Tags

,


ఎం కోటేశ్వరరావు


పద్నాలుగు రోజుల పాటు ఉద్యమాన్ని అణచేందుకు, నీరుగార్చేందుకు ప్రయత్నించిన తరువాత ఇంటా బయటా వత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు రాతపూర్వక ప్రతిపాదనలు ఉంచింది.రైతు సంఘాలు వాటిని తిరస్కరించి సవరించిన చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, దానిలో భాగంగా డిసెంబరు 12న టోల్‌ ప్లాజాల్లో, 14న ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ, మిగిలిన చోట్ల జిల్లా కేంద్రాల్లో కొత్త ఆందోళనను ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది. ముందు రైతుల పట్ల మోడీ సర్కార్‌ తీరుతెన్నులు, ప్రపంచంలో స్పందన అంశాలను చూద్దాం.

రాజనీతిజ్ఞుడి ప్రతిభ ఒక పెద్ద సమస్య వచ్చినపుడు వ్యవహరించేతీరు తెన్నుల మీద ఆధారపడి ఉంటుంది. దేశాధినేత ప్రధాని. రైతులు ఆందోళనకు దిగినపుడు దానిని పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు, ఓకే. వారు దాన్ని ఏదో ఒక దరి చేర్చక ముందే ప్రధాని రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. వ్యూహకర్తలు సరిగా పని చేస్తున్నారా ? లెక్కచేయాల్సిన అవసరం లేదనే పెడసరపు ధోరణికి లోనయ్యారా అన్న అనుమానం వస్తున్నది. కొద్ది రోజుల క్రితం రైతుల ఉద్యమం వెనుక ఖలిస్తానీలు ఉన్నారన్న బిజెపి పెద్దలు ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యమం వెనుక చైనా-పాక్‌ హస్తం ఉందని కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దనవే నిందించారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ని తప్పించి హౌ మంత్రి అమిత్‌ షాను రంగంలోకి దించారు. ఫలితం లేదు. తిరిగి రైతులకు విజ్ఞప్తి చేసేందుకు తోమర్‌ను నియమించారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.


నవంబరు 27 నుంచి రైతులను ఢిల్లీ శివార్లలో నిలిపివేశారు. వారు నగరంలోకి రాకుండా శత్రుసేనలను ఎదుర్కొనే మాదిరి రోడ్ల మీద కందకాలు తవ్వారు, ఇతర ఆటంకాలను ఏర్పాటు చేశారు, భద్రతా దళాలను మోహరించారు. అనేక దేశాల్లో జనం వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించారు గానీ ఎక్కడా ఇలా కందకాలు తవ్వటాన్ని చూడలేదని అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల నేతల నోళ్లలో నానటం నరేంద్రమోడీ పరువును పెంచుతుందా ?


చైనా అంతర్భాగమైన హాంకాంగ్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రదర్శనల గురించి మన దేశం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల వేదిక మీద ఆందోళన వ్యక్తం చేసింది.ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా అంటే కాదు కాదు హాంకాంగ్‌లో భారతీయ పౌరులు ఉన్నారు గనుక అని మన ప్రతినిధులు సమర్ధించుకున్నారు. హాంకాంగ్‌ చైనాకు చెందినదే అయినప్పటికీ పూర్తిగా విలీనం అయ్యేందుకు 2049వరకు గడువు ఉంది. అక్కడ విదేశీయుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. సంవత్సరాల తరబడి ప్రదర్శనలు చేస్తున్నా, రెచ్చగొడుతున్నా అక్కడి పోలీసులు రెచ్చి పోలేదు.అయినా మన దేశం ” ఆందోళన ” వ్యక్తం చేసింది.


కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ గురునానక్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని మన ప్రభుత్వం ఆ దేశరాయబారిని పిలిచి నిరసన తెలిపింది. మన దేశంలోని 543 సభ్యులుండే లోక్‌సభలో పదమూడు మంది సిక్కు సామాజిక తరగతికి చెందిన వారు ఎంపీలుగా ఉన్నారు. అదే కెనడాలోని 338 మంది సభ్యులున్న దిగువ సభలో 18 మంది సభ్యులు, ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు.కెనడా-పంజాబ్‌-భారత్‌లోని సిక్కుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి తెలిసిందే. ప్రస్తుత ఉద్యమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున కెనడా ప్రధాని మౌనంగా ఉండగలరా ?

లక్షలాది మంది రోజుల తరబడి ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద ఆందోళన చేస్తున్న కారణంగానే రాజకీయాలతో నిమిత్తం లేని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసుకొనేందుకు జనానికి హక్కు ఉన్నదని చెప్పారు.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌, బ్రిటన్‌, అమెరికా ఎంపీలు అనేక మంది అప్పటికే రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. వివిధ పార్టీలకు చెందిన 36 మంది బ్రిటన్‌ ఎంపీలు అదేశ విదేశాంగమంత్రి డొమినిక్‌ రాబ్‌కు లేఖ రాస్తూ తమ ఆందోళనను భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, ఆ ఆందోళన అనేక మంది బ్రిటీష్‌ సిక్కులు, పంజాబీలను ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నారు.

ఒక్క బ్రిటీష్‌ ఎంపీలే కాదు అమెరికన్లు కూడా ఉన్నారు. మరోసారి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రాబోతున్నదంటూ ఎన్నికలలో నరేంద్రమోడీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. సదరు ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ కాలిఫోర్నియా ఎంపీ డగ్‌ లామాలఫా, డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జోష్‌ హార్డర్‌ రైతులకు మద్దతు తెలిపారు. ఫలవంతమైన చర్చలు జరపాలని మోడీని కోరారు. మరికొందరు ఎంపీలు కూడా ఇదే హితవు చెప్పారు. ఆండీలెవిన్‌ వంటి వారు ఉద్యమం తమకు ఉత్తేజమిచ్చిందని చెప్పారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు రైతుల ఉద్యమం గురించి పెద్ద ఎత్తున వార్తలు, వ్యాఖ్యలు చేశాయి. ఏ దేశంలో అయినా లక్షలాది మంది ఉద్యమంలోకి దిగినపుడు మానవతా పూర్వకంగా ఆందోళన వ్యక్తం చేయటం, సమస్యలను పరిష్కరించాలని హితవు పలకటం జరుగుతున్నదే. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో నరేంద్రమోడీ స్నేహితుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి, దేశాధ్యక్షుడి మీద తిరుగుబాటు చేసేందుకు పోలీసులు, మిలిటరీని ఎలా ప్రోత్సహించిందీ తాజాగా బొలీవియాలో చూశాము. వెనెజులాలో ప్రతిపక్ష నేతను దేశాధినేతగా గుర్తించటం వంటి వ్యవహారాలకు – ఉద్యమాలకు మద్దతు ప్రకటించటానికి ఉన్న తేడాను గుర్తించాలి. రైతుల ఉద్యమం మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు కాదు, అలా మారే అవకాశాలూ లేవు.


అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదతర దేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు రైతులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అమెరికాలోని ఓక్లాండ్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌ కార్యాలయానికి ప్రదర్శన చేశారు. న్యూయార్క్‌, చికాగో, వాషింగ్టన్‌ డిసి వంటి ఇంకా అనేక చోట్ల చిన్నా, పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం ముందు వేలాది మంది భారత ప్రభుత్వానికి నిరసన, రైతులకు మద్దతు తెలిపారు. ఈ ప్రదర్శనను భారత వ్యతిరేక వేర్పాటు వాదులు జరిపారని హైకమిషన్‌ ఆరోపించింది. కెనడాలోని టోరొంటోలో ఉన్న భారతకాన్సులేట్‌ కార్యాలయం ముందు వందలాది మంది ప్రదర్శన జరిపారు. ఇంకా ఇతర అనేక చోట్ల ప్రదర్శనలు, వాహన ర్యాలీలు జరిగాయి.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్‌బెన్‌, కాన్‌బెర్రా తదితర పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల నుంచి ఆన్‌లైన్‌లో పిటీషన్ల మీద సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


రైతాంగం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ అనేక మంది క్రీడా ప్రముఖులు డిసెంబరు ఏడున రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం మొండిగా ఉంటే తాము సాధించిన అవార్డులను తిరిగి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. తమతో పాటు 35 అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ, ధ్యానచంద్‌అవార్డులను వారు తీసుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాలు రావటానికి కారకులు కేంద్ర పాలకులు.ఇప్పుడు రైతులు, రాబోయే రోజుల్లో తమను దెబ్బతీసే విధానాలను ముందుకు తెచ్చినందున వాటికి వ్యతిరేకంగా కార్మికులు కూడా రంగంలోకి రాబోతున్నారు. నవంబరు 26వ తేదీ సమ్మె దానికి ఒక హెచ్చరిక.


