Tags

, ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


గతంలో బ్యాంకింగ్‌ అనుభవం ఉన్నవారికే బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే వారు. ఇప్పుడు దానితో పని లేదు. బడా కంపెనీయా కాదా అన్నదే గీటు రాయిగా మారనుంది? కార్పోరేట్‌ కంపెనీలు బ్యాంకుల ఏర్పాటు పై మార్గదర్శకాలను సూచించమని కోరుతూ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీ.కే మహంతి ఆధ్వర్యాన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఒక అంతర్గత వర్కింగ్‌ గ్రూపు ని 2020 జూన్‌ 20 న నియమించింది. ఈ బ ందం చేసిన సూచనలు దేశంలో ఒక తీవ్ర చర్చను లేపాయి.

కార్పోరేట్‌ పారిశ్రామిక సంస్ధలు స్వంతంగా బ్యాంకులు పెట్టుకోవడానికి అనుమతించాలని,పెద్ద కార్పోరేట్‌ కంపెనీలను బ్యాంకులను ప్రమోటర్లుగా అనుమతించాలని గ్రూప్‌ ప్రతిపాదించింది. ఇవి అమలైతే బడా కార్పోరేట్‌ కంపెనీలన్నీ స్వంత బ్యాంకులను ప్రారంభించుటకు అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బ్యాంకులలో ప్రమోటర్ల వాటా పరిమితి ని 15 శాతంనుండి 26 శాతానికి పెంచాలని, 50 వేల కోట్ల పైన ఆస్దులు వున్నకంపెనీలకు బ్యాంకింగ్‌ లైసెన్సులను మంజూరు చేయాలనిసూచించింది. దీనికి చెప్పిన కారణాల సారాంశం ఇలా ఉంది. (1) బ్యాంకులు ప్రారంభించటానికి కార్పోరేట్‌ కంపెనీలకు లైసెన్సులు ఇస్తే పెట్టుబడుల లభ్యత పెరుగుతుంది. (2) పరిపాలనాఅనుభవం తోపాటుగా నైపుణ్యం కలిగిన వ్యూహాత్మక కార్పోరేట్‌ మేనేజ్‌ మెంటు లభిస్తుంది.

భారీ మొత్తాలలో రుణాలకోసం బ్యాంకుల చుట్టూ తిరిగే కార్పోరేట్లకు బ్యాంకులను ఇవ్వటం సరికాదని ఆర్ధికవేత్తలు, మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్ధకే ప్రమాదం అన్నారు.
ఈ సూచనలు అమలైతే టాటా, బిర్లా, అంబానీ, అదానీ, యల్‌ అండ్‌ టీ, వంటి దేశీయ కార్పోరేట్‌ దిగ్గజాలు భవిష్యత్తులో బ్యాంకింగ్‌ రంగంలో కీలకంగా మారనున్నాయి. దేశ ఆర్ధికవ్యవస్ద తమ చేతిలో వుంచుకుని లాభాలే ధ్యేయంగా క షిచేస్తారు. బ్యాంకులను తమ ఆదాయ వనరుగా మారుస్తారు.కరోనా మహమ్మా రి వలన సామాన్యప్రజలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోగా కార్పోరేట్‌ కంపెనీలకు లాభాలపంటపండింది. 2020 మూడవ త్రైమాసికంలో భారత్‌ లోని కార్పోరేట్‌ కంపెనీలు రికార్డు స్ధాయిలో 1.33 లక్షల కోట్లు ఆర్జించాయని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీ యమ్‌ ఐ ఈ )తెలిపింది. ఇదే సమయంలో కొత్తగా బిలియనీర్లయినవారి సంఖ్య కూడా పెరిగింది. అట్టి చరిత్ర కలిగిన కార్పోరేట్‌ కంపెనీలకు బ్యాంకులు అప్పగిస్తే డిపాజిటర్ల డబ్బులకు భధ్రత గురించి కూడా ఆలోచించాలి. బ్యాంకు లో భవిష్యత్‌ అవసరాలకు దాచుకున్నసామాన్యులు, మధ్యతరగతి ప్రజల గతిఏమవుతుందో వూహించటంకష్టం. ఈ ప్రమాదకరమయిన ప్రతిపాదనలు ప్రజల పొదుపుమొత్తాలను ముప్పులో పడేస్తాయి. ఆర్ధికవ్యవస్ధకు తీవ్రమైన హానికలిగిస్తాయి.

