ఎం. కోటేశ్వరరావు
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సంస్కరణల పేరుతో ప్రజావ్యతిరేక చర్యలను వేగిరపరచేందుకు, సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకుంది. మరోవైపు దానికి ప్రతిఘటన కూడా రూపుదిద్దుకుంటోంది. దానిలో భాగంగానే నవంబరు 26వ తేదీన దేశవ్యాపిత సమ్మెకు కార్మికులు-కర్షకులు సిద్దం అవుతున్నారు. దీనిలో ఎంత మంది పాల్గొంటారు, ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేదాని మీద ముందు లేదా తరువాత గానీ ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకోవచ్చు. ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన గళం ఎత్తుతున్నారా లేదా అన్నది ప్రధాన అంశం. మహానదులు సైతం ప్రారంభంలో పిల్లకాలువల మాదిరే ఉంటాయన్నది తెలిసిందే. ప్రజా ఉద్యమాలైనా అంతే. రెండు సీట్లు ఉన్న స్దాయి నుంచి దేశంలో అదికారాన్ని సంపాదించే స్దితికి ఎదిగామని బిజెపి చెబుతున్నది. దీనికి పరిస్ధితులు అనుకూలించటమే కారణం. కేంద్రంలో, రాష్ట్రాలలో అదే పార్టీ పాలనలో జన జీవనం దిగజారటం ఎక్కువ అవుతున్న కొద్దీ ఇదే సూత్రం ప్రజా ఉద్యమాలకు మాత్రం ఎందుకు వర్తించదు ?
సంస్కరణలతో దిగజారిన పరిస్ధితులను మెరుగుపరుస్తామని బిజెపి చెబుతోంది. అవి రెండు రకాలు, ఒకటి సామాన్యులకు అనుకూలమైనవి, రెండవది కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేవి. ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు జనానికి అనుకూలంగా లేవు కనుకనే కరోనా వైరస్ వ్యాప్తికి ముందే దేశ అభివృద్ధి రేటు దిగజారింది, అంటే సామాన్యుల బతుకులు దెబ్బతిన్నాయి. జనం పేరుతో కార్పొరేట్లకు అనుకూల విధానాలను ఎంత త్వరగా గ్రహిస్తారన్నదాని మీద ప్రజా ఉద్యమాల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.
నవంబరు 20వ తేదీ నాటికి విదేశీ సంస్ధాగత మదుపుదార్లు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఎక్కువగా నవంబరు మాసంలో పెట్టుబడులు పెట్టారని విశ్లేషకులు ప్రకటించారు. ఇవి మన విదేశీమారక ద్రవ్య నిల్వలను గణనీయంగా పెంచుతాయి. చూశారా నరేంద్రమోడీ గారు విదేశాల్లో మన ప్రతిష్టను పెంచిన కారణంగానే ఇది సాధ్యమైందని మరుగుజ్జు సైన్యం(ట్రోల్స్) సామాజిక మాధ్యమంలో ప్రచారం మొదలు పెట్టవచ్చు. అభివృద్ధి లేకుండా డాలర్లు పెరగటం అది కూడా రూపాయి విలువ పతనం అవుతున్న స్ధితిలో అది వాపా బలమా అన్నదానితో వారికి నిమిత్తం ఉండదు.
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు ధన్యుడు సుమతీ అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో బిజెపి పెద్దల మాటలు, వారి మరుగుజ్జుల సామాజిక మాధ్యమ ప్రచారంలో కొన్ని పదాలు వినిపించటం లేదు. రైతుల ఆదాయాల రెట్టింపు, ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి వాటిలో కొన్ని. కరోనాను సమర్దవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొనేందుకు ఎలాంటి వెనుకా ముందూ చూడటం లేదు. ఎవరితో పోల్చుకొని అలా మాట్లాడుతున్నారో, అసలు ఎదుర్కోవటం అంటే ఏమిటో ఎంత మంది ఆలోచిస్తున్నారు ?
