Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


నోబెల్‌ బహుమతి కమిటీ ఎంపిక ప్రమాణాలు ఏమిటో ముఖ్యంగా శాంతి బహుమతి విషయంలో ఒక్కోసారి అంతుబట్టవు. కొన్ని బహుమతుల ప్రకటన చూస్తే తెరవెనుక ఏదో జరుగుతోంది అనిపిస్తుంది. అమెరికాలో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులుగా ఉన్నా నిత్యం ఎక్కడో ఒక చోట నిప్పురాజేస్తారు, జనాలను చంపటమో, చంపించటమో చేస్తారు. అలాంటి వారికి శాంతి బహుమతి ప్రకటన చేయటాన్ని ఏమనాలి ? బరాక్‌ ఒబామాతో సహా ఇప్పటికి నలుగురికి అలా ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ కొందరు ట్రంప్‌ పేరును ప్రతిపాదించారు. స్వయంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోబట్టి గానీ ఉంటే తన పేరును తానే ప్రతిపాదించగల సమర్ధుడు ఆ పెద్దమనిషి.


ఈ నేపధ్యంలో ట్రంప్‌కు జిగినీ దోస్తు, ప్రపంచ నేతలుగా భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్న మన ప్రధాని నరేంద్రమోడీ పేరును ప్రతిపాదించకపోవటాన్ని ఎలా చూడాలి. గతంలో కేంద్ర మంత్రిగా మోడీని దేవుడు అని వర్ణించిన నేటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాదిరి ఒక్కరు కూడా మోడీ పేరును ప్రతిపాదించే సాహసం ఎందుకు చేయలేకపోయినట్లు ? ప్రపంచ నేతగా ఎదిగిన తొలి ప్రధాని అని ఇంతకాలం ఊదరగొట్టిందంతా ఒట్టి గ్యాసేనా ? ప్రపంచ శాంతికి, ఆర్ధిక అభివృద్ధికి గాను నరేంద్రమోడీకి దక్షిణకొరియా అందచేసిన బహుమతి వెనుక మన మార్కెట్‌ మీద దృష్టి ఉందా ?


ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, ఒక కిలో పప్పులు ఉచితంగా 80 కోట్ల కార్డులున్న వారికి అందచేస్తున్నట్లు, అందుకోసం 90వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అది నిజంగా అంత గొప్ప చర్యే అయితే ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఎందుకు వచ్చినట్లు ? ప్రతి దానికీ వీరుడు శూరుడు అంటూ పొగుడుతున్న కొన్ని దేశాల వారు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు ? చౌక దుకాణాల్లో సరకులు కొనుగోలు చేసేందుకు డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు, ఉచితంగా ఇచ్చేవాటితో కనీసం ప్రాణాలు అయినా నిలుపుకుంటారు,సాయం ఎంతని కాదు, ఎన్ని కోట్ల మందికి చేశారు అన్నది ముఖ్యం కదా ! ఇంత అన్యాయమా ? ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యుఎఫ్‌పి) నోబెల్‌ బహుమతి ప్రకటిస్తారా అని భక్తులు లోలోపల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారా ? వచ్చిన ఆపద తీవ్రతతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్రమోడీ ప్రచార ఆర్భాటం చేస్తున్నారా ? ఆచరణలో ఆకలి లేదా ఆహార భద్రత, పోషకాహారం అందించే విషయలో జరుగుతున్నదేమిటి ?


