Tags
ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుదామంటే ఎల్లవేళలా సాధ్యం కాదు.అందునా రాజకీయ పార్టీలకు అసలు కుదరదు. హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలన్నింటికీ ఒక కొత్త సవాలును ముందుకు తెచ్చాయి. దాన్ని ఏ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్నదాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మీద ఒక తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాదు జనాభా రీత్యా రాష్ట్రంలో మూడోవంతు కలిగి ఉంది. తెలుగు ప్రాంతాల నుంచే గాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్ధిరపడిన, వలస వచ్చిన జనం ఇక్కడ ఉంది. ఈ నేపధ్యంలోనే తప్పించుకు తిరిగితే కుదరని స్ధితి ఏర్పడిందని చెప్పాల్సి వస్తోంది.
జిహెచ్‌ఎంసి ఫలితం తీరు తెన్నులు ఏమిటి ?
గత ఎన్నికలకు, వర్తమాన ఎన్నికలకు పోలికను చూడటం సహజమే అయినప్పటికీ అనేక అంశాలు ఒకదానితో ఒకటి పోల్చుకొనేందుకు వీలు లేదు. గత ఎన్నికల్లో బిజెపి తన మిత్రపక్షం తెలుగుదేశంతో కలసి 63 స్ధానాల్లో పోటీ చేసింది, ఈసారి అన్ని సీట్లకు పోటీ చేసింది. మజ్లిస్ పార్టీ గత ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయగా ఈ సారి 51కే పరిమితం అయింది. అందువలన వచ్చిన సీట్లు, ఓట్లశాతలను పోల్చుకోలేము. టిఆర్‌ఎస్ అన్ని స్ధానాలకు కాంగ్రెస్ 146 చోట్ల పోటీ చేసింది. పార్టీల వారీ టిఆర్‌ఎస్ 55, బిజెపి 48, మజ్లిస్ 44, కాంగ్రెస్ రెండు సీట్లు తెచ్చుకుంది. ఒక స్ధానం ఫలితం ఖరారు కావాల్సి ఉంది. గత, తాజా ఎన్నికల్లో పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ 2016 ——- 2020
టిఆర్‌ఎస్ 43.85 ——- 34.9
బిజెపి 10.34 ——– 34.6
మజ్లిస్ 15.85 ——– 18.28
కాంగ్రెస్ 13.11 ——— 6.5
టిడిపి 15.10 ——— 1.61
గత ఎన్నికల ఫలితాలు ఏమి వెల్లడించాయి ?
గత ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికలలోనే కారు వేగం తగ్గటాన్ని చూశాము. మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు, పార్టీల వారీ ఓటింగ్ ఇతర అంశాలను క్లుప్తంగా చూద్దాం.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను టిఆర్‌ఎస్ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్ 431, కాంగ్రెస్ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్ పార్టీ 99 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఓటింగ్ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా దానికి సీట్లు రాలేదు.
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో కారు వేగం బాగా తగ్గింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.
మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ 50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస 28 ———- 71 —– 20 —– 0 —— 1—— 1
కాంగ్రెస్ 1 ———- 10 —– 35 —– 30 —- 26 —- 18
బిజెపి 0 ———— 3 ——- 4 —– 14 —- 40 —- 59
మజ్లిస్ 0 ———— 0 ——- 2 ——- 1 —– 2 —- 40
–ఇతరులు 1 ———— 2 —— 11 —– 17—-48 —- 41
పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరాసకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్ 41(12.61) మజ్లిస్ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. కరీంనగర్ లోక్‌సభ స్ధానానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 60 స్ధానాలకు గాను టిఆర్‌ఎస్ 36, దానితో ఉండే స్వతంత్రులు నలుగురు, బిజెపి 13, మజ్లిస్ 6,స్వతంత్ర ఒకరు ఉన్నారు.
రాబోయే రోజుల్లో బిజెపి వ్యూహమేమిటి ?
బిజెపి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వనరులను అన్నింటినీ కేంద్రీకరించటంతో పాటు తన మత అజెండాను పూర్తిగా ముందుకు తీసుకు వచ్చింది. మత పరమైన భావోద్వేగాలను గరిష్ట స్ధాయిలో రేపేందుకు అది ప్రయత్నించింది. ఎన్నికల ఫలితాలపై చర్చలలో ఆ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను మొత్తంగా చూస్తే ఈ అజెండాను రాష్ట్ర వ్యాపితంగా ముందుకు తీసుకుపోవటం ద్వారా 2023 లేదా దానికి ముందే ఒక వేళ జమిలి ఎన్నికలను రుద్దితే 2022లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించాలనే ఆశ, ఆకాంక్షలను అది దాచుకోలేదు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత హైదరాబాదులో వచ్చిన విజయాలతో రానున్న రోజుల్లో ప్రచారదాడిని మరింతగా పెంచనుంది. మజ్లిస్‌ను పరోక్షంగా ప్రోత్సహించి లబ్ది పొందుతుంది తప్ప ప్రత్యక్షంగా సంబంధాలను తీసుకొనే అవకాశాలు లేవు. ఒక రాష్ట్ర అధికారం వేరు ఒక కార్పొరేషన్ పరిధి వేరు.
