Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ అత్యధికంగా అమెరికాను ఆరుసార్లు సందర్శిస్తే ఫ్రాన్స్‌,రష్యా, చైనా ఐదుసార్లు వెళ్లారు. చైనా అధినేత గ్జీ జింపింగ్‌ను పద్దెనిమిది సార్లు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే చైనా తన ప్రధమ శత్రువు అన్నట్లుగా ఇంటా బయటా కనిపించేందుకు తాపత్రయ పడుతున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తా వ్యాఖ్యలను చూస్తే దేశాన్ని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. రాజకీయంగా భవిష్యత్‌ ఏమిటన్నది మోడీ, బిజెపికి సంబంధించిన అంశాలు. కానీ వాటితో యావత్‌ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టటమే ఆందోళన కలిగించే అంశం. కొందరికి మోడీ, బిజెపి చర్యల్లో ఆకాశమంత దేశభక్తి, వాటిని విమర్శించే వారిలో పాతాళమంత దేశద్రోహం కనిపించవచ్చు. సామాజిక మాధ్యమంలో కాషాయ తాలిబాన్లు, వారి ప్రచారానికి ప్రభావితులైన వారిలో యుద్దోన్మాదం కనిపిస్తోంది. చలి కాలం వచ్చింది గానీ లేకపోతేనా…. అన్నట్లు కబుర్లు చెబుతారు. చైనా, పాకిస్ధాన్‌ మీద ఒకేసారి పోరాడి విజయం సాధించగల సత్తాను నరేంద్రమోడీ దేశానికి సమకూర్చారన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో భావోద్వేగాలకు గురికాకుండా కొన్ని అంశాలను పరిశీలించుదాం.


సామాజిక మాధ్యమాల్లో కొంత మంది కౌటిల్యుడు లేదా చాణక్యుడు చెప్పాడంటూ కొన్ని అంశాలను చెబుతుంటారు. సన్‌ జు చైనా కౌటిల్యుడిగా పరిగణిస్తారు. ఎవరితో, ఎలా , ఎప్పుడు యుద్దం చేయాలి అన్న ప్రశ్నకు – ఇరు పక్షాలూ సమంగా ఉంటే మనం యుద్దానికి సై అనవచ్చు. మన సంఖ్య తక్కువగా ఉంటే శత్రువుకు దూరంగా ఉండాలి, ఏ విధంగా చూసినా తక్కువే అయితే మనం అతన్నుంచి దూరంగా పోవాలి. శత్రువు గురించి తెలిస్తే నీ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి, ఒక వంద యుద్దాల ఫలితాల గురించి నువ్వు భయపడాల్సిన పనిలేదు. నీ గురించి నీకు తెలిసినా శత్రువు గురించి తెలియకపోతే నువ్వు సాధించిన ప్రతి విజయం వెనుక ఒక పరాజయం వస్తుంది. నీ గురించి నీకు , శత్రువు గురించి తెలియకపోయినా ప్రతి పోరులోనూ ఓటమే. పోరు సలపకుండానే శత్రువును అదుపులోకి తీసుకోవటం ఉన్నతమైన యుద్ద కళ.నువ్వు అన్ని యుద్దాలలోనూ పోరాడటం, గెలవటం కాదు, ఎలాంటి పోరు లేకుండానే శత్రువు ప్రతిఘటనను దెబ్బతీయటం ఉన్నత మేథాశక్తికి నిదర్శనం.- అన్నది సన్‌ జు నీతి సారాంశం.