భారతీయ రెగ్యులేటరీ ఏజన్సీలను మోసంచేయడం-రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ లోపంవలన , కంపెనీ అధిపతుల అనుకూల ప్రభుత్వవిధానాలవలన, మొండి బాకీలు, అవినీతి పెచ్చుమీరటంవలన బ్యాంకులు కుంటుతున్నాయి. పడిలేస్తున్నాయి. ఎన్నో లోపాలున్నాయి. అయినా రైతులకు, చిరువ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు కొంతవరకయినా రుణాలివ్వక తప్పటంలేదు. ప్రజలకు లభించిన ఈవెసులుబాటును కూడా ప్రజలకు దక్కకుండా చేయాలని కార్పోరేట్‌ రంగం క షిచేస్తున్నది. 2018సం. మార్చి నాటికి భారతీయ బ్యాంకులలో మొండి బాకీలు రు. 9.62 లక్షల కోట్లు అందులో 73.2 శాతం కార్పోరేటు కంపెనీల బాకీలే అన్నది గమనించాలి. వ్యవసాయ సంబంధిత అప్పులు రూ . 85,344 కోట్లు మాత్రమే.

బ్యాంకులపై పర్యవేక్షణ ఎట్లా వుంది
2014 లో ఆర్భాటంగా ప్రారంభించిన యస్‌ బ్యాంకు 2020 కల్లా దివాళా తీసింది. 2,41,000 కోట్ల బకాయీలలో 1,45,000 కోట్లు పారుబకాయిలు, అంటే తిరిగి రానివి. అందులో ముఖ్యబాకీదారుడు అనిల్‌ అంబానీ. రిజర్వు బ్యాంకు యస్‌ బ్యాంకును రక్షించింది. ప్రభుత్వ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాచేత 49 శాతం వాటాలను కొనిపించి యస్‌ బ్యాంక్‌ ను కాపాడింది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ను నీరవ్‌ మోడీ 13,800 కోట్లకు ముంచాడు. 2018 లో ఐ డీ బీ ఐ , 2019 లో లక్ష్మీవిలాస్‌ బ్యాంకు,2019 లో పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంకులు వరసగా దివాళాతీశాయి.
రమేష గెల్లీ నాయకత్వాన మోడల్‌ బ్యాంకుగా పేరుపొందిన గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు 1994 లో సికిందరాబాద్‌ లో ప్రారంభమయింది. పది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి 2004 సం.లో దివాళాతీసింది. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డిపాజిటర్లను, ఉద్యోగస్తులను, బ్యాంకును కాపాడింది. ప్రభుత్వ సంస్ధ అయిన ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స లో విలీనంచేశారు. బ్యాంకును దారితప్పించి మోసంచేసిన వారికి లాభం చేకూరింది. చివరకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులు క ట్టే సామాన్య ప్రజలే మరొక సారి మోసంచేయబడ్డారు.
ఐసీఐసీ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్‌ వీడియోకాన్‌ గ్రూపుకి 1875 కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేశారని ఒక విజిల్‌ బ్లోయర్‌ అరవింద్‌ గుప్తా ప్రధానమంత్రికి, ఆర్ధికమంత్రి అరుణజైట్లీగార్లకు ఎన్నో లేఖలు వ్రాశారు. ఆర్ధికమంత్రి అరుణజైట్లీగారికి ఈ కుంభకోణంలో పాత్ర వుందని ఆరోపణలు కూడా వున్నాయి. ఐసీఐసీ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్‌ నిబంధనలకు విరుద్ధంగా తన భర్త వ్యాపార భాగస్వామి ఐన వేణుగోపాల్‌ ధూత్‌ కి అప్పు సాంక్షన్‌ చేశారు. వేణుగోపాల్‌ ధూత్‌ వీడియోకాన్‌ కంపెనీ అధినేత. అప్పులను మొండిబాకీలుగా (%చీూA%) ప్రకటించారు. వీడియోకాన్‌ గ్రూపునకు రూ.1,875 కోట్ల రుణాల మంజూరులో అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై గతంలో మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ అభియోగాల నేపథ్యంలో చందా కొచ్చర్‌పై ఐసీఐసీఐ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. జస్టిస్‌ బీఎన్‌ శ్రీక ష? నేత త్వంలో కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించింది. ఆ తర్వాత ఎండీ, సీఈవో పదవుల నుంచి చందా కొచ్చర్‌ను తొలగించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ కొచ్చర్‌ను అరెస్టు చేసింది.


