Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
బీహార్‌లో జెడియు-బిజెపి కూటమి గెలుపు అక్కడి అభివృద్ది పనులకు విజయమని ప్రధాని నరేంద్రమోడీ వర్ణించారు. బీహార్‌ ప్రజాస్వామ్య గడ్డ అని ఎందుకు పిలుస్తామో ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు.కుటుంబ పాలన గురించి కూడా నరేంద్రమోడీ ప్రస్తావించారు. ఢిల్లీలో జరిగిన బీహార్‌ ఎన్నికల విజయోత్సవ సభలో ప్రధాని చేసిన ప్రసంగమంతా ఇదే ధోరణిలో కొనసాగింది.ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఎవరూ చెప్పలేదని, అనుకూలత కారణంగానే తమ కూటమి 125 స్ధానాలు సాధించిందని బీహార్‌ ఉపముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ చెప్పారు. ఇద్దరు యువరాజులు అధికారం కోసం పోటీ పడుతున్నారని. మరొక సారి అరాచక పాలనా కావాలో లేదో తేల్చుకోవాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని బీహారీలను కోరారు. నిజంగా బీహార్‌లో బిజెపి కూటమి సాధించినదాన్ని ” విజయం ” గా పరిగణించాలా ? ప్రధాని పేర్కొన్న ఇతర అంశాల్లో నిజమెంత ? అంకెలతో ఎలా అయినా ఆడుకోవచ్చు, భిన్న భాష్యాలు చెప్పవచ్చు తప్ప వాటిని మార్చలేము.


భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కొన్ని వేల ఓట్ల తేడాతో అధికారం దక్కటం బీహార్‌లోనే జరిగింది. గతంలో కేరళలో అలాంటి పరిణామం జరిగినప్పటికీ కొన్ని లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది రాసిన సమయానికి ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు కాలేదు. వివిధ మీడియా సంస్దలు అందచేసిన వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నపుడు 0.1 శాతం నుంచి 0.05శాతం మధ్య తేడాలు చూపాయి. ఓట్ల రీత్యా చూస్తే పదమూడు నుంచి 24 వేల ఓట్ల మెజారిటీతో అధిక సీట్లు తెచ్చుకొని ఎన్‌డిఏ కూటమి అధికారం సాధించటం బీహార్‌లో మాత్రమే జరిగింది. ఈ కారణంగానే చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. అసెంబ్లీలోని 243 సీట్లలో మెజారిటీకి అవసరమైన 122గాను ఎన్‌డిఏ 125 తెచ్చుకొన్నది. రాష్ట్రీయ జనతాదళ్‌ లేదా ఆర్‌జెడి-కాంగ్రెస్‌-మూడు వామపక్ష పార్టీల (ఎంజిబి) కూటమి 110, మూడవ కూటమిగా పోటీ చేసిన వాటిలో మజ్లిస్‌ 5, బిఎస్‌పి, విడిగా పోటీలో ఉన్న ఎల్‌జెపి 1, స్వతంత్రులు ఒకరు గెలిచారు. పార్టీల వారీగా చూసినపుడు గత అసెంబ్లీలో 81 స్ధానాలున్న జెడియు 43కు పరిమితం కాగా, బిజెపి 53ను 74కు పెంచుకుంది. ఈ రెండు పార్టీల మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలు ఒకటి నుంచి ఎనిమిదికి పెంచుకున్నాయి. ఆర్‌జెడికి 80కిగాను 75, కాంగ్రెస్‌కు 27కు 19 వచ్చాయి. సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌) మూడు నుంచి 12కు పెంచుకోగా ప్రాతినిధ్యం లేని సిపిఐ, సిపిఎం రెండేసి చోట్ల గెలిచాయి. మజ్లిస్‌ పార్టీ ఐదు, బిఎస్‌పి ఒకటి కొత్తగా సంపాదించాయి. స్వతంత్రులు నాలుగు నుంచి ఒకటికి తగ్గారు.


