Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఉపగ్రహాల ద్వారా సేకరించే భౌగోళిక, ఇతర సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు ఉద్దేశించిన -బెకా- ఒప్పందం మీద భారత్‌- అమెరికాలు సంతకాలు చేశాయి. రెండు దేశాల మిలిటరీ, ఇతర సంబంధాలలో దీన్నొక మలుపుగా పరిగణిస్తున్నారు. సులభ భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు అమెరికా మనకు అనధికారికంగా అందచేస్తున్న సమాచారాన్ని మరింత వివరంగా అధికారికంగా అంద చేయనుంది. లడఖ్‌ సరిహద్దుల్లో చైనా కదలికల గురించి ఇప్పటి వరకు మీడియాకు అందచేసిన సమాచారం, చిత్రాలు, భాష్యాలు అన్నీ కూడా అమెరికా సంస్ధలు అందచేసినవే అన్నది తెలిసిందే. ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా అమెరికా నుంచి పొందే సమాచారానికి మనం ఏ రూపంలో ప్రతిఫలం లేదా మూల్యం చెల్లించాల్సి ఉంటుందో వెల్లడికావాల్సి ఉంది. బెకా ఒప్పందం గురించి చాలా కాలంగా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో అమెరికాతో మన మిలిటరీ బంధానికి మరో ముడి పడుతుంది.

మాతో పెట్టుకుంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ తీస్తాం జాగ్రత్త. ఇదీ చైనా అధినేత గ్జీ జింపింగ్‌ చేసిన తాజా హెచ్చరిక. పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్న నౌకా సంబంధ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల సమన్వయం, సజావుగా సాగే సరఫరా వ్యవస్ధలు, మానవతా పూర్వక మరియు ప్రళయాలు సంభవించినపుడు సాయం కోసం అనే పేరుతో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌ ఒక చతుష్టయ లేదా చతుర్భుజ (క్వాడ్‌) కూటమిగా మరింత ముందుకు పోయేందుకు నిర్ణయించుకున్న నేపధ్యంలో గ్జీ ఈ హెచ్చరిక చేశారు. ఒక దేశం పేరు పెట్టి అనకపోయినా నాలుగుదేశాలు, ప్రత్యేకించి అందరినీ కూడగడుతున్న, రెచ్చగొడుతున్న అమెరికా గురించి అన్నది స్పష్టం.


ఏదో ఒక సాకుతో చైనాను రెచ్చగొడుతున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ద నౌకల విన్యాసాలు జరుపుతున్నది. ఇటీవలి కాలంలో చైనా మీద నెపం మోపేందుకు లడఖ్‌లో జరిగిన పరిణామాలను పదే పదే ఉదహరించటం తప్ప మరొకటి లేదు. మీరు చైనా మీదకు దూకండి మీ వెనుక మేము ఉన్నాం అంటూ మన దేశాన్ని పురికొల్పుతున్నది. నాలుగుదేశాల కూటమిని మిత్ర చతుష్టయంగా పిలుస్తున్నారు. అయితే ఇది దుష్ట చతుష్టయం అని చైనా పరిగణిస్తున్నది. బహుశా ఆప్రచార ప్రభావం లేదా అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారం కావచ్చు ఉత్తర ప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పాకిస్ధాన్‌, చైనాలతో యుద్దానికి ప్రధాని నరేంద్రమోడీ తేదీని కూడా ఖరారు చేశారని చెప్పినట్లు సాక్షాత్తూ ఆర్నాబ్‌ గోస్వామి రిపబ్లికన్‌ టీవీ పేర్కొన్నది. అతగాడేమీ గల్లీ నేత కాదు, ఆ వార్తను ప్రసారం చేసిన టీవీ బిజెపి అనధికారవాణి తప్ప మరొకటి కాదు. సామాజిక మాధ్యమంలో కాషాయ దళాల యుద్ద ప్రేలాపనల గురించి చెప్పనవసరం లేదు.

