ఎం కోటేశ్వరరావు
పోలీసు చర్యలను చిత్రీకరించటాన్ని నేరంగా పరిగణిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం చేసిన బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం నాడు ఫ్రాన్సులో దేశవ్యాపితంగా స్వేచ్చకోసం అనే నినాదంతో వంద చోట్లకు పైగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో లక్షలాది మంది పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. రాజధాని పారిస్‌లో జరిగిన ప్రదర్శనలో ప్రభుత్వం తగ్గించి చెప్పిన సంఖ్య ప్రకారమే 46వేల మంది పాల్గొన్నారు. సాధారణంగా దానికి కొన్ని రెట్లు ఎక్కువ మంది ఉంటారని తెలిసిందే. దేశవ్యాపితంగా కేవలం లక్షా 33వేల మంది మాత్రమే పాల్గొన్నట్లు పోలీసులు ప్రకటించగా ఐదు లక్షల మంది ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ భద్రతా చట్టం (గ్లోబల్ సెక్యూరిటీ లా) పేరుతో ముందుకు తెచ్చిన అంశాల ప్రకారం పోలీసుల దౌర్జన్యాలను చిత్రీకరించిన పౌరులు, మీడియాను శిక్షించే అవకాశం ఉంటుందని తెలిసిందే. పారిస్‌లో పోలీసులు జరిపిన దాడిలో ఎఎఫ్‌పి వార్తా సంస్ధకు ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్న 24 సంవత్సరాల సిరియన్ యువకుడు అమీర్ అల్ హలబీ పోలీసు దెబ్బల కారణంగా తలమీద గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇతనితో పాటు ఉన్న మరో జర్నలిస్టు గాబ్రియెల్ ఎజార్డ్ మాట్లాడుతూ జర్నలిస్టులమని గుర్తించే అవకాశం ఉన్నా, జర్నలిస్టులమని కేకలు వేస్తున్నప్పటికీ పోలీసులు ఖాతరు చేయలేదని చెప్పాడు. ఈ బిల్లు తమను జైళ్లపాలు చేసేందుకు, పోలీసుల దుర్మార్గాలను జనానికి తెలియకుండా నిరోధించేందుకు తీసుకు వచ్చినట్లు జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. కరోనా పేరుతో ప్రదర్శనలకు అనుమతి లేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే శుక్రవారం నాడు కోర్టు వాటిని కొట్టివేసి ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. అనిశ్చితి మధ్య ఇంత పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి రావటం అక్కడి పరిస్ధితి తీవ్రతను తెలుపుతోంది. రెండు ఉదంతాల్లో పోలీసుల తీరు దీనికి కారణంగా చెబుతున్నారు.
గత సోమవారం నాడు జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు జనవరిలో ఎగువ సభ ఆమోదం పొందాల్సి ఉంది. దాని ప్రకారం ఎవరైనా ఒక పోలీసు అధికారి ముఖం కనిపించే విధంగా చిత్రీకరించిన ఫొటో,వీడియోలను ప్రదర్శిస్తే 45వేల యూరోల జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. విధి నిర్వహణలో లేనప్పటికీ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలను కలిగి ఉండేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, అనుమతితో నిమిత్తం లేకుండా నిరసనకారులను చిత్రీకరించేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగించేందుకు చట్టసవరణ అవకాశం కల్పిస్తోంది. ఈ బిల్లును ఆమోదించక ముందే పోలీసులు రెండు ఉదంతాల్లో ప్రవర్తించిన తీరు తీవ్ర నిరసనలకు దారి తీసింది. ఫ్రాన్స్‌లో రాజకీయ ఆశ్రయం కోరుతూ పారిస్ నగరంలో గుడారాల్లో ఉన్న నిర్వాసితులపై పోలీసులు దాడి చేశారు. మైకేల్ జక్లెర్ అనే ఆఫ్రికన్ జాతీయుడైన సంగీత చిత్ర నిర్మాతను అతని రికార్డింగు స్టూడియోలో ప్రవేశించిన పోలీసులు 20నిమిషాల పాటు కొట్టటం, నల్లజాతి మురికి వాడంటూ నిందించటం తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఆ దృశ్యాల వీడియోను రెండు కోట్ల మంది వీక్షించారు. పైగా అతను తమనే కొట్టాడంటూ పోలీసులు తప్పుడు కేసు పెట్టి రెండు రోజుల పాటు జైల్లో వేశారు. అయితే అతనిపై దాడి దృశ్యాలు వెలుగులోకి రావటంతో వదలిపెట్టక తప్పలేదు.
అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ ఉదంతంలో పోలీసుల దుర్మార్గానికి వెల్లడైన వ్యతిరేకత, అదే విధంగా ఫ్రాన్స్‌లోనే పసుపు రంగు చొక్కాలతో నిరసన తెలిపిన వారి మీద పోలీసులు జరిపిన దాడుల పట్ల పోలీసుల మీద తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వారు ఏమి చేసినప్పటికీ కేసులు నమోదు చేయకుండా రక్షణ కల్పించేందుకు తాజా బిల్లును మక్రాన్ ప్రభుత్వం తీసుకువచ్చింది.పచ్చరంగు చొక్కాలతో నిరసన తెలిపిన వారి కండ్ల మీద కాల్పులు జరపటం, కొట్టటం,ఇతర శరీర భాగాలను చిత్ర హింసలకు గురిచేయటం వంటి దారుణాలకు పాల్పడినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఒక్క పోలీసు మీద కూడా చర్యలు లేవు. వాటికి బదులు పోలీసులకు ప్రశంశగా పతకాలను ప్రభుత్వం ప్రకటించటం జనానికి మరింత ఆగ్రహం కల్పించింది. ఎనభై సంవత్సరాల వయస్సున్న ఒక వృద్ధురాలిపై బాష్పవాయు గోళాన్ని విసిరి ఆమె చావుకు, అదే విధంగా ఒక సంగీత కచ్చేరిపై దాడి చేసినపుడు ఒక యువకుడు నీళ్లలో మునిగి మరణంచటానికి కారకుడైన పోలీసు దళ అధికారి అలాంటి పతకాలు పొందిన వారిలో ఉన్నాడు. సంగీత చిత్ర నిర్మాత జక్లెర్‌పై దాడితో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని స్వయంగా అధ్యక్షుడు మక్రాన్ ప్రకటించినప్పటికీ పోలీసులకు అపరిమిత అధికారాలను ఇవ్వటంతో జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నలుగురిని సస్పెండ్ చేయటం, పోలీసు అత్యాచారాలపై విచారణకు ఆదేశించినప్పటికీ వారి మీద చర్యలు తీసుకుంటారన్న విశ్వాసం జనానికి లేదు.
సోమవారం రాత్రి పోలీసులు జరిపిన దాడుల దృశ్యాలను మంగళవారం ఉదయం చూసి తాను దిగ్భ్రాంతి చెందినట్లు పోలీసు మంత్రి ప్రకటించగా అవధులు లేని వంచన అని అధ్యక్షుడు మక్రాన్‌కు ఉపన్యాసాలు రాసి ఇచ్చిన మాజీ రచయిత వర్ణించాడు.చిత్రం ఏమిటంటే అదే రోజు మధ్యాహ్నం పోలీసులకు రక్షణ కల్పించే బిల్లును పార్లమెంటు దిగువ సభలో ఆమోదించారు.పోలీసు దుశ్చర్యల గురించి తాము వ్యక్తం చేసిన దానికి-బిల్లు ఆమోదానికి సంబంధం లేదని చెప్పటం విశేషం. ఈ బిల్లును తీసుకువచ్చే ముందు హింసాకాండ మీద గుత్తాధిపత్యం అనే పేరుతో తీసిన ఒక డాక్యుమెంటరీ సినిమాలో పోలీసు దాడులను చిత్రించారు. పోలీసులు-ప్రదర్శకుల మధ్య జరిగిన ఉదంతాలను సెల్‌ఫోన్ల ద్వారా తీసిన దృశ్యాలను దీనిలో వినియోగించటం విశేషం. కొత్త బిల్లు ప్రకారం ఈ చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదు.