కరోనా ఉద్దీపన 3.0 ప్రకటన తరువాత నవంబరు 12న ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లుగా మొత్తం ఉద్దీపనల విలువ రూ.29,87,641 కోట్లు. అంటే 30లక్షల కోట్లు అనుకుందాం. ఇది జిడిపిలో 15శాతం, ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన విలువే జిడిపిలో 9శాతం అన్నారు. అయితే అంతర్జాతీయ సంస్ధ స్టాటిస్టా డాట్‌కామ్ వెల్లడించిన సమాచారం వేరుగా ఉంది. అక్టోబరు 12 నాటికి జి20 దేశాలు ప్రకటించిన ఉద్దీపనలు జిడిపిశాతాల్లో 21.1శాతంతో జపాన్ అగ్రస్ధానంలో ఉంది. మన దేశ ఉద్దీపన 6.9, చైనా ఏడుశాతాలుగా ఉన్నట్లు అది పేర్కొన్నది. తరువాత ప్రకటించిన మూడవ విడత ఉద్దీపనను కూడా కలుపుకుంటే ఒకటో రెండోశాతం పెరగవచ్చు తప్ప 15శాతం అయి ఉండే అవకాశం లేదు. అందువలన ఇక్కడ ఉద్దీపన అంటే మన పాలకులు చెబుతున్న భాష్యానికి, అంతర్జాతీయ సంస్దలు చెబుతున్న, పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు భిన్నంగా ఉన్నట్లు చెప్పవచ్చు.
మూడు సార్లు ఉద్దీపన ప్రకటించిన తరువాత ప్రపంచంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశంగా భారత్ ఉండనున్నదని ఆక్స్ ఫర్డ్ ఎకనమిక్స్ ప్రకటించటమే చర్చించాల్సిన అంశం.2020-25 సంవత్సరాల మధ్య ఆర్ధిక వ్యవస్ధ పురోగతి గతంలో వేసిన అంచనా 6.5శాతానికి బదులు 4.5శాతం ఉంటుందని తన జోశ్యాన్ని సవరించింది. గతంలో అంతర్జాతీయ అర్ధిక సంస్ధలు చెప్పిన అనేకం నిజం కాలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద వర్తమాన సంవత్సరంలో మన ఆర్ధిక వ్యవస్ధలో 4.5శాతం తిరోగమనాన్ని అంచనా వేస్తే కొందరు 15శాతం అని చెప్పారు. అంతిమంగా ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తిరోగమనం పదిశాతానికి అటూ ఇటూగా ఉండవచ్చని వివిధ తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి మోడినోమిక్స్ ద్వారా భారత ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి తీసుకుపోతానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగేనా ?
ఏడాదికి 11.6శాతం చొప్పున అభివృద్ధి రేటు ఉంటే 2021 నుంచి 2026-27 నాటికి ఐదులక్షల డాలర్ల స్ధాయికి జిడిపి చేరుతుందని కొందరు చెబుతున్నారు. దీనికి గాను ఈ కాలంలో 500లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. మరి అక్స్‌ఫర్డ్ అంచనా 4.5శాతం ప్రకారం ఎప్పటికి చేరేను ? ఇలాంటి అంచనాలు కొన్ని అంశాలు స్ధిరంగా ఉంటాయనే భావనతో తయారవుతాయి. ఉదాహరణకు 2018-19 సంవత్సర అంచనా ప్రకారం దేశ జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు. దీన్ని ఐదు సంవత్సరాలలో ఐదులక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దీనికి గాను ఐదు సంవత్సరాలలో ఉత్పత్తి 84శాతం లేదా పదమూడు శాతం చొప్పున పెరగాల్సి ఉంటుంది.వార్షిక ధరల పెరుగుదల నాలుగుశాతం ఉంటుందని, వృద్ధి రేటు 9శాతం చొప్పున ఉండాలని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ఐదు సంవత్సరాలలో సగటు వృద్ధి రేటు 7.1శాతానికి మించలేదు. ఎన్నడూ తొమ్మిదిశాతానికి చేర లేదు. ఈ స్ధాయికి చేరాలంటే పొదుపు రేటు 39, పెట్టుబడి రేటు 41.2శాతం చొప్పున ఉండాలి. 