ఎం కోటేశ్వరరావు
సినిమా గోలగా చెప్పాలంటే ఒక హీరో లేదా హీరో తమ తదుపరి చిత్రంలో చేసేందుకు అంగీకరించటమే సగం విజయమన్నట్లుగా కొందరు నిర్మాతలు తమ ఖుషీని ప్రకటిస్తారు. ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్‌గా నీరాజనాలందుకున్న ఖుషఉ్బ గతంలో డిఎంకె, కాంగ్రెస్ చిత్రాల్లో నటించి ఇప్పుడు బిజెపి సినిమాలో పని చేసేందుకు అంగీకరించారు. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా ఎంతో గొప్ప తారాగణంతో తీసిన సినిమాలను జనం ఇంటికి పంపిన చరిత్ర కూడా సినిమా రంగంలో నమోదైంది.
ఒక వ్యక్తిగా ఏ పార్టీలో చేరేందుకైనా ఉన్న హక్కును ఎవరికీ కాదనలేము. అయితే జనాలకు సుద్దులు చెబితేనే మండుతుంది.పార్టీలు ఫిరాయించేవారు చెప్పే ఇలాంటి కబుర్లు విని విని జనానికి బోరు కొట్టింది. నేను ఎన్ని పార్టీలైనా మారవచ్చు, మార్పు సహజం, మారాలి అని సెలవిచ్చిన ఆమె తన సిద్దాంతాలు మాత్రం మారలేదని చెప్పారు. హీరోయిన్‌గా ఎన్ని సంవత్సరాలైనా ఫిట్‌నెస్ మారలేదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాను అంటే నిర్మాతలు అంగీకరించవచ్చు, అలా చేస్తే ప్రేక్షకులు ఆదరించవచ్చు. కానీ రాజకీయాలు సినిమాలు కావు. కుష్‌బూ ఏ పార్టీలో చేరితో ఆమె చెప్పిన సిద్దాంతంతో ఆయా పార్టీలు మారిపోతాయా ? ఇంతకీ ఆమె సిద్దాంతం ఏమిటి ?
తన సిద్దాంతాలు లేదా భావజాలం మారలేదు అని చెబుతున్న కుష్‌బూ పెళ్లికి ముందు కన్యలు పవిత్రంగా ఉండాలనే చాదస్తాల నుంచి సమాజం బయటపడాలని, కోరుకున్న పురుషుడితో జీవించే స్త్రీ వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కూడా కనవచ్చంటూ గతంలో వెలిబుచ్చిన భావజాలానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆమె బిజెపి వేదికల మీద ప్రకటించగలరా ? గతంలో బిజెపి మీద చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటారా ? డిఎంకెతో రాజకీయాలను ప్రారంభించి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు బిజెపి కండువా కప్పుకున్నారు. రేపు మరొక పార్టీలోకి వెళ్లరనే గ్యారంటీ ఏముంది ? డొల్లు పుచ్చకాయలు, పార్టీలు మారేవారు ఒకే చోట ఉంటారా ? పార్టీ మారటానికి కొద్ది వారాల ముందు నరేంద్రమోడీది జుమ్లా సర్కార్ (అవసరానికి అనుగుణంగా మాట్లాడటం) అని చెప్పిన ఆమె ఇప్పుడు మాట మార్చితే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని తలూపేందుకు జనం గొర్రెలా ?
తమిళనాడులో నాలుగు సీట్లు సంపాదించుకోవటం ఎలా అనే యావలో బిజెపి ఉందన్నది బహిరంగ రహస్యం. దానిలో భాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ తలుపు తట్టింది. లేస్తే మనిషిని కాదు అని దారినపోయే వారిని బెదిరించే కుంటి మల్లయ్య సామెత మాదిరి ఇప్పటి వరకు రజనీ వైఖరి ఉంది. ఇంతవరకు లేచింది లేదు, ఇప్పుడు లేస్తారో లేదో తెలియదు. 1996 నుంచి ఏదో ఒక రూపంలో రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పటమో సూచనలు ఇవ్వటమో చేస్తున్నారు. 2021 ఎన్నికలలో తన సత్తా చూపేందుకు సిద్దం అవుతున్నారని కొన్ని కథనాలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. తానే ఒక పార్టీని పెడతానని కూడా 69 ఏండ్ల రజనీ కాంత్ ప్రకటించారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత ప్రకటిస్తారని చెబుతున్నారు.
