Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చాణక్య భూమి బీహార్‌. అన్ని ప్రధాన పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఏకపక్షం అనుకున్న ఎన్నికలు ఎన్‌డిఏ కూటమికి వణుకుపుట్టిస్తున్నాయి. అక్టోబరు 28న జరిగిన తొలిదశ 71 స్ధానాల ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి వెనుకబడిందని వార్తలు వచ్చాయి. కరోనాను లెక్క చేయకుండా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా 55.69శాతం పోలింగ్‌ జరిగింది. నితీష్‌ కుమార్‌ను వదిలించుకోవాలనే ఓటర్ల వాంఛకు ఇది నిదర్శనమా ? నితీష్‌ కుమార్‌-నరేంద్రమోడీ కూటమిని గెలిపించాలనే ఉత్సాహం ఎక్కడా కనిపించటం లేదని పోలింగ్‌కు ముందు వచ్చిన వార్తల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.


బిజెపి అంతర్గత సర్వేలలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం, మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించటంతో తొలి దశ ఓటింగ్‌కు రెండు రోజుల ముందు దర్శనమిచ్చిన బిజెపి పోస్టర్లలో నితీష్‌ కుమార్‌ మాయం అయ్యారు. నరేంద్రమోడీ చిత్రమే దర్శనమిచ్చింది. ఇది జెడియు శ్రేణులకు ఆగ్రహం తెప్పించిందని, అయితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. బిజెపి అభ్యర్ధుల మీద జెడియు కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారా ? చాణక్య భూమిగా పేరు గాంచిన బీహార్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.


కరోనా లాక్‌ డౌన్‌ ముగిసినా ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాని ప్రతికూల ప్రభావాలను జనం ఇంకా మరచి పోలేదు. ఎన్నికల ప్రకటన సమయంలో జెడియు నేత నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి విజయం సాధించనుందంటూ సర్వేల పేరుతో తొలి ప్రచారబాణం వదిలారు. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో అక్టోబరు 28న తొలి దశ, నవంబరు మూడున మలి, ఏడున మూడవ చివరి పోలింగ్‌ ముగిసి పదవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అమెరికాలోనే సర్వేలు గాడి తప్పాయి. మన దేశం సంగతి, ప్రత్యేకించి బీహార్‌ సంగతి సరేసరి. గత సర్వేలన్నీ నిజం కాలేదు. అంధులు ఏనుగును వర్ణించిన మాదిరి తొలి దశ ప్రచార ముగింపులో కూడా కొన్ని సంస్ధలు సర్వేల వివరాలను వెలువరించాయి. చివరి క్షణం వరకు ఎటూ తేల్చుకోని ఓటర్లు కొందరు ఉంటారు. వారిని ఆకర్షించటం కోసం ఇలాంటి జిమ్మిక్కులను పార్టీలు ప్రయోగిస్తుంటాయి.


ఎన్నికల ప్రకటన నాటికి-తొలి దశ నాటికీ పోలికే లేదన్నది స్పష్టం. నితీష్‌ కుమార్‌తో అధిక సీట్ల కోసం బేరం పెట్టిన లోక్‌జనశక్తి పార్టీ అది వీలుగాకపోవటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు తిరుగుబాటు జెండా ఎగురవేసి జెడియు పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను నిలిపింది. మిగిలిన చోట్ల బిజెపి అభ్యర్ధులను బలపరుస్తానని, తరువాత ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమితో వామపక్షాలు సర్దుబాటు చేసుకుంటాయా లేదా అన్న సందేహాలు కూడా తొలగిపోయి సజావుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్న నితీష్‌ కుమార్‌ కుల రాజకీయాలతో పాటు, తాను లౌకిక వాదిని అని చెప్పుకొనేందుకు కొన్ని అంశాలతో విబేధించినా బిజెపితో కలసి అధికారాన్ని పంచుకొని మతవాసనలను కూడా అంటించుకున్నారని, అవినీతి పాలనకు తెరతీశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.


