ఎం కోటేశ్వరరావు
ఈ నెల 18, ఆదివారం నాడు జరిగిన బొలీవియా అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష ” మాస్ ” పార్టీ విజయం సాధించింది. పోలింగ్ అనంతర సర్వేలో 53శాతం ఓట్లతో వామపక్ష అభ్యర్ధి లూయిస్ ఆర్‌సి విజయం సాధించనున్నట్లు వెల్లడైంది. ఇది రాస్తున్న సమయానికి 40శాతం ఓట్ల లెక్కింపు జరిగినట్లు ఆర్‌సి 45శాతంతో ముందుండగా 35శాతం సాధించిన ప్రత్యర్ధి మాజీ అధ్యక్షుడు కార్లోస్ మెసా తన ఓటమిని అంగీకరించినట్లు వాయిస్ అమెరికా తెలిపింది. ఎన్నికలలో విజేతను గుర్తిస్తానని, విజయాన్ని గుర్తించటమే ప్రజాస్వామ్యానికి తగినదన్నారు. ఎన్నికలలో లూయీస్ ఆర్‌సి విజయాన్ని ఇరాన్ అభినందించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఈ మేరకు ఒక ప్రకటన చేశాడు. బొలీవియాలో సంబంధాలను పునరుద్దరించి పటిష్ట పరుచుకొనేందుకు సిద్దమని చెప్పాడు.
పట్టణ ప్రాంతాల ఓట్లు తొలుత లెక్కించగా ఇద్దరూ పోటా పోటీగా ఉన్నారని, ఇవో మొరేల్స్ నాయకత్వంలోని ‘మాస్’ (మువ్‌మెంట్ ఫర్ సోషలిజం-సోషలిజం కోసం ఉద్యమం) పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని పట్టు ఉన్నందున మెజారిటీ పెరగనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం తొలి దఫాలోనే యాభైశాతంపైగా తెచ్చుకున్నా లేదా నలభైశాతంపైగా తెచ్చుకొని ప్రత్యర్ధికంటే పదిశాతం కంటే మెజారిటీలో ఉన్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే తొలి రెండు స్ధానాల్లో ఉన్న అభ్యర్ధుల మధ్య రెండవ దఫా ముఖాముఖీ పోటీ నిర్వహిస్తారు.
అనేక కుట్రలు, కరోనా కారణంగా మూడు సార్లు వాయిదా పడి చివరకు ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 25నాటికి పూర్తై ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఏడాది క్రితం పోలీసులు, మిలిటరీ, మితవాద రాజకీయశక్తులు కలసి పన్నిన కుట్ర కారణంగా ఎన్నికల్లో విజయం సాధించిన మాస్ నేత ఇవోమొరేల్స్ పదవికి రాజీనామా చేసి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఎన్నికలు జరిగే రోజు వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నందున అధికారికంగా ప్రకటించే వరకు ఓట్ల లెక్కింపులో అక్రమాలు, ఇతరంగా కుట్రలు జరిపి ఫలితాలను తారు మారు చేసే అవకాశాలను ఇప్పటికీ తోసి పుచ్చలేము. ఎగ్జిట్ పోల్స్ కార్యరూపం దాల్చితే గతేడాది ఇవో మొరేల్స్ కంటే ఎక్కువ ఓట్లతో మాస్ పార్టీ విజయం సాధించనుంది.
ఆదివారం నాడు ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వే ఫలితాలను వెల్లడించేందుకు పౌర సమాజం, కాథలిక్ చర్చి ఏర్పాటు చేసిన స్వతంత్ర సర్వే సంస్ధలు, మీడియాకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వకపోవటం, తొలి లెక్కింపు వివరాలను వెల్లడించకపోవటం అనేక అనుమానాలకు దారితీసింది. అక్రమ పద్దతుల్లో గద్దెనెక్కిన అమెరికా అనుకూల తాత్కాలిక అధ్యక్షురాలు జీనీ అనెజ్ బలపరచినట్లు ప్రచారం జరిగిన అభ్యర్ధికి కేవలం 14శాతమే వస్తాయని తేలటంతో ఆమె ఓటమిని అంగీకరించటం, ఇతర ప్రతికూల పరిణామాలేవీ లేకపోవటంతో మాస్ తిరిగి అధికారాన్ని చేపట్టటం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ అమెరికా అనుకూల శక్తుల కుట్రలను ఊహించలేము.