కౌటిల్యుడు చెప్పిందేమంటే -శత్రువు బలవంతుడు అయితే అతని సలహాలను అనుసరించవచ్చు, అతను బలహీనుడు అయితే దెబ్బతీయాలి.ఒక వేళ సమానుడు అయితే బలంతో లేదా స్నేహంతో అతన్ని అదుపులో ఉంచాలి. దాడి చేసే వారు తన, శత్రువు బలం,బలహీనతలు, లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి, ముందుకు సాగబోయే ముందు నిర్దారించుకోవాలి. తరువాత పూర్తి స్ధాయిలో ముందుకు పోవాలి, లేనట్లయితే మౌనంగా ఉండాలి. ద్వేషం తర్కబద్దమైన ఆలోచననను అంతం చేస్తుంది,కనుక శత్రువు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతన్ని ప్రేమించేందుకు ప్రయత్నించు. సంధించిన బాణం ఎదుటి వ్యక్తిని సంహరించవచ్చు, లేకపోవచ్చు. తెలివిగల వాడి తంత్రం గర్భంలో ఉన్నవారిని కూడా అంతం చేస్తుంది. నేనయితే సాయుధ పోరును సూచించను, లక్ష్య సాధనకు కుట్ర, తంత్రం, మోసం వంటి సైనికేతర చర్యలన్నింటినీ ప్రయోగించవచ్చు. చైనా ఏం చేస్తోందన్నది ముఖ్యం కాదు, మనం కౌటిల్యుడు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామా ?


చైనా పెట్టుబడులు, అమెరికా మిలిటరీ ఆయుధ సంపత్తి, ప్రాంతీయ శక్తి – మూడింటిని కలిగి ఉండటం మోడీకి సాధ్యమేనా అనే శీర్షికతో యూరేసియా టైమ్స్‌ పత్రిక ఒక విశ్లేషణను ప్రచురించింది. దాని సారాంశం ఇలా ఉంది. సరిహద్దులలో చైనాతో ఘర్షణలను ప్రపంచమంతా ఆసక్తితో చూస్తోంది. భారత్‌ గనుక వెనుకా ముందాడుతుంటే చైనా విస్తరణ చర్యల అజెండాను నిలిపివేసేందుకు జరిపే ప్రయత్నాలకు హాని మరియు నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవాలని అమెరికా నేతలు భారత్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాతో భారత్‌ వాణిజ్యం కొనసాగుతూనే ఉంది. ఎగుమతులు- దిగుమతులపై లడఖ్‌ వివాదం పరిమితంగా లేదా అసలేమీ ఉన్నట్లు కనిపించటం లేదు. ఆ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో రసాయనాలు, ఎలక్ట్రికల్‌ మరియు వైద్య పరికరాల దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. మోడీ సర్కార్‌ అనేక చైనా యాప్‌లను నిషేధించినప్పటికీ అవి కేవలం పరువు కాపాడుకొనే చర్యలు మాత్రమే. అనేక రంగాలలో బిలియన్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. వేలాది అంకుర సంస్ధలు చైనా పెట్టుబడులతో విజయాలు సాధిస్తున్నాయి. సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ ఆయుధాలు తప్ప దాదాపు అన్నింటికీ చైనా మీద ఆధారపడుతున్నది.
నరేంద్రమోడీ చైనా విధానాన్ని చూస్తే ఒక మార్గంలో పయనిస్తున్నట్లు కనిపించటం లేదు, తరువాతేమి చేస్తారో అంచనాకు అందటం లేదు. ఇది నరేంద్రమోడీకి ఒక విచిత్రమైన పరిస్ధితిని తీసుకు వచ్చింది. చైనాతో సంబంధాలను పూర్తిగా బహిష్కరించలేరు లేదా యుద్ధాన్ని ఎంచుకోలేరు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించేందుకు చైనా కరాఖండిగా తిరస్కరించటం భారత ప్రభుత్వానికి విషయాలను కష్టతరంగా మార్చింది. ఈ వివాదాన్ని తొలుత భారతే ప్రారంభించిందని, ఆర్టికల్‌ 370 , కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమే రెండు దేశాల మధ్య వివాదాంశంగా కనిపిస్తున్నది. చైనాతో ఘర్షణ పడటం లేదా సంబంధాలను మెరుగుపరచుకోవటమా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాలి. ఇటు చూస్తే గొయ్యి అటు చూస్తే నుయ్యి అన్నట్లుగా ప్రభుత్వం మధ్యలో ఇరుక్కుపోయింది. చైనా డిమాండ్లకు అంగీకరించితే అంతర్గతంగా పరువు పోతుంది. ఒప్పుకోకపోతే వివాదం మరింత దిగజారే ముప్పు ఉంది. అమెరికా కూటమితో మరింతగా దగ్గరయ్యే క్రీడను నరేంద్రమోడీ ఆడుతున్నందున భారత్‌కు విషయాలు మరింత సంక్లిష్టం కావటం తప్ప మరొకటి జరగదు. ఈ విపత్కర పరిస్ధితి నుంచి మోడీ భారత్‌ను ముందుకు నడిపించగలరా ?


