Tags

, ,


ఎం కోటేశ్వరరావు


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయటం కొత్త కాదు. అయితే చేసిన ఫిర్యాదును ఒక ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేయటం దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ద్వితీయ స్ధానంలో ఉండి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్ష తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.


న్యాయమూర్తుల మీద గతంలో కూడా అధికారంలో ఉన్న వారు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ విధంగా వాటిని బహిరంగపరచలేదు. పదోన్నతి వరుసలో ఉన్న న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయటం ఒక ధోరణిగా మారిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే కొద్ది వారాల క్రితం ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాని తరువాత ఇప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రవర్తన మీద, అధికార దుర్వినియోగం గురించి ఫిర్యాదులు కోర్టు విచారణల వరకు వెళ్లాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ జిల్లా న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళా జడ్జి చేసిన ఫిర్యాదు విచారణ సమయంలో జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ కూడా ప్రమోషన్‌ వరుసలో ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదు కోర్టులో లేదా పోలీస్‌ సేష్టన్‌లో దాఖలు కాలేదు. గతంలో న్యాయమూర్తులకు రాసిన లేఖలను, పత్రికా వార్తల మీద స్పందించి విచారణకు ఆదేశించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా పరిగణిస్తారు అన్నది పెద్ద ప్రశ్న.


మధ్య ప్రదేశ్‌ జిల్లా జడ్జిపై వచ్చిన ఆరోపణల కేసులో ఎవరైనా పదోన్నతి పొందుతారు అనగానే మన వ్యవస్దలో అన్ని రకాల అంశాలు ప్రారంభం అవుతాయి. ఫిర్యాదులు చేస్తారు, పత్రికల్లో వార్తలు కనిపిస్తాయి, అరే ఇతను అంత చెడ్డవాడా అని ఆకస్మికంగా జనాలు గుర్తు చేసుకుంటారు అని జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. ఆ జిల్లా జడ్జి ఈ ఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్‌ అవకాశాలున్నాయని అనుకుంటున్న సమయంలో అతని మీద 2018లో పని స్ధలంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఫిర్యాదు చేసింది కూడా మరొక జడ్జి కావటం గమనార్హం. జిల్లా ప్రధాన జడ్జిని మరొక జిల్లాకు బదిలీ చేశారు. అతని మీద వచ్చిన ఫిర్యాదులను విచారించిన అంతర్గత ఫిర్యాదుల విచారణ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. తన మీద చర్యను నిలిపివేయించాలని కోరుతూ సదరు న్యాయమూర్తిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీం కోర్టు సలహాయిచ్చింది. అయితే హైకోర్టులో ఎలాంటి ఊరట లభించకపోవటంతో తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయకూడనే నిబంధనలేవీ లేవు. ఎవరి మీద అయినా ఫిర్యాదులు చేయవచ్చు. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి వాటి మీద విచారణ జరిపే పరిస్ధితి వస్తే కొన్ని రక్షణలు ఉన్నాయి. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ మీద సిబిఐ కేసు దాఖలు చేసింది. అయితే 2014లో రాజస్ధాన్‌ గవర్నర్‌గా నియమించటంతో విచారణ నిలిపివేశారు. పదవీ కాలం ముగిసిన తరువాత విచారణకు పిలవ వచ్చని సుప్రీం కోర్టు చెప్పింది.


ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేఖ ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసింది ఫిర్యాదు మాత్రమే. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంశమే. ప్రతి కేసులో ఒకరు ఓడిపోతారు, రెండవ వారు గెలుస్తారు. ఓడిన వారు న్యాయమూర్తి వల్లనే తనకు అన్యాయం జరిగిందని విమర్శ లేదా ఆరోపణ చేయవచ్చు. అది ఇతర న్యాయమూర్తుల మీద ప్రభావం చూపుతుంది. చివరకు న్యాయవ్యవస్ధ మీదనే విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ నేపధ్యంలోనే న్యాయమూర్తులకు రక్షణ కల్పిస్తూ బ్రిటీష్‌ వారి హయాంలోనే చట్టాలు చేశారు.
న్యాయమూర్తిగా వ్యవహరించే వారు ఇచ్చిన తీర్పులను పై కోర్టులో సవాలు చేయవచ్చు తప్ప వారి మీద చర్యలు తీసుకొనేందుకు వీలు లేకుండా రక్షణ కల్పించారు. అయితే కొన్ని ఉదంతాలలో న్యాయమూర్తులు తప్పు చేసినట్లు ఫిర్యాదులు దాఖలయ్యాయి. అవి వాస్తవమే అని తేలిన సందర్భాలలో వారికి రక్షణ వర్తించదు అన్న తీర్పులు వచ్చాయి. ఒక సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఒక వ్యక్తి అరెస్టు మరియు నిర్బంధానికి ఇచ్చిన ఉత్తరువు నిర్లక్ష్యపూరితంగా ఉందని భావించిన సుప్రీం కోర్టు బాధితుడికి నష్టపరిహారంగా ఐదువేల రూపాయలు ఇవ్వాలన్న తీర్పును సమర్ధించింది. మరో కేసులో ఒక మెజిస్ట్రేట్‌ తన బుర్రను ఉపయోగించకుండా ఒక వారంట్‌ మీద సంతకం చేయటం అక్రమం అని బాధితుడు సెషన్స్‌ కోర్టులో వేసిన కేసులో న్యాయమూర్తి తప్పు చేశారని బాధితుడికి ఐదు వందల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. మరో కేసులో ఆరోపణలు చేసిన న్యాయవాది ఒక రౌడీ గూండా, జూదగాడని ఒక మెజిస్ట్రేట్‌ స్వయంగా కోర్టులో చెప్పటం విధి నిర్వహణలో భాగం కాదని అందువలన అతని మీద చర్య తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. మరో కేసులో ఒక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ విధి నిర్వహణలో ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాస్తూ కాపీ చేస్తూ దొరికి పోయాడు. తాను న్యాయాధికారిని కనుక తనమీద చర్య తీసుకోరాదని వాదించటాన్ని కోర్టు అంగీకరించలేదు.


ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు వ్యవహరించాలి. ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి పాటించాలి. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆరోపణలతో లేఖద్వారా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదంతాలు గతంలో లేవు లేదా రహస్యంగా చేసిన ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్న ఉదంతాలు లేవు. ఫిర్యాదుల స్వభావాన్ని బట్టి ప్రధాన న్యాయమూర్తి తోటి న్యాయమూర్తి మీద విచారణకు ఆదేశిస్తారా లేక ఫిర్యాదుల్లో పసలేదని, బహిరంగంగా ప్రకటించి ఒక న్యాయమూర్తి ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదుదారు మీద చర్య తీసుకుంటారా ?


ఒక వేళ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద తొలగింపు వంటి చర్యలు తీసుకోవాల్సి రాష్ట్రపతి ఉత్తరువు జారీ చేయాలి. దానికి ముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో మెజారిటీ సభ్యులు చర్యలకు ఆమోదం తెలపాలి. ఓటింగ్‌ సమయంలో మూడింట రెండువంతుల మంది సభ్యులు హాజరు ఉండాలి. న్యాయమూర్తుల తీరుతెన్నులపై చర్చ జరపకూడదు. గతంలో జస్టిస్‌ రామస్వామి మీద చర్యకు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో మెజారిటీ లేక ప్రతిపాదన వీగిపోయింది. ఒక ప్రధాన న్యాయమూర్తి మీద చర్యను ప్రతిపాదన దశలోనే రాజ్యసభలో తిరస్కరించి అసలు ఓటింగ్‌ వరకే రానివ్వలేదు.


సమాజ సరళి ప్రతి వారి మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ముందుకు వచ్చిన ఈ సమస్య మన వ్యవస్దలో ఇప్పటి వరకు అంతర్గతంగా జరుగుతున్నట్లు భావిస్తున్న, చెవులు కొరుకుతున్న కుమ్ములాటలను బహిర్గతం చేసింది. దీని పర్యవసానాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు అయినా చేయవచ్చు. జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం మరింత సడలటానికే దోహదం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి కేసును కుల, ప్రభావాల ప్రాతిపదికన జనం చూసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిణామాన్నే పాలకులు కోరుకుంటున్నారా ?