బిజెపి ఆశలు పెట్టుకున్నట్లు ఈ ఎన్నికల్లో మోడీ గాలితో ఓట్లు వస్తాయా ? బీహార్‌ విషయానికి వస్తే మోడీ అధికారానికి వచ్చిన ఏడాది తరువాత జరిగిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. ఆ పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉన్న రాజస్దాన్‌, చత్తీస్‌ఘర్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ పలుకుబడి పని చేయలేదు. రెండోసారి పెద్ద సంఖ్యలో సీట్లతో గెలిచిన తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వలన బిజెపి సాధించిందేమీ లేదు. బీహార్‌లో దానికి భిన్నంగా ఎలా ఉంటుందన్న ప్రశ్నలకు బిజెపి వద్ద సమాధానం లేదు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రకటన తరువాత మరింతగా కనిపిస్తోంది. చాణక్యుడిగా భావించే అరవై తొమ్మిది సంవత్సరాల నితీష్‌ కుమార్‌ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) విషయానికి వస్తే తాము ఎన్‌డిఏ, బిజెపి నుంచి విడిపోలేదని, నితీష్‌ కుమార్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పదే చెబుతోంది. తాను గతం కంటే బలపడ్డాననే అంచనాకు వచ్చిన బిజెపి నితీష్‌ కుమార్‌ను వదిలించుకొనే ఎత్తుగడలో భాగంగానే ఎల్‌జెపిని రంగంలోకి దింపిందని, నితీష్‌ కుమార్‌ పార్టీతో నిమిత్తం లేకుండానే ఎల్‌జెపితో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలో ఉందన్నది ఒక అభిప్రాయం. ఎన్నికల ప్రకటన వరకు కలసి ఉండి విడిపోతే ఇద్దరం నష్టపోతామనే భయంతో నితీష్‌ను ఎన్నికల వరకు ఒక ముసుగుగా బిజెపి ఉపయోగించుకుంటోందని, ఫలితాలను బట్టి చూసుకోవచ్చు లెమ్మని భావిస్తున్నదని చెప్పేవారూ లేకపోలేదు.రాముడికి హనుమంతుడు ఎలానో తాను నరేంద్రమోడీకి అలాంటి వాడినని తన గుండెను చీలిస్తే మోడీయే ఉంటారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తన ప్రభు భక్తిని ప్రదర్శించుకున్నాడు.

రంగంలోకి దిగిన తరువాత నితీష్‌కు పరిస్ధితి గడ్డుగా ఉందని అర్ధమైందని అందుకే స్ధిమితం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక సభలో మీరు ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు, అల్లరి చేయవద్దని విసుక్కున్నారు.కొడుకు కోసం ఏడెనిమది మందిని కన్నారు అంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్‌ తిప్పి కొడుతూ ప్రధాని నరేంద్రమోడీకి కూడా తోడబుట్టిన వారు ఎక్కువగానే ఉన్నారని,నితీష్‌ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి అయి ఉండవచ్చన్నారు.


బీహార్‌లో ఉన్న సంక్లిష్ట రాజకీయ పరిస్దితుల్లో రాష్ట్ర మంతటా పార్టీ విస్తరించకపోయినా 20శాతానికి లోబడి ఓట్లు ఉన్న నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా అంతకాలం పదవిలో ఉండటం సాధ్యమైంది. ఆర్‌జెడి-బిజెపి మధ్య పోరులో నితీష్‌కు అవకాశం వచ్చింది. కొందరు ఇది నితీష్‌ చాణక్య నీతి అంటారు. బీహార్‌లో లాలూ, నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ముగ్గురూ మండల రాజకీయాల నుంచి ఎదిగినవారే.
సర్వేలను పూర్తిగా నమ్మనవసరం లేదు గానీ కొన్ని సర్వేల తీరు ఆసక్తికరం.2010లో నితీష్‌ కుమార్‌కు మద్దతు పలికిన వారు 77శాతం, 2015లో 80శాతం ఉన్నట్లు అప్పటి సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం 52శాతానికి పడిపోయింది.లోక్‌నీతి-సిఎస్‌డిఎస్‌ సర్వే తిరిగి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నవారు 38శాతమే అని వద్దంటున్నవారు 43శాతమని పేర్కొన్నది. సిఓటర్‌ సర్వే ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా ఉన్నామని చెప్పింది 25శాతం, ఆశాభంగం చెందామన్నవారు 46శాతం అని పేర్కొన్నది ఈ కారణంగానే నితీష్‌తో ఇంక ప్రయోజనం లేదని బిజెపి ఎన్నికల గోదాలోకి దిగిన తరువాత భావిస్తున్నట్లు చెబుతున్నారు.