నేతిబీరలో నెయ్యి వంటి సోషలిస్టు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసులకు అధికారాలను ఎక్కువగా ఇచ్చి ఉద్యమాలను అణచివేసింది. ఇప్పుడదే పార్టీ పోలీసులకు అధికారాలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తోంది.ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ గతంలో సోషలిస్టు పార్టీలో పని చేశాడు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పని చేస్తూ 2017 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతకు ముందు సంవత్సరం రాజీనామా చేసి ఎన్ మార్చ్(ముందడుగు) అనే పార్టీని ఏర్పాటు చేశాడు. దీనిలో వామపక్షంగా వర్ణితమయ్యే సోషలిస్టు పార్టీ, మితవాద పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ నుంచి అసంతృప్తి జీవులను చేరదీసి మధ్యేవాద పార్టీ పేరుతో రంగంలోకి వచ్చాడు.నేషనల్ ఫ్రంట్ పేరుతో ఉన్న పచ్చి మితవాద పార్టీ నాయకురాలు మారినే లీపెన్ మీద 2017 ఎన్నికల్లో మక్రాన్ ఘనవిజయం సాధించాడు. అప్పటి నుంచి కార్మికవర్గం పెద్ద ఎత్తున తమ సమస్యల మీద ఉద్యమిస్తున్నది. పసుపు చొక్కాల పేరుతో వినూత్న రీతిలో ఆందోళనలు తలెత్తాయి. కరోనా కారణంగా ఉద్యమాలు పెద్దగా జరగపోయినా ఇటీవలి కాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.
2022లో తిరిగి ఎన్నికలు( ఇంకా 18నెలలు) జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలలో పచ్చి మితవాద నేషనల్ పార్టీ తిరిగి పెద్ద సవాలు విసరనున్నదనే వాతావరణం ఉంది. అయితే తాను సోషలిస్టునని ఇప్పటికీ చెప్పుకొనే మక్రాన్ ఇటీవలి కాలంలో మితవాద శక్తులను సంతుష్టీకరించి వారి ఓట్లను పొందే యత్నాలు చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తద్వారా మారినే లీపెన్ విజయానికి అతగాడు బాటలు వేస్తున్నట్లే అని కొందరు పేర్కొన్నారు. మితవాదులు అసలైన మితవాదులకు మద్దతు ఇస్తారు, మక్రాన్ను నకిలి మితవాదిగా పరిగణిస్తారని చెబుతున్నారు. గత ఎన్నికలలో రెండవ సారి జరిగిన ముఖాముఖీ పోటీలో మక్రాన్‌కు 65శాతం, లీపెన్‌కు 35శాతం వచ్చాయి. మాజీ బ్యాంకర్ అయిన మక్రాన్ తన అర్ధశాస్త్ర పరిజ్ఞానంతో ఆర్ధిక వ్యవస్ధను సరి చేస్తారని అనేక మంది కలలు కన్నారు. ప్రస్తుతం కరోనా రెండవ సారి విజృంభిస్తుండటం, తొలిసారి వచ్చినపుడే పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలటం, మరోవైపు మితవాదుల మద్దతు ఉన్న కార్పొరేట్ల వత్తిడి మక్రాన్ సామర్ధ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడులతో ఇతర అనేక దేశాధినేతల మాదిరే ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారనే విమర్శలు మక్రాన్‌పై వచ్చాయి. ఉగ్రవాదాన్ని అణచేపేరుతో తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామిక హక్కులకు ముప్పు తెస్తున్నాయి. ఈ పరిణామం గురించి గతంలో మక్రాన్‌కు మద్దతు ఇచ్చిన 33 మంది ప్రముఖులు ఒక బహిరంగలేఖ రాశారు. ఈ దాడిని అనుమతించటం నయా ఫాసిస్టు తీవ్రవాదుల కలలను సాకారం చేయటమే, దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చటమే అని వారు పేర్కొన్నారు.ఈ చర్యలను అన్నిరకాల మితవాదులు బలపరిచారు. వలసల పేరుతో ముస్లింలను అనుమతిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. పారిస్ నగరశివార్లలో ఒక టీచరు తల నరికివేయటం, తరువాత ఒక చర్చిలో మూడు కత్తిపోటు ఘటనలు జరిగాయి. వీటిని చూపి ముస్లిం వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొడుతున్నారు. పోలీసులకే కాదు మిలిటరీకి కూడా రక్షణ చర్యలను వర్తింప చేయాలని నేషనల్ పార్టీ కోరుతోంది.
