Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
రైతులకు మద్దతుగా ఈనెల ఎనిమిది నుంచి సరకు రవాణా వాహనాలను నిలిపివేయనున్నట్లు ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఎఐఎంటిసి) బుధవారం నాడు ప్రకటించింది. కోటి మంది ట్రక్కు యజమానులు దీనిలో సభ్యులుగా ఉన్నారు.తొలుత ట్రక్కుల నిలిపివేత ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, కాశ్మీర్‌లలో అమలు జరుగుతుందని తెలిపారు. తరువాత కూడా కేంద్రం రైతుల డిమాండ్లను పట్టించుకోని పక్షంలో దేశవ్యాపితంగా చక్కాజామ్‌(రవాణా బంద్‌) ప్రకటించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు కులతరన్‌ సింగ్‌ అతవాల్‌ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీకి అనేక ప్రాంతాల నుంచి సరఫరాలు నిలిచిపోయాయి. ఆపిల్‌ పండ్లు మార్కెట్‌కు వస్తున్న తరుణంలో ఈ ఆందోళన రైతులకు, వ్యాపారులకు తీవ్ర సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. డిసెంబరు ఒకటిన ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు.
తమకు నష్టదాయకమైన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ నవంబరు 26 నుంచి ఢిల్లీ శివార్లలో కొనసాగుతున్న రైతుల ఆందోళన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.ఒక విదేశీ ప్రధాని మన దేశంలో జరుగుతున్న ఒక ప్రజా ఉద్యమానికి మద్దతు ప్రకటించటం బహుశా ఇదే ప్రధమం కావచ్చు. గురునానక్‌ జయంతి సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కును తాము సమర్ధిస్తామని, భారత్‌లో రైతుల ఉద్యమం సందర్భంగా పరిస్ధితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ఈ విషయాన్ని భారత అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పాడు.
రైతుల ఆందోళన గురించి మన దేశంలోని మీడియాలో కొన్ని తప్ప ఎక్కువ భాగం నిర్లిప్తంగా ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్లుగా వార్తలు ఇస్తున్నాయి. వీటితో పోల్చితే అంతర్జాతీయ వార్తా సంస్ధలు, విలేకర్ల ద్వారా అనేక విదేశీ పత్రికలు,టీవీ ఛానళ్లు వార్తలను ప్రముఖంగా ఇచ్చాయి. డిసెంబరు మూడవ తేదీన రైతు ప్రతినిధులను చర్చలకు పిలుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఒకటవ తేదీనే ఆహ్వానించటం వెనుక విదేశాల్లో తలెత్తిన వత్తిడితో పాటు ఉద్యమానికి దేశీయంగా పెరుగుతున్న మద్దతు ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం సాగుతున్న ఉద్యమంలో సిక్కు రైతాంగం ప్రధాన పాత్రధారులుగా ఉండటం, సిక్కు జనాభా గణనీయంగా ఉన్న కెనడాలో గురునానక్‌ జయంతి రోజున కెనడా ప్రధాని స్పందించటం గమనించాల్సిన అంశం. కెనడా రాజకీయ రంగంలో సిక్కులు ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కెనడా రక్షణ మంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రులుగా సిక్కులు ఉన్నారు. దేశజనాభాలో ఒకటిన్నర శాతానికి పైగా ( ఆరులక్షల మంది ) ఉన్నారు. రైతుల ఆందోళనకు సంబంధించి భారత్‌ నుంచి వస్తున్న వార్తలను గుర్తించకపోతే అశ్రద్ధ చేసిన వాడిని అవుతానని కెనడా ప్రధాని పేర్కొన్నారు. రైతుల ఆందోళన గురించి వాస్తవాలు తెలియకుండా కెనడా నేతలు మాట్లాడారని, ఒక ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అలా మాట్లాడటం అవాంఛనీయమని మన విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. దౌత్యపరంగా జరిగిన సంభాషణలను రాజకీయ అవసరాల కోసం తప్పుగా వ్యాఖ్యానించటం తగదన్నారు. కెనడా ప్రధానితో పాటు బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేతలు జాన్‌ మెక్‌డెనెల్‌,తన్మన్‌జీత్‌ సింగ్‌ దేశీ, ప్రీత్‌ కౌర్‌ గిల్‌ కూడా రైతుల ఆందోళన పట్ల మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న తీరును విమర్శించారు.