నోబెల్‌ బహుమతుల ఎంపికలో జరుగుతున్న లోపాలను చూసిన తరువాత 1991లో కొందరు ఇగో నోబెల్‌ పేరుతో ఎగతాళి బహుమతులను ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో వైద్య రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు గాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌,రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌, టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రడార్‌, బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో, తుర్కుమెనిస్దాన్‌ అధ్యక్షుడు బద్రిమహ్మద్‌లకు కలిపి ఉమ్మడి బహుమతిని ప్రకటించారు. కరోనా మహమ్మారి జనజీవితాల మీద చూపే ప్రభావాన్ని శాస్త్రవేత్తలు, వైద్యుల కంటే ముందుగానే రాజకీయవేత్తలుగా వీరు ప్రపంచానికి బోధ చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ దేశాల్లో కరోనా కేసులు ఎలా పెరిగిపోయిందీ, జనాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందీ ప్రపంచం చూసింది. ప్రపంచ శాంతికి ఇచ్చే ఇగో నోబెల్‌ బహుమతులు భారత్‌-పాకిస్ధాన్‌ దౌత్యవేత్తలకు ప్రకటించారు. అర్ధరాత్రి అపరాత్రి అనికూడా చూడకుండా తలుపు గంటలను మోగించటం, వచ్చి తలుపు తెరిచి సమాధానం ఇచ్చే లోగానే కనపడకుండా పోతున్నందుకు ఇస్తున్నట్లు ప్రకటించారు.(సెప్టెంబరు 18, ది ప్రింట్‌)

నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో విజయాలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటోంది. అదేమిటో గానీ సరైన లెక్కలు తయారు చేయటంలో లేదా తనకు అనుకూలంగా లెక్కలు రాయించటంలో సైతం వైఫల్యం కనిపిస్తోంది. మరోవైపు అన్నీ నెహ్రూయే చేశాడు అని చెప్పుకొనే అవకాశాలు రోజు రోజుకూ నరేంద్రమోడీ దళానికి తగ్గిపోతున్నాయి. 2016-25ను పోషకాహార కార్యాచరణ దశాబ్దంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి 2016ఏప్రిల్‌లో నిర్ణయించింది. 2012లో ప్రపంచ ఆరోగ్య ప్రతినిధుల సమావేశం 2025 నాటికి ఆరుపోషకాహార లక్ష్యాలను సాధించాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దాన్ని చేరుకోవటంలో విఫలమయ్యే 88 దేశాల్లో మనది ఒకటి అని 2020 ప్రపంచ పోషకహార నివేదిక పేర్కొన్నది. గడచిన ఎనిమిది సంవత్సరాలలో మోడీ గారీ వాటా ఆరు సంవత్సరాలు ఉంది. ప్రభుత్వ పని తీరు చూసి వచ్చే ఐదేండ్లలో లక్ష్యాన్ని చేరే అవకాశం లేదని ప్రకటించేశారు. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవటాన్ని నివారించటం, పిల్లల్ని కనే వయస్సు ఉన్న మహిళల్లో రక్త హీనత నివారణ, పిల్లలో అధికబరువు నివారణ, తల్లిపాలు ఇవ్వటం పెంపు లక్ష్యాలను చేరుకొనే అవకాశాలు లేవని మన సమాచారాన్ని విశ్లేషించిన నివేదిక పేర్కొన్నది.ప్రపంచంలో అధ్వాన్నంగా ఉన్న మూడు దేశాలలో నైజీరియా, ఇండోనేషియాతో పాటు మన దేశాన్ని చేర్చారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో పరిస్ధితి దారుణంగా ఉందని నివేదిక పేర్కొన్నది. ఇలాంటి కార్యక్రమాలను అమలు జరపాల్సింది రాష్ట్రాలు కదా, వాటి వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేయటం సబబా అని కొంత మంది అతి తెలివి వాదనలు చేస్తున్నారు. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది అనే వాస్తవాన్ని వారు కావాలనే దాస్తున్నారు. పదిహేనేండ్లకు పైగా పాలనలో ఉన్న రాష్ట్రాలలో పరిస్ధితి మారిందేమీ లేదు.


పిల్లలకు తగినన్ని పండ్లు ఆహారంగా ఇస్తే తరువాతి రోజుల్లో వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దేశంలో తగినంత ఆహారమే పెట్టలేని స్ధితిలో పండ్లు తినిపించటం సాధ్యమా ? తలిదండ్రుల ఆదాయాలు అందుకు అనుగుణ్యంగా ఉన్నాయా? కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ఈ అంశం మరింతగా ముందుకు వచ్చింది. దేశంలో 80 నుంచి 90శాతం మంది పెద్ద వారికి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ డి లోపం ఉంది. కరోనా నిరోధానికి అది అవసరమని కొందరు చెప్పటంతో సూక్ష్మంలో మోక్షానికి అలవాటు పడిన మన జనాలు ఇష్టమొచ్చినట్లు డి విటమిన్‌ టాబ్లెట్‌లు తీసుకొని కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు. దీనికి అర్హతలు లేని ప్రబోధ వైద్యులు, వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులే ప్రధాన కారణం.