కాంగ్రెస్ భవితవ్యం ఏమిటి ?
ఆంబోతుల మధ్య లేగ దూడలు నలిగిపోయినట్లుగా కాంగ్రెస్ పరిస్దితి తయారైంది. దుబ్బాకలో చివరి నిమిషం వరకు అభ్యర్ధిని తేల్చుకోలేకపోవటంలోనే దాని బలహీనత వ్యక్తమైంది. హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికలలో అలాంటి పరిస్ధితి లేదు. అంతర్గత విబేధాలు వెల్లడయ్యాయి. బిజెపి-మజ్లిస్-తెరాసలతో పోటీ పడి అది ప్రచారం నిర్వహించలేకపోయింది. సంఖ్యరీత్యా గతంలో ఉన్న రెండు సీట్లు నిలుపుకున్నా గణనీయంగా ఓట్లను కోల్పోయింది. ఆ పార్టీలో ఇప్పుడు మిగిలేవారు ఎందరు అన్నది ప్రశ్న. ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించినా దానిలో ఉంటారనే విశ్వాసం ఓటర్లలో కోల్పోవటం ఒక ప్రధాన కారణం. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమకుమార్ ఎప్పుడో తప్పుకుంటానని ప్రకటించినా ఆ స్ధానంలో మరొకరిని భర్తీ చేయలేని పార్టీ తీరా పూర్తిగా కాడి పడవేసిన తరువాత కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేని బలహీనతతో అది ఉంది.
చౌరాస్తాలో ఉన్న టిఆర్‌ఎస్ కారు !
టిఆర్‌ఎస్ కారుకు దుబ్బాకలో ఓడిపోయిన దాని కంటే హైదరాబాద్‌లో గెలిచినా పెద్ద దెబ్బతగిలింది. నాలుగు రోడ్ల (చౌరాస్తా) కూడలిలో నిలిచింది.ఇది స్వయంకృతం. ఇప్పుడు అది ఏ దారిలో వెళ్లనుంది అన్నదే కీలకమైన ప్రశ్న. హైదరాబాదు ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాలను కొత్త బాట పట్టించేందుకు దోహదం చేశాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను ఆకర్షించి దెబ్బతీసిన ప్రశ్నించే వారు లేకుండా చూసుకోవాలని భావించిన ఆ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తన వారిని నిలుపుకొనేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తుందన్న ప్రశ్నను ఈ పరిణామం ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ను చూపి బిజెపి తెరాస-కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్నది. మజ్లిస్‌తో అది ఆడిన క్రీడ ఇప్పుడు అడుగడుగునా మజ్లిస్‌కు లొంగలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్ధితిని తెచ్చి పెట్టింది. మేయర్ ఎన్నికలో అది పోటీ చేసినా, చేయకుండా బేషరతు మద్దతు ఇచ్చినా తెరవెనుక ఏదో జరిగిందనే జనం భావించే స్దితిని స్వయంగా కల్పించుకుంది.
మజ్లిస్ ఏమి చేయనుంది ?
ఇతర రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిజెపి బి టీమ్‌గా పోటీలోకి దిగుతున్నదనే విమర్శ మజ్లిస్ మీద ఉంది. దాని వలన లబ్దిపొందిన తీరును మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో చూశాము.మరికొన్ని చోట్ల కూడా అదే పాచికను ప్రయోగించవచ్చు. అయితే తెలంగాణా- ప్రత్యేకించి హైదరాబాదులో ఉన్న పరిస్ధితి వేరు. మజ్లిస్, ముస్లిం మైనారిటీలను బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతానికి చెందిన వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఎప్పటి నుంచో నిరంతరం ప్రయత్నిస్తోంది. బిజెపి ప్రచారంతో మజ్లిస్ తన స్ధానాన్ని పటిష్ట పరచుకుంది. రెండు మతశక్తులు రంగంలోకి దిగినపుడు జరిగే పరిణామం ఇదే. ఇప్పుడు మజ్లిస్‌ను ఒక అంటరాని పార్టీగా చేయటంలో బిజెపి ప్రచారం విజయవంతమైంది. ఎన్నికల ప్రచారంలో బిజెపి అంత తీవ్రంగా గాకపోయినా మజ్లిస్‌ను కూడా టిఆర్‌ఎస్ విమర్శించక తప్పలేదు. మజ్లిస్ మాత్రం టిఆర్‌ఎస్ మీద ఎలాంటి దాడి చేయలేదు. ఈ పరిణామాన్ని బిజెపి ఉపయోగించుకుంది. మజ్లిస్‌ను ఉపయోగించుకొని లబ్ది పొందేందుకు గతంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నించింది. ఇదే టిఆర్‌ఎస్ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసింది. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మజ్లిస్ కూడా ఇరకాటంలో పడింది. అధికారం లేకుండా అది ముస్లింలను తనతో ఉంచుకోలేదు. గొంతెమ్మ కోరికలు కోరి తెగేదాక లాగకపోవచ్చు. ఒక ఎత్తుగడగా ఈ ఎన్నికలో వాటా కోరకపోవచ్చు. డిప్యూటీ మేయర్ లేదా కొంతకాలం మేయర్ పదవితో దానికి వచ్చే ప్రయోజనం కంటే బేషరతు మద్దతుతోనే ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు.