రైతుల ఆందోళన వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారని బిజెపి నేతలు చెప్పటం సమస్యను పక్కదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. గడ్డం పెంచిన వారందరూ ముస్లింలే అని ఉగ్రవాదులందరూ ముస్లింలే అన్నట్లుగా ప్రచారం చేస్తున్న శక్తులు సిక్కులు అనగానే ఖలిస్తానీ ఉగ్రవాదులని ముద్రవేయటంలో ఆశ్చర్యం ఏముంది ? సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు, చివరికి కొన్ని మీడియా సంస్దలు కూడా అదే పాటపాడాయి. దీనికి గాను రైతుల్లో కొందరు ఖలిస్తానీ తీవ్రవాది, ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో హతుడైన భింద్రన్‌వాలే ఫొటోలను ప్రదర్శించటాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు. ఆందోళనకు అనేకరైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. వాటి అనుయాయులుగా ఉన్నవారిలో భింద్రన్‌వాలే మీద సానుభూతి ఉన్నవారు కొందరు ఉండవచ్చు, అతని చిత్రాలను ప్రదర్శించవచ్చు. అంత మాత్రాన రైతు ఉద్యమాన్ని ఉగ్రవాదులే నడుపుతున్నారని చెప్పటం తప్పుడు ప్రచారమే.
ఆంగ్లో-మరాఠాల మధ్య జరిగిన యుద్దాలలో మూడవది మహారాష్ట్రలోని భీమా కొరేగావ్‌ గ్రామం దగ్గర జరిగింది. పీష్వా రెండవ బాజీరావు దళితులను అవమానపరచి తన సైన్యం నుంచి వారిని తొలగించారు. దీంతో పీష్వాలను వ్యతిరేకించిన బ్రిటీష్‌ సైన్యంలో వారు చేరారు. 1818 జనవరి ఒకటవ తేదీ భీమా కొరేగావ్‌ యుద్దంలో పీష్వాలు ఓడిపోయారు. ఇది తమ ఆత్మగౌరవ విజయంగా అప్పటి నుంచి దళితులు భావిస్తున్నారు. ఆ ఉదంతం జరిగిన 200 సంవత్సరాలు గడచిన సందర్భంగా భీమా కొరెగావ్‌లో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ప్రదర్శన, సభ నిర్వహించాయి. దాని నిర్వాహకులు, మద్దతు తెలిపిన వారి మీద బిజెపి ప్రభుత్వ కుట్ర కేసు నమోదు చేసింది. తెలుగు రచయిత వరవరరావుతో సహా అనేక మందిని ఆ కుట్ర కేసులో ఇరికి బెయిలు కూడా ఇవ్వకుండా నిర్బంధించిన విషయం తెలిసిందే. అదే విధంగా సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను వ్యతిరేకించిన ఢిల్లీ ముస్లింలు, వారికి మద్దతు ఇచ్చిన వారి మీద కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం కేసులు దాఖలు చేసింది. ఈ ఉదంతాలను గోరంతలు కొండంతలు చేసి నిర్వాహకుల మీద దేశద్రోహ ముద్రవేసి వేధిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు ఖలిస్తానీ ఉగ్రవాదులు మద్దతు ఉందనే ప్రచారం ప్రారంభించారు. అనేక దేశాలలో స్ధిరపడిన సిక్కులు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఖలిస్తానీ ఆందోళన దేశ వ్యతిరేకమైనది, వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టింది. తీవ్రవాదులు సాయుధ దాడులకు పాల్పడ్డారు. కానీ రైతుల నవంబరు 26 ఆందోళన ఎంతో ముందుగానే ప్రకటించిన కార్యక్రమమే, అదే విధంగా రైతుల ఢిల్లీ చలో పిలుపులో కూడా దాపరికం లేదు. వారేమీ ఖలిస్తానీ డిమాండ్లను ముందుకు తేలేదు, వారంతా ట్రాక్టర్లలో ఆహార పదార్ధాలతో వచ్చారు తప్ప ఆయుధాలు తీసుకు రాలేదు. నిరవధిక ఆందోళనకు సిద్దపడి వస్తున్నారని ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఆందోళన నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా వారిని మరింతగా రెచ్చగొట్టే విధంగా చివరికి హర్యానా బిజెపి ముఖ్యమంత్రి కూడా వ్యవహరించారు. నవంబరు 26 నుంచి ఆందోళనకు దిగితే డిసెంబరు మూడున చర్చలు జరుపుతామని ప్రకటించటంలోనే దుష్టపన్నాగం ఉంది. ఎక్కడైనా పోలీసులు, మిలిటరీ రాకుండా ఆందోళనకారులు రోడ్ల మీద గోతులు తవ్వటం, ఆటంకాలను కల్పించటం సాధారణం. కానీ ఢిల్లీ పోలీసులు, కేంద్ర దళాలే రైతులను అడ్డుకొనేందుకు ఆపని చేయటం మోడీ సర్కార్‌ ప్రత్యేకత.
పంజాబ్‌ రైతులు ఉద్యమించటం ఇదేమీ కొత్త కాదు. గతంలో అనేక ఉద్యమాలు చేశారు. వాటి వెనుక ధనిక రైతులు, పేద రైతులూ ఉన్నారు.1984 మే నెలలో చండీఘర్‌లోని గవర్నర్‌ నివాసాన్ని వారం రోజుల పాటు దిగ్బంధించారు. పంజాబ్‌ రైతాంగం అనేక పోరాటాలు సాగించిన అనుభవం కలిగి ఉంది. కమ్యూనిస్టులు, అకాలీలు వాటికి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. 1984ఆందోళన సమయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు రూపకల్పన జరిగింది. భింద్రన్‌వాలే, అతని అనుచరుల ఆక్రమణలో ఉన్న స్వర్ణ దేవాలయంలోని హర్‌మందిర్‌ సాహిబ్‌ భవనాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సైనిక చర్య జరిపారు. తరువాత ఎనిమిది సంవత్సరాల పాటు పంజాబ్‌లో అన్ని రకాల ఉద్యమాల మీద నిషేధం కొనసాగింది.