అధ్యక్షుడు మక్రాన్ పాలనా కాలంలో పోలీసు దాడులు పెరిగినట్లు అధికారిక వివరాలే వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 2,448 మంది ప్రదర్శకులు గాయపడ్డారు.19,071 ఎల్‌బిడిలను పేల్చారు.చిన్న చిన్న ఇనుప(పిల్లెట్స్) గుండ్లతో తయారు చేసిన తుపాకి గుండ్లు పేల్చారు.1,428 భాష్పవాయు గోళాలను వినియోగించారు. ఈ దాడుల్లో 344 మంది తలలకు గాయాలయ్యాయి, 29 మందికి కండ్లకు గాయాలు, ఐదుగురికి చేతుల గాయాలయ్యాయి. గతంలో ప్రదర్శనల సమయంలో పోలీసులు కాపలాకాయటం గురించి ఎక్కువగా కేంద్రీకరించే వారు ఇటీవలి కాలంలో ప్రదర్శకులను అవసరమైతే అడ్డుకోవాలన్న వైఖరి కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో గాయాలైనట్లు భావిస్తున్నారు. ఇది పోలీసుల మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఈ నేపధ్యంలో వారిని కాపాడేందుకు పోలీసుల ముఖాలు కనిపించే విధంగా దృశ్యాల చిత్రీకరణను నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం బిల్లును తెచ్చింది.
నిరుద్యోగం, దారిద్య్రం, అసమానతలకు వ్యతిరేకంగా గౌరవ ప్రదమైన ప్రవర్తనను కోరుతూ డిసెంబరు ఐదు నుంచి 11వ తేదీ వరకు ప్రజాసమీకరణ వారాన్ని పాటిస్తున్నట్లు ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కరోనా ఆరోగ్య సంక్షోభాన్ని ముందుకు తెచ్చింది. దాని నివారణకు కుటుంబవనరులన్నింటినీ ఖర్చు చేయాల్సి వచ్చింది. పదహారు శాతం ఆదాయం పడిపోయింది. ఎనభై లక్షల మంది ఆహార సహాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. డెబ్బయి లక్షల మందికి ఉపాధి పోవటం లేదా స్ధిరమైన ఉపాధి కరువైంది, మూడు లక్షల మంది స్త్రీ-పురుషులు గృహాలను కోల్పోయారు అని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. మరోవైపున ఐదు వందల బడా కంపెనీల ఆదాయాలు గత ఏడాది కంటే పెరిగాయి, డివిడెండ్ల రూపంలో 30బిలియన్ల యూరోలు చెల్లించాయి. ఇది కార్మికుల సొమ్ము తప్ప మరొకటి కాదు. కార్పొరేట్లకు అనుకూలమైన ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే ఇలా జరిగిందని తెలిపింది. సంక్షోభానికి జనం, కార్మికులు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదని అందువలన ఈ విధానాలకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించేందుకు నిర్ణయించినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల నేపధ్యం, నిరంకుశ విధానాలను మరింతగా రుద్దుతున్న నేపధ్యంలో ఫ్రాన్స్‌లో రానున్నది పోరాటాల కాలం అని చెప్పవచ్చు.
పోలీసు రాజ్యం దిశగా ఫ్రాన్సు- స్వేచ్చ కోసం వీధుల్లోకి జనం !
01 Tuesday Dec 2020
Posted Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion
in