Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) నుంచి భారత్‌ వైదొలగటం సముచితమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయటా ప్రారంభమైంది. జపాన్‌ తదితర దేశాలు కోరుతున్నట్లు దానిలో చేరితే ఒక సమస్య లేకపోతే మరొకటి కనుక ఆ గుంజాటనతో ఎంతకాలం గడుపుతారు ? అంతా నెహ్రూయే చేశారు అన్న సుప్రభాతం మాని నరేంద్రమోడీ సర్కార్‌ తాను చెప్పిన ముఖ్యంగా మేకిన్‌ ఇండియా లేదా ఆత్మనిర్భరత కార్యక్రమాలతో దేశాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకుపోనుంది అన్నది కీలకం. మరో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో కూడదనే వ్రతం చెడి తాను మద్దతు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పరాజయం పాలయ్యాడు. అధికారానికి వచ్చిన జో బైడెన్‌ను సంతృప్తి పరచేందుకు లేదా ఆర్‌సిఇపి చర్చ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు గానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా ఆప్‌ల మీద డాడి చేసిందని భావించవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్నింటి మీద కూడా నిషేధం విధించవచ్చు. చైనా మీద వత్తిడి పెంచి బేరమాడే ఎత్తుగడ కానట్లయితే ఆప్‌లన్నింటినీ ఒకేసారి ఎందుకు నిషేధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాటి వలన చైనాకు తగిలిన దెబ్బ-మనకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది వేరే అంశం. ఆర్దిక వ్యవస్ధ లావాదేవీలను ఆప్‌లు సులభతరం చేస్తాయి తప్ప సంపదలను సృష్టించవు. అందువలన నిషేధాలను పట్టించుకోకుండా కరోనా కారణంగా తగిలిన దెబ్బలను మాన్చుకొని చైనా ముందుకు పోతుంటే తగిలిన దెబ్బలు ఎంత లోతుగా ఉన్నాయో ఇంకా తేల్చుకోలేని స్ధితిలో మనం ఉన్నామంటే అతిశయోక్తి కాదు.


ఆర్‌సిఇపిలో చేరాలా వద్దా ?
ఆర్‌సిఇపి నుంచి వైదొలగటం సరైన నిర్ణయమని కొందరు చెబుతుంటే కాదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో చేరితే భాగస్వామ్య దేశాల నుంచి పారిశ్రామిక, వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వెల్లువెత్తి నష్టం కలిగిస్తాయని మన పారిశ్రామికవేత్తలు, రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ రంగాలలో తలెత్తిన తీవ్ర సమస్యల నేపధ్యంలో 2019లో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మనం ఏ క్షణంలో అయినా చేరేందుకు అవకాశం కల్పిస్తూ మిగిలిన దేశాలన్నీ 2020 నవంబరులో సంతకాలు చేశాయి. ఏ ఒప్పందం అయినా అందరికీ ఖేదం, మోదం కలిగించదు. ఇప్పుడు ఖేదం అనుకున్న లాబీ చేరకపోవటం సరైనదే అని చెబుతున్నది. మోదం పొందాలనుకున్న వారు వచ్చిన అవకాశం జారిపోయిందే అని ఎంత తప్పు చేశామో అని వాదిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ మీద ఎవరి వత్తిడి ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అది అమలు జరుగుతుంది. అందువలన ఈ అంతర్గత పోరు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.
ఒప్పందంలో చేరకపోవటం ద్వారా తక్షణ ప్రమాద నివారణ జరిగిందే తప్ప ముప్పు తొలగలేదని గ్రహించాలి. ఒక వైపు ప్రపంచీకరణ, మరింత సరళీకరణ, సంస్కరణలు అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికులు-కర్షకుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలను రుద్దుతున్నది. విదేశాల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులను నివారించిందన్న సంతోషం రైతాంగంలో ఎక్కువ కాలం నిలిచేట్లు లేదు. సర్కార్‌ మరోవైపు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కనీస మద్దతుధరలు, సేకరణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు రైతాంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదలివేసే చర్యలకు సంస్కరణల ముసుగువేసి పార్లమెంట్‌లో చట్టసవరణలు చేసింది.


కబుర్లు కాదు, నిర్దిష్ట చర్యలేమిటి ?
