Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


మహిమ గల సిద్దాంతంగా చెప్పే స్వేచ్చాయుత పెట్టుబడిదారీ విధానంలో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి మరింతగా బయట పెట్టిందని పోప్‌ ఫ్రాన్సిస్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ” అందరూ సోదరీ సోదరులు ” అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బిషప్పులకు రాసిన లేఖను విడుదల చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ యుద్ధాలు రాకుండా చూసేందుకు అవసరమైన చర్చలు, సౌభ్రాత్వత్వాలను పెంపొందించే నూతన తరహా రాజకీయాలు ప్రపంచానికి అవసరమంటూ తాజాది మూడవది అయిన ఆ లేఖలో పేర్కొన్నారు. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బోధనల నుంచి తానీ ఉత్తేజాన్ని పొందానని ప్రపంచం మీద కమ్మిన చీకటి మబ్బులతో సంఘర్షించాలని అన్నారు. ఆత్మరక్షణకు న్యాయ యుద్దం చేయవచ్చు అన్న కాథలిక్‌ చర్చి సిద్దాంతాన్ని శతాబ్దాల తరబడి విస్తారంగా వినియోగించారని అదింకేమాత్రమూ పనికిరాదని అన్నారు. దాన్ని సమర్దించుకోవటం ఈ రోజుల్లో కష్టమన్నారు.


తీవ్ర హాని కలిగించిన కరోనా వైరస్‌ పీడిత జనాల న్యాయమైన అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం రాజకీయ, ఆర్దిక వ్యవస్ధలను సంస్కరించాలని పోప్‌ చెప్పారు. వివిధ దేశాలు భిన్న మార్గాల్లో కరోనా సంక్షోభం మీద స్పందించినప్పటికీ కలసి పనిచేయటంలో వాటి అశక్తత ఎంతో స్పష్టంగా కనిపించిందన్నారు. మెరుగుపరచేందుకు ఇప్పుడు మనం చేస్తున్నది లేదా ఉన్న వ్యవస్ధను మరియు నిబంధనలను మెరుగుపరచేందుకు చేస్తున్నది గానీ వాస్తవాలను గుర్తించటం లేదనే ఏకైక గుణపాఠాన్ని నేర్చుకోవాలన్నారు. వైరస్‌ కారణంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోవటాన్ని రుజువుగా తీసుకొని ప్రజాఉద్యమాలు, యూనియన్లు, ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న జన సమూహాలు చెప్పేవాటిని రాజకీయనేతలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రతి దాన్ని మార్కెట్‌ స్వేచ్చ పరిష్కరించలేదని కరోనా మహమ్మారి చూపిందన్నారు.


భూ వనరులు సామాజిక ప్రయోజనాలకు తప్ప వ్యక్తుల ఆస్ధి కాదని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కొంత మందిని ధనికులుగా మారుస్తూ పేదలను దూరంగానే ఉంచుతున్నదనే తన విమర్శను పోప్‌ పునరుద్ఘాటించారు. ఊటసిద్దాంతాన్ని చెప్పినంత సులువుగా అమలు చేయలేమని అన్నారు. ఊట సిద్దాంతం, మహత్తు గలవని చెప్పే సిద్దాంతాల పేరు చెప్పకుండానే నయా ఉదారవాదం వాటిని పునరుత్పత్తి చేస్తోందని, అది సమాజ వ్యవస్ధకే ముప్పు తెచ్చే హింసాత్మక ధోరణులు పెరిగేందుకు దోహదం చేసే అసమానతలను పరిష్కరించలేదని అన్నారు. మంచి ఆర్ధిక విధానం ఉద్యోగాలను కల్పిస్తుంది తప్ప కోత పెట్టదని పోప్‌ పేర్కొన్నారు. గౌరవ ప్రదంగా బ్రతకటానికి అవసరమైనవి ఒక వ్యక్తికి లేకపోవటానికి కారణం మరొక వ్యక్తి వాటిని అడ్డుకోవటమే అని తొలి రోజులలో ముందుకు వచ్చిన క్రైస్తవ భావన ఇప్పటికీ చెల్లుతుందని చెప్పారు. జాత్యంహంకారం గురించి చెబుతూ అది ఒక వైరస్‌, అంతర్ధానం కావటానికి బదులు వేగంగా రూపం, స్వభావం మార్చు కుంటుంది, దాగి అవకాశం కోసం ఎదురు చూస్తుంది అన్నారు.

పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రస్తావించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ గురు పీఠమైన అమెరికాలో ” మహమ్మారి విషాదం వ్యాకులత ముగిసింది – మాంద్యం ఇప్పుడే ప్రారంభం అయిందని ” న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక తాజా పరిస్ధితి గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నది. అనిశ్చితమైన భవిష్యత్‌కు ముప్పును తెచ్చే ఆర్ధిక వ్యవస్ధ దీర్ఘకాలికమైన, మెల్లగా కోలుకొనే స్ధితిలో ప్రవేశించినట్లు, సిద్దాంతం ప్రకారం మహమ్మారులతో పెద్దగా ప్రభావితం కావని చెప్పే రంగాలు కూడా ఇప్పుడు తీవ్ర మాంద్యానికి దగ్గరగా ఉన్నాయి. సాధారణంగా మాంద్యాల్లో మాత్రమే ఉండే లేఆఫ్‌ల హెచ్చరికలను వాణిజ్య వార్తల శీర్షికలు ప్రతిబింబిస్తున్నాయి. బడా చమురు కంపెనీ షెల్‌ తొమ్మిదివేలు, డిస్నీ 28, రక్షణ రంగ కంపెనీ రేథియాన్‌ 15వేల ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. వసంత రుతువులో ఈ రంగాలలో రద్దయిన ఉద్యోగాలు వేసవి వచ్చినా పూర్తిగా తిరిగి రాలేదు. 2008 నాటి మాంద్యంలో 2.4శాతం ఉద్యోగాలు తగ్గితే ఇప్పుడు 3.9శాతం తగ్గాయి. గత మాంద్యాల కంటే దారుణంగా మహమ్మారి కారణంగా ఉద్యోగాల నష్టం జరిగింది. ఆర్ధిక వ్యవస్ధ ఆరోగ్యం బాగుపడినప్పటికీ అనేక ఉద్యోగాలు ఉండవు, కొత్త రకాల కోసం కార్మికులు వెతుక్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఒక పరిశ్రమ దెబ్బతింటే అది అనేక ఇతర పరిశ్రమలను దెబ్బతీస్తుంది.