ఓట్ల వివరాలను చూస్తే వికీపీడియా ప్రకారం జెడియు కూటమికి 37.26శాతం (1,57,01,226), ఆర్‌జెడి కూటమికి 37.21(1,56,77,0320) వచ్చాయి. ఎల్‌జెపి పోటీ చేసిన 134 స్ధానాల్లో 5.66శాతం(23,83,457) ప్రజాస్వామ్య లౌకిక మహాకూటమి పేరుతో పోటీ చేసిన ఆరు పార్టీల కూటమికి 4.5శాతం ఓట్లు వచ్చాయి. బిజెపి పోటీ చేసిన చోట ఎల్‌జెపి తన అభ్యర్ధులను నిలపకుండా ఆ పార్టీకి మద్దతు ప్రకటించింది.అంటే 109 స్ధానాల్లో తన ఓట్లను బదలాయించింది. ఆ పార్టీ సాధించిన ఓట్ల సగటు ప్రాతిపదికగా 4.6శాతం ఓట్లను బిజెపికి వేయించిందని భావించవచ్చు. ఈ ఎన్నికలలో బిజెపికి 19.46శాతం, జెడియుకు 15.39 శాతం వచ్చాయి. ఎల్‌జెపి ఓట్ల బదలాయింపు బిజెపి సీట్లు, ఓట్ల సంఖ్య పెరిగేందుకు దోహదం చేసిందని అంకెలు చెబుతున్నాయి. కనీసం 30 స్ధానాల్లో జెడియు అవకాశాలను దెబ్బతీసిందని ప్రాధమిక సమాచారం వెల్లడించింది. 2019 మేనెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, జెడియు, ఎల్‌జెపి మూడూ కలసి 53.25శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. వామపక్షాలు లేని ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమికి 30.76శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ చూస్తే జెడియు కూటమిలో బిజెపి 96, జెడియు 92, ఎల్‌జెపి 35, హిందూస్దానీ అవామ్‌ పార్టీ రెండు చోట్ల మొత్తం 225 స్ధానాల్లో ఆధిక్యత, 40కి గాను 39లోక్‌ సభ సీట్లును సాధించాయి. ఆర్‌జెడి 9, కాంగ్రెస్‌ 5 స్ధానాలకే పరిమితం అయ్యాయి.(కాంగ్రెస్‌ మాత్రమే ఒక లోక్‌సభ స్ధానంలో విజయం సాధించింది) విడిగా పోటీ చేసిన మజ్లిస్‌ రెండు, ఆర్‌ఎస్‌ఎల్‌పి, సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌) ఒక్కొక్క చోట ఆధిక్యత కనపరిచాయి.


లోక్‌సభ ఎన్నికలలో బిజెపి-జెడియు 17 చొప్పున, ఎల్‌జెపి ఆరు చోట్ల పోటీ చేసి వరుసగా 23.58, 21.81, 7.86శాతం తెచ్చుకున్నాయి.పై వివరాలన్నీ చూసినపుడు ప్రధాని నరేంద్రమోడీ ఎంతగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికలలో ఆ కూటమికి ఓట్లు, సీట్లు కూడా గణనీయంగా తగ్గాయి. మరోవైపు ఆర్‌జెడి కూటమి ఓట్లు, సీట్ల రీత్యా ఎంతో మెరుగుదల సాధించాయి.
ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 40కిగాను 39 స్ధానాలు సాధించిన జెడియు-బిజెపి కూటమి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా 243కు గాను 125 స్ధానాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీహారీల తీర్పు సరికొత్త రాజకీయానికి తెరలేపింది.గత రెండు దశాబ్దాలుగా మూడు స్ధంభాలాటగా మారిన రాష్ట్ర రాజకీయాలలో బిజెపి, ఆర్‌జెడి, జెడియు పార్టీలలో ఏ రెండు కలిసినా అధికారాన్ని పొందే పరిస్ధితి తలెత్తింది. దీన్ని ఉపయోగించుకొని నితీష్‌ కుమార్‌ 15ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే గాక సీట్లు తగ్గినా తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు కూడా ఇదే పొందిక తోడ్పడింది.


