Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నిజంగా తలచుకోవాలేగానీ ఏదైనా క్షణాల్లో అయిపోతుంది. కోరుకున్నవాటిని మాత్రమే తలచుకుంటారు, అదే అవుతుంది. జూన్‌ ఐదున వ్యవసాయ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చి సెప్టెంబరు మూడవ వారానికి పార్లమెంటులో ఆమోదం కూడా పొందారు. కరోనా అడ్డం రాలేదు. కాశ్మీరు రాష్ట్ర రద్దు అయితే ఒకే ఒక్క రోజులో పూర్తి చేశారు. అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోలేదు, ఎంత పట్టుదల, ఎంత వేగం ? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కారు మూడురాజధానులు, ఇతర కొన్ని కేసుల మీద ఉన్న ఆత్రంతో వివాదాల విచారణను వేగవంతం చేయించాలని సుప్రీం కోర్టు తలుపులు తట్టటాన్ని చూశాము. రాష్ట్రానికి అది అత్యంత ప్రాముఖ్యత అంశంగా భావించారు. విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి ? ఎవరికైనా పట్టిందా, వెంటనే ఉనికిలోకి తీసుకురావాలనే కోరిక ఉందా ?


కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌ ఉనికిలోకి రావటం గురించి అటు కేంద్రానికి పట్టలేదు, ఇటు రాష్ట్రమూ పట్టించుకోలేదు. ఎంత సమయం తీసుకుంటారు ? ఏమిటి ఆటంకాలు ? రాష్ట్ర పునర్విభజన చట్టంలో వాగ్దానం చేసినమేరకు నిర్ణయం తీసుకొనేందుకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ప్రకటించారు. పందొమ్మిది నెలలు గడుస్తోంది. ఇప్పుడు ప్రతిదానికి కరోనాను చూపుతున్నారు ? కరోనా కారణంగా ఏది ఆగింది ? రైల్వే జోన్‌ ఉనికిలోకి ఎందుకు రావటం లేదు ?


విశాఖ రైల్వే డివిజన్‌ను రద్దు చేస్తారు, ఆ భవనాల్లో జోనల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. సిబ్బందిని కొత్తగా నియమించటం లేదు, ఉన్నవారినే సర్దుబాటు చేయవచ్చు, దానికీ ఇబ్బందీ లేదు.లాక్‌డౌన్‌ దశలవారీ ఎత్తివేస్తున్నారు.నామ మాత్రంగానే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మరి ఆటంకం ఏమిటి ? కొన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు డబ్బు కొరతా ? అదేమీ వేల కోట్లు కాదే ! పోనీ అదైనా చెప్పాలి కదా ? రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపివేశారు. వస్తున్న వార్తలను బట్టి వచ్చే ఏడాది కూడా దేశ జిడిపి తిరోగమనంలో ఉంటుందని చెబుతున్నారు. పోనీ పురోగమనంలోకి వచ్చిన తరువాతే ఉనికిలోకి వస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరూ ఏమీ మాట్లాడరు ? ఏమనుకోవాలి ?
వస్తున్న వార్తలను బట్టి సంస్కరణల పేరుతో ఇప్పుడు ఉన్న 17 రైల్వే జోన్లను తగ్గిస్తారా ? అందుకే 18వ జోన్‌ విశాఖను తాత్సారం చేస్తున్నారా ? రైల్వే సంస్కరణల్లో భాగంగా అసలు జోనల్‌ వ్యవస్ధలనే ఎత్తివేసి కార్యకాలపాల ఆధారంగా కొత్త సంస్ధలను ఏర్పాటు చేస్తారా ? అనేక ప్రశ్నలు ముసురుతున్నాయి.ఏమైనా జరగవచ్చు. రైల్వేలను కూడా దశలవారీ ప్రయివేటీకరించే ఆలోచనలో పాలకులు ఉన్నారు.దానికి అవసరమైన నియంత్రణ కమిషన్‌, ధరల పెరుగుదలకో మరొక పెరుగుదలకో చార్జీల పెంపును ముడిపెట్టి ప్రభుత్వ నిర్ణయంతో పని లేకుండా అధికార యంత్రాంగమే నిర్ణయించే ఏర్పాట్లు కూడా ఆలోచనలో ఉన్నాయి.


జపాన్‌లో రైల్వే వ్యవస్ధ ప్రయివేటీకరణ తరువాత సరకు రవాణాకు దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించారు, ప్రయాణీకుల విషయానికి వస్తే ఆరు ప్రాంతీయ కంపెనీలను ఏర్పాటు చేసి ఏ మార్గంలో రైళ్లు నడపాలో లేదో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చారు. చైనాలో పునర్వ్యవస్దీకరణలో భాగంగా సరకు రవాణా, ప్రయాణీకులు, రైలు మార్గాల యాజమాన్యాలకు స్వతంత్ర సంస్దలను ఏర్పాటు చేశారు. ఆ మూడు విభాగాల్లో కూడా ఉప విభాగాలు ఉంటాయి. బ్రిటన్‌లో ప్రయివేటీకరణలో భాగంగా 25కంపెనీలను ఏర్పాటు చేసి ప్రయివేటీకరించారు. మన దేశంలో కూడా ప్రయివేటు రైళ్లను అనుమతించాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. రైల్వే బోర్డు, జోనల్‌, డివిజన్లను రద్దు చేసి కొత్త వాటిని తీసుకు రారనే హామీ లేదు.