చైనాతో సహా 15దేశాలు ఆర్‌సిఇపి ద్వారా ముందుకు పోతున్నాయి. లడఖ్‌ సరిహద్దు వివాదం జరగక ముందే ఆర్‌సిఇపి చైనాకు అనుకూలంగా ఉంటుంది, దాని వస్తువులన్నీ మరింతగా మన దేశానికి దిగుమతి అవుతాయి అన్న కారణంతో మనం దానిలో చేరలేదని ప్రభుత్వం చెబుతున్నది. దానితో ఎవరికీ పేచీ లేదు. అయితే ఎప్పుడూ ఆ కబుర్లే చెప్పుకుంటూ కూర్చోలేముగా ! చైనాతో పోటీ పడి మన దేశం ముందుకు పోయేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేమిటి అన్నది సమస్య. మనం తయారు చేసే వస్తువులను వినియోగించే శక్తిని మన జనానికి కలిగించే చర్యలేమిటి ? విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యూహం ఏమిటి ?
చైనాకు సానుకూల హౌదా ఎందుకు రద్దు చేయటం లేదు ?

లడక్‌ ప్రాంతం గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతం తరువాత చైనాకు బుద్ధి చెప్పాలి, ఆర్ధికంగా దెబ్బతీయాలన్నట్లుగా ప్రభుత్వ చర్యలు, నేతల మాటలు ఉన్నాయి. పుల్వామా దాడి ఉదంతం తరువాత పాకిస్ధాన్‌కు అత్యంత సానుకూల హౌదా(ఎంఎఫ్‌ఎన్‌)ను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. అంతకంటే ఎక్కువగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా చైనాకు ఆ హౌదాను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మోడీ సర్కార్‌ చెప్పింది. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనాతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ తగల కూడదు, అదే సమయంలో చైనా వ్యతిరేకతను రెచ్చ గొట్టి జనంలో మంచి పేరు కొట్టేయాలన్న యావ తప్ప మరేమిటి ?
ప్రాంతీయ అభివృద్ధి అవకాశాలకు దూరంగా గిరిగీసుకున్న భారత్‌ అనే శీర్షికతో ఈ నెల 23వ తేదీన, అంతకు ముందు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రెండు విశ్లేషణలను ప్రచురించింది. వాటితో ఏకీభవించటమా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మాసాల మధ్య భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతులలో చైనా ఉత్పత్తుల వాటా 18.3శాతం ఉందని, గతేడాది ఇదే కాలంలో 14.6శాతమే అని భారత వాణిజ్యశాఖ వివరాలు వెల్లడించాయి. ఆత్మనిర్బర పేరుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాద నేపధ్యంలో ఇది జరిగింది.(చైనా వస్తుబహిష్కరణ వ్రతం ఏమైనట్లు ?) ఆర్‌సిఇపి నుంచి వైదొలిగిన భారత్‌ రక్షణాత్మక చర్యల నేపధ్యంలో అది సిపిటిపిపి లేదా అమెరికా, ఐరోపాలతో ఒప్పందాలు చేసుకోవటం ఇంకా కష్టతరం అవుతుంది. తనకు తాను గిరి గీసుకుంటున్న భారత్‌ భవిష్యత్‌లో అవకాశాలను జారవిడుచుకుంటుందని ఆ పత్రిక పేర్కొన్నది.


చైనా ఎఫ్‌డిఐ ఆంక్షల నుంచి మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గుతోందా
ఇటీవల హౌం,వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్త బృందం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నిబంధనలను సడలించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఒక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంతో భూ సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కొన్ని రంగాలలో 26శాతం వరకు ప్రభుత్వ తనిఖీతో నిమిత్తం లేకుండా అనుమతించాలన్నదే దాని సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ సడలింపు అమల్లోకి వస్తే చైనా నుంచి పెట్టుబడులను అడ్డుకొనేందుకు గతంలో కొండంత రాగం తీసి చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటమే. ఈ ప్రతిపాదనను ఎందుకు చేసినట్లు ? ముందుచూపు లేదా పర్యవసానాల గురించి ఆలోచించకుండా జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నవారికి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. చైనాను వ్యతిరేకిస్తే అమెరికా, ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని కలలు కన్న, చైనా మీద వీరంగం వేసిన వారికి అవి కనుచూపు మేరలో కనిపించకపోవటమే అసలు కారణం. ఏటికి ఎదురీదాలని ఉత్సాహపడేే ఎవరైనా ముందు తమ సత్తా, పరిస్ధితులు ఏమిటో ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత భారత-చైనా వాణిజ్యం బాగా పెరిగింది. చైనా నుంచి దిగుమతులతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆకస్మికంగా చైనా దిగుమతులను ఆపివేయలేని విధంగా మన పరిశ్రమలు చైనా మీద ఆధారపడ్డాయంటే అతిశయోక్తికాదు. రాజకీయ కారణాలతో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికా, ఐరోపా ఇతర ఆసియా దేశాల నుంచి అధిక ధరలకు వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతుండగా ఉత్పత్తి ఖర్చు మరింతగా పెరిగితే పరిస్ధితి ఇంకా దిగజారుతుంది. మన ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపధ్యంలో చైనాతో వివాదం ప్రారంభమైంది. దీన్ని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు సహిస్తారా ?