లక్ష్మీ విలాస్‌ బ్యాంకు సంక్షోభం
94 ఏళ్ళ చరిత్ర వున్నలక్ష్మీ విలాస్‌ బ్యాంకు సంక్షోభం లో చిక్కుకున్నది. 19 రాష్ట్రాలలో 566 బ్రాంచీలతో పేరుపొందింది. మందుల పరిశ్రమ లో కార్పోరేట్‌ సంస్ద అయిన రాన్‌ బాక్సీ సంస్ధకు ఒక్కదానికే 720 కోట్లు అప్పు ఇచ్చారు. ఇంకా మొండిబాకీలు ఎక్కువయి బ్యాంకు దివాళాతీసింది. డిబిఎస్‌లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించింది. డీ బీ ఎస్‌. బ్యాంకు సింగపూర్‌ కేంద్రంగా 18 దేశాల్లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్న విదేశీ సంస్థ. ఈ విధంగా ఒక విదేశీ బ్యాంకు లక్ష్మీవిలాస్‌ బ్యాంకును మింగేసింది.
ఈ కార్పోరేటు బ్యాంకులు దివాళా తీసినా, వారి పరిశ్రమలు దివాళా తీసినా మొత్తం ఆర్ధికవ్యవస్ధ కుప్పకూలే ప్రమాదం వున్నది. 8లక్షల 80 వేల కోట్ల మొండి బాకీలున్నాయి. వేల కోట్ల రూపాయల బ్యాంకు బాకీలున్నవారందరూ కార్పోరేట్‌ యజమానులే . అందులో 12 మంది బాకీలు 4వ వంతు వున్నాయి. విజయమాల్యా, నీరవ్‌ మోడీ, అనిల్‌ అంబానీ, అదానీ లాంటి మహామహులు ఎంతోమంది వున్నారు.
కార్పోరేట్‌ కంపెనీల చేతులలో బ్యాంకులు వుంటే ఎటువంటి నిబంధనలు లేకుండా నిధులను వారే మంజూరు చేసుకుంటారు. ఇపుడు కార్పోరేట్‌ కంపెనీలు రాజకీయనాయకులకు, పార్టీలకు డొనేషన్లు ఇవ్వటంలో ముందున్నాయి. ఇక బ్యాంకులు , కంపెనీలు కలిపి నిర్వహిస్తున్నబ్యాంకులలో డబ్బులకు కొదవవుండదు. దేశరాజకీయం డబ్బుల చుట్టూతిరుగుతున్నపుడు కార్పోరేట్‌ కంపెనీలు రాజకీయాలను ఇంకా క్రియాశీలంగా నిర్వహిస్తాయి. నీతి నియమాలగురించి పెద్దపట్టింపు లేని కార్పోరేటుకంపెనీల చేతిలో ప్రజల ధనాన్ని వుంచటం పెను ప్రమాదాన్ని సూచిస్తున్నది. గత కొద్ది సంవత్సరాలలో కనీసం 15-20 లక్షల కోట్ల రూపాయలను కార్పోరేటు పారిశ్రామిక వర్గాలు బాకీపడ్డాయి. ఇందులో ఎక్కువ భాగం కావాలని ఎగగొట్టారు.

