Tags

, ,


ఎం కోటేశ్వరరావు


రెండు దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకచోట ఆనంద హేల ! మరో చోట ఆరోపణల గోల !! కరోనా వైరస్‌ను కట్టడి చేసిన చైనాలో అక్టోబరు ఒకటవ తేదీన ప్రతి ఏటా జరుపుకొనే అరుణపతాక ఆవిష్కరణ ఎంతో ఆర్భాటంగా జరిగింది. 1949 అక్టోబరు ఒకటవ తేదీన చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇదే సమయంలో శరత్కాల పండుగను కూడా జరుపుకుంటారు. అందువలన రెండింటికి కలిపి వారం రోజుల పాటు ఇచ్చే సెలవులు గడిపేందుకు దాదాపు 55 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు పయనమై వెళ్లారు. కరోనాను కట్టడి చేసిన తరువాత చైనాలో సాధారణ జీవనం పునరుద్దరణ అయిందనేందుకు ఇది నిదర్శనం.


మరోవైపు కరోనా నిరోధాన్ని నిర్లక్ష్యం చేసి రెండు లక్షలకు పైగా ప్రాణాలు పోయేందుకు,75లక్షల మందికి కరోనా సోకేందుకు కారకుడైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన నేరం, వైఫల్య నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు పూనుకున్నాడు. నిర్లక్ష్యంతో అధ్యక్షుడిగా యావత్‌ అమెరికా పౌరులను, చివరకు వ్యక్తిగతంగా తాను, సతీమణికి సైతం కరోనాను అంటించి క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారి జరిగిన అభ్యర్ధుల సంవాదంలో ట్రంప్‌ పచ్చి అబద్దాలు, అసత్యాలను పలికాడు. ప్రత్యర్ధి జో బిడెన్‌, మీడియా, ఇతరులు ట్రంప్‌ మీద విరుచుకు పడ్డారు. ఎన్నికలు జరిగే నాటికి కోటి మంది వరకు కరోనా బారిన పడే తీరులో వ్యాధి వ్యాపిస్తోంది. మరోవైపు చైనాలో అడపాదడపా కొన్ని కేసులు వెలుగు చూడటం -అదీ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది – తప్ప మొత్తంగా వ్యాధి అదుపులో ఉంది.


మహమ్మారులను ఎదుర్కోవటం,కట్టడి చేయటంలో సోషలిస్టు ప్రభుత్వాల ప్రత్యేకతేమిటో చరిత్రలో తొలిసారిగా ప్రపంచం చూసింది. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి చెందిపెద్ద సంఖ్యలో జనం మరణించిన సమయానికి రష్యాలో బోల్షివిక్‌ ప్రభుత్వం పూర్తిగా నిలదొక్కుకోలేదు. కరోనా కేసులు తొలుత చైనాలో బయట పడిన కారణంగా అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ జీవ ఆయుధాల తయారీలో భాగంగా బయటకు వదిలారని, ప్రమాదవశాత్తూ బయల్పడిందని ఏ కారణం చెప్పినప్పటికీ చైనా మీద ఆరోపణలు చేసేందుకు, కమ్యూనిస్టు సిద్దాంతం మీద దాడి చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కరోనా పేరుతో అన్ని విధాలుగా ఒంటరి పాటు చేసేందుకు, ఆ పేరుతో ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన దేశాలు ఏవో చూశాము. వాటన్నింటినీ తట్టుకొని తన దైన శైలిలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని కరోనా నుంచి బయటపడింది.