బీహార్‌లో మండల్‌- కమండల్‌ రాజకీయాలు పెద్ద ఎత్తున నడిచాయి. మండల్‌ త్రయంలోని నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కమండలం పంచన చేరారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్కరే మిగిలారు. బీహార్‌లో అరాజక శక్తులు చెలరేగిన మాట వాస్తవం. దానికి లాలూ కారకుడని చెప్పినప్పటికీ మిగిలిన నేతలు తప్పించుకోలేరు. ఉత్తర ప్రదేశ్‌ ఏమీ దానికి తక్కువ కాదు. రెండు చోట్లా భూస్వామిక శక్తులు బలంగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించటాన్ని కూడా అరాచకంగానే చిత్రించారు. పేదల పోరాటాలను అణచేందుకు భూస్వామిక శక్తులు కులాల వారీ బీహార్‌లో ప్రయివేటు సాయుధ ముఠాలను పెంచిపోషించాయి. దాడులకు పాల్పడ్డాయి. ప్రతిఘటించిన వారిని అరాజక శక్తులుగా వర్ణించారు. ప్రయివేటు సాయుధ ముఠాలను సమర్ధించిన వారిలో నితీష్‌ తక్కువ తినలేదు, బిజెపి నేతలుగా ఉన్న వారూ దూరంగా లేరు. ఇప్పుడు అలాంటి ముఠాలన్నీ దారి మార్చి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి మామూళ్లు వసూలు చేస్తున్నాయని ఈ ఎన్నికల సందర్భంగా జనం చెబుతున్నారు. నితీష్‌-బిజెపి కూటమి పాలన మీద పెరిగిన వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణమే.
బీహార్‌ కుల సమీకరణలకు పెట్టింది పేరు. వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలేవీ వాటికి అతీతంగా లేవు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్ధితుల్లో ఏ కులం అభ్యర్ది అయినా నితీష్‌ కుమార్‌ నిలబెట్టిన వారిని ఓడిస్తారా లేదా అన్నదే ప్రధానంగా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ నిరంతరం నితీష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట కూడా ఓటర్లు జెడియును ఓడించే అభ్యర్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని బీహార్‌లో పర్యటించిన జర్నలిస్టులు రాస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగానూ, ఎన్‌డిఏ సారధిగా నితీష్‌ కుమారే అని ప్రకటించిన కారణంగా బిజెపి పోటీ చేస్తున్న చోటకూడా అసంతృప్తి చెందిన సాధారణ ఓటర్లకు నితీషే కనిపిస్తారు.

ఖండించినప్పటికీ బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఊహాగానాలు మరింతగా పెరుగుతున్నాయని బిజెపి పక్కా మద్దతుదారు అయిన స్వరాజ్య పత్రిక ఒక విశ్లేషణకు శీర్షికగా పెట్టింది. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇదే అంశం గురించి ఆ పత్రిక రాసింది. తాజా విశ్లేషణలో వ్యాఖ్యాత పేర్కొన్న అంశాల సారం ఇలా ఉంది. తొలుత ప్రచారంలో భాగంగా బిజెపి ఏర్పాటు చేసిన బ్యానర్లు, ముద్రించిన పోస్టర్లు, మీడియా వాణిజ్య ప్రకటనలలో నరేంద్రమోడీతో పాటు నితీష్‌ కుమార్‌ చిత్రానికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశ ఎన్నికలు దగ్గరపడే ముందు ప్రచురించిన వాటిలో కేవలం నరేంద్రమోడీ చిత్రమే ఉంది. వీటిని చూసి జెడియు నేతలు హతాశులయ్యారు గానీ మౌనం వహించారు. తొలి దశ ఎన్నికలకు ముందు ఇలాంటి వాటి మీద వ్యాఖ్యానించటం సరైంది కాదని, ఈ చర్య తమను గాయపరించిందని, బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం బలపడేందుకే ఇది దోహదం చేస్తుందని జెడియు అగ్రనేత ఒకరు చెప్పారు.కేవలం మోడీ బొమ్మలతో ప్రచారం చేయటం తనకు సంతోషం కలిగిస్తున్నదని, మా బిజెపి మిత్రులు నితీష్‌ కుమార్‌ నష్టదాయకం అని గ్రహించారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్‌డిఏ నుంచి ఎల్‌జెపి బయటకు పోయిన తరువాత కేంద్రంలో కూడా ఆ పార్టీని బహిష్కరించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినా బిజెపి తిరస్కరించటంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఎన్నికల తరువాత బిజెపి-ఎల్‌జెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రకటనలు ఖండించదగ్గ పెద్దవి కాదని బిజెపి కొట్టిపారవేస్తోంది. చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి నరేంద్రమోడీ ఎలాంటి ప్రస్తావనలు చేయకపోవటంతో జెడియు నేతలు ఆశాభంగం చెందారు. ఇరవై ఒక్క మంది బిజెపి తిరుగుబాటుదార్లకు చిరాగ్‌ సీట్లు ఇచ్చారు. ఊహాగానాలను బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదని జెడియు నేతలు చెప్పారు. ఎల్‌జెపి నేతలు తాము పోటీ చేస్తున్న చోట్ల ఎన్నికల తరువాత తాము బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందువలన మోడీ మద్దతుదారులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.