కొన్ని చోట్ల తగిలిన ఎదురు దెబ్బల తరువాత ఈ ఎన్నికల ఫలితాలు మొత్తం లాటిన్ అమెరికా వామపక్ష శక్తులకు వచ్చిన అతిపెద్ద విజయం, మితవాద శక్తులకు, దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికాకూ పెద్ద ఎదురుదెబ్బ. అంతే కాదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల వామపక్ష శక్తులకు ఎంతో ఉత్తేజమిచ్చే పరిణామం. ఈ ఫలితాలు అమెరికా పెత్తందారీ పోకడలకు చెంపదెబ్బ. నవంబరు మూడవ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పలుకుబడిని మరింతగా దెబ్బతీస్తాయి. ఎగ్జిట్, ఓట్ల లెక్కింపు తొలి ఫలితాలు వెలువడగానే రాజధాని లాపాజ్‌లో మాస్ పార్టీ మద్దతుదారులు సంబరాలను ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని గమనంలో ఉంచుకొని జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాస్ అభ్యర్ధి ఆర్‌సి ప్రకటించారు. పార్టీ మద్దతదారులు, ఇతరులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
కోటీ పదహారు లక్షల మంది జనాభా ఉన్న బొలీవియాలో స్ధానిక గిరిజన తెగల జనాభా మెజారిటీ ఉన్నప్పటికీ, స్పెయిన్ వలస, స్వతంత్ర పాలన ఐదువందల సంవత్సరాలలో 2006లో ఇవోమొరేల్స్ విజయం సాధించే వరకు మెజారిటీ సామాజిక తరగతికి చెందిన వారు పాలనా పగ్గాలు చేపట్టలేకపోయారు. మొరేల్స్ గత ఏడాది జరిగిన ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలో కుట్ర చేసి ఎన్నికల ఫలితాలను గుర్తించేందుకు నిరాకరించటంతో పాటు పార్లమెంట్ ద్వారా తాత్కాలిక అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. తాను తిరిగి ఎన్నికలను నిర్వహిస్తానని, కొత్త ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని మొరేల్స్ చెప్పినా అంగీకరించలేదు. రాజీనామా చేయాలని, తదుపరి అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనేందుకు వీల్లేదని మిలిటరీ అధికారులు ఆదేశించారు. చివరకు అరెస్టు చేసి జైలు పాలు చేసే కుట్రను గ్రహించి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందారు. మొరేల్స్ అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు, పార్లమెంట్ అభ్యర్ధిగా కూడా పోటీ చేయకూడదని కుట్రదారుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలలో ఆయన ప్రభుత్వంలో పదేండ్లకు పైగా ఆర్ధిక మంత్రిగా పని చేసిన లూయీస్ ఆర్‌సి అభ్యర్ధిగా ఎంపికయ్యాడు. ఎన్నికల ఫలితాల సరళి వెలువడగానే తాను స్వదేశానికి రానున్నట్లు మొరేల్స్ ప్రకటించాడు. మొరేల్స్ మీద చేసిన ఆరోపణలను జనం విశ్వసించలేదని ఓటింగ్ తీరుతెన్నులు స్పష్టం చేశాయి.
వామపక్షాల స్ధానంలో అధికారానికి వచ్చిన మితవాద శక్తులు అంతకు ముందు అమలు జరిపిన సంక్షేమ చర్యలకు ఎలా గండికొడుతున్నారో చూసిన తరువాత బొలీవియన్లు మితవాదుల ప్రచారాన్ని పట్టించుకోలేదన్నది స్పష్టం అవుతోంది. అయితే నయావుదారవాద పునాదులను బద్దలు చేయకుండా వాటి మీద ఆధారపడి తీసుకొనే సంక్షేమ చర్యలకు పరిమితులు ఏర్పడి జనంలో అసంతృప్తి తలెత్తుతున్నట్లు అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. బొలీవియాలో ఏర్పడనున్న నూతన మాస్ ప్రభుత్వం ప్రతిపక్షం, అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రల మధ్య ఆ సవాళ్లను ఎలా స్వీకరించనున్నది చూడాల్సి ఉంది.