1951-2019 మధ్య మన దేశ సగటు పొదుపు రేటు 18.6 శాతం. కనిష్టంగా 1954 మార్చినెలలో 7.9శాతం, గరిష్టంగా 2008లో 37.8శాతం ఉంది. 2018లో 32.4 శాతం ఉండగా మరుసటి ఏడాది 30.1శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఎంతకు దిగజారుతుందో ఇప్పుడే చెప్పలేము. ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ సంస్ధ 2025 వరకు సగటు వృద్ది రేటు 4.5శాతం ఉంటుందని చెప్పింది. అంతకంటే ఎక్కువ ఉన్న సమయంలోనే పొదుపు రేటు పడిపోయింది కనుక రాబోయే రోజుల్లో దిగజారటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఈ అంచనా వెలువడిన తరువాత దాని మీద కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందనలూ వెలువడలేదు.
మన ఆర్ధిక వ్యవస్ధ ప్రయివేటు వినియోగం, పెట్టుబడుల మీద ఆధారపడి ఉంది. గత ఏడాది తొలి మూడు మాసాల్లో ఈ మొత్తం రూ.43లక్షల కోట్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 14లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు ప్రభుత్వ ఖర్చు రూ.1.2లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు ఏ మాత్రం ఊతం ఇవ్వలేదు అన్నది వేరే చెప్పనవసరం లేదు. మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రికార్డు స్ధాయికి పెరిగాయని కొందరు సంబర పడుతున్నారు. కరోనా కారణంగా మన ఎగుమతులతో పాటు ఎక్కువగా దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గాయి. ఈ కారణంగా కొంతమేర ఆదా జరిగి పెరిగినట్లు కనిపించవచ్చు.
విదేశీ సంస్ధాగత మదుపుదారులు నవంబరు మూడవ వారం నాటికి రికార్డు స్ధాయిలో రూ.43,732 కోట్ల రూపాయల విలువగల మన కంపెనీల వాటాలను స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఐరోపా ధనిక దేశాల్లో మరోసారి కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుండటం, అమెరికాలో ఎన్నికలు ముగియటం, ఏప్రిల్ నుంచి డాలరు బలహీనపడుతున్న నేపధ్యంలో ఇది జరిగిందని చెబుతున్నారు. అక్కడ పరిస్ధితి కుదుటపడిన తరువాత లేదా డాలరు విలువ పెరిగితే వారంతా పొలోమని వెనక్కు వెళ్లిపోతారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
మన జిడిపి ఈ ఏడాది పదిశాతంపైగా తిరోగమనంలో ఉంటుందని రేటింగ్ సంస్దలు ప్రకటించాయి. వచ్చే ఐదేండ్ల వరకు సగటున 4.5శాతానికి మించి వృద్ధి రేటు ఉండదని ఆక్స్‌ఫర్డ్ చెప్పింది. అయినా విదేశీ మదుపుదార్లు ఎగబడి మన కంపెనీల వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ? కరోనా కాలంలో మన కంపెనీలు ఎలా లాభాలు పొందాయో తెలుసుకుంటే అసలు కిటుకు అర్ధం అవుతుంది. సిఎంఐయి నివేదిక ప్రకారం సెప్టెంబరు నెలతో ముగిసిన త్రైమాస కాలంలో 1,897 కంపెనీలు రూ.1,33,200 కోట్ల రూపాయల మేరకు నిఖర లాభాలు ఆర్జించాయి. ఇవే కంపెనీలు 2019 జూన్‌తో ముగిసిన మూడు మాసాల కాలంలో ఆర్జించిన లాభాలు 1,06,600 కోట్లు మాత్రమే. ఈ ఏడాది మార్చి నెలతో ముగిసిన త్రైమాస కాలంలో రూ.32,000 కోట్లు, జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 44,100 కోట్లు లాభాలను ఆర్జించగా గత నాలుగు త్రైమాస కాలాల్లో వాటి సగటు లాభం రూ.50,200 కోట్లు ఉంది. ఉద్దీపనల పేరుతో జనానికి ఏమూలకూ చాలని బియ్యం, కందిపప్పు, కొంత నగదు తప్ప మరేమీ లేదు. ఉపాధి కల్పన, ఆర్ధికవ్యవస్ధ పునరుద్దరణ వంటి అకర్షణీయమైన పేర్లతో ఉద్దీపనలన్నీ కార్పొరేటు సంస్దలకే ఇచ్చినందువల్లనే వాటికి ఆ లాభాలు వచ్చాయి. అందువలన తమ దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున విదేశీమదుపుదార్లు మన వాటాలు కొనుగోలు చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి జనానికి చెప్పటానికి, ప్రచారం చేసుకోవటానికి తప్ప ఆ మదుపు సొమ్ము పెట్టుబడులుగా పెట్టేందుకు పనికిరాదు. పెట్టుబడిదారులు ఎప్పుడు వాటాలు అమ్ముకుంటే అప్పుడు వారికి లాభాలతో సహా అసలు సొమ్మును మనం డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలో బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 27.5శాతం పెరిగితే, మన దేశంలో అది 35శాతం ఉంది. అందుకే విదేశీ కంపెనీల ఆసక్తి అని వేరే చెప్పనవసరం లేదు.
ఈ ఏడాది తిరోగమనంలో ఉన్నప్పటికీ వచ్చే ఏడాది పరిస్ధితి మరింతగా మెరుగుపడనుందనే అంచనాలు వెలువడటం కూడా ఒక కారణం. లాభాలను చూసి విదేశీ మదుపుదార్లు పెట్టుబడులు పెడుతుంటే మరోవైపు స్వదేశీ మదుపుదార్లు తమ వాటాలను విక్రయించుకొని లాభాలు తీసుకుంటున్నారు. ఇదే కాలంలో వారు 32వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారు.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ను కార్యస్దానంగా ఎలా మార్చారో అదే మాదిరి కార్మిక సంస్కరణలకు రాజస్దాన్ను ఎంచుకున్నారు. సంస్కరణలకు ముందు, తరువాత ఏమి జరిగిందో చూడండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్ధి సర్వేలలో చెబుతున్నది. సరళీకృత కార్మిక చట్టాలు అమలు జరిగిన తరువాత, ముందు రాజస్ధాన్, సడలింపులు లేని రాష్ట్రాల తీరుతెన్నులను పోల్చి చూడమంటోంది. దాని ప్రకారం వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ఫ్యాక్టరీలు రాజస్ధాన్‌లో 3.65 నుంచి 9.33శాతానికి పెరిగితే మిగతా దేశంలో 4.56 నుంచి 5.52శాతానికి పెరిగాయి. ఉత్పత్తి రాజస్ధాన్‌లో 3.13 నుంచి 12శాతానికి పెరిగితే దేశంలో 4.8 నుంచి 5.71శాతానికి పెరిగింది. కార్మికుల సంఖ్య విషయానికి వస్తే రాజస్ధాన్‌లో ఉండాల్సిన వారి కంటే 8.89 తక్కువ నుంచి 4.17శాతానికి పెరిగింది, దేశంలో అది 2.14 నుంచి 2.6 శాతానికి మాత్రమే పెరిగింది. అంటే రాజస్ధాన్‌లో కార్మిక చట్టాలను సరళీకరించినందువలన ఉపాధి 13.06శాతం పెరిగిందని చెబుతున్నారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.ఇది నిజమైతే, దీనికి కారణాలేమిటో పరిశీలించవచ్చు. దాని కంటే ముందు మరోవైపున ఏమి జరిగిందో చూద్దాం.