బిజెపి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అయితే బీహార్‌ ఎన్నికల్లో అది పోటీ చేస్తున్న 110 స్దానాల్లో 51 మంది అగ్రవర్ణాలుగా పరిగణించబడుతున్నవారికే ఇచ్చింది. జనాభాలో వారు కేవలం 16శాతమే. ఇరవై రెండు మంది రాజపుత్రులు,15 భూమిహార్లు, 11 మంది బ్రాహ్మలు, ముగ్గురు కాయస్ధులు ఉన్నారు. 2015 ఎన్నికల్లో 157 స్ధానాలకు పోటీ చేసిన ఆ పార్టీ 65 మంది ఈ సామాజిక తరగతుల వారికే సీట్లు ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడింది వారే గనుక మిగతావారి కంటే వారికే ప్రాధాన్యత ఇవ్వటం సహజమే అని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీహార్‌కు చెందిన సినిమా నటుడు సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఉదంతాన్ని పెద్ద ఎత్తున వివాదాస్పదం చేసి లబ్ది పొందేందుకు బిజెపి ప్రయత్నించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి మిత్రపక్షమైన జెడియు పోటీ చేస్తున్న 115 స్ధానాలలో ఈ సామాజిక తరగతులకు కేవలం 19 మాత్రమే ఇచ్చారు.


దేశంలో తొలిసారిగా సంఘపరివార్‌ శక్తులకు లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ వచ్చింది. నాలుగు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వారే ఉన్నారు. బలం లేని స్ధితిలో బిజెపి నేతలుగా ఉన్న అతల్‌-వాజ్‌పేయి ద్వయానికి ప్రస్తుత మోడీ-షా ద్వయం పని తీరు, ఎత్తుగడల్లో ఎంతో తేడా ఉంది. సంఘపరివార్‌ అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరినైనా ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తరువాత పక్కన పడేయటాన్ని చూస్తున్నాము. బీహార్‌లో బిజెపి పెరుగుదల లేదా స్ధిరపడటానికి నితీష్‌ ఎంతగానో సహకరించారన్నది స్పష్టం. అంతర్గతంగా బిజెపి చేయించిన సర్వేలలో పరిస్ధితి క్లిష్టంగా ఉన్నట్లు తేలిందనే వార్తలు వచ్చాయి. మూడింట రెండువంతుల మెజారిటీ తమ కూటమికి వస్తుందని, ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినా నితీష్‌ కుమారే తిరిగి సిఎం అని పార్టీ అగ్రనేతలు చెప్పినప్పటికీ వారి అనుమానాలు వారికి ఉన్నాయి. అందుకే నితీష్‌ కుమార్‌ గురించి చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపటం లేదు. ఎన్నికల తరువాత తమను వదిలించుకొని ఆర్‌జెడి నాయకత్వంలోని కూటమితో నితీష్‌ కుమార్‌ చేరితే ఏమిటనే ఆందోళన కూడా బిజెపిలో లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్‌జెడితో కలసి పోటీ చేసి బిజెపితో చేతులు కలిపిన పెద్దమనిషి మరోమారు అదే పని చేయరని ఎవరు చెప్పగలరు ?