ఈ నేపధ్యంలోనే మూడులక్షల ఉద్యోగాలను రద్దు చేయాలని 55 ఏండ్లు దాటిన వారి జాబితాలను సిద్దం చేయాలని, సిబ్బంది పని తీరును సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జోన్లకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 13-14 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.రిటైరైన ఖాళీలను భర్తీ చేయకుండా ఉంచటం, పని తీరు బాగోలేదని భావించిన వారిని నిర్బంధంగా రిటైర్‌ చేయించే ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ విషయమై జోనల్‌ అధికారులకు రాసిన లేఖలు తీవ్ర సంచలనం, ఉద్యోగుల్లో వ్యతిరేకత తలెత్తటంతో వివరణ పేరుతో శాంత పరిచేందుకు మరొక ప్రకటన చేశారు.పని తీరుబాగో లేని వారిని తొలగించటం అంటే కొత్త ఉద్యోగాలు ఉండవని కాదన్నదే దాని సారాంశం. 2014-19 మధ్య 2,83,637 పోస్టుల భర్తీ కసరత్తు జరిగిందని వాటిలో 1,41,060పోస్టులకు పరీక్షలను పూర్తిచేశామని ఆ ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని పేర్కొన్నది.


పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా రక్షణ సిబ్బందిని తప్ప కొత్తగా ఏ పోస్టును సృష్టించవద్దని ఆదేశించారు. ఉన్న సిబ్బందితో పలు రకాల పనులు చేయించాలి. కనీస సంఖ్యలో సిబ్బందితో పని చేయించేందుకు ఏర్పాటు చేయాలని, కొత్తగా నియామకాలు జరపవద్దని, గత రెండు సంవత్సరాల్లో సృష్టించిన పోస్టుల గురించి సమీక్ష జరపాలని, వాటిలో నియామకాలు జరపకపోతే నిలిపివేయాలని, సిబ్బందిని హేతుబద్దీకరించాలని, ఆర్ధికంగా లాభసాటి గాని శాఖలను మూసివేయాలని, ఇంకా అనేక పొదుపు చర్యలను ఆదేశించారు. 2014కు ముందు ప్రకటించిన గుల్బర్గ, జమ్ము, సిల్చార్‌ తప్ప కొత్త డివిజన్ల ఏర్పాటు ఆలోచన లేదని 2015లో కేంద్ర ప్రకటించింది.విశాఖను రద్దు చేస్తున్నారు కనుక రాయఘడ డివిజన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.


విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు గాను విశాఖ డివిజన్‌ను రద్దు చేసి దాని ఆధీనంలోని 30శాతం మార్గాలను విజయవాడ డివిజన్‌లో విలీనం చేసి మిగిలిన వాటితో రాయఘడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి విశాఖ జోన్‌ ఉనికిలోకి రానున్నదని సంకేతాలు ఇచ్చారు.వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను గత ఆగస్టులో సమర్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని దానిలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న రైల్వే మార్గాలన్నీ విశాఖ జోన్‌లో ఉంచాలని పలువురు కోరారు. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌ మీద ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తరువాత కార్యకలాపాల ప్రారంభానికి నాలుగు నుంచి ఆరునెలల వ్యవధి అవసరం అవుతుందని అంచనా. డిపిఆర్‌ గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోనరెడ్డి లేదా ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గానీ ఈ అంశం మీద కేంద్రాన్ని సంప్రదించినట్లు వార్తలు లేవు.


విశాఖ జోన్‌ ఉనికిలోకి వస్తే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఒడిషాలో రాజకీయ సమస్యలకు దారి తీయవచ్చు. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాలను ఒకేసారి సంతృప్తి పరచటం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌లో ఉంది. తమ జోన్‌ పరిధి తగ్గిపోనుందనే భయంతో బిజెపి, దాని మిత్ర పక్షం బిజెడి తెచ్చిన వత్తిడి మేరకు విశాఖ డివిజన్నే రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిషాలో బిజెపి పరువును కాపాడేందుకు ఏదో ఒక సాకుతో విశాఖ జోన్‌ ఉనికిలోకి రాకుండా చూడాలని కేంద్రం చూస్తున్నదా ? రైల్వేజోన్ల తగ్గింపు అంశం కూడా పరిశీలనలో ఉన్నదని రైల్వే మంత్రి పార్లమెంట్‌లో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అదే వాస్తవమైతే ఆ పేరుతో విశాఖ రైల్వేజోన్‌ ఇచ్చినట్లుగానూ ఇవ్వనట్లుగానూ ఎటూ తేల్చకుండా ఉంచేందుకు పూనుకున్నారా ? ఏమో ! కేంద్ర పెద్దలు దేనికైనా సమర్ధులు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకపార్టీ లేదా బిజెపి లేదా దాని మిత్ర పక్షాలకు ఇదేమీ పట్టినట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఒక దగా ! వి శాఖ రైల్వే జోన్‌ మరో దగా కాదు కదా !