కోర్టుల తీరుతెన్నుల మీద సీనియర్‌ న్యాయవాది నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పుల తీరుతెన్నులపై చేసిన విమర్శలు వ్యక్తిగతం కానప్పటికీ సుప్రీం కోర్టు నేరంగా పరిగణించింది. ఇప్పుడు ప్రత్యేకించి ఒక న్యాయమూర్తి మీద జగన్‌ ఫిర్యాదు చేశారు. రాసిన లేఖకు ప్రధాన న్యాయమూర్తి నుంచి సమాధానం వచ్చేవరకు ఆగి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావానికి లోనై తీర్పులు ఇస్తున్నారని ఆరోపించటం ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను బ్లాక్‌మెయిల్‌ చేయటమే అంటున్నవారు లేకపోలేదు. తీర్పులను విమర్శించ వచ్చు తప్ప న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించిన వారు దాన్ని నిరూపించుకోవాలి లేకపోతే వారి మీదనే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించటం ఒకటైతే, వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావితం చేశారని ఆరోపించటం మరొకటి. ఈ రెండింటికీ తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. జస్టిస్‌ రమణ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను కూడా ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తికి పంపటమే కాదు, బహిరంగపరిచారు. ఆస్తులు ఉండటం తప్పు కాదు, వాటిని ఎలా సంపాదించారనేది సమస్య. ఆదాయానికి మించి సంపాదిస్తే ఆదాయ వనరులను తెలియచేయాల్సి ఉంటుంది. వీగిపోయిన లేదా గెలిచిన ప్రతి కేసు వెనుక ఎవరో ఒకరు న్యాయమూర్తులను ప్రభావితం చేశారని ఆరోపించితే రాబోయే రోజుల్లో కేసులు నమోదైతే వాటి మీద ప్రభావం పడకుండా ఉంటుందా ? సుప్రీం కోర్టులో కూడా కేసులు వీగిపోతే అక్కడి న్యాయమూర్తుల మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తారా ? వీటికి అంతమెక్కడ ? ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుంది ? అన్నీ శేష ప్రశ్నలే.


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నడుస్తున్న కేసుల మీద, న్యాయమూర్తుల మీద సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారం ఒకటైతే. పార్టీలు, మీడియా వ్యాఖ్యాతలు చేస్తున్న అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు కోర్టులను ప్రభావితం చేస్తున్నారని గతంలో విమర్శించిన వైసిపి నేతలు ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ స్వయంగా జోక్యం చేసుకొని ప్రభావితం చేస్తున్నారని రోడ్డెక్కారు. గతంలో 16నెలల పాటు జైల్లో ఉన్న జగన్‌ బెయిలు పొందేందుకు నాటి యుపిఏ ప్రభుత్వ సహకారాన్ని పొందారంటూ ఒక వ్యాఖ్యాత పలికారు. ఇప్పుడు కేసులు తుది విచారణకు వస్తున్నందున తిరిగి కేంద్ర సాయం కావాల్సి వచ్చిందని, మోడీ-షా ద్వయం సహకరిస్తారనే నమ్మకం లేకపోయినా సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా రాశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు న్యాయమూర్తులను ప్రభావితం చేసి బెయిల్‌ ఇప్పించారని సూటిగానే చెప్పారు. అధికారంలో ఉన్న వారికి అలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందన్నపుడు వైసిపి ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు సైతం అలా ప్రభావితం చేస్తారనేందుకు ఆస్కారం లేదా ? జస్టిస్‌ రమణ పూర్వాశ్రమంలో న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీలో పని చేయలేదా కేసులను చూడలేదా ? ఆ పరిచయంతో చంద్రబాబు ప్రభావితం చేసి ఉండవచ్చని జనం అనుకొనేందుకు ఆస్కారం లేదా ?