంత్రణలను మరింత సడలిస్తే మాన్‌శాంటో, కార్గిల్‌, సింజెంటా వంటి కంపెనీల దోపిడీకి అడ్డు ఉండదు. గుజరాత్‌లో పెప్సీ కంపెనీ తన అనుమతి లేకుండా తన పేటెంట్‌ హక్కు ఉన్న బంగాళాదుంప విత్తనాలను సాగు చేశారంటూ మన దేశానికి వర్తించని నిబంధనలతో పదకొండు మంది రైతుల మీద కేసులు వేసిన విషయం తెలిసిందే.
మన కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం కనుక ఆ విధానాన్ని రద్దు చేసేట్లు ఆదేశించాలని అమెరికా, కెనడా దాఖలు చేసిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ ధరల నిర్ణయం రాయితీగా వర్ణిస్తూ అవి అనుమతించిన దానికంటే 26 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నది వాటి వాదన. ఉత్పత్తి విలువ లెక్కింపు పద్దతిలో తేడా ఉంది. అమెరికా, కెనడా వంటి దేశాలు మన రూపాయిని యూనిట్‌గా తీసుకొని లెక్కిస్తున్నాయి. మన దేశం డాలరు ప్రాతిపదికగా లెక్కవేస్తోంది. ఉదాహరణకు మన దేశం పప్పుదినుసుల విలువ రూ.2,677 కోట్ల రూపాయలుగా చూపుతుంటే అమెరికా రూ.69,923కోట్లుగా లెక్క చెబుతోంది. మన ప్రభుత్వం సేకరించే సరకునే పరిగణనలోకి తీసుకుంటే అమెరికా మొత్తం ఉత్పత్తి విలువను లెక్క వేస్తోంది. చైనా మీద కూడా అమెరికా ఇలాంటి కేసే వేసింది. వీటిని భారత్‌, చైనా రెండూ కలసి వ్యతిరేకిస్తున్నాయి.


భారత ఆహార సంస్ధ అనవసరంగా ధాన్య నిల్వలు చేస్తున్నదనీ, కనీస మద్దతు ధరల విధానం అసమర్దతకు ప్రోత్సాహం అనే దివాలాకోరు వాదనలు చేసే వారు కూడా ఉన్నారు. ఒక ఎకరానికి పది క్వింటాళ్ల ధాన్యం పండించే రైతుకూ, 15క్వింటాళ్లు పండించే రైతుకూ కనీస మద్దతు ధర ఒకటే ఉంటుందనే రీతిలో వారి వాదనలు ఉన్నాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చు, తక్కువ నీటిని వినియోగించే వారికి ప్రోత్సాహం ఇవ్వటం లేదని చెబుతారు. ఇవన్నీ ఆ విధానాలను రద్దు చేయాలనే దుష్ట ఆలోచన ఉన్నవారు ముందుకు తెచ్చే వాదనలు. కనీస మద్దతు ధర ఎత్తివేస్తే ప్రయివేటు వ్యాపారులు అలాంటి రైతులను గుర్తించి వారికి అదనపు ధర లేదా మరో రూపంలో ప్రోత్సాహం అందిస్తారా ? ఏ దేశంలో అయినా అలా జరిగిందా ? ఉన్న వ్యవస్ధలో లోపాలను సరిదిద్దటాన్ని ఎవరూ వ్యతిరేకించటం లేదు. అంతకంటే మెరుగైన వ్యవస్ధ లేకుండా ఉన్నదాన్ని నిర్వీర్యం చేస్తే దిక్కేమిటి ? ఇదే రైతులు ముందుకు తెస్తున్న ప్రశ్న !


రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చేందుకు వీలుగా ముందు ఒక పరిమిత ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాలో మన రాయబారిగా ఉన్న తరంజిత్‌ సింగ్‌ సంధు ఆగస్టు 21న ఫిక్కి సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం మన దేశం మన అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల మీద అమెరికా విధించిన అధిక పన్నులను వెనక్కు తీసుకోవాలని, జిఎస్‌పి కింద రద్దు చేసిన రాయితీలను పునరుద్దరించాలని కోరుతోంది. తాము ఆపని చేయాలంటే తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను తెరవాలని, ఐటి ఉత్పత్తుల మీద పన్నులు తగ్గించాలని వాణిజ్యలోటును తగ్గించాలని అమెరికా అంటోంది. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అనుసరించే వైఖరి. నవంబరు ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇదే సమస్య ముందుకు రానుంది. ఆ వత్తిడిని మన పాలకులు తట్టుకుంటారా ? మన రైతులు, పరిశ్రమలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటారా ? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మన ముందు ఉంది !