ప్రపంచీకరణ జపం ఆచరణలో ఆంక్షలు !
చైనా మాదిరి మన దేశం ఎగుమతి కేంద్రంగా మారాలంటే రక్షణాత్మక చర్యలను విరమించి స్వేచ్చా వాణిజ్య పద్దతులను అనుసరించాలన్నది ఒక వాదన. దాని సారాంశం ఏమిటో చూద్దాం. గతంలో విఫలమైన విధానాలను తిరిగి అమలు జరిపితే లక్ష్యాలను చేరుకోలేము.2014 నుంచీ మోడీ సర్కార్‌ అనేక మార్లు దిగుమతి ఆంక్షలు, సుంకాలను, లైసన్సులు తీసుకోవాల్సిన చర్యలను పెంచింది. ఇది తిరిగి లైసన్సు రాజ్యం వైపు వెళ్లటమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి ఒక వైపు చెబుతారు, మరోవైపు అది అమలుకు అడ్డుపడే చర్యలు తీసుకుంటారు. దీనికి అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలను పెంచారు.కొన్ని ఐఫోన్ల ధరలను చూస్తే విమానాల్లో దుబారు వంటి చోట్లకు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తెచ్చుకోవటం చౌక అని చెబుతున్నారు. అనేక వస్తువుల దిగుమతికి లైసన్సు తీసుకోవాలని నిర్ణయించారు. రక్షణాత్మక చర్యల వలన మన వస్తువుల నాణ్యత పెంచేందుకు, చౌకగా అందించేందుకు మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు చర్యలు తీసుకోరు. పాత పద్దతులనే కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరగబోతోంది. రూపాయి విలువను పడిపోయేట్లు చేయటం ద్వారా మన వినియోగదారులు దిగుమతి చేసుకొనే వస్తువుల ధరల పెరుగుదలకు, మన వస్తువులను విదేశీయులు చౌకగా పొందేందుకు వీలు కలిగిస్తున్నారు.
స్వయం సమృద్ధి లేదా మన కాళ్ల మీద మనం నిలిచే విధానాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకు అనువైన విధానాలను అనుసరించే చిత్త శుద్ది లేదనేదే విమర్శ. ప్రపంచానికి తన తలుపులు తెరిచే ఉంటాయని చైనా చెబుతోంది, అయితే అది తాను చెప్పినట్లు జరగాలని అది కోరుకుంటోంది అని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వ్యాసశీర్షిక సారం. తన కాళ్ల మీద తాను నిలిచి ఇతరులు తమ మీద ఆధారపడేట్లు చేసుకొనే వ్యూహాన్ని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ అనుసరిస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఆర్ధిక వ్యవస్ధలతో సంబంధాలను తెంచుకోవటం లేదని గ్జీ చెబుతున్నారు గానీ చైనా అడుగులు చూస్తే అదే మార్గంలో పడుతున్నాయి అంటూ వ్యాసకర్తలు భాష్యంచెప్పారు. మన నరేంద్రమోడీ కూడా ఆ విధానాన్నే ఎందుకు అనుసరించరు ?


ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది !
ప్రతి దేశం ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తోంది. అమెరికా, జపాన్‌, మన దేశంతో కలసి క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కూటమి కడుతోంది. మరోవైపు అదే చైనాతో కలసి ఆర్‌సిఇపిలో భాగస్వామిగా చేతులు కలిపింది. చైనాతో వాణిజ్య మిగులులో ఉన్న ఆస్ట్రేలియన్లు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా తన ఆయుధాలను బయటకు తీస్తోంది. వరుసగా బొగ్గు, మద్యం,బార్లీ, పత్తి వంటి ఉత్పత్తుల దిగుమతులను ఆస్ట్రేలియా నుంచి క్రమంగా తగ్గిస్తోంది. ఇది వత్తిడి పెంచి అమెరికా నుంచి విడగొట్టే ఎత్తుగడలో భాగమే అన్నది స్పష్టం. దీనికి ప్రధాన కారణం దాని ఆర్ధికశక్తే. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 38శాతం చైనాకే జరుగుతున్నాయి, అమెరికా వాటా నాలుగుశాతమే. మన దేశం చైనా నుంచి ఒక శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటుంటే మన ఎగుమతుల్లో మూడుశాతం చైనాకు ఉన్నాయి. అందువలన చైనాకు మన తలుపులు మూస్తే నష్టం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది.