రైతులు ఆందోళన చేయటం ఇప్పుడే ప్రారంభమైందా ? ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరటం మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక మన ప్రభుత్వం దాన్నుంచి వైదొలగాలని రైతు సంఘాలు, వామపక్షాలు, దాదాపు అన్ని పార్టీలు కోరాయి. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి కూడా అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తీవ్రమైన వత్తిడి వచ్చింది. ఊగిసలాటలో ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు 2019 నవంబరు నాలుగున రైతులు ప్రదర్శనలు కూడా చేశాయి. ఎవరి వత్తిడి ఎంత పని చేసిందీ అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వెనక్కు తగ్గింది, ఆమేరకు అందరూ హర్షించారు.
ఆర్‌సిఇపిలో చేరిక గురించి ఎనిమిది సంవత్సరాలు తర్జన భర్జన పడిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రతికూల మార్పులు తెస్తాయని భయపడుతున్న వ్యవసాయ చట్టాల మార్పుల గురించి మేథోమధనం చేయకుండా ఆర్డినెన్స్‌ రూపంలో తేవాల్సినంత అత్యవసరం ఏముంది ? పోనీ తెచ్చారు, బిల్లును పార్లమెంట్‌ కమిటీకి నివేదించాలన్న ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్‌ను తోసి పుచ్చి చర్చలను ఒక ప్రహసనంగా మార్చి ఆమోద ముద్ర ఎందుకు వేయించుకున్నట్లు ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కొన్ని మార్పులు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంది? కరోనా వైరస్‌ నివారణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని ఒక ముఖ్యమంత్రి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అన్న మరొక ముఖ్యమంత్రి చిట్కాల మాదిరి రైతుల ముందు కేంద్రం ఉంచిన ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే రైతులు తిరస్కరించారు.


చర్చలు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి)కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటనల మీద ప్రకటనలు చేయటం తప్ప రైతుల డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తూ, వాటి నిర్ణయానికి సమగ్ర వ్యవస్దను ఏర్పాటు చేయాలన్న న్యాయమైన కోర్కెను కేంద్రం ఎందుకు అంగీకరించటం లేదు అన్నది చాలా మందికి అంతుబట్టటం లేదు. అమలు జరుపుతామంటున్నారు కదా దాన్నే చట్టబద్దం చేస్తే పోయేదేమిటి అని హర్యానా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జననాయక్‌ జనతా పార్టీ(జెజెపి) నేతల హితవును కూడా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ అమలు జరుపుతామని చెబుతున్నాం కదా అన్నదానికి మించి ఒక్క ముక్క చెప్పటం లేదు. వ్యవసాయ చట్టసవరణలకు-కనీస మద్దతు ధరలకు అసలు సంబంధం లేదని వాదిస్తున్నారు తప్ప చట్టబద్దం చేసేందుకు ఆటంకం, అభ్యంతరం ఏమిటో చెప్పరు.


డిసెంబరు తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఒక లేఖ రూపంలో పంపిన ప్రభుత్వ ప్రతిపాదనలు రైతాంగాన్ని సంతృప్తిపరచేవిగా లేవని తిరస్కరించారు. వాటిలో ఉన్న అంశాలేమిటి ?1. ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పి వ్యవస్దను అలాగే కొనసాగిస్తాము, పంటల సేకరణ కూడా కొనసాగుతుంది. రైతులు ఏమంటున్నారు ? ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలి, రైతు ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరింత శాస్త్రీయంగా ధరల నిర్ణాయక వ్యవస్ధను ఏర్పాటు చేసి సాధికారత, చట్టబద్దత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు దీనికి అసలు పొంతనే లేదు. 2. ప్రభుత్వ (నోటిఫైడ్‌) మార్కెట్‌-స్వేచ్చా మార్కెట్‌ అన్న తేడా లేకుండా పన్నులు, సెస్‌లను అన్నింటికీ ఒకే విధంగా వర్తింప చేస్తాము. రైతుల వాదన ఏమిటి ? మార్కెట్‌ యార్డుల పరిధులను కుదించి అసలు ఆ వ్యవస్ధనే నామమాత్రం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవి ఉపయోగం లేకుండా పోయిన తరువాత కార్పొరేట్‌ చేతుల్లో రైతులు ఇరుక్కుంటారు గనుక మార్కెట్‌ యార్డుల్లోనే ఎవరైనా కొనుగోళ్లు జరపాలి. 3.నియంత్రణలేని మార్కెట్లలో లావాదేవీలు జరిపేవారు నమోదు చేసుకొనే విధంగా సవరణలు తెస్తాము. రైతుల అభ్యంతరం ఏమిటి ? నియంత్రణలు లేని మార్కెట్లుంటేనే రైతులకు రక్షణ ఉండదు, నమోదు అన్నది నామమాత్రమే.కంటితుడుపే ! 4.నగదు బదిలీకి బదులు సబ్సిడీ వర్తించే విధంగా రైతులను విద్యుత్‌ బిల్లుల నుంచి మినహాయిస్తాము. రైతులు అంటున్నదేమిటి ? అసలు ఉచిత విద్యుత్‌ పధకాలను ఎత్తివేసే విధంగా, సబ్సిడీని గరిష్టంగా 20శాతానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదన అమలు జరిగితే ఉచిత విద్యుత్‌ పధకాలకు ఎసరు వస్తుంది. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు మేలు చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు.


కనీస మద్దతు ధరల విధానాన్ని, భారత ఆహార వ్యవస్ధ కార్యకలాపాలను పరిమితం చేసి ధాన్య సేకరణ బాధ్యతను వదలించుకొనేందుకు కేంద్రం పావులు కదుపుతోందనే అనుమానాలు కూడా రైతులకు కలుగుతున్నాయి. వీటికి ఆధారాలు లేవా ? స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు జరుపుతున్నామని చెబుతున్న పాలకులు కీలకమైన వాటిని పక్కన పెట్టారు. ఉదాహరణకు మార్కెట్‌ యార్డులను మరింత పటిష్టపరచాలని చెబితే వాటిని పరిమితం చేసేందుకు చట్ట సవరణ చేశారు. కనీస మద్దతు ధరల నిర్ణాయక అంశాలలో భూమి కౌలును పరిగణనలోకి తీసుకోవటం లేదు.ఇంకా ఇలాంటివే ఉన్నాయి.

భారత ఆహార సంస్ధను నిర్వీర్యం చేస్తారా, సేకరణ మొత్తాలను తగ్గిస్తారా ? ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో) నిబంధనల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరించిన బియ్యాన్ని అంతర్గత వినియోగానికి విక్రయించవచ్చు తప్ప విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు లేదు.ఈ ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీ నాటికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎఫ్‌సిఐ వద్ద బియ్యం నిల్వలు 135లక్షల టన్నులు ఉండాలి, వాస్తవ నిల్వలు 222లక్షల టన్నులు ఉన్నాయి. తరువాత సేకరణ తరుణం ప్రారంభం అయినందున నిల్వలు పెరిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2020-21లో 150లక్షల టన్నుల గోధుమలు, 50లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే 2015-16 నుంచి 2019-20 సంవత్సరాలలో గోధుమలు కనిష్టంగా 14.21లక్షల టన్నులు గరిష్టంగా 81.84 లక్షల టన్నులు, బియ్యం 4.9-17.77లక్షల టన్నులు మాత్రమే విక్రయించారు. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉత్పత్తి అయ్యే కోటీ60లక్షల టన్నులలో కేవలం 30లక్షల టన్నులను మాత్రమే సేకరిస్తామని చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆర్టికల్‌ 13లోని సంధి నిబంధన ప్రకారం దేశీయంగా, ఎగుమతులకు సబ్సిడీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే అది ఆయా దేశాల ఉత్పత్తి విలువలో పదిశాతం కంటే ఆ మొత్తాలు మించకూడదు. ఈ నిబంధన కూడా 2004 జనవరి ఒకటి నుంచి రద్దయింది. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీలను వర్ధమాన దేశాలు సవాలు చేసేందుకు వీలు కలిగింది. అదే ఇప్పుడు చర్చలు ప్రతిష్ఠంభనలో పడటానికి కారణం అయింది. అయితే 2013లో జరిగిన బాలి సమావేశంలో తాత్కాలిక సంధి నిబంధనను రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అమల్లో ఉన్న ఆహార భద్రత పధకాల కింద ఇస్తున్న సబ్సిడీలు నిర్ణీత పదిశాతానికి మించినా ఏ సభ్యదేశమూ సవాలు చేసేందుకు లేదు. తరువాత తెచ్చిన పధకాలకు సబ్సిడీలు ఇవ్వటానికి వీలులేదు. మన దేశం ఆహారభద్రతా చట్టాన్ని 2013లో తెచ్చారు కనుక సబ్సిడీలు కొనసాగించవచ్చు. అయితే ఈ నిబంధన ఎంతకాలం అన్నది స్పష్టత లేదు.2017నాటికి సంధి నిబంధనలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించారు. అయితే అప్పటికీ కుదరకపోతే కుదిరేంతవరకు తాత్కాలిక నిబంధన కానసాగుతుంది.2018-19లో ప్రపంచ వాణిజ్య సంస్దకు మన దేశం అందచేసిన సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం విలువ 43.67 బిలియన్‌ డాలర్లని, ఐదు బిలియన్‌ డాలర్లు సబ్సిడీగా ఇచ్చామని పేర్కొన్నది. ఈ మొత్తం పదిశాతం కంటే ఎక్కువ. సంధి నిబంధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. ఎలా రూపొందిస్తారో స్పష్టత లేదు. సబ్సిడీలను తగ్గించాలని ఒక వైపు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో వత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే వ్యవసాయానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ గత ఏడు సంవత్సరాలుగా 70వేల కోట్ల రూపాయలకు అటూఇటూగా ఉంది. ఇది మినహా పెరిగిన ధరలను రైతులే భరించాల్సి వస్తోంది. ఇలాంటి పరిమితులనే విద్యుత్‌, ఆహార తదితర వ్యవసాయ సంబంధ సబ్సిడీలకు అమలు జరపబోతున్నారు.
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యం, గోధుమ ఎగుమతులకు అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్ని దశాబ్దాలలో తొలిసారిగా మన దేశం నుంచి చైనా తాజాగా బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నది అనే వార్తలు వచ్చాయి. నిజానికి 2006లో మన బియ్యం దిగుమతికి చైనా అనుమతి ఇచ్చినప్పటికీ నామ మాత్రంగా తప్ప పెద్ద మొత్తంలో దిగుమతి లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ చైనా పదివేల టన్నుల దిగుమతికి నిర్ణయించింది. దీనిలో పక్కా వాణిజ్యం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవు. థారులాండ్‌, వియత్నాంల నుంచి దిగుమతి చేసుకొనే బియ్యంతో పోల్చితే మన దేశం టన్నుకు వందడాలర్ల తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు రావటమే కారణం. ధరలు పెంచినా, చైనాలో తిరిగి ఉత్పత్తి పెరిగినా ఎగుమతులు అనుమానమే.