ఇప్పుడేమి జరగనుంది ? ఏమి చేయాలి ?
హైదరాబాదు మేయర్ కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగానే అన్ని పార్టీలు వ్యవహరించటం అనివార్యం. రాజకీయాల్లో దేశద్రోహులుగా లేదా దేశద్రోహశక్తులకు మద్దతు ఇచ్చిన పార్టీలని తాను విమర్శించిన వాటితో చేతులు కలపటానికి బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాశ్మీరులో పిడిపితో కలసి సంకీర్ణ మంత్రివర్గంలో పాల్గొనటమే దానికి పెద్ద నిదర్శనం. అలాంటి పార్టీకి మజ్లిస్‌తో చేతులు కలపటం పెద్ద సమస్య కాదు. అయితే అలంకార ప్రాయమైన మేయర్ పీఠం కంటే ముఖ్యమంత్రి గద్దె మీద బిజెపి కేంద్రీకరించినందున ప్రస్తుతానికి మజ్లిస్‌తో చేతులు కలిపే అవకాశాలు లేవు. మజ్లిస్‌తో చేతులు కలిపిందనే ప్రచారాన్ని నగర ఓటర్లు అనేక మంది నమ్మిన కారణంగానే గతంలో టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గారు. అలాంటపుడు మజ్లిస్‌తో చేతులు కలిపితే బిజెపికి మొదటికే మోసం వస్తుంది.
మేయర్ పీఠాన్ని టిఆర్‌ఎస్ దక్కించుకొనేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి ? హాజరైన సభ్యులలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు దక్కుతాయి. తమ మధ్య ఎలాంటి అవగాహన లేదు అని చెప్పుకొనేందుకు మజ్లిస్ ఓటింగ్‌ను బహిష్కరించవచ్చు లేదా అది కూడా పోటీ పెడితే బిజెపి కూడా పోటీ చేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చు. ఏది జరిగినా టిఆర్‌ఎస్‌కు పీఠం ఖాయం. గత ఎన్నికల్లో టిర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగా రెండు పదవులనూ అదే దక్కించుకుంది. మజ్లిస్‌తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే బిజెపి పన్నిన వలలో చిక్కినట్లే. పరోక్షంగా మద్దతు తీసుకున్నా బిజెపి దాడి ఆగదు.
తెలంగాణా వ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు అనువైన భౌతిక పరిస్ధితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే ఇలాంటి మితవాద భావాలు ఓటర్ల మీద బలంగా ప్రభావం చూపుతాయి. అది హైదరాదు నగరం మీద ఉన్నంత తీవ్రంగా ఇతర ప్రాంతాల మీద ఉంటుందని చెప్పలేము. చారిత్రక నేపధ్యం, రజాకార్ వారసత్వం, గతంలో ఇక్కడ జరిగిన మతకలహాలు, రాజకీయ పార్టీల అవకాశవాదం దీనికి కారణం. హైదరాబాదులో మజ్లిస్ పార్టీ గూండాయిజం నుంచి రక్షణ కల్పించేది తామే అనే బిజెపి ప్రచారం దశాబ్దాలుగా పధకం ప్రకారం సాగుతోంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్నట్లుగా అనేక మంది ఆ ప్రచారానికి లోనుకావటం కూడా తాజా ఎన్నికల్లో బిజెపి పుంజుకోవటానికి దోహదం చేసింది. ముఖ్యంగా మజ్లిస్ ప్రభావం ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోవటం లేని ప్రాంతాలలో టిఆర్‌ఎస్ విజయం సాధించటం దానికి ఒక సూచిక అని చెప్పవచ్చు.
