Tags

,


ఎం కోటేశ్వరరావు


ఆరున్నర సంవత్సరాల క్రితం – అప్పటి ప్రధాని నరేంద్రమోడీ చిత్రాన్ని చూసిన వారికి ఇప్పుడు మోడీ పెరిగిన గడ్డం కొట్చొచ్చినట్లు కనిపిస్తుంది. అది వ్యక్తిగతం, దేనికి పెంచుతున్నారో తెలియదు-దేశానికి ఇబ్బంది లేదు. కానీ దానికి తగినట్లుగా ఆయన ఏలుబడిలో దేశ అభివృద్ది, ఇతర అనేక సూచికల విషయంలో పెరుగుదల లేకపోగా వెనక్కు పోతోంది, ఇది ఆందోళన కలిగించే అంశం. అన్నీ నెహ్రూయే చేశారు, అన్నింటికీ కాంగ్రెసే కారణం చెప్పుకొనేందుకు ఇంకే మాత్రం అవకాశం లేని విధంగా సూచికలు దర్శనమిస్తున్నాయి. మీరు చేసింది ఏమిటో చెప్పమని అడిగే రోజులు ప్రారంభమయ్యాయి. సామాజిక మాధ్యమ కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరిపడటం ఇప్పటికే తగ్గింది, ఇంకా తగ్గనుంది.


తాజా విషయానికి వస్తే 2019 ప్రపంచ దేశాల మానవాభివృద్ధి సూచికలను డిసెంబరు 15న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.(దీన్ని మీడియాలో 2020 సూచిక అని కూడా రాస్తున్నారు. గత ఏడాది సూచికను తదుపరి ఏడాదిలో ప్రకటిస్తారు) దీని ప్రకారం 189 దేశాలలో మన స్ధానం 129 నుంచి 131కి పడిపోయింది. 2014నుంచి చూస్తే 132-129 మధ్యనే ఉన్నది. ” అభివృద్దిలో మనతో పోటీ పడుతోంది ” అని కొందరు వర్ణించే చైనా ర్యాంకు 97 నుంచి 85కు పెరిగింది. మన బిజెపి నేతలు నిత్యం స్మరించే లేదా పోల్చుకొనే పాకిస్ధాన్‌ ర్యాంకు 156 నుంచి 154కు పెరిగింది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌ ర్యాంకు 141 నుంచి 133కు పెంచుకుంది. ఈ లెక్కన బంగ్లాదేశ్‌ మానవాభివృద్దిలో మనలను వెనక్కు నెట్టేందుకు ఎక్కువ కాలం పట్టదు. మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పేవారు వీటిని ఏమంటారో, అసలు వీటిని అంగీకరిస్తారో లేదో తెలియదు. మన యంత్రాంగం అందించిన గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి ఈ సూచికలను నిర్ణయిస్తుంది కనుక లెక్కల్లో తేడా అంటే కుదరదు. బ్రిక్స్‌ దేశాలలో మన దేశం 2018తో పోల్చితే (131) రెండు, రష్యా (52)మూడు స్ధానాల దిగువకు పడిపోయాయి. బ్రెజిల్‌ 84 యథాతధంగా ఉంది. చైనా రెండు స్దానాలను మెరుగుపరచుకొని 85కు, దక్షిణాఫ్రికా ఒక స్ధానం పెంచుకొని 114కు పెరిగింది.శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ ఒక్కో స్దానాన్ని పెంచుకున్నాయి.

అయితే తాజాగా కర్బన ఉద్గారాల విడుదల-వాటి ప్రభావాన్ని కూడా మానవాభివృద్ధి సూచికల నిర్ధారణలకు పరిగణనలోకి తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి) నిర్ణయించింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటే మన సూచిక ఎనిమిది స్దానాల ఎగువన ఉంటుందని కూడా నివేదిక పేర్కొన్నది. ఇంతే కాదు అత్యంత ఎక్కువ మానవాభివృద్ధి జాబితాలో ఉన్న 50దేశాలు పూర్తిగా దిగువకు పడిపోతాయి. ఉదాహరణకు ఇప్పుడు మొదటి స్ధానంలో ఉన్న నార్వే పదిహేనవ స్దానానికి, చైనా 101వ స్దానానికి దిగజారుతాయి.ఆస్ట్రేలియా 72, అమెరికా 45, కెనడా 40 స్ధానాల దిగువకు చేరతాయి. అంటే ఇవన్నీ కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాలు. పరిశ్రమలు, చమురు వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అవి అంత ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. కనుక మన స్ధానం మెరుగుపడుతుందని సంతోషించాలా ? పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉన్నామని విచారించాలా ? అందువలన కొత్త ప్రమాణాలతో కొత్త నివేదికలు వచ్చినపుడు వాటి మంచి చెడ్డలను చూద్దాం.


