Tags

,


ఎం కోటేశ్వరరావు


హిందూ – ముస్లిం ఐక్యత ఇతివృత్తంతో టాటా గ్రూపు ఆభరణాల కంపెనీ తనిష్క రూపొందించిన ఒక వాణిజ్య ప్రకటనను వివాదాస్పదం కావించారు. దాంతో కంపెనీ దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తొలుత తమ ప్రకటనపై వ్యతిరేక, అనుకూలతలను వ్యక్తం చేసే వ్యాఖ్యలకు అవకాశం లేకుండా చేసింది. తరువాత ఏకంగా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే భారత ప్రకటనల ప్రమాణాల మండలి(ఎఎస్‌సిఐ) వెంటనే ఒక ప్రకటన చేస్తూ తనిష్క ప్రకటన ఏ ప్రమాణాలనూ ఉల్లంఘించనందున దాని మీద చేస్తున్న ఫిర్యాదులు నిలిచేవి కాదని, కావాలనుకుంటే ప్రకటనదారులు ప్రసారం చేసుకోవచ్చని పేర్కొన్నది. తనిష్క ప్రకటనలో ఎలాంటి అసభ్యత లేదా అసహ్యకరమైనదేమీ లేదని పేర్కొన్నది. ప్రకటనలు, మీడియా రంగంలో ఉన్న అనేక సంస్దలు ఇదే విధమైన మద్దతును ప్రకటించాయి. అయినా హిందూత్వశక్తులు దాడులకు దిగుతాయనే భయంతో ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
కొందరి మనోభావాలు దెబ్బతినటాన్ని గమనంలో ఉంచుకొని తమ ఉద్యోగులు, దుకాణ సిబ్బంది, భాగస్వాముల సంక్షేమం దృష్ట్యా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు తనిష్క తెలిపింది. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా గాంధీ ధామం పట్టణంలోని తనిష్క దుకాణంలో ఈ మేరకు ఒక ప్రకటనను కంపెనీ అంటించింది. దుకాణంపై కొందరు దాడికి దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొంత మంది దుకాణం వద్దకు వెళ్లి ప్రశ్నించారు తప్ప దాడి లేదా దుకాణ ధ్వంసం గానీ జరగలేదని, ఫోన్లద్వారా అనేక మంది నిరసన తెలిపారని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిని పలువురు నెటిజన్లు, ఖండించారు. ఈ ప్రకటనపై వెల్లడైన ధోరణి ఆందోళన కలిగిస్తున్నదని, ప్రకటనను రూపొందించిన వారికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ ప్రకటించింది.


ఇటీవలి కాలంలో రంధ్రాన్వేషణ చేసే శక్తులు ప్రతి దానిలో హిందూత్వకు హాని జరుగుతోందంటూ మనోభావాలను రెచ్చగొట్టేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. గర్భిణీతో ఉన్న హిందువు అయిన కోడలికి ఒక ముస్లిం కుటుంబం హిందూ సాంప్రదాయ ప్రకారం సీమంతం జరపటం, ఆ సందర్భంగా కోడలికి తనిష్క ఆభరణాన్ని బహుకరించే 44 సెకండ్ల ప్రకటనను తనిష్క కంపెనీ తయారు చేయించి విడుదల చేసింది. ముస్లిం యువకులు కుట్రతో హిందూ యువతులను ప్రలోభ పెట్టి వివాహాలు చేసుకొనటాన్ని -లవ్‌జీహాద్‌- ప్రోత్సహించేదిగా, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేదిగా ప్రకటన ఉందంటూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమంలో దాడికి దిగితే గాంధీ ధామం, ముంబై తనిష్క దుకాణాల వద్ద మతశక్తులు గుమికూడి నిరసన తెలిపినట్లు వార్తలు వచ్చాయి.


అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు హిందువులను వివాహాలు చేసుకున్నారు. పోనీ వారేమీ చదువు సంధ్యలు లేని లేదా మంచీ చెడ్డలు తెలియని వారు కాదు. అదే విధంగా కొందరు బిజెపి పెద్దలు ముస్లిం మతానికి చెందిన యువతులను తమ కుమారులకు ఇచ్చి వివాహాలు చేసినవారు కూడా ఉన్నారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు చేసుకోవటం తప్ప హిందూ అబ్బాయిలు ఎంత మంది ముస్లిం అమ్మాయిలను చేసుకున్నారో చెప్పండి అని కొంత మంది అడ్డు సవాళ్లు విసురుతారు. దీనిలో ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా ? వివాహం వ్యక్తిగతం, దానికి మతాన్ని ముడి పెట్టే దుష్ట యత్నంలో భాగమే లవ్‌ జీహాద్‌ ప్రచారం.
మతం ఒకటే అయినా హిందువులలో వేర్వేరు కులాల మధ్య జరుగుతున్న వివాహాలను కులపెద్దలు అంగీకరించకుండా పంచాయతీలతో విడదీయటం, దాడులు, హత్యలకు పాల్పడటాన్ని చూస్తున్నాము. మిర్యాలగూడెంలో అమృత-ప్రణరు, హైదరాబాదులో అవంతిక-హేమంత్‌ ఉదంతాలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. రెండు ఉదంతాల్లో హిందూ యువకులను చంపించింది హిందూ మత మామలే కదా ! ముస్లిం కుటుంబం హిందూ యువతికి సీమంతం జరపటానికి బదులు హిందూ కుటుంబం ముస్లిం యువతికి సీమంతం జరిపే విధంగా ఏకత్వ ప్రకటనను ఎందుకు రూపొందించలేదంటూ రంధ్రాన్వేషకులు తనిష్క ప్రకటన మీద అర్దం లేని, వితండ వాదనకు దిగారు. నిజానికి వారికి మతద్వేషం లేకపోతే ఆ ప్రకటనను సమర్ధించి రెండో విధంగా కూడా ప్రకటనలు రూపొందించి రెండు మతాల మధ్య సమదూరం పాటించాలని కంపెనీకి సలహా ఇవ్వవచ్చు, దానికి బదులు ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, తనిష్క ఆభరణాల కొనుగోలును బహిష్కరించాలని పిలుపు ఇవ్వటాన్ని ఏమనుకోవాలి ?


గతంలో కూడా కొన్ని ప్రకటనలను ఆధారం చేసుకొని హిందూమతోన్మాదాన్ని, ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. హిందూస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తి సర్ఫ్‌ఎక్సెల్‌ పౌడర్‌ గురించిన ప్రకటనలో స్నేహితులైన హిందూ బాలిక ముస్లిం బాలుడితో హౌలీ సందర్భాన్ని చిత్రించారు. దానిలో నువ్వు నమాజుకు వెళ్లిరా తరువాత రంగు పడుతుంది అని బాలిక అంటుంది. దాన్ని వక్రీకరించి హౌలీ పండుగ కంటే నమాజుకు ప్రాధాన్యత ఇచ్చారంటూ రంధ్రాన్వేషకులు దాడి చేశారు. ఇదే కంపెనీ తన రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్‌ ప్రకటనకు కుంభమేళాను ఇతివృత్తంగా ఎంచుకుంది. వృద్దుడైన తన తండ్రితో మేళాకు వెళ్లిన కొడుకు నుంచి జనం రద్దీలో తండ్రి విడిపోతాడు. కొద్ది సేపటి తరువాత కొడుకు దాన్ని గ్రహించి తండ్రిని వెతుక్కుంటూ వెళ్లి ఒక టీ స్టాల్‌ దగ్గర తండ్రిని కలుసుకుంటాడు. ఇద్దరూ టీ తాగుతూ ముసలి వారిని వదిలించుకొనే చోట నాకోసం తిరిగి వచ్చావంటూ కొడుకును తండ్రి అభినందిస్తాడు.


దీని మీద హిందువులు పవిత్రంగా భావించే కుంభమేళాను కించపరుస్తారా బహిష్కరించండి హిందుస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తులను అంటూ సామాజిక మాధ్యమంలో దాడికి దిగారు. దాని మీద ఆ కంపెనీ తన ప్రకటనను సమర్ధించుకుంది. ముసలి వారిని వదిలించుకొనేవాటిలో సకుంభమేళా స్ధలం ఒకటి. మన పెద్దవారి సంరక్షణ పట్టించుకోకపోవట విచారకరం కాదా ? అలాంటి చోట్ల చేతులు పట్టుకొని పెద్దవారిని తీసుకు పోవాలని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఆప్రకటనను రూపొందించామని, ఆ ప్రకటన చూడండి ఒక నగసత్యం గురించి కళ్లు తెరిపిస్తుంది అని పేర్కొన్నది. దానికి విపరీత అర్ధం చెబుతూ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.