ఇవో మొరేల్స్‌ను ఆధికారం నుంచి తొలగించటం లాటిన్ అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మూలమలుపు అని డోనాల్డ్ ట్రంప్ వర్ణించిన విషయం తెలిసిందే. కానీ అదే ట్రంప్ హయాంలో మాస్ ప్రతినిధి తిరిగి అధికారాన్ని చేపట్టబోతున్నాడు. అధికారంలో ఉండి ఓడిపోయిన అధ్యక్షుడిగా అదే ట్రంప్ చరిత్ర చెత్తబుట్టకు ఎక్కనున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ఎలాంటి పరిహాస ప్రాయమైన వాదనలతో కుట్రదారులు వ్యవహరిస్తారో బొలివీయా పరిణామం స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో లెక్కింపు ప్రారంభంలో ప్రత్యర్ధికంటే ఇవోమొరేల్స్ మెజారిటీ 7.87శాతమే ఉందని, తరువాత 10.15శాతంగా ప్రకటించారని, తరువాత దాన్ని 10.52కు పెంచి మొరేల్స్ గెలిచినట్లు ప్రకటించారని ఆక్రమాలకారణంగానే ఇలా జరిగిందని అమెరికా కనుసన్నలలో నడిచే అమెరికా దేశాల సంస్ధ (ఓఏఎస్) ఆరోపించింది. ఎన్నికలకు ముందే ఈ సంస్ధతో పాటు ఐరోపా దేశాల ప్రతినిధులు అక్రమాల గురించి ప్రచారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగులేని మెజారిటీకారణంగానే గత ఎన్నికలలో చివరిలో మోరెల్స్ అవసరమైన మెజారిటీ సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా అదే ధోరణి వ్యక్తమైనట్లు వచ్చిన వార్తలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది మాస్‌కు మెజారిటీ వస్తున్న సమయంలో వివరాలను వెల్లడించకుండా నిలిపివేసి తరువాత ప్రకటించటంతో పెద్ద తేడా రావటాన్ని కూడా ఎన్నికల అక్రమంగానే కుట్రదారులు ఆరోపించారు. అయితే తరువాత వాటికి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయారు.
తాజా ఎన్నికలో మాస్ పార్టీ విజయం సాధించనుందని తొలి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. మితవాద శక్తుల మధ్య ఉన్న వివాదాలను సర్దుబాటు ఒకే అభ్యర్ధిని పోటీకి నిలపాలని ప్రయత్నించారు. అయితే రెండవ అభ్యర్ధి రంగంలోకి దిగాడు. తొలి విడత ఎవరికీ మెజారిటీ వచ్చే అవకాశం లేదనే అంచనాతో దిగిన మితవాద శక్తులకు మలివిడత ఎన్నికలతో పని లేకుండానే బొలీవియన్లు నిర్ణయాత్మక తీర్పునిచ్చారు. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేల ప్రకారం ఆర్‌సికి 42.3, మెసాకు 33.1, మూడవ అభ్యర్ధికి 16.7శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. మెసాకు మద్దతుగా అనెజ్ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గత ఏడాది మొరేల్స్‌కు 47శాతం వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లూయీస్ ఆర్‌సికి 52.4శాతం, కార్లోస్ మెసాకు 31.5, మూడవ పార్టీకి 14.1శాతం వస్తాయని వార్తలు వెలువడ్డాయి.