కొరియా ఆక్రమణకు పూనుకున్న అమెరికన్లను ఎదిరించి చైనా సాధించిన విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా అక్టోబరు 23వ తేదీన బీజింగ్‌ గ్రేట్‌ హాల్‌ సభలో సుత్తి లేకుండా సూటిగానే పరోక్షంగా అమెరికా కూటమిని గ్జీ హెచ్చరించాడు. సరిగ్గా అదే సమయంలో తమ భూ భాగమైన తైవాన్‌ గగన తలం మీద అమెరికా గూఢచార విమానం సంచరించినట్లు రుజువైతే తమ మిలిటరీ జట్లను పంపుతామని చైనా హెచ్చరిక చేసింది. అబ్బే ఆ వార్తల్లో నిజం లేదని 24వ తేదీన అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రజా సంబంధాల అధికారి లెప్టినెంట్‌ కల్నల్‌ టోనీ విక్‌మాన్‌ ప్రకటన చేశాడు.


ఏ చిన్న ఉదంతం జరిగినా పరిణామాలు ఏ విధంగా మారతాయో తెలియని స్ధితి ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్నదని చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. ఒక వేళ ఆ ఉదంతం జరిగితే ఎంత తీవ్ర పరిణామాలు జరుగుతాయో అమెరికా, దానితో చేతులు కలిపిన తైవాన్‌ యంత్రాంగం గ్రహించిదనేందుకు చిహ్నం అమెరికా ప్రకటన. ప్రధాన భూభాగంలో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలితప్ప సైనిక బలంతో కాదని, తొలి తూటా పేలుడు తమ వైపు నుంచి ఉండదన్నది ఏడు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వ వైఖరి. అయితే అమెరికన్లు తైవాన్‌లో తిష్టవేసి రచ్చ చేస్తే అవసరమైతే సైనిక చర్య తప్పదని చైనా హెచ్చరిస్తున్నది. అమెరికా విమానం తైవాన్‌ గగన తలం మీదుగా ఎగిరిందా లేదా ఆ వార్త కల్పితమా నిజమా అన్నది నిర్దారణ కాలేదు. ఒక వేళ ఎగిరితే అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించటమే. అదే జరిగితే అమెరికా విమానాలను తరిమేందుకు చైనా మిలిటరీ జట్లు సిద్దంగా ఉంటాయి. తైవాన్‌ దీవి చైనా ప్రధాన భూ భాగానికి తూర్పున 161కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఉంది. కొద్ది వారాల క్రితం చైనా ఆ ప్రాంతంలో నౌకా విన్యాసాలు జరపటంతో పాటు తూర్పు తీరంలో తైవాన్‌ వైపు గురిపెట్టి అనేక ఆధునిక క్షిపణులను చైనా మిలిటరీ మోహరించింది.


కొరియా యుద్దంలో చైనా విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా గ్జీ చేసిన హెచ్చరిక ఒక్క అమెరికాకు మాత్రమే కాదు, తమకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న దేశాలన్నింటికీ అన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొరియాను జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆక్రమించారు. దాన్ని విముక్తం చేసేందుకు నాటి సోవియట్‌ సేనలు ఒక వైపు నుంచి మరో వైపు నుంచి అమెరికన్‌ సేనలు కదిలాయి.38వ అక్షాంశరేఖకు ఉత్తర వైపున ఉన్న కొరియా ప్రాంతం సోవియట్‌, దక్షిణ ప్రాంతం అమెరికా ఆధీనంలోకి వచ్చాయి. యుద్దం ముగిసిన తరువాత రెండు ప్రాంతాలను ఐక్యం చేయాలన్నది ఒప్పందం. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల పాలనలోకి, దక్షిణ కొరియా మిలిటరీ పాలనలోకి వెళ్లాయి. అయితే దక్షిణ కొరియాలోనే తిష్టవేసి చైనాకు, అదే విధంగా ఇండోచైనా ప్రాంతంలోని వియత్నాం తదితర దేశాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా తన సైన్యాన్ని అక్కడే ఉంచింది.1950లో ఉత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు ఐక్యరాజ్యసమితి శాంతిసేనల ముసుగులో ఉన్న అమెరికా మిలిటరీ ప్రయత్నించటంతో పక్కనే ఉన్న చైనా జోక్యం చేసుకొని తన వలంటీర్ల సైన్యాన్ని పంపింది.1953 జూలైలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద నాటి దక్షిణ కొరియా పాలకులు సంతకాలు చేయలేదు. విలీన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అమెరికా ఇప్పటికీ తన సైన్యాన్ని అక్కడే ఉంచి అడ్డుపడుతోంది.