అదే యూరేసియా టైమ్స్‌ మరో విశ్లేషణలో మూడు సంవత్సరాల క్రితం డోక్లాంలో అత్యంత శక్తివంతమైన చైనాకు భారత్‌ చిల్లు పెట్టింది లేదా గాలి తీసింది అన్నది ఒక అవాస్తవం అని అమెరికా గూఢచార నివేదిక నిర్ధారించింది అని పేర్కొన్నారు. భూటాన్‌లోని డోక్లాం ప్రాంతంలో 2017లో రెండు దేశాల సేనలు 75 రోజుల పాటు ముఖాముఖీ తలపడిన విషయం తెలిసిందే. దుందుడుగా వ్యవహరించిన చైనా మిలిటరీకి షాక్‌ తగిలే విధంగా భారత్‌ వ్యవహరించిందని విశ్లేషకులు అప్పుడు పేర్కొన్నారు. అయితే డోక్లాం ఉదంతంలో గట్టి పాఠం నేర్చుకున్న చైనా ఆ ప్రాంతంతో పాటు వాస్తవాధీన రేఖ సమీపంలో అదనపు మిలిటరీ నిర్మాణాలను చేపట్టిందని భూ రాజకీయ గూఢచార వ్యవహారాల మీద అధ్యయనం చేసే అమెరికా సంస్ధ స్ట్రాట్‌ఫర్‌ వెబ్‌ సైట్‌ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. గత మూడు సంవత్సరాలలో భారత సరిహద్దులో చైనా తన వైమానిక స్ధావరాలు, వైమానిక రక్షణ కేంద్రాలు, హెలిపోర్టులను రెట్టింపు చేసింది. కొత్తగా పదమూడు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా మూడు వైమానిక స్ధావరాలు, ఐదుశాశ్వత వైమానిక రక్షణ కేంద్రాలు, ఐదు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభించింది. లడఖ్‌ ఘర్షణ ప్రారంభమైన తరువాతే నాలుగు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు అంతరిక్ష చిత్రాలు, ఇతర సమాచారం తెలుపుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో చైనా శాశ్వత మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా తన స్దానాన్ని పటిష్ట పరచుకుంది. ఇదే వ్యూహాన్ని భారత సరిహద్దులో కూడా అనుసరిస్తున్నదని విశ్లేషకుడు పేర్కొన్నారు.


చైనా, ఇతర ఇరుగు పొరుగుదేశాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు, ఇతర అవసరాల కోసం అమెరికాతో మన దేశం అనేక ఒప్పందాలు చేసుకున్నది. అదేమీ ఉచితం కాదు. ఆ రంగంలో మనం ఉంటే అమెరికాతో ఒప్పందంతోనే పని లేదు, కనుక మూల్య రూపం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో చైనా అలాంటి సమాచారాన్ని సేకరించేందుకు మూడు స్వంత మిలిటరీ యావోగాన్‌ ఉపగ్రహాలను ప్రారంభించింది. యావోగాన్‌ పేరుతో ఉపగ్రహాల ప్రయోగం 2006 నుంచి జరుగుతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాల కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నౌకల నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల వ్యవస్ధలను దెబ్బతీసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని చైనా సమకూర్చుకుంటోంది. సముద్రాలలో ఉన్న యుద్ద నౌకలు విడుదల చేసే రేడియో, ఎలక్ట్రానిక్‌ సంకేతాల(సిగల్స్‌)ను పసిగట్టటంతో పాటు అవి వెలువడుతున్న ప్రాంతాలను స్కాన్‌ చేసి యుద్ద నావల సంచారాన్ని పసిగడతాయి. ఈ ఉపగ్రహాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించి శత్రు యుద్ద నావల మీద క్షిపణులతో ఏ లక్ష్యంపై అయినా కేవలం 40 నిమిషాల్లో దాడి చేయవచ్చని చైనా నిపుణులు చెబుతున్నారు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ఒక వేళ అమెరికా అందచేసిన ఆయుధాలతో కవ్వింపులు, దాడులకు తెగబడితే దానికి మద్దతుగా దక్షిణ చైనా సముద్రంలో సంచరించే అమెరికా యుద్ద నౌకలను ముందుగా అడ్డుకోవాలన్నది చైనా ఎత్తుగడ. గత ఏడాది అక్టోబరు నాటికి అంతరిక్షంలో యావోగాన్‌-30 రకం ఉపగ్రహాలు పదిహేను ఉన్నాయి. తాజాగా ప్రయోగించినవి దాదాపు ప్రపంచమంతటినీ చుట్టి సమాచారాన్ని సేకరిస్తాయి. ఇలాంటి సమాచారాన్ని తాము భారత్‌కు అందచేస్తామని అమెరికా చెబుతోంది. ఇటీవల దానితో సంతకాలు చేసిన బెకా ఒప్పంద సారం అదే.


గాల్వాన్‌ లోయ ఉదంతం తరువాత తూర్పు సరిహద్దులో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో టిబెట్‌లోని చామడో బంగడా విమానాశ్రయాన్ని చైనా విస్తరిస్తున్నట్లు ఉపగ్రహచిత్రాలు చూపుతున్నాయి. ఈ చిత్రాలను పొరుగు సేవల పద్దతిలో సొమ్ము చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి కాలంలో మన మీడియాలో వస్తున్నవి అవే. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న బంగడా విమానాశ్రయంలో రెండు రన్‌వేలు ఉన్నాయి. ఒకదానిలో రాకపోకలు నడుస్తున్నాయి, విదేశీ పౌరులకు వాటిలో ప్రవేశం లేదు. రన్‌వేకు ఒక వైపు మిలిటరీ తరహా నిర్మాణాలు ఉన్నట్లు , గాల్వాన్‌ ఉదంతం తరువాతే ఇవి ఏర్పాటయినట్లు మీడియా విశ్లేషకులు రాస్తున్నారు. అరుణాచల్‌ సరిహద్దులో కనీసం నాలుగు చోట్ల ఆగస్టు-సెప్టెంబరు నుంచి చైనా మిలిటరీ మోహరింపు కనిపిస్తున్నదని చైనా నిపుణుడు కలపిట్‌ ఏ మనికికార్‌ చెప్పారు. సరిహద్దుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చైనా మిలిటరీ ఉందని, భారత్‌ మీద వత్తిడిని పెంచే ఎత్తుగడ కావచ్చని అన్నారు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతున్నది. 1962 యుద్దంలో ఆ ఏడాది అక్టోబరు 20న చైనా మిలిటరీ అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది, వాటిలో తవాంగ్‌ పట్టణం ఉంది, అసోంలోని తేజ్‌పూర్‌ పట్టణం వరకు చైనా సేనలు వచ్చాయి. అయితే నవంబరు 20 తరువాత చైనా తనంతట తానే వెనక్కు తగ్గి వాస్తవాధీన రేఖ వెనక్కు వెళ్లిపోయింది. చైనా ఇప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని గుర్తించటం లేదు. ఈ కారణంగానే దలైలామా తవాంగ్‌ పట్టణాన్ని సందర్శించేందుకు నిర్ణయించుకున్నపుడు అభ్యంతరం తెలిపింది.

ప్రతి దేశం చిన్నదా పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడున్న స్ధితిలో రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అవసరం. దానికి మన దేశం మినహాయింపు కాదు. దానికి హడావుడి, రాజకీయ ప్రచారం చేసి ఇతర దేశాలను రెచ్చగొట్టాల్సిన, మనలను అనుమానించే స్ధితిని కల్పించాలని కౌటిల్యుడు చెప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దంలో అవసరం లేకపోయినా జపాన్‌పై అణుబాంబులు వేశారు. అమెరికన్లు ప్రపంచాన్ని భయపెట్టి లొంగదీసుకొనేందుకు అమలు జరిపిన యుద్ద తంత్రం తప్ప మరొకటి కాదు. తరువాత మనతో సహా అనేక దేశాలు అణ్వాయుధాలను తయారు చేశాయి. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ప్రతి దేశం అణుబాంబుతయారీకి దగ్గరలో ఉన్నట్లే లెక్క.


చాణుక్యుడు, సన్‌ జు చెప్పినట్లు ఎన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయి ? నీ శత్రువు శత్రువు నీకు మిత్రుడు అన్న నీతి తెలిసిందే. ఆ మేరకే చైనాకు వ్యతిరేకంగా అమెరికా, ఇతర దేశాలతో మనం చేతులు కలుపుతున్నట్లు సమర్ధించుకోవచ్చు. దానిద్వారా వచ్చే లాభాలతో పాటు నష్టాలు, సమస్యలను కూడా బేరీజు వేసుకోవాలి. చాణుక్యుడు చెప్పింది అదే. కాశ్మీర్‌ను ఆక్రమించిన కారణంగా పాకిస్ధాన్‌ మనకు శత్రువుగా మారింది. అలీన విధానం అనుసరిస్తూ అంతర్జాతీయ పరిణామాల్లో అనేక విషయాల్లో మనం అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకున్నాం. దానికి ప్రతిగా పాకిస్ధాన్‌న్ను ప్రోత్సహించి మన దేశం మీద అమెరికా ఎన్నికుట్రలు చేసిందీ, కాశ్మీర్‌, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎంత నష్టపరచిందీ చూశాము. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అయ్యామో, విస్తారమైన మన మార్కెట్‌ను ఎప్పుడు తెరిచామో, దాని ఆయుధాలను -ఇటీవలి కాలంలో చమురును సైతం – కొనటం ఎప్పుడైతే ప్రారంభించామో దానికి పాక్‌తో పని లేదు. కానీ జరిగిందేమిటి ? తమను ఉపయోగించుకొని వదలివేసిందన్న దుగ్ద పాక్‌లో తలెత్తి చైనాకు దగ్గర అయింది.

శత్రువులను పెంచుకున్న వారు తెలివైన రాజనీతిజ్ఞులు కాదు. అమెరికా అండ చూసుకొని మన యుద్ద ప్రేలాపనలు ఎంతవరకు పోయాయంటే ఒకేసారి రెండున్నర యుద్దాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సైనికాధికారి బిపిన్‌ రావత్‌ లడఖ్‌ ఉదంతాలకు ఎంతో ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యమే బస్తీమే నిరంతరం ఎక్కడో ఒక చోట యుద్దం చేసింది తప్ప ఒకేసారి అనేక యుద్దాలు చేయలేదు.రెండున్నర యుద్దాలు అంటే చైనా, పాకిస్ధాన్‌, ఉగ్రవాదుల మీద అని అర్ధం.ఉగ్రవాదాన్ని అణచేందుకే కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చామని, మిలిటరీకి అధికారాలు ఇచ్చామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఏడాది కాలంలో ఉగ్రదాడుల్లో 54 మంది పౌరులు మరణించగా కేంద్రపాలనలోకి వచ్చిన ఏడాది కాలంలో 45 మంది మరణించారు. దీన్ని బట్టి ఏం జరుగుతోందో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు.


రామ-రావణ యుద్దంలో లంకకు వారధి నిర్మాణంలో ఉడుత సాయం కథ తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మన ఇరుగుపొరుగున ఉన్న దేశాలో నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక ఒక్కటీ మనకు స్నేహంగా లేదు. అమెరికా అండ చూసుకొని ఈ దేశాలను విస్మరించాము. తద్వారా వాటిని చైనాకు దగ్గర చేయటం రాజనీతా, తెలివిగల వ్యవహారమా ? పశ్చిమాసియాలో సైనికంగా బలమైన దేశాల్లో ఇరాన్‌ ఒకటి. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అది చైనా వైపు మొగ్గింది. దాంతో అమెరికా ఆంక్షలను మరింత పెంచి మనలను కూడా బెదిరించగానే దాన్నుంచి చమురు కొనటం ఆపేశాము. దాంతో వారు చైనాకు మరింత దగ్గరయ్యారు, అసలేమి చేస్తున్నామో, పర్యవసానాలేమిటో అర్ధం అవుతోందా ? బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఇరాన్‌, పాకిస్ధాన్‌, శ్రీలంక, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ ఏవీ మనకు మిత్రదేశాలుగా లేవు.