తొలిసారి నరేంద్రమోడీ పాలనా కాలంలో 2014-19 మధ్య బిజెపి బంధం నుంచి 15 పార్టీలు వైదొలిగాయి. రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత మూడు పార్టీలు గుడ్‌బై చెప్పాయి.ఈ నేపధ్యంలో బీహార్‌ పరిణామాలను చూడాల్సి ఉంది. మహారాష్ట్ర అనుభవనాన్ని చూసిన తరువాత దాన్ని పునరావృతం కానివ్వరాదని బిజెపి అధిష్టానవర్గం బీహార్‌లో జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి ఇది అనివార్యస్ధితి. ఈ నేపధ్యంలోనే తమ కారణంగానే నితీష్‌ కుమార్‌కు మరోమారు ముఖ్యమంత్రి పదవి దక్కిందని శివసేన వ్యాఖ్యానించింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ఆ పార్టీ నేతలు ఒక వేళ మాట తప్పితే మా మాదిరే వ్యహరించాలని జెడియుకు హితవు చెప్పింది. ఈ కారణంగానే అనివార్య పరిస్ధితుల్లో బిజెపి వ్యవహరిస్తోంది. ఇది ఎంత కాలం కొనసాగుతుంది అన్న ప్రశ్న ఎలాగూ ఉండనే ఉంటుంది. మహారాష్ట్రలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అధికారాన్ని రెండు భాగాలుగా పంచుకొనేందుకు అంతర్గతంగా అంగీకరించిన బిజెపి ఫలితాలు వచ్చిన తరువాత మాట తప్పిందని శివసేన చెప్పింది. తాము అలాంటి ఒప్పందం చేసుకోలేదని బిజెపి అడ్డం తిరిగింది. ఫలితంగా అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు, పర్యవసానాల్లో బిజెపి భంగపడిన విషయం తెలిసిందే. తమకు సీట్లు ఎక్కువ వచ్చిన కారణంగా సిఎం పదవి తమకే అని బీహార్‌ బిజెపి అంటే శివసేన మాదిరి జెడియు బయటకు వచ్చి ఆర్‌జెడితో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే నితీష్‌ కుమార్‌ను గద్దెనెక్కించి చక్రం తిప్పాలని బిజెపి నిర్ణయించిందని చెప్పవచ్చు. మాన్‌ ఆఫ్‌ ది మాచ్‌ ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌, ఎన్‌డిఏ విజయోత్సవాలు చేసుకోవటం పెద్ద జోక్‌, జెడియు అవకాశాలను దెబ్బతీసిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఇంకా ఎన్‌డిఏలోనే ఉన్నారు అని శివసేన నేత సంజయ రౌత్‌ వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో అందునా అధికారం కోసం దేనికైనా గడ్డి కరుస్తున్న ఈ రోజుల్లో తెల్లవారే సరికి అనూహ్య పరిణామాలు జరగవచ్చు. ఈ నేపధ్యంలో నితీష్‌ కుమార్‌ పదవి ఎంతకాలం ఉంటుంది అన్నది ఒక ప్రశ్న. వివాదాస్పద ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ అంశాలు ముందుకు వచ్చినపుడు బీహార్‌లో వాటిని అమలు జరిపేది లేదని నితీష్‌ కుమార్‌ చెప్పారు. అంతేకాదు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు, దాన్ని బిజెపి వ్యతిరేకించలేదు. నాడు బిజెపి మీద నితీష్‌ కుమార్‌, నేడు బిజెపి మీద నితీష్‌ కుమార్‌ ఆధారపడనున్నారు. అందువలన ఇప్పుడు కూడా బిజెపి దానికే కట్టుబడి ఉంటుందా ? ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో పార్లమెంట్‌లో జెడియు వ్యతిరేకించింది. తరువాత ఒకసారి పార్లమెంట్‌ ఆమోదించిన తరువాత బలపరచక చేసేదేమీ లేదని అడ్డం తిరిగింది. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఓటర్లను వేడుకున్న నితీష్‌ కుమార్‌ ఇప్పుడు పదవికోసం ఎన్‌ఆర్‌సి,ఎన్‌పిఆర్‌ విషయంలో గత వైఖరికే కట్టుబడి ఉంటారా ? పదవికోసం పై అంశాలలో తన వ్యతిరేకతను తానే దిగమింగి బిజెపి అజెండాకు జైకొడతారా ? అదే జరిగితే జెడియులో ఎలాంటి వ్యతిరేకత తలెత్తదా ?
