ఎం కోటేశ్వరరావు
మూడు వందల మంది అంతర్జాతీయ పరిశీలకులు 34దేశాల నుంచి వచ్చారు, దేశీయంగా వివిధ పార్టీలు, సంస్ధలకు చెందిన వారు వెయ్యి మంది పరిశీలకులు ఉన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు. అయినా సరే డిసెంబరు ఆరున జరిగిన వెనెజులా పార్లమెంట్ ఎన్నికలను తాము గుర్తించేది లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాల నేతలు ప్రకటించారు. డోనాల్డ్ ట్రంప్ వారసులు అంతకంటే ఏమి చెబుతారు ! వెనెజులా జాతీయ అసెంబ్లీ( పార్లమెంట్)లోని 277 సీట్లకు గాను దేశాధ్యక్షుడు నికోలస్ మదురో నాయకత్వంలోని వామపక్ష కూటమి 253 స్ధానాలను గెలుచుకుంది. దీనిలో ఐక్య సోషలిస్టు పార్టీ ప్రధాన పక్షం కాగా మరో తొమ్మిది చిన్న పార్టీలు ఉన్నాయి. ఎన్నికలలో పాల్గొన్న ప్రతిపక్షాలకు 21, మరోమూడు స్ధానాలు స్ధానిక తెగలకు వచ్చాయి. ఈ ఫలితాలు అమెరికా కుట్ర విఫలం అయిందనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఎన్నికల వరకు అధికార సోషలిస్టు పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ తాజా ఎన్నికలలో విడిగా పోటీ చేసి 2.73శాతం ఓట్లు, ఒక స్ధానాన్ని పొందింది.ఈ ఎన్నికలలో 107 పార్టీలు, 14వేల మంది అభ్యర్దులు పాల్గొన్నారు. పోటీ చేసిన 107లో మదురోను వ్యతిరేకించే పార్టీలు 97 ఉన్నాయి.
మదురో నాయకత్వంలోని కూటమిని అధికారంలోకి రాకుండా చేసేందుకు గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా నాయకత్వంలోని శక్తులు చేయని కుట్ర లేదు. మదురో ప్రభుత్వాన్ని ఇప్పటికీ గుర్తించటం లేదన్న విషయం తెలిసిందే. అమెరికా మద్దతుతో ఉన్న ప్రతిపక్షం తాజా ఎన్నికలలో తమకు ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.ఫలితాలను తాము గుర్తించేది లేదని చెప్పింది. డిసెంబరు తొమ్మిదిన అమెరికా దేశాల సంస్ద (ఓయేఎస్) సమావేశంలో వెనెజులా ఎన్నికలను గుర్తించరాదని బ్రెజిల్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా, కెనడా, చిలీ, ఈక్వెడోర్ తదితర దేశాలు సమర్దించగా అర్జెంటీనా, మెక్సికో, బొలీవియా దూరంగా ఉన్నాయి.
లాటిన్ అమెరికాలోని వెనెజులా, తదితర దేశాలలో వామపక్ష శక్తులు గత రెండు దశాబ్దాల కాలంలో సంక్షేమ చర్యలను అమలు జరిపి విజయాలతో పాటు వాటికి ఉన్న పరిమితుల కారణంగా తలెత్తే అసంతృప్తి వలన పరాజయాలను చవిచూస్తున్నాయి. తమ దోపిడీ నిరాఘాటంగా కొనసాగేందుకు అమెరికా తదితర ధనిక దేశాలు లాటిన్ అమెరికా సమాజాల మీద మిలిటరీ, నిరంకుశ శక్తులను రుద్దాయి. వాటికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాల్లో ఆ శక్తులను వ్యతిరేకించే కమ్యూనిస్టు, వామపక్ష, ఇతర శక్తులన్నీ ఏకమైన కారణంగానే అడ్డుకోగలిగాయి. ఆ క్రమంలోనే ఎన్నికల విజయాలు పొందాయి. జనానికి అనేక ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుస విజయాలు సాధించాయి. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల హర్షామోదాలు పొందాయి. వాటిని కూడా అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాల వెన్నుదన్ను ఉన్న కార్పొరేట్ శక్తులు సహించలేదు. అందుకే ఆ ప్రభుత్వాలను కూలదోసేందుకు చేయని యత్నం లేదు. ఆ క్రమంలో ఛావెజ్ వంటి వారు ఆ కుట్రలకు వ్యతిరేకంగాలాటిన్ అమెరికాలో కలసి వచ్చే శక్తులన్నింటినీ కూడగట్టేందుకు ప్రయత్నించి కొంత మేర సఫలం అయ్యారు.
అయితే ఛావెజ్ లేదా ఇతర దేశాల్లోని నాయకత్వం అమలు జరిపిన చర్యలన్నీ నయా ఉదారవాద విధానాల పునాదుల మీద నిర్మితమైన పెట్టుబడిదారీ వ్యవస్ధల పరిధిలోనే అన్నది గమనించాలి.వాటికి ఉన్న పరిమితుల కారణంగా జనంలో తలెత్తే అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు, దాని ప్రాతిపదికగా జనాన్ని రెచ్చగొట్టేందుకు అమెరికా పెద్ద ఎత్తున వామపక్ష వ్యతిరేకశక్తులకు అన్ని విధాలా సాయం అందించింది. గతంలో మాదిరి మిలిటరీ నియంతృత్వాన్ని రుద్దే అవకాశాలు లేకపోవటంతో అధికారానికి వచ్చిన మితవాదశక్తులు వామపక్ష, ప్రజాతంత్ర పాలకుల కంటే మెరుగైన చర్యలు తీసుకోవటంలో విఫలం కావటంతో అర్జెంటీనా వంటి చోట్ల తిరిగి వామపక్ష శక్తులు అధికారానికి రాగలిగాయి. బొలీవియాలో ఎన్నికైన సోషలిస్టు ఇవోమొరేల్స్‌ను పదవి చేపట్టకుండా అడ్డుకొని అంతం చేస్తామని బెదిరించి విదేశాలకు వెళ్లేట్లు చేశారు. అయితే అధికారాన్ని ఆక్రమించుకున్న శక్తులు ఏడాది పాలనలో మొరేల్స్ కంటే మెరుగైన పాలన అందించలేవని రుజువు కావటంతో జనం తిరిగి మొరేల్స్ నాయకత్వంలోని ‘మాస్’ పార్టీకి పట్టం కట్టారు.
వెనెజులాలో కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది. మదురో ఏలుబడిలో అనేక తీవ్ర సమస్యలను జనం ఎదుర్కొంటున్నా, ప్రతిపక్ష మితవాద శక్తులు అధికారానికి వస్తే తమపరిస్ధితి మరింత దిగజారుతుందనే భయం జనంలో ఉంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు పొందిన ప్రతిపక్ష పార్టీ నేత జువాన్ గురుడో 2018లో జరిగిన ఎన్నికలలో విజేత అయిన మదురోను తాను గుర్తించనని, పార్లమెంట్ తననే అధ్యక్షుడిగా ఎన్నుకున్నదని 2019లో ప్రకటించుకున్నాడు. అతగాడి ప్రవాస ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా మరికొన్ని దేశాలు ప్రకటించాయి. అనేక రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడినా జనంలో ఎలాంటి మద్దతు కనిపించలేదు. మరింత పరాభవం తప్పదని గ్రహించిన కారణంగానే ఈ నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయకుండా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ ఎన్నికలలో పోలింగ్ 30.5శాతం అని అధికారికంగా ప్రకటించారు. మదురో నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ కూటమికి 277కు గాను 253, డెమోక్రటిక్ యాక్షన్ పార్టీకి 11, మరో రెండు పార్టీలకు మూడేసి చొప్పున ఒక పార్టీకి రెండు, కమ్యూనిస్టు పార్టీ, మరొక పక్షానికి ఒక్కొక్కటి వచ్చాయి.ఓటర్లు ఇంత తక్కువగా ఎందుకు పాల్గ్గొన్నారనేది ఒక ప్రశ్న. ఓటర్లలో ఉత్సాహం లేకపోవటానికి ఒక ప్రధాన కారణం ప్రతిపక్షం బహిష్కరణ ప్రకటనతో ఎలాగూ గెలిచేది అధికార పక్షమే అన్న నిర్లిప్తత ఒకటి. దీనితో పాటు మదురో సర్కార్ మీద అసంతృప్తి కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. అయితే దేశంలో పరిస్ధితి ఆర్ధికంగా దిగజారటంలో లక్షలాది మంది దేశం వదలి వెళ్లారు. వారి పేర్లు కూడా జాబితాలో ఉంటాయి. మొత్తంగా చూసినపుడు తాత్కాలికంగా అయినా సామ్రాజ్యవాదుల కుట్రలు విఫలం అయ్యాయి.అమెరికా కుట్రలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మదురోను హత్య చేసిన వారికి 15మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా సంస్ధలు ప్రకటించాయి. ఈ కారణంగా తాజా ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఆయన ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకొనేదీ రహస్యంగా ఉంచారు.
ఎన్నికలు సక్రమంగా జరగలేదనేందుకు ఓటర్లు తక్కువగా పొల్గొనటమే నిదర్శనమని సాకులు చెబుతున్నారు. వెనెజులా తరువాత రోజు జరిగిన ఎన్నికలలో రుమేనియాలో 33, ఇటీవలి కాలంలో ఇతర దేశాలలో ఈజిప్టులో 28, మాలీ 35, జమైకా 38, జోర్డాన్ 30, జార్జియాలో 26శాతం చొప్పున నమోదైంది. వీటికి లేని అభ్యంతరం వెనెజులాకు ఎందుకు ? 2005 వెనెజులా పార్లమెంట్ ఎన్నికల్లో కనిష్టంగా 25శాతమే నమోదైన రికార్డు ఉంది. అంతెందుకు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎన్నడూ నలభై శాతానికి అటూఇటూగానే ఉంటున్నది. వెనెజులాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉంటే 50లక్షల మంది(నాలుగోవంతు) జనం కనీస సౌకర్యాలు లేక విదేశాలకు వెళ్లారని గతంలో చెప్పారు. అది కూడా ఓటింగ్ తగ్గటానికి ఒక ప్రధాన కారణమే కదా !
ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసిందన్న సందేహం సహజంగానే కలుగుతుంది. దాని మంచి చెడ్డల చర్చను పక్కన పెట్టి కమ్యూనిస్టు పార్టీ మాటల్లోనే కొన్ని అంశాలను చూద్దాం. డిసెంబరు 14వ తేదీ పార్టీ పత్రిక ” పాపులర్ ట్రిబ్యూన్ ”లో కొన్ని ముఖ్య అంశాల సారాంశం ఇలా ఉంది. వెనెజులాలో ప్రజాబాహుళ్య విప్లవ ప్రత్యామ్నాయ నిర్మాణ లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ, ఇతర రాజకీయ, సామాజిక శక్తులతో కలసి కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. ప్రత్యామ్నాయ విధానాలను జనం ముందుంచటానికే ప్రాధాన్యత ఇచ్చింది.2018లో అధ్యక్ష ఎన్నికల సమయంలో మదురో నాయకత్వంలోని ఐక్య సోషలిస్టు పార్టీ-కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత ఒప్పందం జరిగింది. దాని ప్రకారం తదుపరి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి దాని ప్రాతిపదికగా పోటీ చేయాలన్నది సారాంశం. అయితే ఆ ఒప్పందంలోని అవగాహన అంశాలకు విరుద్దంగా మదురో ప్రభుత్వం వ్యవహరించింది. యజమానులతో కార్మికులు చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వ ఉత్తరువు ద్వారా రద్దు చేసింది. దాంతో కార్మికులు అనేక సంక్షేమ చర్యలను కోల్పోయారు. కార్మిక సంఘాలు నిరసన తెలిపటాన్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నారు. అణచివేత చర్యలకు అనుమతించారు. ప్రయివేటీకరణలకు పెద్ద పీటవేశారు. భూములను యజమానులకు తిరిగి ఇచ్చివేశారు. రైతులను భూముల నుంచి తొలగించి యజమానులకు అనుకూలంగా కేసులలో ఇరికిస్తున్నారు. ఈ నేపధ్యంలో కార్మికులు-రైతాంగ ప్రయోజనాల రక్షణకు పోరాడేందుకుగాను పాలక సోషలిస్టు పార్టీ కూటమితో విడగొట్టుకొని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసింది.అనేక అననుకూలతలు, అధికార మీడియాలో తగిన అవకాశాలు ఇవ్వకపోవటం, ప్రయివేటు మీడియాలో, ఇతరంగా ప్రచారానికి నిధుల కొరత వంటి సమస్యలను కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొన్నది. పోలైన ఓట్లలో 2.73శాతం పొందింది. సీట్ల కోసమే కమ్యూనిస్టు పార్టీ పని చేసినట్లయితే సోషలిస్టు పార్టీ కూటమిలో ఉంటే ఎక్కువ సీట్లు పొంది ఉండేవారమని,వాటికోసం ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టదలచ లేదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. దామాషా ప్రాతికన సీట్లు కేటాయించే పద్దతి అవలంభించి ఉంటే 277 స్ధానాల్లో ఇప్పుడు వచ్చిన ఒకటికి బదులు తమకు ఏడు లేదా ఎనిమిది వచ్చి ఉండేవని, అధికార సోషలిస్టు పార్టీ 69శాతం ఓట్లు తెచ్చుకొని 91శాతం సీట్లు పొందిందని కమ్యూనిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫిగేరా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
పార్లమెంట్ ఎన్నికలను గుర్తించేది లేదని ప్రకటించిన అమెరికా, దాని నాయకత్వంలోని దుష్ట కూటమి రాబోయే రోజుల్లో ఎలాంటి కుట్రలకు తెరలేపనుందో చూడాల్సి ఉంది. అమెరికా దాని మిత్ర దేశాలు వెనెజులాను ఇబ్బందుల పాలు చేస్తున్నది వాస్తవం. దాని వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కుట్రలను అధిగమించే క్రమంలో గత పార్లమెంటులో ప్రతిపక్షం మెజారిటీలో ఉండి అనేక చర్యలకు ఆటంకాలు కలిగించింది. ఇప్పుడు సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించినందున మదురో జనానికి ఉపశమనం కలిగించే చర్యలు ఏ మేరకు తీసుకుంటారు, పరిస్దితిని ఎలా చక్కదిద్దుతారు అన్నది ఆసక్తి కలిగించే అంశం.