మనం ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ యుద్ద విమానాలు తెచ్చుకున్నాం. అవి అధిక ధరలకా, దానిలో ముడుపులున్నాయా లేదా అన్నది- ఉంటే ఏదో ఒక రోజు బయటపడకపోదు- కాసేపు పక్కన పెడదాం. మరోవైపు వాటితో సమంగా లేదా కాస్త ఆధునికమైన విమానాలను స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో చైనా ఉంది. మనం ఆ రంగంలో ఎంతో వెనుకబడి ఉన్నాం కనుకనే మనకు విమానాలు అమ్మే దేశాలన్నీ చైనాకు వ్యతిరేకంగా మనలను ఎగదోస్తున్నాయి. భారత్‌ గనుక తాను తయారు చేస్తున్న 114 ఎఫ్‌ 21 రకం విమానాలను కొనేందుకు అంగీకరిస్తే ఇతర దేశాలకు వాటిని విక్రయించబోనని అమెరికా లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చెప్పింది. ఎంతకాలం ఇలా విదేశాల మీద ఆధారపడి ఆయుధాలు కొనగలం? ఇక్కడ సమస్య మనం విమానాలను ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అన్నది. పరిశోధన-అభివృద్దికి నిధులు కేటాయిస్తే ఏదీ అసాధ్యం కాదు. మనకేమీ నిపుణులు తక్కువ లేరు. యాభై ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలన్నింటినీ ఐదేండ్లలో తాను సరి చేశానని నరేంద్రమోడీ దళం చెప్పుకుంటుంది. మరి పరిశోధనా-అభివృద్ధి రంగంలో చేసిందేమిటి ?


యునెస్కో సమాచారం ప్రకారం 1996-2018 మధ్య మన దేశంలో పరిశోధన-అభివృద్ధికి చేసిన ఖర్చు జిడిపిలో 0.639 – 0.65 శాతం మధ్య ఉంది. మధ్యలో 2008లో 0.859 శాతానికి పెరిగి క్రమంగా దిగజారింది. దీనికి కారణం నరేంద్రమోడీ తప్ప నెహ్రూ కాదు కదా ! ఇదే కాలంలో చైనా కేటాయింపు 0.563 శాతం నుంచి 2.186శాతానికి పెరిగింది. 2017-18 ఆర్ధిక సర్వేలో పరిశోధన రంగానికి నిధులు రెట్టింపు చేయాలని పేర్కొన్నారు. ఆ జాడలు ఎక్కడా లేవు. ప్రపంచంలో పరిశోధన-అభివృద్ధికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్న దేశాలలో అమెరికా తరువాత చైనా ఉంది. 2020 నాటికి తన జిడిపిలో రెండున్నర శాతం ఖర్చు చేయాలన్న లక్ష్యానికి 2.23శాతంతో చైనా దగ్గరలో ఉంది. అమెరికా 2018లో 2.83శాతం ఖర్చుచేసింది. ఓయిసిడి దేశాల సగటు ఖర్చు 2.38, ఇజ్రాయెల్‌ 4.9, దక్షిణ కొరియా 4.5శాతం ఖర్చు చేశాయి.
చైనా గత రెండు ద శాబ్దాలుగా ఖర్చు చేసిన ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నది. అన్ని రంగాలలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో ధీటుగా ఉంది. గతంలో ఆయుధాలను దిగుమతి చేసుకొనేదిగా ఉన్న దేశం నేడు తొలిసారి ఎగుమతులను ప్రారంభించింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది. 2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు.


పరిశోధన-అభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చదివే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. అదేపని మనం ఎందుకు చేయటం లేదు ?


చైనా విజయాల గురించి నమ్మని వారిని ఏమీ చేయలేం. సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు, ఎంతో డబ్బు మిగులుతుంది, ప్రయోజనం కలుగుతుంది కదా ? గోమూత్రం తాగే వారిని తాగనిద్దాం-దేశానికి నష్టం లేదు. గోమూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పే వారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకూడదు ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వొద్దు. దేశాన్ని, సమాజాన్ని మరింతగా వెనక్కు నెట్టే యుద్దం అసలే వద్దు !