తాత్కాలికంగా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినప్పటికీ తరువాత వత్తిడి తెచ్చి కేంద్ర మంత్రిగా పంపటం లేదా తనంతట తానే పదవి నుంచి తప్పుకొనే విధంగా బిజెపి వ్యవహరించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే జెడియు ఎంఎల్‌ఏలు బిజెపి నాయకత్వాన్ని అంగీకరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్దకమే. బిజెపి దయాభిక్షతో వచ్చే పదవులు ఆర్‌జెడి కూటమికి మద్దతు ప్రకటించినా వస్తాయన్నది స్పష్టమే. ఇక విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలోని కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.తమ అభివృద్ధి పధకాలే విజయాన్ని చేకూర్చాయన్నారు. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? ఇప్పటికి సాధించినదానికే తమ భుజాలను తాము చరుచుకుంటే బీహార్‌ రాబోయే రోజుల్లో కూడా అధోగతిలోనే ఉంటుంది. పదిహేనేండ్ల నితీష్‌ కుమార్‌ పాలనలో మానవాభివృద్ధి సూచికలో 2018 యుఎన్‌డిపి నివేదిక ప్రకారం బీహార్‌ 36వ స్దానంలో ఉంది. దాని తరువాత మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం లేదు. అయినా మోడీ అభివృద్ధి విజయమని చెప్పారు.


ప్రధాని అరాజకశక్తిగా వర్ణించిన ఆర్‌జెడి కూటమి గురించి చూద్దాం. గతంలో అక్కడ అరాజకం నెలకొన్నమాట నిజం. భూమికోసం, అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటాలు సాగించినపుడు వాటిని అణచివేసేందుకు భూస్వామిక శక్తులు వివిధ సేనల పేరుతో గూండా గుంపులను పెంచి పోషించాయి. వాటికి నాడు ఒకే పార్టీలో ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌, దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అందరూ పరోక్షంగా మద్దతు ఇచ్చారు. తరువాత విడిపోయి వేర్వేరు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికలలో జెడియు కూటమితో సమంగా బీహారీలు ఓటు వేయటం ప్రధాని నరేంద్రమోడీ, ఆ కూటమికి చెంపదెబ్బగా చెప్పవచ్చు. నితీష్‌ కుమార్‌ ఏలుబడిలో గూండాయిజం లేదన్నది మోడీ గారి భాష్యం. గూండాయిజం సాగిందని చెబుతున్న సమయంలో తేజస్వి యాదవ్‌ నిక్కర్లతో తిరిగిన బాలుడు. ఇప్పుడు 31సంవత్సరాల యువకుడు. అందువలన గతానికి అంటే తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఏలుబడికి ముడిపెట్టి చేసిన ప్రచారాన్ని ఓటర్లు పట్టించుకోలేదన్నది స్పష్టం. ఎన్నికలలో ఎక్కడా బూత్‌ల ఆక్రమణ, దౌర్జన్యం వంటివి నమోదు కాలేదు. రెండు కూటములకు సమానంగా ఓట్లు రావటాన్ని బట్టి నరేంద్రమోడీ చేసిన ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టారని చెప్పవచ్చు.
మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ బిజెపికి ప్రాధాన్యత పెరుగుతోందని దానికి అనుగుణ్యంగా బీహార్‌లో సీట్లు పెరిగాయని ప్రధాని విజయోత్సవ సభలో చెప్పారు. బీహార్‌ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాలలో బిజెపి సాధించిన అసెంబ్లీ స్ధానాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల సంవత్సరం—- సీట్లు
1995 ——- —— 41
2000 —————72
2005 ఫిబ్రవరి— 37
2005 అక్టోబరు— 55
2010—————- 91
2015 ————— 53
2020 ————— 74
ఈ అంకెలు నరేంద్రమోడీ చెప్పింది వాస్తవం కాదని వెల్లడిస్తున్నాయి. గతంలో గరిష్టంగా 72, 91స్ధానాలు తెచ్చుకున్న పార్టీ ఇప్పుడు 74తెచ్చుకుంటే దాన్ని ఆదరణగా చెప్పటం జనాల జ్ఞాపకశక్తిని అవమానించటం తప్ప వేరు కాదు. తమకు ఓటు వేస్తే కరోనా వైరస్‌ వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామన్న వాగ్దానం, నరేంద్రమోడీ రామాలయ నిర్మాణం, గాల్వాన్‌ లోయలో మరణించిన బీహార్‌ రెజిమెంట్‌ సైనికులు, సినిమా సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఆత్మహత్యను కూడా ఎన్నికల్లో వాడుకోవాలని చూసినా వాటి వలన పెద్దగా ప్రభావితులైనట్లు కనిపించలేదు.


గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన అప్రజాస్వామిక, చివరికి అత్యవసర పరిస్ధితిని కూడా విధించిన నేపధ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు సమీకృతమయ్యాయి. జనతా పార్టీలో నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం కూడా ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన కారణంగా సిపిఎం, ఇతర వామపక్షాలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు అత్యవసర పరిస్దితిని విధించకపోయినా రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం, ప్రతిపక్షాలపై కేంద్ర సంస్ధలతో దాడులు చేయించటం వంటి చర్యలతో పాటు మతోన్మాదాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువస్తోంది. ఈ జంట ప్రమాదాల నేపధ్యంలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ద్వారా ఓట్ల చీలిక నివారించి ఆ పార్టీని ఎదుర్కోవాలనే అభిప్రాయం నానాటికీ బలపడుతోంది.


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దాని ప్రాధాన్యతను మరింత స్పష్టపరిచాయి.కాంగ్రెస్‌ లేదా ఆర్‌జెడి విధానాలు, అవగాహనలను వామపక్షాలు లేదా మరొక శక్తి ఆమోదించటం, అంగీకరించాల్సిన అవసరం లేదు. ఏది ప్రధాన సమస్య అన్నపుడు బిజెపి ముప్పు ముందుకు వస్తోంది. గతలోక్‌ సభ ఎన్నికలలో వామపక్షాలు విడిగా పోటీ చేశాయి. ఐక్యత అవసరాన్ని ఆర్‌జెడి, కాంగ్రెస్‌ గుర్తించాయి. దాని ఫలితమే వామపక్షాలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్‌జెడితో ఎలాంటి సర్దుబాటు లేకుండానే సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌,) సిపిఐ, సిపిఎంలకు కలిపి 3.5శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికలలో సర్దుబాటుతో 4.7శాతానికి పెరిగాయి. ఈ ఎన్నికల్లో మహాకూటమి గణనీయ సంఖ్యలో స్దానాలు సంపాదించేందుకు ఈ ఓట్లు ఎంతో దోహదం చేశాయన్నది స్పష్టం. గత లోక్‌ సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి వ్యతిరేక ఓటు సంఘటితం కావాల్సిన అవసరాన్ని ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేశాయి. బీహార్‌ ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమి ‘బి’ టీమ్‌గా రంగంలోకి దిగిన మజ్లిస్‌, బిఎస్‌పి కూటమి చీల్చిన ఓట్ల ద్వారా ఎన్‌డిఏ లబ్ది పొందిదన్నది తెలిసిందే. అందువలన అలాంటి శక్తులను దూరంగా ఉంచుతూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరాన్ని కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పవచ్చు.