రక్షణాత్మక చర్యల ద్వారా మన ప్రగతికి మనమే అడ్డుపడటమే గాక ప్రపంచ భాగస్వామ్యాలను కూడా దెబ్బతీసినట్లు అవుతోందన్నది కొందరి అభిప్రాయం. ఇది విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించాలనే లాబీల నుంచి కూడా వచ్చే మాట అన్నది స్పష్టం. పన్నుల విధింపు, నిబంధనలు ఎక్కువగా ఉండటం వంటి చర్యల వలన ప్రపంచంలో భారత్‌ తన ఆర్ధిక వ్యవస్ధను తెరవటం లేదనే అభిప్రాయానికి తావిస్తుందన్నది సారాంశం. నిజానికి అమెరికా సంస్ధలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మన దేశంలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి.
ప్రతిష్ట, పలుకుబడి పెంచామన్నారు, ఫలితేమిటి ?
మేకిన్‌ ఇండియా పిలుపుతో ఆర్భాటం, ప్రపంచంలో దేశానికి ఎన్నడూ లేని ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని చెప్పటం తప్ప వాటితో గత ఆరున్నర సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించిందేమిటో, చేసిందేమిటో తెలియదు.ఆచరణలో కనిపించకపోతే గప్పాలు కొట్టుకోవటం అంటారు. ఆర్‌సిఇపిలో చేరకూడదని ఏడాది క్రితమే నిర్ణయించిన కేంద్రం మన సరకులకు విదేశీ మార్కెట్ల కోసం చేసిందేమీ లేదు. మరోవైపున ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత 26దేశాలు, వాణిజ్య కూటములతో చైనా 19 స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని తన వాణిజ్య విలువను 27 నుంచి 35శాతానికి పెంచుకుంది. దీన్ని విస్తరణవాదంగా చిత్రించి పబ్బంగడుపుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలో తయారు చేస్తామని చెబుతున్న సరకులను ఎక్కడికి ఎగుమతి చేస్తారు ? ఆర్‌సిఇపి ఒప్పందంలోని మిగిలిన 14భాగస్వామ్య దేశాలతో చైనా విదేశీ వాణిజ్యంలో 2019లో మూడోవంతు ఉంది, చైనాకు వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆ దేశాల వాటా పదిశాతం ఉంది. ఈ దిశగా నరేంద్రమోడీ ఇంతవరకు చేసిందేమిటి ? మన ఇరుగుపొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోలేదు, అవి చైనాతో సంబంధాలను పెంచుకున్నాయి.


మనం ప్రత్యామ్నాయ బిఆర్‌ఐని ఎందుకు రూపొందించలేదు ?
చైనా వాణిజ్య విస్తరణలో మరొక ప్రధాన అంశం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బిఆర్‌ఐ). 2049లో (అప్పటికి చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి) పూర్తయ్యే ఈ పధకం ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు చైనా పూనుకుంది. దీనిలో రోడ్డు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న మోడీ ఇలాంటి పధకాన్ని ఎందుకు రూపొందించలేకపోయారు ? చైనా గ్జీ జింపింగ్‌కు ఉన్న తెలివితేటలు మోడీకి లేవా ? నెహ్రూ అలా చేశారు, ఇలా చేశారు అని రోజూ అంతర్గతంగా ఆడిపోసుకోవటం, ఆర్‌సిఇపి, బిఆర్‌ఐ వంటి చర్యల ద్వారా చైనా విస్తరించటాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా ఇతర దేశాలతో చేతులు కలిపేందుకు తాపత్రయం తప్ప మన దేశమే అలాంటి పధకాలను రూపొందించాలనే దూరదృష్టి ఎందుకు కొరవడింది?
చైనా లేదా మరొకటి మరొక దేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిందే, అందరూ కలసి అడ్డుకోవాల్సిందే. గతంలో అలా ఆక్రమించుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలన్నీ వెనక్కు తగ్గి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత వలసలు, ఆక్రమణలు లేవు. ఏదో ఒక సాకుతో అమెరికా, దానికి మద్దతు ఇస్తున్నదేశాలే ఇటీవలి కాలంలో ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఆక్రమించుకుని తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి తప్ప చైనా అలాంటి చర్యలకు ఎక్కడా పాల్పడలేదు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) 1995లో ఉనికిలోకి రాక ముందు 1948 నుంచి పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) అమల్లో ఉంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు దానిలోకి చైనాను ప్రవేశించనివ్వలేదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే తమ ప్రాబల్యంలో ఉన్న ప్రపంచ మార్కెట్‌లోకి చైనా ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.(1971వరకు అసలు చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపే ఇవ్వలేదు.చైనా తిరుగబాటు రాష్ట్రమైన తైవాన్‌లో ఉన్న తొత్తు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధి అని దానికే ప్రాతినిధ్యం కల్పించాయి) 2001లో సభ్యత్వమిచ్చాయి.