కరోనా కేసులు తొలుత బయట పడిన ఊహాన్‌ నగరం, హుబెయి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు జరిపిన తీరు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు, అన్నింటికీ మించి జనం ఎక్కడా చైనా, వియత్నాంలో మాదిరి సహకరించలేదు. మహమ్మారి నుంచి చైనా సమాజాన్ని బయటపడవేసేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యల మీద జనం అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి గత నాలుగు దశాబ్దాలలో సంస్కరణలు అమలు జరిపి జనజీవితాలను మెరుగుపరచిన వాస్తవాన్ని స్వయంగా గమనించటమే కారణం. పదేండ్ల క్రితం ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా తమ ఆర్ధిక వ్యవస్ధ కూడా ప్రభావితం అయినప్పటికీ జనాన్ని ఆదుకున్న తీరును, మిగిలిన దేశాల్లో జనజీవితాలు అస్తవ్యస్ధం కావటాన్ని చూశారు గనుకనే కరోనా మహమ్మారిని జయించేందుకు ప్రభుత్వంతో కలసి జనం పోరాడారు.
దాదాపు తొమ్మిది నెలల పాటు క్వారంటైన్‌, లాక్‌డౌన్‌, అనేక ఆంక్షలను అనుభవించిన జనం గత రెండు నెలలుగా కొత్తకేసులు లేకపోవటంతో పంజరాల నుంచి బయట పడిన పక్షులు స్వేచ్చగా ఎగిరే మాదిరి బయటకు వచ్చారు. పరిస్ధితులన్నీ బాగుపడ్డాయనే ధైర్యం వచ్చిన తరువాత కసిగా విహార యాత్రలకు వెళుతున్నారని విశ్లేషకులు వర్ణించారు. ఇది చైనా ఆర్ధిక వ్యవస్దకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. సెప్టెంబరు30వ తేదీన 12 కేసులు నమోదు కాగా అవి కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే. ఎనిమిది రోజుల పాటు సెలవులను ప్రకటించటం ఏ దేశంలో అయినా జరుగుతుందా ? చైనాలో మాత్రమే చూడగలం. నూటనలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కసారిగా 55 కోట్ల మంది బయటకు వస్తే బహిరంగ స్ధలాలు ఎంత రద్దీ అవుతాయో ఊహించుకోవాల్సిందే. ప్రయాణ సాధనాల్లో, హౌటళ్లలో రిజర్వేషన్లు దొరక్క, ఒక రోజు ముందే వాహనరద్దీతో ఇండ్లకే పరిమితమైన వారెందరో. వాహనాలు నత్తనడక నడిచాయి. ఐదు వందలకు పైగా విహార కేంద్రాలలో ప్రవేశానికి రాయితీలు లేదా ఉచితంగా అనుమతిస్తూ ప్రకటించారు. అక్టోబరు ఒకటవ తేదీ ఒక్కరోజే 14,941 విమానాలు ఏర్పాటు చేశారు. రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేక విమానాలు కూడా సిద్దం చేశారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు ఎనిమిది వరకు రైల్వేశాఖ 10.8 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే చైనా సమాజం మీద ఆర్ధికంగా కరోనా ప్రభావం లేదా ? ఉంది కనుకనే గత ఏడాది 80 కోట్ల మంది ప్రయాణాలు చేస్తే ఈ ఏడాది 55 కోట్ల మందే చేస్తున్నారని వెల్లడైంది. గతేడాది 9.5బిలియన్‌ డాలర్ల మేరకు జనం ఖర్చు చేశారు. ఈ ఏడాది తగ్గనుంది.ఆగస్టు నుంచి సాధారణ వస్తుకొనుగోలు పెరిగింది.


కరోనా వైరస్‌ను అదుపు చేయటంలో ఒక్క చైనాయే కాదు, వియత్నాంతో పాటు సామ్రాజ్యవాదుల ఆంక్షల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న క్యూబా,వెనెజులా కూడా ప్రపంచానికి మార్గంచూపాయి. వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. అయితే అదే పద్దతిని ఇతర దేశాల్లో ఎందుకు అనుసరించటం లేదు ? ఇబ్బందులేమిటి ? అనే చర్చ జరిగింది. చైనాతో వియత్నాంకు సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. ఊహాన్‌ నుంచి వియత్నాం వచ్చిన ఒక చైనా పౌరుడు, అతని కుమారుడిలో జనవరి 30న ఆ వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. 2003లో చైనాలో బయటపడిన సార్స్‌ సోకిన తొలి దేశం వియత్నాం కావటం, గత అనుభవాలను గమనంలో ఉంచుకొని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం వెంటనే కరోనా నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంది.వాటికి జనం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వియత్నాంలో కేంద్రీకృత అధికార వ్యవస్ధ ఉండటం, వెంటనే నిర్ణయాలు తీసుకొనేందుకు, అమలు చేసేందుకు దోహదం చేసింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం, లాక్‌డౌన్‌ నిబంధనలను గట్టిగా అమలు జరపటం ఎంతో తోడ్పడింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద నిఘావేసే చర్యలు తీసుకున్నారు.అనేక దేశాల్లో ప్రభుత్వాలకు అలాంటి అధికారం ఉన్నప్పటికీ జవాబుదారీతనం, తగినన్ని నిధులు లేని కారణంగా ఆ పని చేయలేదు.


ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. జనం కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.ఇలాంటి పరిస్ధితి మరేదేశంలోనూ కనిపించదు. సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్ధితిని ప్రభుత్వం వివరించింది. మీడియా సరేసరి. మిలిటరీని కూడా రంగంలోకి దించి జనాన్ని అప్రమత్తం గావించింది. ఈ కసరత్తు అంతా జనానికి పరిస్ధితి తీవ్రతను తెలియ చేసేందుకు కరోనా పోరులో వారిని భాగస్వాములను చేసేందుకు అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు ఎంతగానో తోడ్పడింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ఆర్ధిక రంగంపై దాని ప్రభావం పడకుండా చూసిన కారణంగా ఈ ఏడాది ఎనిమిది నెలల్లో అమెరికాతో సహా అనేక దేశాలకు వియత్నాం ఎగుమతులు గత ఏడాది కంటే పెరిగాయి. అమెరికా ఖండ దేశాల నుంచి పెట్టుబడులు కూడా పెరిగాయి. దీనికి అమెరికా-చైనా మధ్య తలెత్తిన వివాదం కూడా తోడైంది.


క్యూబా మీద అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలకు ఆరుదశాబ్దాలు నిండాయి.1991లో సోవియట్‌ రిపబ్లిక్‌లను కూల్చివేసిన తరువాత కూడా అవి కొనసాగుతున్నాయి. అక్కడి కమ్యూనిస్టు పార్టీ జనానికి కలిగించిన చైతన్యం కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలిచింది. అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.


అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 కరోనా కేసులు నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది. క్యూబా ఔషధంగా పేరుగాంచిన ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా2బి తయారీ 2003నుంచి చైనాలో జరుగుతోంది. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతోంది.జనాన్ని చంపటానికైనా సిద్ధపడుతున్నాడు గానీ దాన్ని అమెరికాలో వినియోగించటానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు అహం అడ్డువచ్చింది.


అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలన్నీ క్యూబా ప్రభుత్వం ఉచితంగానే చేసింది.వైద్యం అనేక దేశాల్లో బీమా కంపెనీల ఆదాయవనరుగా, వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. దీనికి అనుగుణ్యంగానే అమెరికాలో వైద్యులకు ఇచ్చే వేతనాలు క్యూబాలో లేవు అన్నది కూడా నిజం. వైద్యులకు వేతనాల కంటే జనానికి వైద్య ఖర్చు తగ్గించటమే సోషలిస్టు క్యూబా ప్రత్యేకత. మిగతావారితో పాటు వైద్యులు కూడా ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతను పొందుతారు.


క్యూబా వైద్య విధానాన్ని చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వెనెజులాలో 20వేల మంది క్యూబన్‌ వైద్యులు,నర్సులు ఉన్నారు. స్ధానికులతో కలసి వారంతా ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు,చికిత్స, అవసరమైన సలహాలు అందించటం నిత్యకృత్యంగా చేస్తున్నారు.దేశంలో 15వేల క్లినిక్స్‌, 572 రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలు, 586 చికిత్స కేంద్రాలు, 35 ఉన్నత సాంకేతిక వైద్య కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిలో అత్యధిభాగాన్ని కరోనా నిరోధ కేంద్రాలుగా పని చేయిస్తున్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న వెనెజులాలో అక్టోబరు రెండవ తేదీ నాటికి 76వేల కేసులు నమోదు కాగా 635 మంది మృత్యువాత పడ్డారు.పక్కనే ఉన్న కొలంబియాలో 8.35లక్షల కేసులు, 26వేల మరణాలు సంభవించాయి. వెనెజులా గురించి అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల గురించి కట్టుకధలు చెప్పేవారు ఈ వివరాల గురించి ఏమంటారు? ఆమెరికా, ఇతర అనేక దేశాలు కల్పిస్తున్న ఇబ్బందులను తట్టుకుంటూ వెనెజులా జనాన్ని కరోనా బారిన పడకుండా కాపాడుతున్నది. అంతా సజావుగా ఉందని చెబుతున్న కొలంబియా సంగతి చూశాము. అదే ప్రాంతానికి చెందిన మరో దేశం బ్రెజిల్‌లో 48.5లక్షల కేసులు నమోదు కాగా 1.44లక్షల మంది మరణించారు.


కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన దేశాల్లో చైనా కూడా ఒకటి. వైరస్‌ను అక్కడే తయారు చేసి వదిలారు అని చెబుతున్నవారు మరి దీనికేమంటారు ? జనవరి-మార్చినెలల మధ్య జిడిపి 6.8శాతం తిరోగమనంలో పడగా ఎక్కడైతే మహమ్మారి ప్రారంభమైందో ఆ హుబెరు రాష్ట్రంలో నష్టం 39.2శాతం ఉంది. అయితే ఆ విపత్తును త్వరలోనే అధిగమించి ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో మూడశాతం పురోగమనాన్ని సాధించింది. ఫిబ్రవరి నాటికి 80వేలకు పైగా కేసులుండగా అక్టోబరు రెండున 85,424 కేసులు నమోద కాగా చికిత్స పొందుతున్న వారు 189 మంది, ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది, కొత్తకేసులు పది నమోదయ్యాయి. మే మొదటి వారానికే ఊహాన్‌తో సహా దేశమంతటా 80శాతం ఉత్పాదక కార్యకలాపాలు నమోదయ్యాయి. ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తూ వైరస్‌ జాడను కనుగొన్నారు.


చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. 2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు.


కరోనా కారణంగా ఉద్దీపన పధకాలకు అమెరికా 2.3లక్షల కోట్ల డాలర్లు కేటాయించింది. చైనా 50వేల కోట్ల డాలర్లు కేటాయించింది. అమెరికా అంత మొత్తం ప్రకటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ 2020లో 8శాతం తిరోగమనంలో ఉంటుందని, 2021లో 4.5శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ జూన్‌ అంచనాలో పేర్కొన్నది. అదే చైనా విషయానికి వస్తే ఒకటి, 8.2శాతాలుగా ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే 2020లో పురోగమన వృద్ధి రేటుతో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా. కరోనా విషయంలోనే కాదు, ఆర్ధిక రంగంలో చైనా తన సోషలిస్టు వ్యవస్ధ విశిష్టతను ప్రదర్శిస్తోందన్నది స్పష్టం.