1950 నాటికి చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అనేక చోట్ల ప్రతిఘటనను ఎదుర్కొంటూ కుదుట పడలేదు. అయితే సరిహద్దులోకి అమెరికా సేనల ప్రవేశం చేసిన తరువాత అక్కడికే పరిమితం గావు చాంగ్‌కై షేక్‌కు మద్దతుగా చైనాలో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆ పరిస్ధితిని ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో దక్షిణ కొరియా మిలిటరీ, అమెరికన్ల దురాక్రమణను ఎదుర్కొనేందుకు సాయపడవలసిందిగా ఉత్తర కొరియా ప్రభుత్వం 1950 అక్టోబరు 19న చైనా ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే లక్షలాది మంది స్వచ్చంద సైనికులు యాలూ నదిని దాటి కొరియాలో ప్రవేశించారు. 1951అక్టోబరు 25న చైనా సైనికులు దక్షిణ కొరియా మిలిటరీపై తొలి విజయం సాధించారు. ఆ యుద్దంలో రెండు లక్షల మంది చైనా సైనికులు మరణించారు. యుద్దం ముగిసిన తరువాత ప్రతి ఏటా అక్టోబరు 25ను విజయోత్సవంగా జరపాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం త్యాగం పేరుతో ఒక సినిమాను కూడా నిర్మించి విడుదల చేశారు.1950 అయినా 2020 అయినా చైనా విషయాల్లో ట్రంప్‌ లేదా భవిష్యత్‌లో మరొక నేత అయినా పెత్తందారీ పోకడలకు పోతే తగిన జవాబు ఇస్తామని గ్జీ స్పష్టం చేశారు. పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో ప్రస్తుత పరిస్ధితి 1950లో యుద్దానికి ముందున్నట్లుగా ఉందని చైనా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌ లేదా జో బిడెన్‌ ఎవరు అధికారానికి వచ్చినా చైనా వ్యతిరేకులకు విధాన నిర్ణయాన్ని అప్పగిస్తే అమెరికా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
చైనా పౌరులు నేడు సంఘటితంగా ఉన్నారని, వారిని తక్కువగా చూడవద్దని గతంలో మావో చెప్పిన అంశాన్ని గ్జీ పునరుద్ఘాటించారు. బెదిరింపులు, అడ్డుకోవటం వంటి వత్తిళ్లు పని చేయవని స్పష్టం చేశారు. గతంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాను అడ్డుకునేందుకు ఆసియాలో క్వాడ్‌ పేరుతో అలాంటి కూటమి ఏర్పాటుకు పూనుకున్నారు. దానిలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి. ఆసియా ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలతో వాటిని విస్తరించాలనే యత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే చైనాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఈ నాలుగు దేశాల్లో అన్ని అంశాలపైనా ఏకీభావం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చతుష్టయంలో అమెరికా, భారత్‌తో చైనా వాణిజ్యం మిగుల్లో ఉండగా జపాన్‌,ఆస్ట్రేలియాలతో తరుగులో ఉంది. అంటే చైనాతో లడాయి కొని తెచ్చుకోవటం అంటే ఇవి తమ వాణిజ్య అవకాశాలను ఫణంగా పెట్టాల్సి ఉంది. అందువలన అమెరికా వత్తిడికి తట్టుకోలేక చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ జపాన్‌, ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించటం లేదన్నది ఒక అభిప్రాయం. చైనాకు ఎన్నిహెచ్చరికలు చేసినా మన ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా చేసిన ప్రకటనలో మన భూభాగంలోకి చైనా కొత్తగా ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పటం చైనాతో తెగేదాకా లాగేందుకు ఇంకా నిర్ణయించుకోలేదనేందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.


