ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలక్ట్రరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్‌కు 306 ఓట్లు వస్తాయని మీడియా విశ్లేషణలు తెలిపాయి. ఈ కారణంగానే మన ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక దేశాల నేతలు అభినందనలు పంపుతున్నారు.అమెరికా నగరాలలో డెమోక్రాట్ల విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమెరికా మిత్ర రాజ్యాలు లేదా అది శత్రువులుగా పరిగణిస్తున్న దేశాలూ బిడెన్ ఏలుబడిలో సంబంధాలు, సమస్యలూ ఎలా ఉంటాయా అన్న మధనంలో పడ్డాయి.ప్రపంచీకరణ, అందునా ఏకైక అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రతి పరిణామ పర్యవసానాలూ ప్రపంచం మీద ఉంటాయి కనుక ఇది సహజం.
అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి ఓడిపోయిన వారిలో 11వ వ్యక్తిగా డోనాల్డ్ ట్రంప్ చరిత్ర పుటలకు ఎక్కాడు. ఈ ఎన్నికల గురించి ప్రపంచంలో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది ఎవరికయ్యా అంటే అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ (ఈసారి ట్రంప్ సర్కార్ ) అని నినాదమిచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, దాని మీద ఎలాంటి అభ్యంతరమూ తెలపని సంఘపరివార్ లేదా బిజెపికి అన్నది స్పష్టం. గతంలో మన పాలకులు ఎవరూ మరొక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అంతర్గతంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ దేశం ఎలా జోక్యం చేసుకున్నప్పటికీ అదంతా లోగుట్టు వ్యవహారం. బహిరంగంగా జోక్యం చేసుకొని ఒక పక్షానికి మద్దతు పలికింది నరేంద్రమోడీ మాత్రమే. అందువలన ఇబ్బంది పడేది కూడా మోడీ అండ్ కో మాత్రమే. ట్రంప్ మీద జోకులేసే వారు మోడీని కూడా కలిపి ఆడుకున్నా చేయగలిగిందేమీ లేదు.
అనేక సార్లు బిజెపి ఐటి విభాగం అభాసుపాలైంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. 2014 సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపిన సందర్భంగా ఇచ్చిన విందులో నాడు ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ – మోడీ కలుసుకున్న ఫొటోను ఇప్పుడు విడుదల చేసి బైడెన్‌తో మోడీకి ఎంత సాన్నిహిత్యం ఉందో చూడండి అని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు నిరాకరించింది కూడా అదే బిడెన్, అదే పార్టీకి చెందిన బరాక్ ఒబామా అన్న విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రధాని అవగానే బరాక్ ఒబామా స్వాగతం పలికారు. దానికి చూశారా మా మోడీ తడాఖా అని బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఎగిరెగిరి పడ్డారు. అక్కడ ఆహ్వానం నరేంద్రమోడీకి కాదు, భారత ప్రధానికి అన్నది అసలు వాస్తవం. ఇప్పుడు ప్రత్యేక పరిస్దితి తలెత్తింది. గుజరాత్‌లో జరిపిన మారణకాండలో మోడీ మీద వచ్చిన విమర్శల కారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒబామా సర్కార్ అనుమతి ఇవ్వలేదు. తరువాత పరిస్ధితి మారింది కనుక ఒక దేశాధినేతగా ఆహ్వానం పలికారు. తాజా ఎన్నికలలో బైడెన్‌కు వ్యతిరేకంగా,ట్రంప్‌కు మద్దతుగా ప్రధాని హౌదాలో అమెరికా వెళ్లి మరీ ప్రచారం చేయటాన్ని ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన తీరులో మోడీ ప్రవర్తన చౌకబారుగా ఉందా, రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకం, ప్రమాదకరమైన పోకడ. బిజెపి ఐటి విభాగపు నేత అమిత్ మాలవీయ ఒక ట్వీట్ చేస్తూ వామపక్ష శక్తులు ఆశాభంగం చెందుతారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైతే ఆయన ఏది చెబితే అది వినాల్సి రావటం మోడీకి పెద్ద దెబ్బ అవుతుందనే భ్రమల్లో దుష్ట వామపక్ష శక్తులు ఉన్నాయి, వారు చివరికి ఆశాభంగం చెందుతారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బైడెన్ అయినా మరొకరు అయినా చక్రం తిప్పేది అమెరికా అధ్యక్షుడు తప్ప ప్రస్తుత పరిస్ధితిలో మోడీ లేదా మరొక దేశనేత కాదు.
మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలన్నది ట్రంప్ ఎత్తుగడ. అదే బైడన్ కూడా అనుసరిస్తే, ఆలోచన లేకుండా మనం భుజం అప్పగిస్తే ఉపయోగించుకుంటారు. చైనా మార్కెట్‌ను పూర్తిగా తమకు అప్పగించాలని, ప్రపంచంలో ఎక్కడా చైనా పోటీకి రాకూడదని అమెరికా కోరుకుంటోంది.అందుకు ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకుంటున్నది. గతంలో మన మార్కెట్ కోసం మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ను ఎగదోసి మన మీద వత్తిడి తెచ్చింది. మన పాలకులు లొంగిపోవటంతో ఇప్పుడు పాక్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ లోగా చైనా ఆర్ధికంగా ఎదుగుతుండటంతో దానికి వ్యతిరేకంగా మనలను ప్రయోగించేందుకు చూస్తున్నది. అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తారు. అందువలన తమ అవసరం కోసం బిడెన్ కూడా మోడీని మరింతగా కౌగలించుకోవచ్చు, ట్రంప్ ఇచ్చిన దేశపిత మాదిరి మరొక అపహాస్యపు బిరుదును ఇవ్వవచ్చు. దాన్ని గమనించకుండా మన అవసరం అమెరికాకు ఉంది, ఇదే మన గొప్ప అని మన భుజాలు మనం చరుచుకుంటే నగుబాట్లు పాలుకావటం తప్ప మరొకటి ఉండదు. ట్రంప్‌కు మద్దతు ప్రకటించినపుడు చూపిన హావభావాలనే రేపు బిడెన్‌తో కౌగిలింతలలో కూడా నరేంద్రమోడీ ఎలా ప్రదర్శిస్తారు ? అప్పుడు అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ నినాదం గుర్తుకు రాదా? వారు మానవ మాత్రులు కాదా?
ఈసారి ట్రంప్ ప్రభుత్వం అని చెప్పారు తప్ప ట్రంప్‌కు ఓటు వేయమని కోరలేదుగా అని బిజెపి నేతలు వాదించవచ్చు. హూస్టన్ నగరంలో హౌడీమోడీ కార్యక్రమం తరువాత ట్రంప్ చేసిన ట్వీట్‌లు ఏమిటి ? అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీ సమ్మతి పొందారు.హూస్టన్‌లో 50వేల మందికి పైగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు, ట్రంప్‌తో చేతులు కలిపి నడిచారు అని ట్రంప్ పత్రికా కార్యదర్శి మెకెనీ ట్వీట్ చేశారు. తెలివిగా మద్దతు ప్రకటించామని మోడీ మద్దతుదారులు సంతోష పడ్డారు. ట్రంప్‌కు తన సమ్మతి ఉందని భారత అమెరికన్లకు చెప్పిన భారత ప్రధాని అన్న అర్ధం వచ్చే శీర్షికతో బ్లూమ్‌బెర్గ్ రాసింది. దానికి ఇద్దరూ కౌగలించుకున్న ఫొటోను సాక్ష్యంగా ప్రచురించింది. హూస్టన్‌లో ఇచ్చిన నినాదం మీద విమర్శలు తలెత్తటంతో అహమ్మదాబాద్‌లో మోడీ నోటి వెంట అబ్‌కీ బార్ అనే నినాదం వెలువడలేదు గాని అంతకంటే ఎక్కువ పొగడ్తలతో నింపివేశారు.భారతలో ట్రంప్ ఎన్నికల సభమాదిరిగా నిర్వహించారు.ఈ సభ వీడియోలను కూడా ట్రంప్ అమెరికన్-భారతీయులలో ప్రచారానికి వినియోగించుకున్నారు. అన్నింటికీ మించి హూస్టన్ సభకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరుకావటాన్ని చూసి ఇంకేముంది అమెరికన్-భారతీయుల మీద కూడా మోడీ ప్రభావం ఎలా పడిందో చూడండి అంటూ ఊదరగొట్టారు.
రెండు శిబిరాలుగా చీలిన అమెరికాలో ఒక శాతం ఓట్లు కూడా ఫలితాలను తారు మారు చేస్తాయి. అందువలన తన ఓటమిని ముందుగానే ఊహించిన ట్రంప్ భారతీయ ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ పలుకుబడిని ఉపయోగించుకోవాలని చూశాడు కనుకనే పై వ్యవహారాలన్నీ నడిచాయి. ట్రంప్ ఎత్తుగడలకు ప్రతిగా భారత-ఆఫ్రికా వారసత్వం కలిగిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష స్ధానానికి నిలిపి డెమోక్రాట్లు దెబ్బతీశారు.ఎన్నికలకు కొద్ది వారాల ముందు జరిపిన ఒక సర్వేలో 72శాతం మంది భారత సంతతి డెమోక్రాట్లకు, 22శాతం ట్రంప్‌కు ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారని తేలింది. ఎన్నికలు జరిగిన తరువాత వెల్లడైన వార్తలను చూస్తే తటస్ధంగా ఉన్న ఓటర్లు కూడా డెమోక్రాట్ల వైపే మొగ్గినట్లు కనిపిస్తోంది. అమెరికన్ భారతీయలలో నరేంద్రమోడీ తన పలుకుబడిని ఎక్కువగా ఊహించుకున్నారన్నది స్పష్టం. అందుకే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మెజారిటీ భారతీయులు ట్రంప్‌కు ఓటు వేయలేదు, మొత్తంగా పరాజయం, అంటే నరేంద్రమోడీకి రెండు దెబ్బలు అని చెప్పవచ్చు.