గతంలో తాము నడచిన బాటనే ముందుకు పోవాలని దేశ ప్రజలు ఈ తీర్పు నిచ్చారని ఆర్‌సి వర్ణించారు. ఇవో మొరేల్స్ మాదిరి ప్రజా ఉద్యమాల నుంచి నేతగా ఆవిర్భవించనప్పటికీ ఒక మేథావిగా మాస్ ఎత్తుగడలు, విధానాలను నిర్ణయించటంలో ఆర్‌సి కీలకపాత్ర వహించారు. అనేక సంస్కరణలకు కీలకవ్యక్తిగా మారటమే కాదు మొరేల్స్ తరువాత ప్రజల అభిమానం పొందారు. గత ఏడాది కాలంలో కుట్రదారుల ప్రభుత్వం అనుసరించిన అక్రమాలు, అవినీతి కారణంగా బొలివీయన్లు రెండు ప్రభుత్వాల మధ్య తేడాను గమనించారు. 2002 నుంచి జరిగిన బొలీవియా ఎన్నికలు, అనంతర పరిణామాలను చూసినపుడు రెండు శిబిరాలుగా రాజకీయ సమీకరణలు జరిగాయి. తాము వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చినపుడు వారికి సమస్యలు సృష్టించేందుకు మితవాదులు చేయని ప్రయత్నం లేదు. గత ఏడాది ఇవో మొరేల్స్‌ను అడ్డుకోవటం పరాకాష్ట. ఈ కారణంగానే ఈ సారి కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని, ఏదో ఒకసాకుతో మిలిటరీ రంగంలోకి దిగవచ్చని జోశ్యం చెప్పిన వారు కూడా ఉన్నారు.
మాస్ పార్టీ నేతగా ఇవో మొరేల్స్ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన కొచబాంబా ప్రాంతం ఉన్న చపారే రాష్ట్రంలో, ఇతర చోట్ల పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గత ఏడాది కాలంలో తాత్కాలిక ప్రభుత్వం పాల్పడని తప్పుడు పని లేదు. సంఘవ్యతిరేక శక్తులను ప్రోత్సహించి మాస్ కార్యకర్తల మీద, సామాన్య జనం మీద దాడులు చేయించారు. చమురు ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం కలిగించారు. మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో పోలీసులతో గ్రామాల మీద దాడులు చేయించారు. మిలిటరీని ప్రయోగించి భయపెట్టారు. మొరేల్స్ వ్యతిరేకులకు పెద్ద ఎత్తున నిధులు అందచేసి తప్పుడు ప్రచారం చేయించారు. ఈ ఎన్నికల్లో అనేక మంది మాస్ అభ్యర్దులను పోటీకి అనర్హులుగా ప్రకటించారు. పోటీలో ఉన్నవారి మీద పోలీసు దాడులు చేయించారు. అంతెందుకు అధ్యక్ష పదవికి పోటీపడిన ఆర్‌సిని అనేక సార్లు అనర్హునిగా ప్రకటిస్తామని బెదరించారు. మితవాద శక్తులు ఎన్నికల సంఘం మీద వత్తిడి తెస్తూ నిరసన ప్రదర్శనలకు దిగాయి. మీడియా సంగతి చెప్పనవసరం లేదు. మాస్ పార్టీకి వ్యతిరేకంగా మితవాదశక్తులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఉన్నది ఉన్నట్లు రాస్తారు, చూపుతారు అని అనుమానం వచ్చిన స్దానిక, విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు విధించారు. టెలిసుర్, ఆర్ టీవీ ఛానల్స్ ప్రసారాల అనుమతులను రద్దు చేశారు.పదిహేను సామాజిక రేడియోలను మూయించారు. కొందరు జర్నలిస్టుల మీద కుట్ర అనుకూల మూకలను ఉసిగొల్పారు.
అన్నీ సక్రమంగా జరిగితే కొత్తగా తిరిగి ఏర్పడే మాస్ ప్రభుత్వ ప్రమాణస్వీకారం పెద్ద ఎత్తున జరిపే అవకాశాలున్నాయి. క్యూబా,వెనెజులా, నిగరాగువా మరికొన్ని దేశాల ఆధినేతలు అతిధులుగా అర్జెంటీనా ప్రవాసం నుంచి తిరిగి వచ్చే ఇవోమోరేల్స్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చునని చెబుతున్నారు. అయితే అమెరికా సామ్రాజ్యవాదులు ఈ పరిణమాన్ని సహిస్తారా ? మాస్ విజయాన్ని వమ్ము చేయకుండా ఉంటారా ?