Tags

, ,


ఎం కోటేశ్వరరావు


గత ఏడాది చలికాలంలో ఉల్లి ధరలు కొన్ని చోట్ల కిలో రూ.160 నుంచి 180వరకు పలికాయి. తిరిగి ఈ ఏడాది అదే పునరావృతం కానుందా ? ధరల పెరుగుదల తీరు అదే ధోరణిలో ఉంది. ఉల్లి ధరల గురించి గత ఏడాది డిసెంబరులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ సభ్యురాలు సుప్రియా సూలే పెరిగిన ఉల్లి ధరల గురించి ఒక ప్రశ్న అడిగారు. సమాధానం పూర్తయిన తరువాత ఒక సభ్యుడు మీరు ఈజిప్షియన్‌ ఉల్లిపాయలు తింటారా అని అడిగారు. దానికి ఆమె నేను పెద్దగా ఉల్లి, వెల్లుల్లి తినని కుటుంబం నుంచి వచ్చాను కనుక మీరు ఆందోళన చెందవద్దు అని చెప్పారు. ఈ మాటలను వేరే విధంగా వక్రీకరించారని బిజెపి ఉడుక్కుంది. నేను పెద్దగా తినను గనుక ధరలు పెరుగుతాయని మీరు ఆందోళన పడవద్దు అన్న అర్ధం ఆమె మాటల్లో స్పురించింది. ఈజిప్షియన్‌ ఉల్లి రకాలను తినేందుకు మన జిహ్వలు అంగీకరించవు, బహుశా అలాంటివి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు అనే ఉద్దేశ్యంతో కూడా ఆ సభ్యుడు అడిగి ఉండవచ్చు.


కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నుంచి ఉల్లిధరలు పెరుగుతున్నాయి.అయినప్పటికీ అక్టోబరు 18వరకు గత ఏడాది కంటే తక్కువే ఉన్నాయి. గతేడాది దేశవ్యాపిత సగటు ధర కిలో రూ.46.33 కాగా పదిరోజుల్లో కిలోకు రూ.11.56 పెరిగి చిల్లర ధర 51.95కు పెరిగింది(ట).(అదెంత వరకు వాస్తవమో వినియోగదారులకు తెలుసు కనుక వారికే వదలి వేద్దాం. ఉల్లి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కిలో ఉల్లి కొంటే సగం పనికిరాని వాటి గురించి చెబుతున్నదేమో తెలియదు.) ముందస్తు చర్యగా సెప్టెంబరు 14న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వచేసిన ఉల్లిని విడుదల చేస్తున్నది. రాబోయే రోజుల్లో మరింతగా విడుదల ఉంటుంది.డిసెంబరు 15వరకు దిగుమతులను సులభతరం చేస్తూ 2003 నాటి ఉత్తరువులను కేంద్ర ప్రభుత్వం సడలించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే సరకుతో వచ్చే తెగులు, ఇతర వాటి నివారణకు దిగుమతి చేసుకొనే ఉల్లిని శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలను (ఫ్యూమిగేషన్‌ ) ఓడలకు ఎక్కించే చోట గాకుండా మన దేశంలో దిగుమతి చేసే చోట చేపట్టేందుకు కూడా సవరణలు చేసింది. దిగుమతులు ఆలస్యం కాకుండా చూసేందుకు ఈ చర్య అని చెబుతున్నారు. ఇది సక్రమంగా జరగకపోతే కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
గత ఏడాది అక్టోబరు 20వ తేదీన ఉల్లి ధరలతో పోలిస్తే అదే రోజున ఈ ఏడాది 12.13శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం చెప్పినదాన్ని బట్టి ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నది ప్రభుత్వ ప్రకటన సారంగా చెప్పుకోవాలి. ఉల్లి, పప్పుధాన్యాలు, ఖాద్యతైలాలు, నూనె గింజలు, తృణధాన్యాలు, బంగాళాదుంపల నిల్వలకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి పరిమితులు ఉండవు, ఎన్నయినా చేసుకోవచ్చని తాజా చట్ట సవరణ తెలిపింది. అయితే మరి నియంత్రణ ఎప్పుడు అంటే నిల్వ ఉండని తోట పంటల ఉత్పత్తుల (ఉల్లి, బంగాళాదుంప) ధరలు వందశాతం, ఇతర నిల్వ ఉండే ఆహారవస్తువుల ధరలు యాభై శాతం పెరిగినపుడు మాత్రమే ప్రభుత్వాలు నియంత్రణలను అమల్లోకి తెస్తాయి. మరి ధరల పెరుగులను ఎలా లెక్కిస్తారు.


గత పన్నెండు నెలలు లేదా గత ఐదు సంవత్సరాల మార్కెట్‌ సగటు ధరలను తీసుకొని వాటిలో ఏవి తక్కువగా ఉంటే వాటితో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చి ధరల పెరుగుదల ఎంత ఉందో నిర్ణయించి దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. ఉల్లి ధరలు గత పన్నెండు నెలల్లో కిలో సగటున రూ.40, ఐదేండ్ల సగటు రూ.35 అనుకుందాం. తక్కువ 35 రూపాయలు కనుక వందశాతం అంటే 70రూపాయలు దాటినపుడు మాత్రమే ప్రభుత్వం నిల్వల మీద నియంత్రణలు విధిస్తుంది. గత ఏడాది 40 నుంచి ఇప్పుడు 65కు పెరిగినా ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం పైన చెప్పిన విధంగా గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల 12.13శాతమే, గత ఐదేండ్ల సగటు ఇంకా తక్కువ ఉంటుంది. కనుక ఇప్పట్లో ఉల్లిధరల నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోదన్నది స్పష్టం. ఈ లెక్కలు వ్యాపారుల జేబులు నింపటానికా వినియోగదారుల పర్సులను కొల్లగొట్టటానికా ?


మన దేశంలో ఏడాదికి ఉల్లి మూడు పంటలు పండుతుంది. వేసవి పంట ఏప్రిల్‌లో, ఖరీఫ్‌ తొలి పంట సెప్టెంబరు, ఖరీఫ్‌ రెండవ పంట నవంబరు తరువాత మార్కెట్‌కు వస్తుంది. వర్షాలు, వాటితో వచ్చే తెగుళ్ల కారణంగా కొంత పంటనష్టం జరిగిందని, పదిశాతం ఉల్లివిత్తనాల కొరత, రబీ పంటలో నిల్వచేసినదానిలో 35శాతం పాడైపోవటం ప్రస్తుత ఉల్లిధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. ఉల్లి వ్యాపారం మొత్తం ప్రయివేటు వ్యాపారుల చేతుల్లోనే ఉంది. గత ఏడాది ధరలు పెరిగి సొమ్ము చేసుకున్న వ్యాపారులు మూడోవంతు పంట పాడైపోయేంత అసమర్ధంగా నిల్వలు చేసుకుంటారంటే నమ్మేదెలా ? వీటి కంటే అసలు కారణం ఈ ఏడాది జూన్‌లోనే ఆర్డినెన్స్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిల్వలపై నియంత్రణలు ఎత్తివేసిన వాటి జాబితాలో ఉల్లి ఉండటం, రాబోయే రోజుల్లో కొరత ఏర్పడనుందని వ్యాపారులు ఊహించటం లేదా నియంత్రణ నిబంధనలు లేవు కనుక కృత్రిమ కొరత సృష్టించటం ప్రధాన కారణం అన్నది స్పష్టం.


ప్రపంచంలో ఉల్లి సాగు విస్తీర్ణం మన దేశంలో ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువ కారణంగా చైనా తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ ఉత్పత్తి చేస్తూ మొదటి స్ధానం ఆక్రమించింది. మూడవ స్ధానంలో ఒక ఏడాది అమెరికా ఉంటే మరో ఏడాది ఈజిప్టు ఉంటోంది. భారత్‌, చైనా రెండూ కూడా సాధారణ పరిస్ధితిలో అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. మనం పదిశాతం ఎగుమతులు చేస్తున్నాము.ధరలు పెరిగినపుడు నిషేధిస్తున్నాము. విధానాల మీద చర్చను వెనక్కు నెట్టే క్రమంలో అనేక అంశాలను రాజకీయ పార్టీలు ముందుకు తెచ్చాయి. వాటిలో ఉల్లి ఒకటి. గత నాలుగు దశాబ్దాలుగా తరచూ ఉల్లి రాజకీయాలు ముందుకు వస్తున్నాయి.1980లోక్‌ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేత ఇందిరా గాంధీ ఉల్లిని ఎన్నికల సమస్యగా ముందుకు తెచ్చారు. తరువాత కూడా ఎన్నికల సమయంలోనూ తరువాత ప్రతిపక్షాల అస్త్రంగా మారింది.1998లో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉల్లి ధరల కారణంగానే ఓడిపోయిందని విశ్లేషించారు. తరువాత కాలంలో ఎవరు అధికారంలో ఉన్నా సత్పరిపాలనకు ఉల్లి ధరలు ఒక గీటురాయిగా మారాయంటే అతిశయోక్తి కాదు.


2015లో కేంద్ర ప్రభుత్వం ధరల స్ధిరీకరణ నిధిగా 500 కోట్లను ఏర్పాటు చేసింది. ఆ నిధితో దిగుమతి చేసుకున్న లేదా స్ధానికంగా సేకరించిన సరకు ధరలో రాష్ట్రాలు సగం మొత్తాన్ని కేంద్రానికి చెల్లించి ఉల్లిపాయలను కొనుగోలు చేసి మార్కెట్‌ ధరలకంటే తక్కువకు విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇది ధరల మీద పెద్ద ప్రభావం చూపటం లేదు. గతేడాది దిగుమతి చేసుకున్న ఉల్లి సరైన గోదాము సౌకర్యాలు లేక పాడైపోయినట్లు వార్తలు వచ్చాయి. దాంతో అయినకాడికి తెగనమ్మి ప్రభుత్వం సొమ్ముచేసుకొనేందుకు ప్రయత్నించింది. దిగుమతి చేసుకున్న ఉల్లి ధర 45-50 రూపాయలు పడితే దాన్ని పది-పదిహేను రూపాయలకే అమ్మాల్సి వచ్చింది.
ధరల స్ధిరీకరణ చర్యల్లో భాగంగా గతేడాది నాఫెడ్‌ 52వేల టన్నుల ఉల్లిని మహారాష్ట్ర, గుజరాత్‌లో కొని నిల్వచేసింది. ఆగస్టులో బహిరంగ మార్కెట్‌లో కిలో 40 రూపాయలు దాటినపుడు దానిలో సగాన్ని రాష్ట్రాలకు విక్రయించింది. వర్షాలకు గోదాముల్లో నీరు చేరటంతో మిగిలిన సగం సరకు పాడైపోతున్నట్లు గుర్తించి బహిరంగ మార్కెట్లో ఎంతవస్తే అంత అన్న ప్రాతిపదికన విక్రయించింది. సరైన నిల్వ ఏర్పాట్లు కూడా చేయలేని నిర్లక్ష్యాన్ని ఈ ఉదంతం వెల్లడించింది.


గత ఏడాది కూడా సెప్టెంబరు చివరి వారంలో ఎగుమతులపై నిషేధం విధించింది.నిల్వ పరిమితులను చిల్లర వ్యాపారులకు వంద నుంచి ఇరవై క్వింటాళ్లు, హౌల్‌సేలర్స్‌కు 500 నుంచి 250కి తగ్గించినప్పటికీ ధరలు తగ్గలేదు, నవంబరు, డిసెంబరు మాసాల్లో 150రు.ల వరకు పలికింది. లక్షా 20వేల టన్నులు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించి,42వేల టన్నులకు టెండర్లు ఖరారు చేసి తరువాత ఐదువేల టన్నులకు రద్దు చేసి చివరికి 37వేల టన్నులు దిగుమతి చేసుకున్నారు. రకరకాల కారణాలు తోడై దిగుమతులు ఆలస్యం కావటంతో లక్ష్యం నీరుగారిపోయింది. అవి వచ్చే సమయానికి స్దానిక మార్కెట్లో ధరలు పడిపోయాయి. దాంతో అంతకు ముందు తమకు 33వేల టన్నులు కావాలన్న రాష్ట్రాలు దిగుమతి సరకు ధరలు ఎక్కువగా ఉండటంతో తమ ఆర్డర్లను సగానికి తగ్గించుకున్నాయి. వాటిని కూడా పూర్తిగా తీసుకుపోలేదని, ముంబై రేవులో కుళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమంటే ఇదే సమయంలో ప్రయివేటు వ్యాపారులు 75వేల టన్నులను వేగంగా దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్దిపొందారు.
దేశాల మధ్య ఉల్లి దౌత్యపరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దులో విబేధాల కారణంగా చైనా పెట్టుబడులు, దిగుమతుల మీద ఆంక్షలు విధించిన కేంద్రం టర్కీ విషయానికి వస్తే అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఆర్టికల్‌ 370 రద్దు విషయాన్ని టర్కీ బహిరంగంగానే విమర్శించింది. అయినా గత ఏడాది పదకొండువేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నాము. మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఒక సమావేశంలో మాట్లాడుతూ మన విదేశాంగవిధానంలో వేగంగా మార్పులు వస్తున్నప్పటికీ వస్తువుల విషయానికి వచ్చినపుడు ఆర్ధిక విషయాలే ప్రధాన నిర్ణాయక శక్తిగా ఉంటాయని చెప్పారు.


మన దేశం ఉల్లి ఎగుమతి, దిగుమతి విధానాల్లో తరచూ చేస్తున్న మార్పులు సంప్రదాయంగా మన నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. ఒక నిలకడ లేనికారణంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నిషేధం కారణంగా ప్రధాన దిగుమతిదారైన బంగ్లాదేశ్‌ తీవ్రంగా ప్రభావితమైంది. దాంతో వచ్చే ఏడాది మార్చి వరకు చైనా నుంచి దిగుమతులు చేసుకోవాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై తాజా నిషేధం తాజాగా నిత్యావసర సరకుల చట్టానికి చేసిన సవరణకు విరుద్దమనే విమర్శలు వ్యాపారుల నుంచి వచ్చాయి.ఎగుమతుల ద్వారా రైతాంగాన్ని ఉద్దరిస్తామని చెప్పిన వారు ఇలా చేయటం ఏమిటని ఇతరులు కూడా విమర్శించారు. ఇది ఉల్లి తరుణం కాదు. త్వరలో మార్కెట్‌కు రానుంది. ఇప్పుడు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ధరలు రేపు రైతాంగానికి అదే పని చేస్తాయా ? పాలకులు రైతాంగాన్ని ఆదుకుంటారా ? గత ఏడాది జరిగింది పునరావృతం అవుతుందా ?