ప్రస్తుతం మానవాభివృద్ధి సూచికల్లో ఆయా దేశాల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ప్రతిబింబిస్తున్నాయి. తాజా నివేదిక కరోనాతో నిమిత్తం లేని 2019వ సంవత్సరానిది. కరోనా ప్రభావం ఏ దేశాన్ని ఎక్కడ ఉంచుతుందో చూడాల్సి ఉంది. దానితో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న అంశాలను తీసుకొని మనం ఎక్కడ ఉన్నామో, పాలకులు మనలను ఎక్కడ ఉంచారో ఒకసారి అవలోకిద్దాం. 2018లో పిపిపి ప్రాతిపదికన మన తలసరి జాతీయ ఆదాయం 6,829 డాలర్లు కాగా 2019లో అది 6,681డాలర్లకు పడిపోయింది. ఐక్యరాజ్యసమితిలోని 189 దేశాలను మానవాభివృద్దిలో నాలుగు తరగతులుగా విభజించారు. వాటిలో అత్యంత అభివృద్ది చెందిన దేశాలుగా 0.957 – 0.804 పాయింట్ల మధ్య ఉన్న 66, అభివృద్ది చెందినవిగా 0.796 – 0.703 ఉన్న దేశాలు 53, మధ్యతరహా దేశాలలో 0.697-0.554 పాయింట్ల మధ్య ఉన్నవి 37, అంతకంటే తక్కువగా ఉన్న దేశాలు 33 ఉన్నాయి. వీటిలో మన దేశం మూడవ జాబితాలో ఉంది. మనతో పాటు మన కంటే ఎగువన భూటాన్‌, దిగువన వరుసగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, పాకిస్దాన్‌ ఉన్నాయి. మన కంటే ఎగువన అభివృద్ధి చెందిన దేశాలలో శ్రీలంక, చైనా ఉన్నాయి.


2000 సంవత్సరంలో ప్రణాళికా సంఘం విజన్‌ 2020 పేరుతో ఒక పత్రాన్ని రూపొందించి అభివృద్ధి ఎలా ఉండాలో, ఉంటుందో పేర్కొన్నది. ఈ ఇరవై సంవత్సరాలలో వాజ్‌పేయి హయాంను కూడా కలుపుకుంటే బిజెపి ఏలుబడి పది సంవత్సరాలు, కాంగ్రెస్‌ వాటా పదేండ్లు ఉంది. ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పిందేమిటి ? రానున్న రెండు దశాబ్దాల కాలంలో జిడిపి వృద్ది రేటు 8.5-9శాతం మధ్య ఉంటుంది. దీంతో దారిద్య్రం పూర్తిగా తొలగిపోతుంది. ఎగువ మధ్య తరగతి జాబితాలోకి దేశం వెళుతుంది. ఇవేవీ నిజం కాలేదు. జనాభా పెరుగుదల గురించి వేసిన అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. ఈ రెండు దశాబ్దాలలో ఉపాధి రహిత అభివృద్ది మాత్రమే నమోదైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందేందుకు నైపుణ్యం కలిగిన 50 కోట్ల మంది కార్మికులు కావాలని చెప్పారు. రెండువేల సంవత్సరంలో నైపుణ్యం కలిగిన యువకులు రెండుశాతం ఉంటే 2019 నాటికి 4.4శాతానికి మాత్రమే పెరిగింది. అందరికీ ఉద్యోగాలు అన్న నినాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెద్ద నోట్ల రద్దు, తగిన కసరత్తులేని జిఎస్‌టి అమలు వలన కోటీ పదిలక్షల ఉద్యోగాలు పోయాయి.


విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం, రద్దు చేయాలని కోరేవారు పెరుగుతున్నారు. గిరిజనులకు సంబంధించి జనాభాలో వారు ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 2.3శాతానికి మించి లేరు. నాణ్యమైన విద్య ఒక అంశమైతే మన జనాభాకు తగిన విధంగా విశ్వవిద్యాలయాలు పెరగలేదు.1998లో 229 ఉంటే ఇప్పుడు 993కు పెరిగాయి,2020 నాటికి మొత్తం 1500 కావాల్సి ఉంది. ప్రస్తుతం 18-24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే కాలేజీకి వెళుతున్నారు. దాదాపు కోటి మంది ఏటా డిగ్రీలు పొందుతున్నారు.వారి పరిజ్ఞానం, నైపుణ్యం చాలా తక్కువ స్ధాయిలో ఉంది. ఉపాధి అవసరాలకు తగినట్లుగా లేదు. ఏటా రెండులక్షల మంది ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డిలు పొందుతున్నారు. వారి పరిశోధన, బోధనా స్దాయిలు ఉండాల్సినంతగా లేవు. విద్య మీద మన పెట్టుబడిలో ప్రపంచంలో మనది 158, అత్యంత వెనుకబడిన సూడాన్‌ మనకంటే ఒక స్ధానంలో ముందుంది, నమీబియా 159లో ఉంది. అమెరికా 27, చైనా 44వ స్దానాల్లో ఉన్నాయి.


2019 ప్రపంచ ఆకలి సూచికలో 117 దేశాల జాబితాలో మనది 102, పదే పదే చెప్పాలంటే సిగ్గువేస్తోంది, శ్రీలంక 66, నేపాల్‌ 73,బంగ్లా 88, పాకిస్ధాన్‌ 94లో ఉంది, మనువాదులు చెప్పే అఖండ భారత్‌లోని ఆఫ్ఘనిస్తాన్‌ 108వ స్దానంలో ఉంది. ఇదంతా ఎప్పుడు, చైనా కంటే వేగంగా మనం అభివృద్ధి చెందుతున్నాం, త్వరలో దాన్ని అధిగమిస్తున్నాం అని చెప్పిన తరువాత అని గమనించాలి. అందరికీ ఆహారం సంగతి తరువాత అందరికీ ఆరోగ్యం సంగతి చూద్దాం. ఆదాయం తగినంతలేక భరించలేని ఆరోగ్య ఖర్చుతో అప్పుల పాలై ప్రతి ఏటా ఆరుకోట్ల మంది జనం దారిద్య్రంలోకి దిగజారుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం గోవాలో ప్రతి 614 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి పడక ఉంటే బీహార్‌లో 8,789 మందికి ఒకటి ఉంది. వాటిలో సౌకర్యాలు, ఆధునిక పరికరాల సంగతి సరేసరి. కేంద్ర పెద్దలు చెప్పే ఆయుష్మాన్‌ భారత్‌ స్దితి ఇది. ఇలాంటి అంశాలన్నీ మానవాభివృద్ధి సూచికల్లో ప్రతిబింబిస్తాయి.


మన దేశ జిడిపి పెరుగుతున్నది. కానీ జనం చేతుల్లోకి పోతే మానవాభివృద్ది మెరుగుపడుతుంది. అదే వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైతే అంకెల్లో గొప్పలు చెప్పుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ ఆర్ధిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక 2020 ఏమి చెప్పింది. గణనీయమైన ఆర్ధికపురోగతి సాధించినప్పటికీ భారత్‌లోని సామాజిక ఆర్ధిక అసమానత జనంలో గణనీయమైన భాగాన్ని దానికి దూరంగా ఉంచినట్లు పేర్కొన్నది. అల్పాదాయ తరగతి కుటుంబాల్లో జన్మించిన వారు సరాసరి ఆదాయాన్ని పొందేందుకు ఏడు తరాలు పడుతుందని కూడా చెప్పింది. 2013 నాటి వివరాల ప్రకారం తలసరి రోజుకు 32 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తున్న వారు దేశంలో 22 కోట్ల మంది ఉన్నారు. జాతీయ గణాంక సంస్ద అంచనా ప్రకారం 2019-20లో తలసరి వార్షిక జాతీయ ఆదాయం రూ.1,12,835 ఉంది. పేదలు దీన్ని చేరుకోవాలంటే ఏడు తరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక చెప్పింది.ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక 2020 ప్రకారం 82దేశాల జాబితాలో మనది 76వ స్ధానం.