సినిమా తారలు బిజెపిలో చేరటం కొత్తేమీ కాదు. గతంలో గౌతమి, నమిత, రాధారవి ఆ పార్టీలో చేరినా ఒరిగిందేమీ లేదు. కుష్‌బూ తమిళనాడులో పరిచయం అవసరం లేని స్టార్, మాట్లాడగల చాతుర్యం ఉంది. అందువలన వస్తారో రారో తెలియని రజనీ కోసం వేచి చూడటం కంటే ఆమెతో ప్రచారం చేయించుకోవచ్చని బిజెపి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.కుష్‌బూ డియంకె నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీకి పోయింది లేదు, కాంగ్రెస్‌లో చేరినపుడు కొత్తగా ఆ పార్టీకి పెరిగిందేమీ లేదు. ఇప్పుడు బిజెపికి కూడా ప్రచారానికి తప్ప ఓట్ల ప్రయోజనం కలగకపోవచ్చు. నేను ఇప్పుడే పార్టీలో చేరాను, ఆరునెలల తరువాత చూడండి అని విలేకర్లతో చేసిన వ్యాఖ్య బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కావచ్చు.
గతంలో కొన్ని అంశాల మీద ఆమె చేసిన వ్యాఖ్యల మీద బిజెపి లేదా హిందూమత శక్తులు సామాజిక మాధ్యమంలో ఎలా విరుచుకుపడ్డాయో, ఎన్ని కేసులు నమోదు చేశాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె బిజెపిలో చేరి సిద్దాంతాల గురించి చెప్పటాన్ని ఆశక్తులు ఎలా జీర్ణించుకుంటాయో చూడాల్సిందే. పచ్చిమితవాదులు ఆమెను అంగీకరిస్తారా ఆమె తన వైఖరిని మార్చుకుంటారా ? గతంలో ఆమె చేసిన బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారకుండా ఉంటాయా ? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడిన ఆమె ఈ ఏడాది మార్చినెల నుంచి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కుష్‌బూ పేరు నఖత్ ఖాన్ అంటూ ఆమె మతం గురించి బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్) దాడి చేసినపుడు అవును నేను ముస్లింగానే పుట్టాను, దాని గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరినపుడు ఆ పార్టీ తన భావజాలానికి సరిపడిందని చెప్పారు. మరి బిజెపి గురించి ఏమి చెబుతారు అంటే ఎవరైనా కులం, మతం, జాతి గురించి మాట్లాడితే నా రక్తం సలసల కాగుతుంది. నేను దేశభక్తురాలిని, లౌకికవాదిని కాషాయ, హిందూత్వవాదాలకు వ్యతిరేకం అని చెప్పారు. అలాంటి హిందూత్వవాదులతోనే ఆమె చేతులు కలిపారు.
ద్రవిడ కజగం పార్టీ స్దాపకుడు, హేతువాది, జీవితాంతం బ్రాహ్మణిజానికి, బ్రాహ్మలకు వ్యతిరేకంగా ఉన్న ఇవి రామస్వామి నాయకర్ మనవడైన సతీష్ కృష్ణన్ ఆగస్టు నెలలో అన్నాడిఎంకె నుంచి బిజెపిలో చేరారు. ఇలా కాంగ్రెస్, డిఎంకె, అన్నాడిఎంకె మూడు పార్టీలలో అసంతృప్తికి గురైన వారందరనీ చేర్చుకొనేందుకు బిజెపి తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యను పార్టీ యువజన విభాగ ఉపాధ్యక్షురాలిగా చేసి ఆ పార్టీలోకి చేర్చుకుంది. నా తండ్రిని చూసి కాదు, నేను ఏమిటన్నది చూడాలని ఆమె చెప్పుకుంది. నా తండ్రి మంచివాడని, జనాలకు సాయం చేసేవాడని నాకు చెప్పారని, తండ్రితో స్ఫూర్తి పొందానని విలేకర్లతో చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా ఎంఎల్‌ఏగా ఎన్నికైతే వారికి పార్టీ తరఫున ఒక ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ పార్టీ సమావేశంలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కనీసం 25 మంది ఎంఎల్‌ఏలను పార్టీ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని చెప్పారు. పార్టీ గెలుపుకోసం బాగా పనిచేసినట్లు గుర్తించిన వారికి తమిళనాడులో పార్టీలు బంగారు ఉంగరాలు, గొలుసులు బహుమతిగా ఇవ్వటం సాధారణ విషయం. బిజెపి మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా ఇన్నోవా కార్లనే ఎరగా చూపింది.
ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముఠాలు పార్టీలో ఆధిపత్యం మాదంటే మాదని కొట్టుకున్నాయి. అది ముదిరితే ఏదో ఒక వర్గం తమతో వస్తుందన్న ఆశలు ఒక దశలో బిజెపిలో కలిగాయి. అయితే తామిద్దరూ ఒకటేనని పళని స్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పని చేసేందుకు నిర్ణయించినట్లు అన్నాడిఎంకె ప్రకటించింది. అయితే ఆ సయోధ్య ఎన్నికల వరకు నిలుస్తుందా ఏమి జరుగుతుంది అనేది అప్పుడే చెప్పలేము.
2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 స్ధానాలకు పోటీ చేసిన బిజెపి 2.86శాతం ఓట్లు తెచ్చుకుంది. అన్నాడిఎంకెకు 40.88శాతం, డిఎంకె కూటమికి 39.1శాతం వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి 55శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది, 39కి గాను 38 సీట్లు గెలుచుకుంది. ఇంతే కాదు 216 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సంపాదించింది. అన్నా డిఎంకె కూటమి 16 చోట్ల మెజారిటీ తెచ్చుకోగా అన్నాడిఎంకె 12, పట్టలి మక్కలి కచ్చి 3, బిజెపి ఒక చోట ఆధిక్యత ప్రదర్శించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె కూటమిలో సీట్ల పంపకం పెద్ద సమస్యగాక పోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో తామే నాయకత్వం వహిస్తామని బిజెపి చెప్పుకోవటంపై అన్నాడిఎంకె గుర్రుగా ఉంది. ఎన్నికల నాటికి ఆ పార్టీ నేత శశికళ జైలు నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు. ఆమె ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-అన్నాడిఎంకె విడివిడిగా పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేసిన పట్టలి మక్కల్ కచ్చి 5.36 శాతం ఓట్లు తెచ్చుకుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి పిఎంకె, బిజెపి, తమిళమానిల కాంగ్రెస్ అన్నా డిఎంకె కూటమిలో చేరాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియదు. అన్నాడిఎంకె బలహీనపడిన కారణంగా గత పార్లమెంట్ ఎన్నికలలో 20 స్ధానాలకే పరిమితమై పిఎంకెకు 7, బిజెపికి ఐదు, డిఎండికెకు నాలుగు, మరో మూడు పార్టీలకు మూడు సీట్లు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరుగుతుందా ? అన్నాడిఎంకె తన సీట్లను సగానికి తగ్గించుకుంటుందా ?
మరోవైపు డిఎంకె కూటమిలో 2019 లోక్‌ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ డిఎంకె 138, కాంగ్రెస్ 49, సిపిఎం, సిపిఐ పన్నెండు చొప్పున, ముస్లింలీగ్ ఐదు చోట్ల ఆధిక్యత ప్రదర్శించింది. ఇంతటి భారీ విజయం సాధించిన కారణంగా డిఎంకెలో సీట్ల కోసం పోటీ పడేవారు సహజంగానే ఉంటారు. అసంతృప్తి చెందిన వారిని పిలిచి పార్టీ కండువాలు కప్పేందుకు అన్నాడిఎంకె, బిజెపి సిద్దంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలాల్లో పెను మార్పులు జరిగే పరిణామాలేవీ జరగలేదు. ఈ నేపధ్యంలో ఫలితాలు కూడా లోక్‌సభ మాదిరే ఉంటాయని భావిస్తున్నారు.