ప్రపంచంలో పలుచోట్ల నెలకొన్న అస్తవ్యస్ధ పరిస్ధితికి సరైన టీకా ఆహారమే అని నోబెల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెరిట్‌ రెసి అండర్సన్‌ చెప్పారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్‌ బహుమతిని ప్రకటించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచ ఆకలిని కరోనా మహమ్మారి రెట్టింపు చేయనుందనే అంచనాల నేపధ్యంలో ఈ కార్యక్రమ అవసరం ఎంతో ఉందన్నారు. తమ కుటుంబానికి దక్కిన ఈ గౌరవంగా దీన్ని భావిస్తున్నామని, తొలిసారిగా తనకు మాటలు రావటం లేదని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యనిర్వహణ అధికారి డేవిడ్‌ బియాస్‌లే వ్యాఖ్యానించారు. అనేక దశాబ్దాల పాటు ప్రపంచంలో ఆకలి తగ్గిన తరువాత 2016 నుంచి పెరుగుతోందని, పెద్ద దేశాలు కొన్ని ఆకలిని తీర్చేందుకు సహకరించటం లేదని ఆహార కార్యక్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.


మన దేశానికి సంబంధించి 117 దేశాలలో ఆకలి సూచిక 2019లో 102గా ఉంది. అయితే మన అధికారులు అది పాత సమాచారం మీద ఆధారపడి రూపొందించినది, 2017, 18 సంవత్సరాల వివరాలను తీసుకుంటే 91గా ఉంటుందని చెబుతున్నారు. ఆకలిని కొలిచేందుకు తీసుకుంటున్న ప్రమాణాల్లో మార్పులు చేసిన మాట వాస్తవం. అది ఒక్క మన దేశానికే కాదు అన్ని దేశాలకూ వర్తిస్తుంది.102కు బదులు 91 ఎంతో మెరుగైదని చెప్పుకొనేందుకు తాపత్రయ పడటం తప్ప మనం ఎంతో ఆకలితో ఉన్నామనే విషయాన్ని విస్మరిస్తున్నారు. 2019 సూచికలో ఐదు పాయింట్లు, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన దేశాలన్నింటినీ ఒకటవ స్ధానంలో ఉన్నట్లుగా పరిగణించారు, అలాంటి దేశాలు 17 ఉన్నాయి. ఐదు-ఆరు పాయింట్ల మధ్య ఐదు దేశాలు ఉన్నాయి. ఆరు -ఏడు పాయింట్ల మధ్య మరో ఐదు దేశాలుండగా వాటిలో 6.5 పాయింట్లతో చైనా 24వ స్ధానంలో ఉంది. పదిపాయిట్ల లోపు ఉన్న దేశాలన్నీ ఆకలి తక్కువగా, 10-19.9 మధ్య వచ్చినవి సాధారణమైనవిగా, 20-34.5 మధ్య తీవ్రంగా, 35-49.9 ఆందోళన కరంగా , 50పాయింట్లు దాటినవి మరింత ఆందోళన కరమైన స్దితిలో ఉన్నట్లు భావిస్తున్నారు. మన దేశం 91 అయినా 102 అయినా ఆందోళనకర స్ధాయిలో ఆకలి ఉన్న దేశాల వర్గీకరణలోనే ఉంటుందని గమనించాలి. ఆహారమే కొనలేని మన దేశవాసులకు పోషకాహారం గురించి మన ప్రధాని మన్‌కీ బాత్‌లో ఉద్బోధ చేశారు.

ఆకలి ఒక అంశమైతే దేశాల్లో ఆహార భద్రత ఏ స్ధాయిలో ఉందన్నది కూడా ముఖ్యమే.2019 సూచికలో 113 దేశాలలో 87.4 పాయింట్లతో సింగపూర్‌ తొలి స్ధానంలో ఉంది.చైనా 71 పాయింట్లతో 35వ స్ధానంలో ఉండగా మన దేశం 58.9 పాయింట్లతో 72వ స్దానంలో ఉంది. పాకిస్ధాన్‌ 78వ స్ధానంలో 56.8పాయింట్లను కలిగి ఉంది.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల ముసుగులో మన రైతాంగానికి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగించేందుకు పూనుకోవటాన్ని కొందరు పెద్దలు స్వాగతిస్తున్నారు. కొన్ని అంకెలు చెబుతూ మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో మిగులు సాధించినట్లు చిత్రిస్తున్నారు. వారు చెబుతున్న అంకెలు వాస్తవమే గానీ వాటికి చెబుతున్న భాష్యంతోనే అసలు సమస్య. పండించటం ఒక ఎత్తయితే జనం తింటున్నారా లేదా అన్నది అసలు సమస్య. 2019 సంవత్సరానికి చైనా పండ్ల ఎగుమతులు దిగుమతుల వివరాలను ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. చైనా నుంచి కొన్ని పండ్లను ఎగుమతి చేస్తుండగా కొన్ని రకాలను దిగుమతి చేసుకుంటోంది. గతేడాది 950 కోట్ల డాలర్ల విలువ గల పండ్లను దిగుమతి చేసుకుంటే 550 కోట్ల డాలర్ల విలువగల పండ్లను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే దిగుమతుల విలువ 24, ఎగుమతుల విలువ 14శాతం పెరిగింది.


వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంపుదల ద్వారా రైతులకు మేలు చేస్తామనే పేరుతో సంస్కరణలు ప్రారంభించిన నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు 14న ఉల్లిధరలు పెరగటాన్ని చూపుతూ ఎగుమతులను నిషేధించింది. తరువాత ఉల్లి ధరలు పెద్దగా తగ్గిందేమీ లేదు. విమర్శలు రావటంతో అక్టోబరు మొదటి వారంలో కృష్ణాపురం ఉల్లిరకాన్ని నిషేధం నుంచి మినహాయించింది. ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల నిషేధం అమల్లోకి తెచ్చిందో మన మీద ఆధారపడిన బంగ్లాదేశ్‌ వంటి దేశాలు చైనా నుంచి దిగుమతులకు పూనుకున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏడాది తగ్గినా, పెరిగినా ప్రస్తుతం ప్రపంచంలో 9,32,26,400 టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. చైనాలో 2,39,07,509 టన్నులు, భారత్‌ 1,94,15,425 టన్నులు ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో ఉల్లి ధరలు ప్రతి ఏడూ ఏదో ఒక సమస్యను ముందుకు తెస్తున్నాయి. గతేడాది కూడా ధరలు పెరగటంతో నిషేధం విధించారు. దాంతో మన మీద ఆధారపడిన అనేక దేశాలు చైనాతో ఒప్పందాలు చేసుకున్నాయి. 2021వరకు ఉల్లి దిగుమతి పన్ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో అసాధారణ రీతిలో రైతులకు, అదే మాదిరి వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు తెప్పించే పరిస్ధితి లేదు. అదే మన దేశంలో వ్యాపారులు ఇరువురినీ దోచుకుంటున్నా పట్టించుకొనే వారు లేరు. తాజాగా నిల్వలపై ఆంక్షలను ఎత్తివేయటం, దానికి వర్షాలు తోడు కావటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వాటిని అదుపు చేసేందుకు ఎగుమతిపై ఆంక్షలు.


చైనాలో రెండు నెలలుగా స్ధానికంగా కరోనా కేసులేవీ నమోదు కాకపోవటంతో అక్టోబరు ఒకటి నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దాదాపు 63 కోట్ల మంది వినోద, విహార యాత్రలు చేసినట్లు ప్రకటించారు. బంధువులు, స్నేహితులను కలిసిన సందర్భాలలో పండ్లను కానుకగా ఇవ్వటం చైనా సంప్రదాయాలలో ఒకటి.ఈ ఏడాది అసాధారణ డిమాండ్‌ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో దిగుమతి చేసుకున్న పండ్లకే ఎక్కువ ఆదరణ ఉంది. ద్రాక్ష ఉత్పత్తిలో, వినియోగంలో చైనా అగ్రస్ధానంలో ఉంది. ఈ కారణంగా మిగులు సమయాల్లో ఎగుమతులు, పంట అయిపోయిన తరువాత దిగుమతులు కూడా చేసుకుంటున్నది. ప్రపంచంలో 23 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా చైనాలో గత ఏడాది 10.8 మి.టన్నులు ఉత్పత్తి అయినట్లు అంచనా. మన దేశంలో మూడు మిలియన్‌ టన్నులకు అటూ ఇటూగా ఉంటోంది. చిలీ ప్రపంచ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది.