మానవాభివృద్ధికి ఉపాధి, తద్వారా వచ్చే ఆదాయం కూడా ముఖ్యపాత్ర వహిస్తుందన్నది తెలిసిందే. మన దేశంలో జనాభా తప్ప ఉపాధి అవకాశాలు, అవసరాలకు తగినట్లుగా వేతనాలు పెరగటం లేదు. 2005 మార్చి నుంచి 2012 మార్చి నాటికి 459.4 నుంచి 474.2 మిలియన్లకు మొత్తం ఉపాధి పెరిగింది. 2018 నాటికి అది 465.1మిలియన్లకు తగ్గిపోయింది. ఈ కాలంలో కార్మికశక్తి 470.2 నుంచి 495.1 మిలియన్లకు పెరిగింది.కార్మికశక్తి భాగస్వామ్యం 43 నుంచి 36.9శాతానికి తగ్గిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు కారణమైందని తెలిసిందే. పురుష వ్యవసాయ కార్మికుల వేతనాలు 2014 డిసెంబరులో 5.13శాతం పెరిగితే 2016లో 6.77, 2018లో 4.84శాతం పెరుగుదల రేటు ఉంది. అంటే నిజవేతనాలు గణనీయంగా పడిపోయాయి.నిపుణులైన కార్మికుల వేతనాల పెరుగుదల రేటు ఈ కాలంలో 6.16 నుంచి 4.06శాతానికి పడిపోయింది. ఇది తలసరి వినియోగం తగ్గటానికి దారి తీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు.


వివిధ అంతర్జాతీయ సూచికలు, పోలికల్లో మన దేశ స్ధానం గౌరవ ప్రదమైనదిగా లేనప్పటికీ మన ప్రధాని, బిజెపి నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచామని పదే పదే చెప్పుకుంటున్నారు. మనం సాధించామని చెబుతున్న ప్రచారానికి విశ్వసనీయత చేకూర్చే ఆధారాలు ఎక్కడా కనిపించటం లేదు. అది యాభై ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలోనూ, ఆ యాభై ఏండ్లలో చేయలేని దానిని ఐదేండ్లలో చేసి చూపించామని చెప్పుకొనే బిజెపి ఏలుబడిలోనూ కనిపించటం లేదు. అప్పుడూ ఇప్పుడూ అసలు సమస్యల నుంచి జనాన్ని పక్కదారి మళ్లించే నినాదాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఆర్ధిక విషయానికి వస్తే కరోనా పూర్వపు దిగజారిన స్ధితికి అయినా ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేని స్ధితి. వివిధ అంతర్జాతీయ సంస్ధలు రూపొందించిన సూచికల్లో మన స్దానం ఎలా ఉందో చూద్దాం. ఏడాది కాలంలో కనీసం 15అంశాల్లో దిగజారిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ద రూపొందించే ఆర్ధిక స్వేచ్చ సూచికలో మన దేశం 2019 సూచికలో 79వ స్ధానంలో ఉంటే 2020లో 105కు పడిపోయింది. ప్రజాస్వామ్య సూచికలో 2018తో పోల్చితే పదిస్ధానాలు దిగజారి 2019లో 51వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 27వ స్ధానంలో ఉండేది. పత్రికా స్వేచ్చలో 142, మహిళలకు భద్రతలో 133, ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. శాంతి సూచికలో ఐదు స్ధానాలు దిగజారి 163 దేశాలలో 141కి, ప్రపంచ పోటీతత్వ సూచికలో పది స్ధానాలు దిగజారి 68కి, స్త్రీ పురుష నమానత్వ సూచికలో 112కు దిగజారింది. పాస్‌పోర్టు సూచికలో 199 దేశాలలో మనది 84వ స్దానం. ఇలా అనేక సూచికలు దిగజారటం నరేంద్రమోడీ పాలనలో కనిపిస్తోంది. వాటి కొనసాగింపే మానవాభివృద్ధి సూచిక పతనం !