మనం గమనించాల్సిన అంశం ఏమంటే చైనా ప్రారంభించిన సంస్కరణల్లో భాగంగా అది తన అపార మార్కెట్‌ను తెరిచింది.దానిలో ప్రవేశించాలన్నా, లబ్ది పొందాలన్నా చైనాను డబ్ల్యుటిఓలో భాగస్వామిని చేయకుండా సాధ్యం కాదు. అందుకే గతంలో అడ్డుకున్న అమెరికా వంటి దేశాలే ఐరాసలో, డబ్ల్యుటిఓలో చేరనిచ్చాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని చైనా నేడు ఒక అగ్రశక్తిగా ఎదిగి ధనిక దేశాలను సవాలు చేస్తోంది. తమకు పోటీగా తయారైన చైనాను సహించలేని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన దేశం పోటీలో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయా ? సహిస్తాయా ? చైనాను వ్యతిరేకిస్తే పశ్చిమ దేశాలు మనకేదో తవ్వితలకెత్తుతాయనే భ్రమల్లో ఉన్న మోడీ సర్కార్‌ అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా వాటిని నమ్ముకొని ఉంది తప్ప తాను చేయాల్సింది చేయటం లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అసలే లేదు.2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపిని సాధించటం లక్ష్యంగా చెప్పింది తప్ప దానికి అనువైన పరిస్దితుల కల్పనకు పూనుకోలేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది.

గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ధి జాడెక్కడ ?
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్దికవేత్తగా ఉన్న గీతా గోపీనాధ్‌ మరో ఆర్ధికవేత్త ఇక్బాల్‌ దహలీవాల్‌తో కలసి 2014 మేనెలలో దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఒక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం భారత్‌ యవ్వనదశలో ఎదుగుతున్న మార్కెట్‌గా ఉంది. దీని అర్ధం రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అదే జరిగింది, దానికి తోడు చమురు ధరలు పడిపోవటం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేకుండానే అభివృద్ధి జరిగింది. తదుపరి చర్యలు లేకపోవటంతో ఐదేండ్ల తరువాత దిగజారింది. జిడిపిలో పరిశ్రమల విలువ వాటా 25శాతం దగ్గర అప్పటికే ఆగిపోయింది. తనకు అధికారమిస్తే గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది దేశమంతటా అమలు చేస్తానని నరేంద్రమోడీ నమ్మబలికారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం పరిశ్రమల వాటా 24.88శాతానికి పడిపోయింది. ఈ కాలంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపిదే పాలన అన్న విషయం తెలిసిందే. ప్రయివేటు పెట్టుబడుల మీద ఆశలు పెట్టుకున్న సర్కార్‌కు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో మూటలు కట్టుకోవటం తప్ప వాటిని పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను స్ధాపించటం లేదు. విదేశీ మదుపుదార్లు మన కార్పొరేట్ల వాటాలను కొనుగోలు చేయటం తప్ప కొత్త పరిశ్రమలు పెట్టటం లేదు. అభివృద్ధి లేకపోవటానికి ఇదొక ప్రధాన కారణం.
చైనాలో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ సంస్ధలు ప్రత్యామ్నాయ ఉత్పాదక దేశాల కోసం చూస్తున్నాయని ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుంటే పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని గీతా గోపినాధ్‌ చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాల తరువాత కూడా నరేంద్రమోడీ అండ్‌కో అదే కబుర్లు చెబుతూ చైనా నుంచి ఉత్పాదక కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెబుతున్నది, భ్రమలు కల్పిస్తున్నది. 2013లో సులభతర వాణిజ్య సూచికలో మన దేశం 134వ స్ధానంలో ఉండగా 2020లో 63కు ఎదిగినా చైనా నుంచి, మరొక దేశం నుంచి కంపెనీలు వస్తున్న సూచనలేమీ లేవు. ఇప్పటికైనా చైనా గాకపోతే మరొక దేశాన్ని చూసి అయినా అభివృద్ధికి బాట వేస్తారా ? కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం గడుపుతారా ?