కాశ్మీరు, సిఎఎ, ఎన్‌ఆర్‌సి సమస్యల మీద డెమోక్రటిక్ పార్టీ ఎంపీలు మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. కాశ్మీరీలు ఒంటరిగా లేరు,మేమందరం చూస్తున్నాము, అవసరం అయితే జోక్యం చేసుకోవాలి అని తాజాగా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన కమలా హారిస్ గతంలో చెప్పారు.డెమోక్రటిక్ పార్టీ ఎంపీ ప్రమీలా జయపాల్ గతంలో నరేంద్రమోడీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గతేడాది డిసెంబరుల్లో ఆమె సభ్యురాలిగా ఉన్న పార్లమెంటరీ బృందం భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమెను మినహాయించాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్ కోరగా అమెరికా నిరాకరించింది. దాంతో ఆ బృందంతో జరగాల్సిన సమావేశాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి ఆమె పెద్ద మెజారిటీతో గెలిచారు. అలాంటి ఎంపీలు నరేంద్రమోడీ సర్కార్ గురించి ఇప్పుడు మౌనంగా ఉంటారా ? అదే ట్రంప్ విషయానికి వస్తే అహమ్మదాబాద్ పర్యటన సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిఎఎ గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం జరుపుతానన్నాడు. నరేంద్రమోడీ విధానాలకు మద్దతు పలికాడు. మన దేశాన్ని బెదిరించటం, కంపు దేశమని నోరు పారవేసుకోవటం గురించి మోడీ మౌనం దాల్చినా దేశ ప్రజలు తీవ్రంగానే స్పందించటాన్ని చూశాము.
బైడెన్ గెలుపు మన దేశానికి లాభమా నష్టమా అన్న చర్చ ప్రారంభమైంది. ఒకటి స్పష్టం అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాలే వారికి ముఖ్యం. మీ ఇంటికొస్తే మాకేం పెడతారు, మా యింటి కొస్తే మాకేం తెస్తారు అన్నట్లుగా ఉంటుంది. డెమోక్రాట్లు అందరికీ ఆరోగ్యం అనే ఎన్నికల వాగ్దానం చేశారు. దాన్ని ఆచరణలో పెడితే మన ఔషధ పరిశ్రమకు మరింత ఉపయోగం అని కొందరు లెక్కలు వేస్తున్నారు. అదే విధంగా హెచ్1బి వీసాలు మరిన్ని ఇవ్వొచ్చని కొందరు ఆశపడుతున్నారు. అమెరికా కార్పొరేట్ సంస్ధలకు చౌకగా పని చేసే వారు కావాలి. ఎన్నికల్లో ఓట్ల కోసం ట్రంప్ స్ధానిక యువతను ఆకట్టుకొనేందుకు విదేశీయులకు వీసాలు బంద్ అన్నట్లు హడావుడి చేశారు. నిజంగా అలాంటి ఆంక్షలను అమలు జరిపితే అక్కడి కార్పొరేట్లు సహించవు.
చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ రెండు సంవత్సరాలు దాటినా సాధించిందేమీ లేదు. ఒక వేళ బైడెన్ దాన్ని కొనసాగించినా ఒరిగేదేమీ లేదు. ట్రంప్ ప్రచారం చేసినట్లు బైడెన్ కమ్యూనిస్టు కాదు, పక్కా కార్పొరేట్ల ప్రతినిధి. బరాక్ ఒబామా హయాంలో కూడా అమెరికా యుద్దాలు చేసిన విషయం మరచి పోకూడదు. అందువలన ట్రంప్ మాదిరి దురహంకారం, నోటి దురుసుతనం ఉండకపోవచ్చు తప్ప అమెరికా మౌలిక విధానాల్లో మార్పు వచ్చే అవకాశం లేదు. చైనాతో వైరం కంటే రాజీయే లాభం అనుకుంటే దూకుడు తగ్గించి, కొంత ఆలస్యం చేయవచ్చు తప్ప అమెరికా పెత్తందారీ వైఖరిలో మౌలిక మార్పు ఉండే అవకాశాలు లేవు.
డోనాల్డ్ ట్రంప్ ఘోర పరాజయం – నరేంద్రమోడీకి చెప్పుకోలేని దెబ్బ !
08 Sunday Nov 2020
Posted BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA
in