మామూలుగానే వృద్దులను వదిలించుకొనే బాధ్యతా రహితులైన వారు నిత్యం మనకు దర్శనమిస్తుంటారు. ఉత్తరాదిలో కుంభమేళా సందర్భంగా కొందరు కావాలనే ముసలివారిని వదలి వేసి తమదారి తాము చూసుకుంటారన్నది నమ్మలేని నిజం. మేళా ముగిసిన తరువాత అలాంటి వారందరినీ వృద్దాశ్రమాలకు తరలిస్తారు. ఆ దుర్మార్గాన్ని ఖండించి, నిరసించాల్సింది పోయి ఒక సందేశాత్మక అంశంతో రూపొందించిన ప్రకటనకు మతానికి ముడిపెట్టటం దేశంలో మతోన్మాద భావనలను ఎంతగా మెదళ్లకు ఎక్కించారో స్పష్టం చేస్తున్నది.


కుంభమేళాలో ఇలాంటి దురాచారం, కొందరు బిడ్డల బాధ్యతా రాహిత్యం గురించి 2013 ఫిబ్రవరిలో నేషనల్‌ జాగ్రఫిక్‌ న్యూస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. తమ కుటుంబాల్లోని ముసలి వారిని వదిలించుకొనేందుకు కుంభమేళా కోసం ఎదురు చూసే వారు కూడా ఉంటారని అనుష్‌ మాలవీయ అనే ఒక సామాజిక కార్యకర్త చెప్పిన అంశాన్ని దానిలో పేర్కొన్నారు. వదలివేసినట్లు ఎవరూ అంగీకరించరు గానీ అది వాస్తవం అని అనుష్‌ చెప్పారు. అలా విస్మరణకు గురైన వారిలో తాము ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలియని వారు ఉంటారని, కొందరు వృద్దాశ్రమాల్లో చేరితే మిగిలిన వారు వీధులపాలై యాచకులుగా మారతారని చెప్పారు. వారణాసి, బృందావన్‌ ప్రాంతాల్లో వితంతు మహిళలను వదలివేసే దురాచారం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ పురాణం లేదా వేదాలు కూడా అనాధలైన వారిని ఇలా విస్మరించమని చెప్పలేదు.


తనిష్క ఏకత్వ ప్రకటనను వెనక్కు తీసుకోవటం గురించి సానుకూల విమర్శలు కూడా వెలువడ్డాయి. ఇలాంటి చర్యలు సామాజిక మాధ్యమంలోని మతోన్మాదులకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని ట్రస్ట్‌ రిసర్చ్‌ ఎడ్వజరీ సంస్ధ సిఇఓ ఎన్‌ చంద్రమౌళి చెప్పారు.భవిష్యత్‌లో మిగిలిన ప్రకటనదారులకు ఇదొక సంప్రదాయంగా మారుతుందన్నారు. ప్రకటన వెనక్కు తీసుకోవటం విచారకరమని, తనిష్క మీద ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రకటనను వెనక్కు తీసుకోవటం వలన మంచి కంటే మరింత నష్టం జరుగుతుందని మరో మీడియా అధిపతి సందీప్‌ గోయల్‌ అన్నారు. ఒక బ్రాండ్‌గా నమ్మిన దానికి నూటికి నూరుశాతం కట్టుబడి ఉండాలి, లేనట్లయితే అది తెచ్చిపెట్టుకున్నదని, వెన్నుముక లేదని అనుకోవాల్సి ఉంటుందన్నారు. తనిష్క తన ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిందని ఎక్కువ మంది ప్రకటనల రంగంలోని వారు అభిప్రాయపడ్డారు.


హిందువులను కించపరిచే ప్రకటనల పేరుతో ఆయా కంపెనీల వస్తువులను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న పిలుపులను వినియోగదారులు పట్టించుకుంటారా ? దానికి ఎలాంటి ఆధారాలు లేవు. పట్టించుకొనేట్లయితే చైనా వస్తువులను బహిష్కరించాలని కాషాయ తాలిబాన్లు నిత్యం పారాయణం చేస్తుంటారు. ఎందరు పట్టించుకున్నారు ? నరేంద్రమోడీ హయాంలో వాటి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. అలాంటి పిలుపు ఇచ్చే వారు వాడే సెల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్లలో చైనావే ఎక్కువగా ఉంటున్నాయి లేదా చైనా విడిభాగాలు లేని పరికరాలు దాదాపుగా లేవు. అయితే అలాంటి ప్రచారం మెదడు ఉపయోగించని లేదా సరిగా ఎదగని వారి బుర్రలను ఖరాబు చేసేందుకు పనికి వస్తాయి.