Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల సంప్రదింపుల అనంతరం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని పదిహేను దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)పై నవంబరు 15వ తేదీన సంతకాలు చేశాయి. ఇదొక చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయా దేశాల చట్ట సభలు ఆమోదం తెలిపిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం జనాభా, మూడోవంతు జిడిపి ఉన్న దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి ఈ ఒప్పంద చర్చలలో ఉన్న భారత్‌ తాను వైదొలుగుతున్నట్లు గతేడాది నవంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న ఏడాది కాలంలో అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. ప్రపంచీకరణలో భాగంగా అనేక సంస్కరణలు చేపడతామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు రక్షణాత్మక చర్యలు తీసుకోవటాన్ని మిగతా దేశాలు ఎలా చూస్తాయి ? అయితే భారత్‌ కోరుకుంటే ఎప్పుడైనా చేరవచ్చని, నిబంధనలను కూడా సడలిస్తామంటూ భాగస్వామ్య దేశాలు తలుపులు తెరిచే ఉంచాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల రక్షణ చర్యల్లో భాగంగా, ఇతర కారణాలతో మన దేశం ఈ ఒప్పందంలో చేరలేదు. చైనా కారణంగా దూరంగా ఉన్న అమెరికా కూడా దీనిలో చేరవచ్చనే ఆశాభావాన్ని జపాన్‌ వ్యక్తం చేసింది.


ఆస్ట్రేలియా,బ్రూనే, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా,థారులాండ్‌,వియత్నాం సభ్యులుగా ఉన్న ఈ ఒప్పందం ద్వారా ప్రతిదేశమూ లబ్ది పొందటంతో పాటు ప్రపంచ జిడిపి పెరుగుదలకూ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా అవతరిస్తున్న చతుష్టయ కూటమిలో ఉన్న జపాన్‌, ఆస్ట్రేలియా దీనిలో భాగస్వాములు. దక్షిణ కొరియాతో సహా రాజకీయ అంశాలలో అవి అమెరికాకు మద్దతు ఇస్తూనే ఆర్ధిక రంగంలో చైనాతో సంబంధాలతో మరింత ముందుకు పోవాలనే నిర్ణయించాయంటే ఆర్ధిక అంశాలే ప్రధాన చోదకశక్తిగా ఉన్నాయన్నది స్పష్టం. ఈ ఒప్పందంతో చైనాకు ఎగుమతి అవుతున్న జపాన్‌ పారిశ్రామిక ఎగుమతులలో 86శాతం, దక్షిణ కొరియా నుంచి ఎగుమతి అవుతున్నవాటిలో 92శాతంపై పన్నులు రద్దువుతాయి. జపాన్‌ ఆటోవిడిభాగాల తయారీ పరిశ్రమ ప్రధానంగా లబ్ది పొందుతుంది. ఆస్ట్రేలియా కూడా ఇదే అంచనాతో ఒప్పందానికి సిద్దపడింది. చైనాతో వాణిజ్య సంబంధాలలో ఈ మూడు దేశాలూ మిగులులో ఉన్నాయి.


అనేక ఆసియన్‌ దేశాల వస్తూత్పత్తి చైనానుంచి చేసుకొనే కొన్ని వస్తువుల దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఒప్పందానికి అమెరికా, భారత్‌ దూరంగా ఉన్నాయి. చైనాను పక్కన పెట్టాలన్న అమెరికా ఆదేశాలు లేదా విధానాలకు అనుగుణ్యంగా నడవటానికి తాము సిద్దంగా లేమనే సందేశం ఈ ఒప్పందం పంపినట్లయింది. ఒక వైపు ప్రపంచీకరణ తమకు నష్టదాయకంగా మారిందని బహిరంగంగా చెప్పకపోయినా అమెరికాతో సహా అనేక పెట్టుబడిదారీ రాజ్యాలు రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుకుంటూ పోతున్నాయి. ప్రపంచవాణిజ్య సంస్ధతో నిమిత్తం లేకుండా ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయి.ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలేని ఈ అతిపెద్ద ఒప్పందం కుదరకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ జరిగాయి.పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను చక్రబంధంలో బిగించాలని చూసిన ట్రంప్‌ యంత్రాంగానికి ఇది పెద్ద వైఫల్యం. అమెరికాకు అగ్రతాంబూలం అన్న వైఖరిని అనుసరిస్తున్న వైఖరితో ఆసియా దేశాల్లో తలెత్తిన అనుమానాల కారణంగా కూడా ఆర్‌సిఇపి ఉనికిలోకి రావటానికి దోహదం చేసింది.
కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ కుదేలవుతున్నాయి. ఇదే సమయంలో చైనా, తూర్పు ఆసియా దేశాలు అమెరికాాఐరోపాలతో పోల్చితే కరోనాను అదుపు చేశాయి. ఆర్దిక రంగంలో పురోగమనంలో ఉన్నాయి. మరోపది సంవత్సరాల వరకు వినిమయం ఎక్కువగా ఉండే మధ్యతరగతి ప్రజానీకం పెరుగుదల చైనా, ఆసియాలోనే ఉంటుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.ఆర్దికంగా పెద్ద రాజ్యాలలో ఒక్క చైనా వృద్ది మాత్రమే పురోగమనంలో ఉంది. అమెరికా, ఐరోపా దేశాలు కరోనా కట్టడితో పాటు ఆర్ధికంగా కూడా తీవ్ర సమస్యలతో ఉన్నాయి.