బ్యాంకుల జాతీయకరణకు ముందు ఎలా వుండేది.
1969 సం.లో 14 ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణ ముందున్న పరిస్ధితిని గుర్తుతెచ్చుకొంటే రాబోయే రోజులలో కార్పోరేటు బ్యాంకులు ఏంచేస్తాయో వూహించవచ్చు. స్వంత ప్రయోజనాలను పెంచుకోవటానికే ఆనాటి బ్యాంకులు పనిచేశాయి. వ్యవసాయంచేసుకునే రైతులకు 2 శాతం అప్పులు కూడా ఇవ్వలేదు. గొర్రెలకు, బర్రెలకు, చేతివ త్తిదారులకు, మహిళలకు, ఇంటికి , చదువులకు,స్కూటర్‌ , చిన్నపరిశ్రమలకు,వ్యాపార రుణాలు బ్యాంకులు జాతీయం చేసినతరువాతనే అందుతున్నాయి. గ్రామీణప్రాంతప్రజలకు, సమాజంలోని బలహీనవర్గాలకు కొంతవరకయినా సంస్ధాగత రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నిలోపాలున్నా ప్రభుత్వబ్యాంకులు కాబట్టి కొంతలోకొంత చిన్నవారికి అవసరానికి అప్పుదొరికింది. బ్యాంకుల కుంభకోణాలను, వైఫల్యాలను, అవినీతిని నివారించి బ్యాంకింగ్‌ వ్యవస్ధకు స్ధిరత్వాన్నికల్పంచి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే వుద్దేశంతో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. బ్యాంకుల జాతీయకరణ హఠాత్తుగా జరగలేదు. ప్రజల త్యాగాలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా నే బ్యాంకుల జాతీయకరణ, ఇన్స్యూరెన్సు కంపెనీల జాతీయకరణ , భారీ పరిశ్రమలు, సమాజంలో కొన్ని అభివ ధికర మార్పులు జరిగాయి. జాతీయకరణకు ముందు బ్యాంకులు పూర్తిగా ప్రైవేటురంగంలో వుండేవి. బ్యాంకుల చరిత్ర చాలా ఆందోళనకరంగా వుండేది. బడా పారిశ్రామికవేత్తలు వారికి వారే అప్పులిచ్చుకునేవారు. ఆర్దిక శాఖ సలహాదారైన వీ.ఏ. పాయి పనానడికర్‌ 1967 లో ఇలా అన్నారు.’బ్యాంకుల అంతర్గత వ్యవహారాలన్నీ డైరక్టర్ల చేతిలోవుండేవి. అప్పుల వ్యవహారాల విచక్షణాధికారం డైరక్టర్లకే వుండేది.”
1969 సం.జులై 19 న జాతీయకరణ జరిగింది. 50 కోట్లకు మించి డిపాజిట్లువున్న 14 బ్యాంకు లను, 1980 లో 200 కోట్లు డిపాజిట్లు వున్న 6 బ్యాంకులను జాతీయంచేశారు. ఆనాటికి డిపాజిట్లు 4646 కోట్లు వుంటే ఇపుడు 125 లక్షలకోట్లున్నాయి. అపుడు 3599 కోట్లరూపాయలను రుణాలుగా ఇస్తే 96.5 లక్షలకోట్లను అప్పులు ఇస్తున్నారు. వ్యవసాయానికి 2.2 శాతం అప్పులిస్తే ఇపుడు 18 శాతం ఇవ్వమని ఆదేశాలున్నాయి. 1969 లో వ్యవసాయానికి మొత్తం 162 లక్టల రూ.ను ఇస్తే , 2011 సం.లో 4లక్షల కోట్ల రూ.లను ఇచ్చారు. ప్రాధాన్యతారంగాలకు అప్పులు15 శాతంనుండి 41 శాతానికి పెరిగాయి. మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్‌ వ్యవస్ధ విస్తరించింది. బ్యాంకు శాఖలు 8262 సంఖ్య నుండి 1,41,756 కు పెరిగాయి.
చరిత్ర లో తనకు సంబంధాలున్నవారికే అప్పులివ్వటం అనివార్యంగా వినాశనానికే దారితీసింది. అప్పుతీసుకునేవాడు యాజమాన్యంలో వుంటే, బ్యాంకు వసూలు చేయగల్గిన రుణాలు ఎలా ఇవ్వగలుగుతుంది. ఫలితంగా నిరర్ధక ఆస్ధులు అలవికాని స్ధాయికి చేరుకున్నాయి. తాజా ఉదాహరణలు యస్‌ బ్యాంకు, లక్ష్మీవిలాస్‌ బ్యాంకు, ఐ.ఎల్‌.ఎఫ్‌.ఎస్‌ బ్యాంకులు – దివాళాతీసిన తీరు ఆర్బీఐ నియంత్రణా వైఫల్యాలను సూచిస్తున్నది..