టిఆర్‌ఎస్-బిజెపి మధ్య తెరవెనుక అవగాహన ఉందన్నది గతంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో, వెలుపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వైఖరి స్పష్టం చేసింది. బిజెపితో రాజీపడి తమ జోలికి రాకుండా చూసుకోవాలన్నది టిఆర్‌ఎస్ నేతల అవకాశవాదం. అదే విధంగా మజ్లిస్‌ను బుజ్జగించే వైఖరితోనే ఆ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని బిజెపి చేస్తున్న ప్రచారదాడిని ఎదుర్కోవటంలో చట్టపరంగా, రాజకీయంగా కెసిఆర్ సర్కార్ అచేతనంగా ఉందని జనం భావిస్తున్నారు. తాము పార్లమెంట్‌లో బిజెపికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే టిఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేసినా రాజకీయంగా నిర్దిష్ట వైఖరిని తీసుకోలేదు. నవంబరు 26జాతీయ సమ్మెకు చివరి నిమిషంలో మద్దతు ప్రకటించింది.డిసెంబరు ఎనిమిదవ తేదీ భారత్ బంద్‌లో సంపూర్ణంగా పొల్గొనాలని రెండు రోజులు ముందుగానే కెసిఆర్ ప్రకటించారు. బిజెపి తమ గద్దెకు ఎసరు తెస్తోందని నిర్ధారించుకున్నట్లుగా ఇది సూచిస్తున్నది.
ఇక మజ్లిస్‌తో తమకు తెరచాటు అవగాహన లేదని నిరూపించుకొనే బాధ్యత టిఆర్‌ఎస్ మీద ఉంది. దాని వలన లబ్ది పొందేది కూడా అదే. తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా నిజమాబాద్ కార్పొరేషన్‌లో దాని సహకారంతోనే మేయర్ పదవిని దక్కించుకుంది. కనుక చెప్పే మాటలను అంత తేలికగా నమ్మటం కష్టం. ఎలా నిరూపించుకుంటారో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే అదేమీ కష్టం కాదు. నిజంగానే అదే జరిగితే ఏం జరుగుతుంది ? రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు గతంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఇటీవల టిఆర్‌ఎస్ వైపు ఉన్నారు. మజ్లిస్‌తో సంబంధాలను తెంచుకుంటే ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో తన అభ్యర్ధులను పోటీ పెట్టి మైనారిటీల ఓట్లను చీల్చి బిజెపికి లబ్ది చేకూర్చినట్లే ఇక్కడ కూడా చేసేందుకు అవకాశం లేకపోలేదు. బిజెపి మెజారిటీ మతతత్వాన్ని వ్యతిరేకించినట్లే మజ్లిస్ మైనారిటీ మతతత్వాన్ని కూడా నిఖరంగా వ్యతిరేకిస్తే కోల్పోయిన ఓట్లలో కొన్నింటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇదే విధంగా అసంతృప్తి చెందిన వివిధ తరగతుల సమస్యలను పరిష్కరిస్తే వారి మద్దతును కూడా తిరిగి పొందటం కష్టం కాదు. ప్రభుత్వం మీద ఒకసారి అసంతృప్తి ప్రారంభమైతే ఎన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపినా అవి ఓట్లు తెచ్చి పెట్టవు అని ఇప్పటికైనా టిఆర్‌ఎస్ నాయకత్వం గుర్తించటం అవసరం. ఎవరు అధికారంలోకి వచ్చినా అమలు జరుపుతున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తారు కనుక తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చనే అభిప్రాయం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లలో కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అది మరింత స్ధిరపడుతుంది. కొత్తది ఏదైనా సాధారణ స్దాయికి చేరిన తరువాత దాని మీద ఆకర్షణ తగ్గి కొత్త అంశాల మీద కేంద్రీకరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడి సర్కార్ అమలు జరిపిన పధకాలేమీ తక్కువ కాదు, చివరి నిమిషంలో ముందుకు తెచ్చిన పసుపు-కుంకమ కంటే వైసిపి పార్టీ ఎక్కువగా అమలుజరుపుతుందని జనం భావించారన్నది స్పష్టం.
హైదరాబాదు ప్రచారంలో అభివృద్ది అంశాల కంటే మత అంశాలనే ఎక్కువగా ముందుకు తెచ్చారు. తెలంగాణాలో సంక్షేమ పధకాలతో పాటు మతోన్మాద భావాలను కూడా బిజెపి జమిలిగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రసమితి, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరులను మార్చుకొని సామరస్యతగా మారుపేరుగా ఉన్న రాష్ట్రాన్ని ఇదే బాటలో నడిపిస్తారా ? అవకాశ వాదం, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి మెజారిటీ-మైనారిటీ మతశక్తుల అడ్డాగా మారుస్తారా ? టిఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష ఎదురైంది.
Good analysis. Nice Pressented facts and stastics .
LikeLike