అమెరికాతో జతకడితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్న మన దేశ కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. గతంలో అమెరికా-సోవియట్‌ మధ్య సాగిన ప్రచ్చన్న యుద్దకాలంలో మన కార్పొరేట్‌ శక్తులు ఆ విబేధాన్ని వినియోగించుకొని లబ్దిపొందేందుకు, తామే స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించాయి. గతంతో పోల్చితే ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు మరింతగా బలపడ్డాయి. వివిధ కారణాలతో అమెరికా మునుపటి స్ధాయిలో లేదు. కొనుగోలు శక్తి పద్దతి(పిపిపి)లో లెక్కించినపుడు చైనా నేడు ప్రపంచంలో ఆర్ధిక అగ్రరాజ్యం, అమెరికా ద్వితీయ స్ధానంలో ఉంది. సాధారణ పద్దతిలో చూస్తే ప్రధమ స్దానంలో ఉన్న అమెరికాను త్వరలో చైనా అధిగమించనుందనే అంచనాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య అంతరం ప్రతి ఏటా తగ్గుతున్నది. ఈ నేపధ్యంలో అమెరికా పాటలకు మన కార్పొరేట్‌ శక్తులు నృత్యాలు చేస్తాయా అన్నది సమస్య.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దంలో భాగంగా ఐరోపాలోని అనేక దేశాలకు సోవియట్‌ నుంచి ముప్పు, కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తారనేే భయాన్ని రేపి నాటో కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చైనా నుంచి అలాంటి ముప్పు ఏదేశానికీ లేదు. మన దేశంతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ అది మరోసారి యుద్దానికి దారితీసే అవకాశం లేదు.1962 యుద్దం నాటికి సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమయ్యాయి. యుద్దంలో మనదేశానికి సోవియట్‌ యూనియన్‌ అండవుంటుందనే ఒక పొరపాటు అంచనాకు నాటి మన నాయకత్వం వచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఆ సోవియట్‌ లేదు. సిరియా రష్యా నేతలు చైనాతో వివాదపడకపోగా స్నేహబంధాన్ని మరింతగా పెంచుకొనేందుకు నిర్ణయించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ మన దేశం-చైనా మధ్య యుద్దమంటూ వస్తే వారూ మనం చావో రేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్ముకొని అమెరికా లబ్ది పొందుతుంది తప్ప మనకు ఒరిగేదేమీ ఉండదు. జపాన్‌, ఆస్ట్రేలియాల పరిస్ధితీ అదే. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అలాంటి సమస్య లేదు. అయితే అమెరికా అనుంగు దేశంగా వ్యతిరేకించటం తప్ప మరొక కారణం లేదు.


దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల గురించి చైనా – ఆప్రాంత దేశాల మధ్య వివాదం ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ దేశానికి చెందిన నౌకలనూ అడ్డుకోలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇక క్వాడ్‌ను ఆసియా నాటోగా మార్చి పెత్తనం చేయాలని అమెరికా చూస్తోంది. ఇదే సమయంలో జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అక్కడి కార్పొరేట్‌ శక్తులు ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిది ప్రకారం అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మిలిటరీని వినియోగించటం నిషేధం, అంతే కాదు త్రివిధ దళాలను నిర్వహణను కూడా అనుమతించదు. ఈ కారణంగానే ఆత్మరక్షణ పేరుతో జపాన్‌ పరిమితంగా తన దళాలను నిర్వహిస్తున్నది. ఈ స్ధితి నుంచి బయట పడేందుకు అమెరికా అంగీకరిస్తుందా ? ఆసియా ప్రాంతీయ మిలిటరీ శక్తిగా తిరిగి ఎదగటాన్ని అనుమతిస్తుందా ?


ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేసి దానిలో మన దేశం చేరాలంటే దానికోసం మనం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దున్న-ఎద్దు వ్యవసాయం ఎలాంటి సమస్యలను తెస్తుందో తెలిసిందే. ప్రస్తుతం మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యన్‌ ఆయుధాలదే అగ్రస్ధానం. అందువలన సగం రష్యా, సగం అమెరికా ఆయుధాల నిర్వహణ కుదరదు. అన్నింటికీ మించి తన ఆయుధాల కొనుగోలును మనం నిలిపివేస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. అమెరికా ఉచితంగా ఆయుధాలు ఇవ్వదు. ఐరోపాలో నాటో నిర్వహణ తమకు కష్టంగా మారిందని, నిర్వహణ ఖర్చును ఐరోపా దేశాలు మరింతగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అలాంటి స్దితిలో అమెరికా కోసం మనం చేతి చమురు వదిలించుకోవాల్సిన అవసరం ఏముంది ?
అధ్యక్ష ఎన్నికల నేపధ్యం, చైనా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు తెచ్చిన చతుష్టయంతో తెల్లవారేసరికి అద్బుతాలు జరుగుతాయని అనుకుంటే పొరపాటు. నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. నిజానికి ఈ ప్రతిపాదన 2004లో ప్రారంభమైంది. మధ్యలో మూలనపడి 2017లో మరోసారి కదలిక ప్రారంభమైంది. ట్రంప్‌ ఓడిపోతే కొంతకాలం పాటు దూకుడు తగ్గవచ్చు. ఒక వేళ గెలిచినా మన వంటి దేశాలను ముందుకు నెట్టటం తప్ప తన ఆర్దిక పరిస్ధితి మెరుగుపడేంతవరకు ట్రంప్‌ కూడా ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయవచ్చు.


అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాలు నాటో కూటమిని రష్యా ముంగిటికి తీసుకు వస్తున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు రష్యా తనవంతు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు క్వాడ్‌ పేరుతో ఆసియా నాటో ఉనికిలోకి వస్తే అది చైనాకే కాదు రష్యాకూ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ నేపధ్యంలోనే చైనాతో కూటమి ఏర్పాటు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సూచన ప్రాయంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు చైనా మరో దేశానికి వ్యతిరేకంగా మూడో దేశంతో ఎలాంటి సైనిక కూటమిని ఏర్పాటు చేయలేదు. అమెరికాకు మరింత దగ్గరగా భారత్‌ వెళుతున్నప్పటికీ దాయాదిగా ఉన్న పాకిస్ధాన్‌తో, మిత్రదేశంగా ఉన్న నేపాల్‌తో చైనా మిలిటరీ ఒప్పందాలు చేసుకోలేదని అంతర్జాతీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. అమెరికా మరింత దూకుడుగా చైనా వ్యతిరేక అజెండాను ముందుకు తీసుకువస్తే చైనా తన వైఖరిని పున:పరిశీలించుకోవచ్చు. తన ఆర్దికశక్తితో చైనా చిన్న దేశాలను నియంత్రిస్తున్నదని విమర్శించే వారు ఇరాన్‌ పట్ల అమెరికా, మోడీ అనుసరించిన వైఖరి ఆర్ధికపరమైనదిగాక మరేమిటో చెప్పాలి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఆర్ధికపరమైనవి కావా, దానిలో భాగంగానే కదా ఇరాన్‌ నుంచి మనం చమురు కొనుగోలు నిలిపివేసి ఆమేరకు అమెరికా నుంచి తెచ్చుకుంటున్నది. అమెరికా పుణ్యమా అంటూ ప్రధాని నరేంద్రమోడీ మన మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించారు.ఈ చర్యతో మనకు ఒరిగిందేమీ లేకపోగా మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించాము. అమెరికా బెదిరింపులు, అదిరింపులతో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు చైనా అందిస్తున ఆర్దిక స్నేహ హస్తాన్ని అందుకుంటున్నాయి. మన పాలకులకు అమెరికా కౌగిలింతలు తప్ప చుట్టుపట్ల ఏమి జరుగుతోందో పట్టటం లేదు. ఇది తెలివి తక్కువ వ్యవహారమా తెలివిగలదా ?