ప్రస్తుతం కొన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు కొన్ని బాగా నడుస్తూ వుండవచ్చు. వారి స్వంత క్రమశిక్షణ పాత్ర చాలా ఎక్కువగా వుంటుంది. ప్రభుత్వ పర్యవేక్షణ వలన బాగున్నాయనుకోవటానికి వీలులేదు.చిన్నమొత్తంలో పొదుపుచేసుకునే సామాన్యప్రజానీకాన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల కు అప్పచెప్పటంవలన జరిగిన కంపెనీల ఎగవేతలూ, పొదుపుదారుల ఆక్రందనలూ, ఆత్మహత్యలూ అందరికీ తెలిసినవే. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలపైన పర్యవేక్షణ బలహీనంగా వుంది. కొంతమంది వ్యాపార సామ్రాజ్యాధిపతులు రాజకీయనాయకుల అండదండలతో సామాన్యప్రజలపొదుపు సొమ్ముతో ఆటలాడుకుంటున్నారు.
మన దేశంలో ఇపుడు వున్న బ్యాంకులు చాలవా మళ్ళీ కార్పోరేట్‌ బ్యాంకులెందుకు అనే ప్రాధమిక ప్రశ్నను కొంతమంది లేవనెత్తుతున్నారు. కార్పోరేట్‌ కంపెనీలు ప్రజల సొమ్ముతోనే వ్యాపారాలు చేస్తాయి. స్వంత పెట్టుబడితో వ్యాపారాలు చేయటం చాలా అరుదు. ప్రజల వద్దనుండి నిర్దిష్ట పనులకు తీసుకున్న పెట్టుబడులు ఆయా పనులకు వినియోగించటం వుండదు. బడా కార్పోరేట్‌ సంస్ధలను బ్యాంకులకు దూరంగా వుంచకపోతే మొత్తం ఆర్ధిక వ్వవస్ధనే మింగేస్తారు.

పారిశ్రామిక సంస్ధలకు పెట్టుబడులు కావాలి. వారి చేతిలో బ్యాంకు వుంటే సునాయాసంగా ప్రశ్న లేకుండా డిపాజిట్ల రూపంలో పెట్టుబడులను పొందగలరు. ఆ డబ్బులను స్వంత కంపెనీలలోకి , మళ్ళించటం సహజ ప్రక్రియ. పరిశ్రమ దివాళా తీస్తే బ్యాంకు కూడా దివాళా తీయక తప్పదు. మొండి బాకీలు నిరర్ధక ఆస్ధులయి బ్యాంకు దివాళాతీస్తుంది. బ్యాంకు దివాళా ప్రభావం పరిశ్రమ మీద పడుతుంది. ఈ గొలుసుకట్టు పరిణామాలలో మొదటి బాధితుడు బ్యాంకు లో డబ్బులు దాచుకున్న సామాన్య డిపాజిట్‌ దారుడు. తరువాత ఉద్యోగాలు కోల్పోయే బ్యాంకు ఉద్యోగులు. అసలైన బాధితులు పన్నులు కట్టే సామాన్య పౌరులు .