పెట్టుబడిదారీ వ్యవస్ధ దివాలాకోరుతనం కారణంగా కరోనా ముందు స్ధాయికి ఆర్ధిక వ్యవస్ధ కోలుకున్నప్పటికీ అది నిరంతరం కొనసాగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ జనాభాలో నాలుగుశాతం కలిగిన అమెరికాలో కరోనా మరణాల్లో మాత్రం 21శాతం ఉన్నాయి. ప్రపంచ ధనిక దేశాల్లో నాలుగోవంతు మరణాలు అక్కడే సంభవించాయి. అమెరికాలో రోజుకు వెయ్యి మంది, ఐరోపా యూనియన్‌లో మూడు వందల మంది మరణిస్తుండగా ఆసియా ధనిక దేశాలలో దాదాపు మరణాలు లేవు. అమెరికా పక్కనే ఉన్న కెనడాలో వైరస్‌ కారణంగా మరణిస్తున్నవారు రోజుకు పదికి అటూ ఇటూగా మరణాలు ఉంటున్నాయి.
మరోవైపు సోషలిస్టు వ్యవస్ధలు కలిగిన చైనా కరోనా వైరస్‌ను పూర్తిగా అరికట్టటమే కాదు సాధారణ జనజీవనాన్ని తిరిగి ప్రారంభించింది. వియత్నాం, క్యూబా కూడా కరోనాను అరికట్టటంలో జయప్రదమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ మరియు సోషలిస్టు వ్యవస్ధ గొప్పతన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించినట్లు చైనా అధినేత గ్జీ జింపింగ్‌ వర్ణించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలోని ధనిక దేశాలు 2008 ద్రవ్య సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని స్ధితిలో చైనా దాని ప్రభావాలను అధిగమించి ఒక ప్రధాన శక్తిగా ఎదిగింది. ప్రధాన ఆర్ధిక వ్యవస్దలన్నీ తిరోగమనంలో ఉండగా చైనా పురోగమనంలో సాగుతోంది. ఈ వాస్తవాన్ని విస్మరించటం అంత తేలిక కాదు.
అనేక మంది ఆర్ధిక పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ 2008 గాలివానకు తట్టుకొని నిలవటమే కాదు తదుపరి దశాబ్దిలో ప్రపంచ ఆర్దిక వ్యవస్ధలో మూడోవంతు ఆర్ధిక ప్రగతిని చైనా జోడించింది. అమెరికాకు సమీపంలో ఉంది. ఈ ఆర్ధిక శక్తి ప్రపంచంలో చైనా పలుకుబడి పెరిగేందుకు దోహదం చేసింది.బెల్ట్‌ మరియు రోడ్డు చొరవ పేరుతో చైనా నుంచి ఐరోపా వరకు లక్ష కోట్ల డాలర్ల పధకాన్ని చైనా అమలు జరుపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ గురుత్వాకర్షణ కేంద్రం అట్లాంటిక్‌ నుంచి పసిఫిక్‌ సముద్రానికి మారుతోంది అని అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌ వ్యాఖ్యానించాడు.ఏదైనా ఉపద్రవం వచ్చినపుడు ఆదుకొనేందుకు ప్రతివారూ అమెరికా కోసం ఎదురు చూసేవారు. కానీ కరోనా మహమ్మారి తొలి రోజుల్లో జనానికి అవసరమైన ముఖతొడుగులు, ఇతర రక్షణ వైద్య పరికరాల కోసం ప్రపంచం చైనా వైపు చూసింది. ఒక్క జిడిపి విషయంలోనే కాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి అన్ని రంగాలలో చైనా తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపింది. ఇది అక్కడి సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత తప్ప మరొకటి కాదు. అమెరికా రాజకీయ నాయకత్వం రోజు రోజుకూ చైనా వ్యతిరేకతను పెంచుకుంటున్నప్పటికీ ఆర్ధిక సేవలు అందించే అక్కడి కంపెనీలు చైనాలో కార్యకలాపాలను పెంచుతూనే ఉన్నాయి.చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలన్నీ పొలోమంటూ స్వదేశానికి, మన దేశానికి వస్తున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.అయితే అలాంటి ఆలోచన లేదా నిర్ణయం తీసుకున్న కంపెనీలు కేవలం నాలుగుశాతమే అని తాజా సర్వేలో వెల్లడైంది.


అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.
అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది.క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. వైద్య సేవను ఆదాయానికి గాక బాధ్యతగా ప్రభుత్వం భావించటమే దీనికి కారణం.


వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు.
చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు.2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు. అనేక విజయాలు సాధించిన చైనా ఈ లక్ష్యాన్ని సాధించటంలో కూడా జయప్రదం అవుతుందనటంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదు.