Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అనేక అనుమానాలు, సందేహాలకు తెరదించుతూ శుక్రవారం(అక్టోబరు 23వ తేదీ) రాత్రి లాటిన్‌ అమెరికా దేశమైన బొలీవియా ఎన్నికల సంఘం అధ్యక్ష, పార్లమెంట్‌ ఉభయ సభల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీనేత ఇవోమొరేల్స్‌ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్ధారణ అయింది. అమెరికా పన్నిన కుట్రలో భాగంగా నానా యాగీ, ఆరోపణలు చేసిన అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) పరువుపోయింది. దాని ప్రధాన కార్యదర్శి ఆల్‌మాగ్రో రాజీనామా చేయాలనే వత్తిడి పెరిగింది. తమ మద్దతుదార్లను అడుగడుగునా రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన వలలో చిక్కకుండా మాస్‌ పార్టీ నాయకత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అనేక చోట్ల కార్యకర్తలు, నేతలపై దాడులు, తప్పుడు కేసులతో వేధించటం, ఆ పార్టీకి తిరుగులేని పట్టు ఉన్న ప్రాంతాలకు పెట్రోలియం ఉత్పత్తుల వంటి వాటిని సరిగా సరఫరా చేయకపోవటం వంటి అనేక అక్రమాలకు తాత్కాలిక ప్రభుత్వం పాల్పడింది.


మాస్‌ పట్ల జనంలో తిరుగులేని విశ్వాసం వ్యక్తం కావటం ప్రపంచంలోని యావత్‌ వామపక్ష శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది, బాధ్యతను మరింతగా పెంచింది. మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్‌సికి పోలైన ఓట్లలో 55.1శాతం, ప్రత్యర్ధి కార్లోస్‌ మెసాకు 28.83, మూడవ అభ్యర్ధి ఫెర్నాండో కామ్చోకు 14శాతం వచ్చాయి. పార్లమెంట్‌ దిగువ సభలోని 130 స్ధానాల్లో మాస్‌ పార్టీకి 73, మిగతా రెండు పార్టీలకు 41,16 చొప్పున వచ్చాయి. ఎగువ సభలోని 36 స్ధానాలలో మాస్‌కు 21, రెండు, మూడు స్ధానాల్లో ఉన్న పార్టీలకు 11,4 చొప్పున వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చేనెల మధ్యలో ప్రమాణస్వీకారం చేయనుంది. దేశంలో 73లక్షల మంది ఓటర్లలో 60ఏండ్ల లోపు వారు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది, ఈసారి 88శాతం పోలింగ్‌ జరిగింది.


గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మితవాదశక్తులు హింసాకాండకు పాల్పడ్డాయి. అసలు గత ఏడాది ఎన్నికలు జరగ ముందే బొలీవియా ఎన్నికలను తాము గుర్తించబోమని, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటం లేదని అమెరికా, బ్రెజిల్‌, కొలంబియా మరికొన్ని దేశాల మితవాద పాలకులు ప్రచారం ప్రారంభించారు. అనివార్యమై జరిపిన ఈ ఎన్నికల్లో మితవాద శక్తులు ఒకే అభ్యర్ధిని నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. అయితే వాటి మధ్య ఉన్న అధికార యావ కారణంగా సాధ్యం కాలేదు. మాస్‌ పార్టీ మెజారిటీ ఓట్లు సాధించనుందని సర్వేలు వెల్లడించినా తగినన్ని ఓట్లు రాక రెండవదఫా ఎన్నికల్లో పోటీలో నిలిచే మితవాద అభ్యర్ధి విజయం సాధిస్తాడనే అంచనాతో ఈ సారి ఆశక్తులు ఉన్నాయి. మరొక ప్రధాన కారణం తటస్ధ ఓటర్లకు ఆగ్రహం తెప్పించకుండా వారి ఓట్లను ఆకర్షించాలనే ఎత్తుగడ కూడా దాడులకు పాల్పడకుండా నిలువరించిందని చెబుతున్నారు. గత ఏడాది కుట్రదారులు గద్దెనెక్కిన తరువాత తమకు ప్రత్యర్ధులు అనుకున్నవారి మీద పెద్ద ఎత్తున దాడులు చేయటంతో భయవాతావరణం ఏర్పడి ఎన్నికల ముందు 20శాతం ఓటర్లు తామెవరికి ఓటు వేసేది నిర్ణయించుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాడులను తప్పించుకొనేందుకే వారలా చెప్పారని, చడీచప్పుడు లేకుండా పోలింగ్‌లో తమ నిర్ణయాన్ని మాస్‌కు అనుకూలంగా తీసుకున్నారని నిర్ధారణ అయింది. ఎన్నికల్లో అనూహ్యంగా ఫలితాలు ఎదురుకావటంతో కొన్ని చోట్ల ఈ శక్తులు విధ్వంసకాండ సృష్టించేందుకు అక్రమాలు జరిగాయంటూ ప్రదర్శనలు చేశాయి. అయితే అమెరికా దేశాల సంస్ధ, ఇతర పరిశీలకులు అలాంటివేమీ లేవని ప్రకటించటంతో వెనక్కు తగ్గాయి. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయం సాధించినట్లు ప్రకటించగానే పోలీసు, మిలిటరీ కుట్రచేసి అక్రమాలు జరిగాయని జనాన్ని నమ్మించేందుకు అనేక చోట్ల బ్యాలట్‌ బాక్సులు, ఎన్నికల కార్యాలయాలను దగ్దం చేసి ఇవో మొరేల్స్‌ మీద అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. అది కుట్ర అని, మాస్‌ పార్టీకి జనంలో మద్దతు ఉందని ఈ ఎన్నికలు నిర్ధారించాయి. మితవాదులు వెనక్కు తగ్గటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.


దిగజారిన ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరుస్తామని మాస్‌ వాగ్దానం చేసింది. అయితే దాని ప్రత్యర్ధి పార్టీలు మెజారిటీగా ఉన్న రెడ్‌ ఇండియన్‌ తెగల పట్ల అనుసరించే దురహంకార ధోరణులు, ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను ప్రకటించలేకపోవటం, శ్వేత జాతి, మిశ్రమ రంగు జాతీయుల ఓట్లకోసం వెంపర్లాడటం తప్ప మెజారిటీ జనాన్ని పట్టించుకోకపోవటం మితవాద శక్తుల ఓటమికి దోహదం చేసిన కారణాలలో కొన్ని. మితవాద పార్టీలు రెండూ అమెరికా అనుకూలశక్తులుగా జనం గుర్తించటం, అమెరికా,ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందటం, ఇవోమొరేల్స్‌ ప్రభుత్వ కూల్చివేత కుట్ర వెనుక వారి హస్తం ఉందన్న అంశాలు కూడా మాస్‌ విజయానికి దోహదం చేశాయి. కరోనా కేసులు విపరీతంగా ఉండటం, ఆరోగ్యశాఖ మంత్రి మెర్సిలో వెంటిలేటర్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిదొరికిపోయి అరెస్టు కావటం వంటి పరిణామాలు కుట్రదారుల ప్రభుత్వం అంటే ఏమిటో జనానికి స్పష్టమైంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటం తప్ప ఉపాధి కోల్పోయిన వారికి ఎలాంటి సాయం అందించకపోవటంతో కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొలీవియా ఎదుర్కొంటున్న సమస్యలకు పెట్టుబడిదారీ, మితవాద శక్తుల దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, వారు అధికారానికి వస్తే ఉన్న సంక్షేమ చర్యలను కూడా తిరగదోడతారనే విషయం ఓటర్లకు స్పష్టమైంది.


కొత్త ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. కరోనాను అదుపు చేయటం వాటిలో ఒకటి. ఈ ఏడాది జిడిపి 6.2శాతం తిరోగమనంలో ఉంటుందని అంచనా. అందువలన దిగజారిన ఆర్దిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం, సామాన్యులకు ఉపశమనం కలిగించటం, జాత్యహంకార శ్వేతజాతి, పచ్చి మితవాద శక్తులను అదుపు చేయటం, అన్నింటికీ మించి అమెరికా కుట్రలను ఎదుర్కోవటం వంటి అంశాలున్నాయి. పద్నాలుగు సంవత్సరాల ఇవో మొరేల్స్‌ పాలనలో గ్యాస్‌, పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్‌, గనులను జాతీయం చేయటం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ప్రయివేటు రంగానికి లోబడే చేశారు. ఈ పరిమిత చర్యల కారణంగా కూడా దేశ ఆదాయం పెరిగింది. ఇవో మొరేల్స్‌ అధికారానికి రాక ముందు ప్రయివేటు రంగంలోని పెట్రోలియం, గ్యాస్‌ క్షేత్రాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన వార్షిక ఆదాయం 73 కోట్ల డాలర్లు కాగా వాటిని జాతీయం చేసిన తరువాత 495 కోట్లకు పెరిగింది.దాంతో చేపట్టిన సంక్షేమ చర్యల కారణంగా 60శాతంగా ఉన్న పేదరికం 35కు తగ్గిపోయింది. ఇప్పుడు కరోనా కారణంగా తిరిగి పెరిగినట్లు వార్తలు వచ్చాయి. స్దానిక తెగల భాషలతో స్కూళ్లలో బోధన ప్రారంభించారు. బొలీవియాలో పండించే కోకాతో ఔషధాలతో పాటు కొకెయిన్‌ అనే మాదక ద్రవ్యాన్ని కూడా తయారు చేయవచ్చు. అయితే మాస్‌ ప్రభుత్వం రాక ముందు మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో యంత్రాంగం కోకా రైతుల జీవితాలను నాశనం చేసింది. మొరేల్స్‌ అధికారానికి వచ్చాక కోకా సాగును చట్టబద్దం చేశాడు.మాదక ద్రవ్యాల నిరోధానికి తగుచర్యలు తీసుకున్నారు.


గత పదకొండు నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఆర్ధికరంగం దిగజారింది. నిరుద్యోగం 4.2 నుంచి 12శాతానికి చేరింది, నిర్మాణ రంగం వంటి వాటిలో 30శాతం ఉంది. ఉత్పత్తి 16శాతం పడిపోయింది. ద్రవ్యలోటు ఆరు నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది. దారిద్య్రం, సంపద కేంద్రీకరణ పెరిగింది.ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోయటం వెనుకు బహుళజాతి కంపెనీల హస్తం ఉంది. మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లలో వినియోగించే బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిల్వలకు బొలీవియా కేంద్రం. ప్రపంచ మొత్తం నిల్వల్లో అక్కడ 25 నుంచి 45శాతం వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయటం కంటే బ్యాటరీలు తయారు చేసి ఎగుమతి చేయటం మరింత లాభసాటిగా ఉంటుందని, ఆ వచ్చే సొమ్ముతో దారిద్య్రనిర్మూలనతో పాటు సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. అక్కడ ఉన్న ఖనిజంతో ఏడాదికి నాలుగు లక్షల బ్యాటరీలను తయారు చేయవచ్చని అంచనా వేశారు. ఆమేరకు ప్రభుత్వ రంగ సంస్ధ ఒక ప్రకటన చేసిన తరువాత ఎన్నికలు జరగటం, ఇవోమొరేల్స్‌ ఘనవిజయం సాధించటం, కుట్ర చేసి తొలగించటం తెలిసిందే. అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల కుట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలలో లిథియం శుద్దికి మొరేల్స్‌ సర్కార్‌ జర్మనీతో కుదుర్చుకున్న సంయుక్త పధకాన్ని రద్దుచేయటం ఒకటి.
లూయీస్‌ ఆర్‌సి నూతన ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆచితూచి ప్రకటన చేశారు. అయితే గత ఏడాది కాలంలో జరిగిన హింసాకాండ, హత్యలకు బాధ్యులైన వారి మీద ఏ చర్యలు తీసుకుంటారు? 36 మంది మరణించగా 800మందికి పైగా గాయపడ్డారు. మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గుతేలుస్తారా ? ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మితవాదశక్తులు మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. దాన్నెలా ఎదుర్కొంటారు ? ఇవో మొరేల్స్‌ అర్జెంటీనా ప్రవాసం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.కుట్రదారులు మోపిన కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందా లేక విచారణ కొనసాగించి నిజం లేదని నిగ్గుతేలుస్తుందా అన్నది స్పష్టం కాలేదు.


ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు తాజా ఎన్నికల్లో విజయం లభించినప్పటికీ రాబోయే ఐదు సంవత్సరాలలో మాస్‌ ప్రభుత్వ నడక నల్లేరు మీద బండిలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పలేము. పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మాస్‌ పార్టీ ఆర్ధిక రంగంలో లాటిన్‌ అమెరికాలోని మిగతా వామపక్ష పాలిత దేశాలలో మాదిరి నయాఉదారవాద పునాదులను కదిలించలేదు. కొన్ని సంక్షేమ చర్యలు తీసుకొని ఉపశమనం కలిగించటం తప్ప పెట్టుబడిదారీ వ్యవస్ధ ముందుకు తెచ్చిన అసమానత, దోపిడీలను అవి నివారించలేవు. వాటికి ఉన్న పరిమితులు కూడా ఏమిటో గత రెండు దశాబ్దాల అనుభవం వెల్లడించింది. అమెరికాతో కుమ్మక్కయిన పోలీసు, మిలిటరీ, మితవాద శక్తుల కుట్రలకు బొలీవియాలో తాత్కాలికంగా తెరపడింది. అవి తిరిగి మరోమారు తలెత్తలేవని చెప్పలేము. దానికి గాను పలు ఆటంకాలను అధిగమించాల్సి ఉంది.అయితే ఈ విజయంతో సంతృప్తి చెంది ఆదమరవకుండా అమెరికా కుట్రలను నిరంతరం కనిపెట్టటంతో పాటు విధానపరమైన మార్పులను చేపట్టి పురోగమించటం ఎలా అనే అతిపెద్ద సవాలు ఆ పార్టీ ముందు ఉంది.