ఫసిపిక్‌ ప్రాంత దేశాల భాగస్వామ్యం(టిపిపి) పేరుతో అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిపాదనలో చైనాతో సహా అనేక ఆసియా దేశాలకు అవకాశం లేకుండా చూశారు. ఈ ఒప్పందంపై 2016లో సంతకాలు చేసిన అమెరికా మరుసటి ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి రాగానే ఉపసంహరించుకుంది. దాంతో అది అమల్లోకి రాలేదు. దీనికి ప్రతిగా చైనా, మరికొన్ని దేశాలు ముందుకు తెచ్చిందే ఆర్‌సిఇపి. దీనిలోపి టిపిపిలో ఉన్న ఆసియా దేశాలు భాగస్వాములయ్యాయి. అమెరికాను కూడా తమతో చేరాలని కోరాయి.టిపిపి వెనక్కు పోయిన తరువాత అమెరికా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాకు వ్యతిరేకంగా సరికొత్త సమీకరణకు పూనుకుంది. ఆర్‌సిఇపి నుంచి మన దేశం వైదొలగటానికి ఒక కారణం మన పారిశ్రామిక, వ్యవసాయ రంగాల నుంచి వెల్లడైన తీవ్ర వ్యతిరేకత అన్నది స్పష్టం. ఆ నష్టాల గురించి ప్రారంభం నుంచీ చర్చలలో ఉన్న మన ప్రతినిధులకు తెలియనివేమీ కాదు. అయినా ఆరు సంవత్సరాల పాటు ముందుకు పోయి 2019లో వెనక్కు తగ్గటానికి పైకి వెల్లడించని ఒక ప్రధాన కారణం ఈ కాలంలో అమెరికాతో పెనవేసుకున్న బంధం అన్నది స్పష్టమే. దానికి చక్కటి ఉదాహరణ ఇరాన్‌తో మనకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా అమెరికా వత్తిడి మేరకు అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము.


ఆర్‌సిఇపిలోని 15దేశాలలో ప్రపంచంలోని 47.7శాతం మంది జనాభా, మూడోవంతు జిడిపి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 29.1, పెట్టుబడులలో 32.5శాతం వాటాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. ఇక దేశాల వారీగా చూస్తే కలిగే ప్రయోజనాలు కొన్ని ఇలా ఉన్నాయి. జిడిపి పెరుగుదల పసిఫిక్‌ ప్రాంతంలో 2.1, ప్రపంచంలో 1.4, చైనాకు 0.55, దక్షిణ కొరియాకు 0.41నుంచి 0.62, జపాన్‌కు 0.1శాతం చొప్పున పెరుగుదల ఉంటుందని అంచనా. చైనా వ్యవసాయ ఉత్పత్తులపై జపాన్‌ 56శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 49, ఇతర దేశాల ఉత్పత్తులపై 61శాతం పన్నులు తగ్గుతాయి. కొన్ని వస్తువుల విషయంలో వెంటనే పన్నులు తగ్గినా, మొత్తంగా ఒప్పందంలో అంగీకరించిన మేరకు తగ్గుదలకు పది సంవత్సరాలు పడుతుంది. ప్రాంతీయ సరఫరా వ్యవస్ధ స్దిరపడుతుంది. ఆయా దేశాలకు కలిగే ఆర్ధిక ప్రయోజనాలు ప్రపంచ రాజకీయాల్లో వాటి వైఖరుల మీద కూడా ప్రభావం చూపుతాయి. ఈ ఒప్పందంతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.ఈ దిశగా మూడు దేశాలు పన్నులను తగ్గించేందుకు పూనుకోవచ్చు. చైనాాఅమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన నష్టాలలో ఈ ఒప్పందం కారణంగా చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలకు 150 నుంచి 200 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గవచ్చని అంచనా. ఇది అమెరికా మీద వత్తిడి పెంచుతుంది.