ప్రయోజనాల మధ్య సంఘర్షణ
స్వంత ప్రయోజనాలకూ తన వ త్తి ధర్మాలకూ సంఘర్షణ సంభవించినపుడు, ఎటువైపు వుంటారనేది ముఖ్యసమస్య. కార్పోరేట్‌ బ్యాంకు రైతులకు, సామాన్యప్రజలకు అప్పులు ఇవ్వాలా లేక తన పరిశ్రమకు అప్పులిచ్చి, స్వంత లాభాలు పెంచుకోవాలా అనే ప్రయోజనాల మధ్య ఘర్షణ వచ్చినపుడు అనివార్యంగా తనపరిశ్రమవైపే మొగ్గుచూపుతున్నారనేది చారిత్రక సత్యం. అదానీ గారు బ్యాంకు పెట్తే, తనకు కొత్తగా కేటాయించిన విమానాశ్రయాలకు అప్పులు ఇస్తాడా లేక రైతులకు అప్పులు ఇస్తాడా? హిందూ వ్యాస రచయిత గోపీనాధ్‌ గారికధలో..ఎట్టిపరిస్ధితులలోనూ కోడిని తినను అని ప్రతిజ్ఞ చేసిన ఒక నక్కను కోళ్లఫారం వద్ద కాపలాపెట్టారు. ఆకలి అయినపుడు నక్కఏంచేస్తుందో-అదే విధంగా కార్పోరేట్‌ కంపెనీలు చేస్తాయని గోపీనాధ్‌ చెప్పారు. సెబీ నిపుణుడు హేమీంద్ర హజారీ ‘ నక్కలను కోళ్ళకు ఇన్‌ఛార్జిగా కాపలా ఉంచాలని, ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక పాలనలో కూడా, ప్రారంభ దశలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వంటి పెద్ద నియంత్రిత ఆర్థిక సంస్థల అనుసంధాన రుణాలను ఆర్‌బిఐ గుర్తించలేకపోయింది.” అన్నారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య సంయుక్తంగా ఒక వ్యాసం వ్రాశారు. కార్పోరేట్‌ కంపెనీలు బ్యాంకులు పెట్టడానికి అనుమతివ్వాలంటూచేసిన ప్రతిపాదన పిడుగుపాటు లా అనిపించిందన్నారు.” చరిత్ర చూసుకుంటే రుణాలు ఇవ్వటమనేది ఇప్పటికీ సరిగ్గా జరగని ప్రక్రియే. అటువంటిది ఒక రుణగ్రహీత చేతిలో బ్యాంకు వుంటే..రుణాల జారీ సక్రమంగా ఉంటుందని ఎలా ఆశించగలం. ఒక స్వతంత్ర నియంత్రణసంస్ధఉన్నా ..దాని చేతిలో ప్రపంచంలోని మొత్తం సమాచారంఉన్నా ..ఆర్ధికవ్యవస్ధలో ఎక్కడో ఏమూలో చోటు చేసుకునే అసమంజస రుణాన్ని ఎలా కనిపెట్టగలదు” అని ప్రశ్నించారు. గత కొన్నేళ్ళుగా కార్పోరేట్‌ ఎగవేతలు మనముందుకనిపిస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా వారికి ప్రమోటర్లుగా అవకాశమిచ్చి బ్యాంకులు పెట్టుకోమని లైసెన్సులు ఇవ్వాలనటం సరికాదని అభిప్రాయపడ్డారు. కొన్ని కార్పోరేట్‌ గ్రూపులు ఆర్ధికంగా మరింత బలపడటానికి బ్యాంకు లైసెన్సులు దోహదపడతాయన్నారు.

బలహీనమైన నియంత్రణ , పర్యవేక్షక సామర్థ్యం లేవి ఆర్బిఐ యొక్క రికార్డును చూస్తే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ కార్పోరేట్‌ బ్యాంకుల రుణాలను పర్యవేక్షించగలదా అని ప్రముఖ ఆర్ధిక వేత్త, ప్రభుత్వ మాజీ సలహాదారు ఇలాపట్నాయక్‌ అన్నారు.ఇలా పట్నాయక్‌, రాధికాపాండే అనుమానించారు. రెగ్యులేటరీ వ్యవస్ధను అదనంగా అభివ ధి చేసి పర్యవేక్షించాలని శంకర ఆచార్య, విజయ కేల్కర్‌, అరవింద్‌ సుబ్రమనియన్‌, ఇండిన్‌ ఎక్సప్రెస్‌ పత్రిక లో సంయుక్తంగా ఒక వ్యాసం వ్రాస్తూ, ‘పారిశ్రామిక సంస్ధలకు స్వంత బ్యాంకులను అనుమతించటం ఆర్ధిక వ ద్ధిని , ప్రజాస్వామ్యాన్నీ దెబ్బతీయడమే అన్నారు.భారత పెట్టుబడిదారీ విధానం కళంకం కలిగి వుంది. ఎందుకంటే ప్రభుత్వానికీ పారిశ్రామిక పెట్టుబడికీ దుష్ట సంబంధాలున్నాయి. పారిశ్రామిక పెట్టుబడి కి ఫైనాన్స్‌ కేపిటల్‌ కీ మధ్య అడ్డంగా వున్న రేఖను చెరిపేస్తే ఈ కళంకం మరింత ఘోరంగా వుంటుంది.” అన్నారు. కార్పోరేట్లకు బ్యాంకుల లైసెన్సులు ఇవ్వటం అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి బాటలు వేయటమేనని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్ధికవేత్త కౌశిక్‌ బసు అన్నారు. ప్రభుత్వ చర్యలు ఆర్ధిక అస్ధిరత్వానికి దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు.

ప్రభుత్వ రంగం బ్యాంకులను కార్పోరేట్‌ సంస్ధల స్వంతం చేసే కుట్ర

ప్రస్తుతం రిజర్వ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రప్రభుత్వ కనుసన్నలలో నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఏమికావాలంటే ఆర్బీఐ అది చేస్తున్నది. కేంద్రప్రభుత్వం కార్పోరేట్‌ సంస్ధల ప్రయోజనాలను నెరవేరుస్తున్నది. ప్రభుత్వ రంగం లోని బ్యాంకులను కైవసం చేసుకోవడానికి ఇదొక కొత్త వ్యూహం.
నయాఉదార వాదవిధానాల పిదప జాతీయబ్యాంకులను మూసివేసి ప్రయివేటు బ్యాంకులుగా మార్చమని భారత్‌ ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతున్నది. ప్రభుత్వ బ్యాంకుల పని తీరు అధ్వాన్నంగా వున్నందున జాతీయకరణ రద్దుచేసి మొత్తం బ్యాంకులనన్నిటినీ ప్రయివేటు చేయాలన్నది బలమైన ప్రజాభిప్రాయంగా మలుస్తున్నారు. జాతీయ బ్యాంకులలో ప్రయివేటువ్యక్తుల మూలధనాన్ని పెంచుకోవటానికి అనుమతించి ఆతరువాత పెట్టుబడుల ఉపసంహరణపేరున షేర్లను అమ్మేసి బ్యాంకులను కార్పోరేట్‌ పరిశ్రమాధిపతులకు అప్పచెప్పేందుకు జరుగుతున్నకుట్ర లో భాగమే ఈ సూచనలు. అంతర్జాతీయద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం పెరిగే కొద్దీ బ్యాంకులన్నిటినీ కార్పోరేట్‌ కంపెనీలే స్వంతం చేసుకుంటాయి. మన స్వాతంత్య్రం, జాతీయ సార్వభౌమత్వం దెబ్బతినటమేకాక రైతాంగం, చిన్నఉత్పత్తిదారులు,చిరువ్యాపారులు రుణ సౌకర్యంలేక కష్టాలపాలవుతారు. కొద్దిమంది కార్పోరేట్‌ అధిపతుల వద్ద అనూహ్యమైన సంపద పోగుపడుతుంది. పెట్టుబడి పోగుపడే ప్రక్రియ వేగవంతమయి అసమానతలు పెరిగి దారిద్య్రం తాండవిస్తుంది. ప్రభుత్వబ్యాంకులను కార్పోరేట్‌ సంస్ధలకు కట్టబెట్టే ప్రతిపాదనలు ఉపసంహరించాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లారాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు,ఫోన్‌. 9000657799