ఇప్పుడు సాగుతున్న ఉద్యమం మీద ఖలిస్తానీ ముద్రవేయటం ద్వారా ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని వేరు చేయటం, ఆందోళనను అణచివేసే దుష్టాలోచన కూడా లేకపోలేదు. హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ స్వయంగా అలాంటి ఆరోపణ చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే భీమా కొరేగావ్‌ కుట్ర కేసు, ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళన కారులపై, వారికి మద్దతు ఇచ్చిన వారి మీద తప్పుడు కేసులు బనాయించిన విషయం తెలిసిందే. రైతుల ఉద్యమం తీవ్రతరం అయినా మరికొంత కాలం సాగినా అలాంటి పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.
పంజాబ్‌, హర్యానా వాటికి సమీపంలో ఉన్న రైతులు ప్రస్తుతం ఉద్యమంలో ముందు పీఠీన ఉన్నారు. దీని ప్రభావం 2022లో జరిగే పంజాబ్‌ ఎన్నికలలో పడుతుందనే భయంతో అకాలీదళ్‌ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల మీద కూడా పడనుందనే భయం బిజెపి మిత్రపక్షాల్లో తలెత్తింది. అవి చిన్న పార్టీలు, వ్యక్తులే కావచ్చు గానీ ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయాన్ని తెలుపుతున్నది. హర్యానాలో బిజెపి మిత్రపక్షమైన జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. సవరించిన చట్టాలలో కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తూ ఒక్క ముక్కను చేర్చేందుకు వచ్చే ఇబ్బంది ఏమిటని ఆ పార్టీ నేత అజరు చౌతాలా ప్రశ్నించారు. డిసెంబరు మూడు వరకు వేచి చూడకుండా ముందే ఎందుకు చర్చలు జరపకూడదని అజరు చౌతాలా కుమారుడు జెజెపి నేత దిగ్విజయ సింగ్‌ చౌతాల కూడా ప్రశ్నించారు. రైతుల పట్ల అనుసరించే వైఖరిని బట్టి తమ పార్టీ భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు తాను ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్వతంత్ర ఎంఎల్‌ఏలు సోంబిర్‌ సింగ్‌ సంగవాన్‌, బలరాజ్‌ కుందు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరితో ఉన్నదని పేర్కొన్నారు. తొంభై మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఎన్నికైన బిజెపి బలం 40 కాగా పది సీట్లున్నజెజెపి, ఏడుగురు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉంది. రాష్ట్రంలోని అనేక ఖాప్‌(గ్రామ పెద్దలతో కూడిన కమిటీలు)లు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాజస్ధాన్‌లో బిజెపి మిత్రపక్షమైన రాష్ట్రీయ లోకతాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పి) అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు హనుమాన్‌ వేణీవాల్‌ ఒక ప్రకటన చేస్తూ పార్లమెంట్‌ ఆమోదించిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరారు.తాము జవాన్లు, కిసాన్ల మద్దతుతో ఎన్నికయ్యామని రైతుల సమస్యల మీద పునరాలోచన చేయనట్లయితే ఎన్‌డిఏలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామని చెప్పారు.
పార్లమెంట్‌ ఆమోదించిన వ్యవసాయ సవరణ చట్టాలను వెనక్కు తీసుకొనే ప్రసక్తి లేదని, రైతులతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని బిజెపి నేతలు చెబుతున్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల్లో భయాలు రేపింది తప్ప రైతుల్లో నిజంగా వ్యతిరేకత లేదని ఆరోపిస్తున్నారు. వచ్చేఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని బిజెపి ఏర్పాట్లు చేసుకుంటున్నది. వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమైనవని, ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపధ్యంలో కేంద్రం వెనక్కు తగ్గే ధోరణిలో లేదన్నది స్పష్టమౌతోంది. రైతులతో చర్చలు కాలయాపన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఈ కారణంతోనే రైతులు ఢిల్లీకి రాకుండా రాష్ట్రాల నుంచి వచ్చే రహదారులన్నింటినీ మూసివేయటం, రైతులకు ఆటంకాలను కలిగిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోకుండా వెనక్కు తగ్గేది లేదని రైతులు ప్రకటించారు. షాహిన్‌ బాగ్‌ ఆందోళనకు, భీమా కొరేగావ్‌ కేసులకు రైతుల ఆందోళనకు ఉన్న తేడాను గమనించకుండా కుట్రతో అణచివేయాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గమనించాలి.