2017లో విడుదల అయిన అంతర్జాతీయ కార్మిక సంస్ద నివేదిక ప్రకారం ఉత్పాదక రంగంలో ఉత్పత్తి, జత అయిన విలువలో వేతనాల శాతం 1980-81లో ఉన్న 43.9నుంచి 2012-13 నాటికి 23.6శాతానికి పడిపోయింది.రాజస్ధాన్‌లో ఇది 23 నుంచి 14.4శాతంగా ఉంది. అంటే అక్కడ వేతనాలు సంస్కరణలకు ముందే ఎంత తక్కువగా ఉన్నాయో వెల్లడి అవుతోంది. 2014-15కు ముందు వేతనాల పెరుగుదల శాతం 14-15శాతం ఉన్నట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడించింది. బిజెపి పాలకుల సంస్కరణల తరువాత 2014-15లో 11.5శాతం ఉండగా తరువాత రెండు సంవత్సరాలలో 6.1, 3.5శాతాలకు పడిపోయాయి. యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి చట్టాలకు కోరలు లేకుండా చేయటంతో కార్మికులకు బేరమాడేశక్తి తగ్గిపోయినట్లు ఇది వెల్లడిస్తోంది. సంస్కరణల తరువాత కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది, దీనర్ధం ఏమిటి శాశ్వత కార్మికుడికి ఇచ్చే వేతనంలో సగంతో కాంట్రాక్టు కార్మికులు దొరుగుతున్నారు. వారికి అలవెన్సులు, ఇఎస్‌ఐ వంటి పరిమిత రక్షణలు ఉండవు, యజమానులు చెల్లించాల్సిన అగత్యమూ లేదు. అందువలన కార్మికుల సంఖ్యను పెంచుకొని ఉత్పత్తినీ పెంచుకొనేందుకు యజమానులకు అన్ని అవకాశాలు కల్పించారు. ఇంతగా ఉపాధి అవకాశాలు పెరిగాయని చెబుతున్న రాజస్ధాన్‌లో దేశ సగటు కంటే నిరుద్యోగం ఎందుకు ఎక్కువగా ఉన్నట్లు ? సిఎంఐయి సమాచారం ప్రకారం 2019 జూలైలో దేశంలో 7.5శాతం ఉంటే రాజస్ధాన్‌లో 10.6శాతం నిరుద్యోగం ఉంది. అందువలన ఒక వైపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సంపదలు పెరుగుతుండగా కార్మికులు వారిమీద ఆధారపడుతున్నవారి జీవితాలు దిగజారుతున్నాయి. కొనుగోలు శక్తి పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణం. వినిమయం మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్ధలను అభివృద్ధి చేయాలని చూసే విధానంలో అంతర్గతంగా ఉన్న ఈ వైరుధ్యం కారణంగా కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది.
కరోనా పూర్తిగా అంతరించిన తరువాత కూడా పూర్వస్ధాయి కంటే ఉత్పత్తి 12శాతం తగ్గుతుందని మన దేశం గురించి ఆక్స్‌ఫర్డ్ అంచనా కట్టింది. మరోవైపు మన దేశం నవంబరు 27న ప్రకటించే వివరాలతో సాంకేతికంగా మాంద్యంలో ప్రవేశించనున్నట్లు రిజర్వుబ్యాంకు ముందే ప్రకటించింది. నిజానికి ఇప్పుడు మనం మాంద్యంలోనే ఉన్నాం. సరైన వివరాలు లేని కారణంగా తొలి, రెండవ త్రైమాస వృద్ధి వివరాలను సకాలంలో ప్రకటించటంలో మోడీ సర్కార్ విఫలమైంది. ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా ఆరునెలల పాటు తిరోగమన వృద్ధి నమోదు అయితే మాంద్యంలో ప్రవేశించినట్లు పరిగణిస్తారు. మూడవ త్రైమాసం కూడా డిసెంబరుతో ముగియనుంది.
వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం మోపే భారాలను మోసేందుకు సిద్దంగా ఉన్నారా లేక దిక్కుతోచక భరిస్తున్నారా ? పెట్రోలు, డీజిలు మీద పన్నులు, ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకుంది. గతంలో బిజెపి మరుగుజ్జులు కేంద్రం మోపుతున్న భారాల కంటే రాష్ట్రాలు మోపే పన్నుల భారం ఎక్కువ అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి భారాలను సమర్ధించారు. 2014 మార్చి నుంచి 2020 సెప్టెంబరు మధ్య పెట్రోలు మీద పన్ను భారం లీటరుకు రూ.10.38 నుంచి రూ.32.98( రెండువందల శాతానికి పైగా), డీజిలు మీద ఇదే కాలంలో రూ.4.58 నుంచి రూ.31.83కు(ఆరువందల శాతంపైగా) పెంచినా దేశభక్తిగా భావించి చెల్లిస్తున్నాము. రాష్ట్రాల పెంపుదల్లో తేడాలు ఉండవచ్చు గానీ ఏ రాష్ట్రమూ ఇంత భారీగా పెంచలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోలు మీద 60, డీజిలు మీద 68శాతం వ్యాట్ పెరిగింది.
2014-15 నుంచి 2019-20వరకు చూస్తే పెట్రోలు, డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వానికి ఎక్సయిజు పన్ను ఆదాయం రూ. 1,72,000 కోట్ల నుంచి రూ.3,34,300 కోట్లకు పెరిగింది. ఇదే సయయంలో రాష్ట్రాల ఆదాయం రూ.1,60,500 కోట్ల నుంచి రూ. 2,21,100 కోట్లకు పెరిగింది. ఈ కారణంగానే బిజెపి మరుగుజ్జులు ఇటీవలి కాలంలో దీని గురించి నోరుమూసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరను బట్టి రోజు వారీ వినియోగదారులకు సవరిస్తామని చెప్పిన కేంద్రం దానికి విరుద్దంగా ప్రస్తుతం పెంచటమే తగ్గించటం లేదు. వినిమయం తగ్గినా కంపెనీల లాభాలు, కేంద్ర, రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూసేందుకే ఈ పని చేస్తున్నారు. అయినా వినియోగదారులు కిమ్మనటం లేదు.
2017-18 నాటి వివరాల ప్రకారం దేశంలో ఒక వ్యక్తి రోజువారీ సగటు జిడిపిలో 25శాతం మొత్తాన్ని పెట్రోలు మీద ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇది రాష్ట్రాలలో బీహార్‌లో 94శాతం, యుపిలో 50శాతం ఉండగా చైనాలో నాలుగు, వియత్నాంలో 8, పాకిస్ధాన్‌లో 17శాతం ఉంది. ఇది పెరిగే కొద్దీ వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆర్ధిక వ్యవస్ధ మీద ప్రతికూల ప్రభావం చూపి ఆర్ధిక వ్యవస్ధ పునరుద్దరణ మందగిస్తుంది. చమురు మీద పన్నును ప్రభుత్వం బంగారు బాతుగా పరిగణిస్తున్నది. ఎక్కువ గుడ్ల కోసం ప్రయత్నిస్తే ఏమౌతుందో తెలిసిందే.
నవంబరు 26వ తేదీ ఆందోళన నరేంద్రమోడీ ఆరున్నర సంవత్సరాల పాలనా కాలంలో ఐదవది. కష్టజీవులు ముందుకు తెచ్చిన అంశాలను నిర్లక్ష్యం చేసినకొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు. మోడీ సర్కార్ వాటిని నివారిస్తుందా ? మరింతగా పెంచుతుందో తేల్చుకోవాలి.