భారత్‌ 25శాతం బియ్యం రకం టన్ను ధర 2019 నవంబరులో 357.4 డాలర్లు ఉంటే 2020 నవంబరులో 342.8లో ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ సమాచారం వెల్లడించింది. ఇదే రకం థారు బియ్యం ధర 415.4 నుంచి 479.5డాలర్లకు, వియత్నాం బియ్యం 323.6 నుంచి 472.5 డాలర్లకు పెరిగింది. అయితే థారులాండ్‌, వియత్నాంలో సాగు సమస్యలతో బియ్యం ఉత్పత్తి తగ్గటంతో ఎగుమతుల మీద ఆంక్షలు కూడా ఉండటంతో చైనాకు మన బియ్యం ఎగుమతులకు అవకాశం వచ్చింది. మిగతా దేశాలకూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నాం.


ప్రపంచ మార్కెట్లో పోటీ తట్టుకోవాలంటే మన దేశంలో ధాన్యం ధర తక్కువగా ఉండాలని, కనీస మద్దతు ధరలను పెంచుకుంటూ పోతే తమకు గిట్టుబాటు కాదనీ ఎగుమతి వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలు, వాటి పర్యవసానాలను చూసిన తరువాత రైతాంగానికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలకుల మాటలు విశ్వసనీయత సమస్యను ముందుకు తెస్తున్నాయి. ఇప్పటి వరకు రైతాంగానికి-వినియోగదారులకు ఎదురైన అనుభవాలు చూస్తే అధికారంలో ఎవరున్నా బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలు తప్ప రైతులు-జనానికి ఉపయోగపడే చర్యలు లేవు. పాలకులు చెప్పిన అనేక మాటల నీటి మూటలయ్యాయి.మేక పిల్లల వంటి రైతాంగాన్ని తోడేళ్ల వంటి బడా సంస్దలకు అప్పగిస్తాము గానీ అవి తినకుండా రక్షణ చర్యలు తీసుకుంటామన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది. అసలు తోడేళ్లను రప్పించటం ఎందుకు అన్నది మేకల ప్రశ్న.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శేకాదు, యావత్‌ ప్రపంచం ముక్త కంఠంతో రైతులకు మద్దతు తెలిపినా ఏమౌతుంది ? వారంతా ఢిల్లీ వచ్చి మా ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తారా ? చేయమనండి చూస్తాం ! ఇది ఒక బిజెపి మిత్రుడి ప్రయివేటు సంభాషణ సారం. నిజమే ! ఏమౌతుంది ? మహా అయితే ప్రపంచనేత అని భుజకీర్తులు తగిలించుకున్న నరేంద్రమోడీ పరువు పోతుంది, అంతకు మించి పోయేదేమీ ఉంటుంది ? ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. రైతుల ఆందోళన గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేక అది భారత-పాక్‌ వ్యవహారం అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంతకాలం తప్పించుకుంటారు ?