కూరగాయలు, పండ్లు తగినన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. ఆ మేరకు వినియోగించేందుకు అనువుగా ఉత్పత్తి ఉందా లేదా అన్నది కూడా చూడాలి, కొనుగోలు చేసే వారు లేనపుడు మిగులుగా కనిపించవచ్చు. అది ఆయా దేశాల బలహీనత తప్ప బలంగా చెప్పగలమా ? ప్రపంచ వ్యవసాయ సంస్ధ ప్రకటించిన తాజా సమాచారం (2016) ప్రకారం ప్రపంచ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో చైనా వాటా 39శాతం ఉంది. మన దేశం పదిశాతం, అమెరికా నాలుగుశాతం కలిగి ఉన్నాయి. చైనాలో 708 మి.టన్నుల ఉత్పత్తి జరిగింది. మన దేశంలో 2015లో పండ్లు, కూరగాయల ఉత్పత్తి 180 మి.టన్నులు. ఉత్పత్తిని బట్టి వినియోగాన్ని అంచనా వేసుకోవచ్చు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది లేదా మన పౌరుల కొనుగోలు శక్తి అలా ఉంది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. మన దేశంలో వారాల తరబడి అసలు కూరగాయల మొఖం ఎరగని కుటుంబాలున్నాయంటే అతిశయోక్తి కాదు.


ఆహార భద్రత, పోషకాహార లేమిని మన కంటే ఎంతో మెరుగ్గా చైనా అధిగమిస్తోందన్నది స్పష్టం. జనం ఆహారం తీసుకుంటున్నారా, పోషకాహారం కలిగి ఉన్నారా లేదా అనేందుకు దారిద్య్రం కొలబద్ద. 1981-2015 మధ్య చైనాలో దారిద్య్రం 0.7 శాతానికి తగ్గింది. మన దేశంలో 1987లో 48.9శాతం ఉంటే 2015 నాటికి 13.4శాతానికి తగ్గింది.1999-2005 మధ్య దారిద్య్ర నిర్మూలనలో చైనా ఆదాయ స్ధితిస్దాపకత 1.51ఉంది. అంటే ఆదాయం ఒకటి పెరిగితే దారిద్య్రం 1.51 తగ్గింది. ఇదే కాలంలో మన దేశంలో స్ధితిస్ధాపకత 0.4శాతం మాత్రమే ఉంది.దారిద్య్రం ఒకటికి 0.4 మాత్రమే తగ్గింది. దీనికి అనుగుణ్యంగానే 2002-04 నుంచి 2015-07 మధ్య ఆకలి, పోషకాహారం లేని వారు చైనాలో 15.9 నుంచి 8.8శాతానికి తగ్గితే ఇదే సమయంలో మన దేశంలో 22.2నుంచి 14.8కి తగ్గింది. ఐదేండ్ల లోపు పిల్లల పెరుగుదల ఆగిపోయిన వారు ప్రపంచ సగటు 23.2శాతం కాగా 2000-13 మధ్య చైనాలో 17.8 నుంచి 8.1శాతానికి పడిపోగా మన దేశంలో 2000-15 మధ్య 54.2 నుంచి 38.4కు తగ్గింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే చైనాలో 1980దశకంలో వ్యవసాయం బాగా అభివృద్ది చెంది జన జీవితాలను మార్చివేయగా మన దేశంలో ఆది జరగలేదు. ఇవన్నీ ఆయా దేశాలలో ఎలాంటి రాజకీయ వ్యవస్ధ ఉందని కాదు, జనం పట్ల జవాబుదారీతనంతో ఉన్నారా లేదా అన్నది ముఖ్యం.