ఒప్పందం కుదిరినంత మాత్రాన అంతా అయిపోయినట్లు భావించరాదు. దాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.ఈ ఒప్పందం బహుపక్ష వాదానికి చారిత్రక విజయం, ప్రాంతీయ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలకు పెద్ద సహాయకారి అవుతుందని భావిస్తున్నారు.టిపిపి నుంచి అమెరికా తప్పుకున్న తరువాత దీనిని పసిఫిక్‌ ప్రాంత సమగ్ర మరియు పురోగామి భాగస్వామ్య ఒప్పందంగా(సిపిటిపిపి) సవరించారు.టిపిపి ఒప్పందంలో వాణిజ్యానికి పెద్ద పీట వేస్తే దీనిలో పెట్టుబడుల వంటి వాటిని కూడా చేర్చారు.అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఆర్‌సిఇపి ఒప్పందాన్ని అతిగా చూపి చైనా ముప్పు పేరుతో టిపిపిని మరోసారి ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇది అంత తేలిక, వెంటనే జరిగేది కాదు. సిపిటిపిపిలో చేరి దాన్ని ఆర్‌సిఇపికి వ్యతిరేకంగా తయారు చేసేందుకు పూనుకోవచ్చు.

మన దేశం విషయానికి నరేంద్రమోడీ యంత్రాంగం ఆలోచనా ధోరణులు ఇలా ఉన్నాయని చెప్పవచ్చు. ట్రంప్‌ రెండో సారి కచ్చితంగా అధికారానికి వస్తాడు(ఈ కారణంగానే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లి హౌడీమోడీ సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని ఎన్నికల ప్రచారం చేశారు). చైనాతో వాణిజ్య యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాడు. అది మేకిన్‌ ఇండియా కార్యక్రమం విజయవంతం కావటానికి దోహదం చేసే పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుంది. చైనా నుంచి ఇతర దేశాల సంస్దలు మన దేశానికి తరలివస్తాయి. తద్వారా త్వరలో ఎగుమతుల్లో చైనాను అధిగమించవచ్చు. ఇలాంటి భ్రమలకు గురైన కారణంగానే అమెరికా కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని, ముఖ్యమంత్రులందరూ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు సిద్దంగా ఉండాలని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
అమెరికా ఇచ్చిన ప్రోత్సాహంతో చైనా మీద ఆధారపడిన సరఫరా వ్యవస్దకు ప్రత్యామ్నాయంగా జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి నూతన వ్యవస్దను ఏర్పాటు చేయాలని మన దేశం ప్రతిపాదించి చర్చలు జరుపుతోంది. అవి ఒక కొలిక్కి రాకముందే ఆ చైనాతోనే వాటితో పాటు మరికొన్ని దేశాలు ఆర్‌సిపి ఒప్పందం చేసుకొని అమలుకు ముందుకు పోతున్నాయి. జపాన్‌ వంటి దేశాలు మనల్ని, రెండవ పెద్ద ఆర్దిక వ్యవస్ద ఉన్న చైనాను కూడా ఉపయోగించుకోవాలని చూస్తాయి తప్ప కేవలం మన మీదనే ఆధారపడే అవకాశాల్లేవని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.


ఏ నాయకత్వమైనా తమవైన స్వంత పద్దతులలో దేశాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవచ్చు. అవి విజయవంతమౌతాయా లేదా అన్నది వేరే అంశం. కానీ మరొక దేశం మీద ఆధారపడి అంచనాలు రూపొందించుకోవటం మబ్బులను చూసి ముంతలో నీరు ఒలకపోసుకోవటం, గాలిమేడలు కట్టటం తప్ప మరొకటి కాదు. అనూహ్యంగా కరోనా వైరస్‌ సమస్య వచ్చింది. ట్రంప్‌ ఓడిపోయాడు. బైడెన్‌ చైనాతో వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తాడో, రాజీపడతాడో తెలియదు. ట్రంప్‌ మాదిరి దూకుడు మాత్రం ఉండదు అంటున్నారు. అవి తేలేంతవరకు మేకిన్‌ ఇండియాను మన మోడీగారు ఏమి చేస్తారు ? వాయిదా వేస్తారా ? అనేక ఆసియా దేశాలు గతంలోనూ, ఇప్పుడు ఎగుమతి ఆధారిత విధానాలతోనే వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు ఆర్‌సిఇపి ద్వారా మన పొరుగునే ఒక పెద్ద స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఏర్పడింది. దాన్ని విస్మరించి రక్షణాత్మక చర్యలు తీసుకొంటున్న మన దేశం వైపు పెట్టుబడులు వస్తాయా ? వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా ? అసలు అమెరికా కూడా వాటిని అంగీకరిస్తుందా ? మన పారిశ్రామిక, వ్యవసాయ రంగ రక్షణ చర్యలు తీసుకోకపోతే పాలక పార్టీ పారిశ్రామికవేత్తలు, రైతాంగానికి దూరం అవుతుంది. వీటిని ఫణంగా పెట్టి ప్రపంచ కార్పొరేట్లు, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ద, ప్రపంచ వాణిజ్య సంస్ధలు వత్తిడి తెస్తున్న ప్రపంచీకరణ గొలుసుకు మన దేశాన్ని కట్టకపోతే వాటికి కోపం వస్తాయి ? నరేంద్రమోడీ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు ?