Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో విఫలమైన దేశాలూ, సఫలమైనవీ ఇప్పుడు వ్యాక్సిన్‌ గురించి కేంద్రీకరించాయి. ప్రపంచ వ్యాపితంగా ఇప్పుడు కరోనా వెనక్కు పోయి వాక్సిన్‌ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. దాని ఖర్చు , తయారీ, ఎంత వేగంగా సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది అన్నది ప్రధాన అంశం. బీహార్‌లో గెలిపిస్తే ఉచితంగా అందచేస్తామని బిజెపి ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని కొన్ని రాష్ట్రాలూ ప్రకటించాయి. అయితే ఆ ఖర్చును కేంద్రం భరిస్తుందా రాష్ట్రాల మీదనే మోపుతుందా, లేక కొంత వాటా భరిస్తుందా అన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు.


ప్రస్తుతం తయారు చేస్తున్న వాక్సిన్‌ ఖర్చు ఒక డోసుకు ఎంత అంటే మూడు డాలర్ల నుంచి 37 డాలర్లవరకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ దేశాలకు ఒక రేటు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక రేటుకు కొన్ని కంపెనీలు అందచేస్తాయన్నది మరొక వార్త. ఇప్పటికే కొన్ని చోట్ల అత్యవసర ప్రాతిపదికన వాక్సిన్‌ వేయటం ప్రారంభించి జనాల్లో ఆశలు, విశ్వాసం కల్పించారు. ఇదే సమయంలో కరోనా తగ్గిన ప్రాంతాల్లో మనకు అవసరం లేదనే అభిప్రాయం జనాల్లో వస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. జనం చస్తుంటే పట్టించుకోని మతాలు ఇప్పుడు వాక్సిన్‌ విషయంలో రంగ ప్రవేశం చేస్తున్నాయి. ప్రత్యేక పరిస్ధితిగా పరిగణించి మతస్తులు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని అమెరికా బిషప్పులు ప్రకటించారు.
ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి. కరోనా వైరస్‌ను కృత్రిమంగా రూపొందించి ప్రపంచం మీదకు వదలిందని, ధన సంపాదనకు దాని నివారణకు అవసరమైన వాక్సిన్‌ కూడా సిద్దం చేసుకుందనే నిందలు చైనా మీద వేసిన తీరు, వాటిని ఇప్పటికీ నమ్ముతున్న వారి గురించి తెలిసిందే. వాస్తం ఏమిటి ? ఇప్పుడు మిగతా అనేక దేశాలతో పాటే చైనా వాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తోంది తప్ప ముందుగా రాలేదు, ఆరోపించినట్లు దాన్ని సొమ్ము చేసుకోనూ లేదు. అయినా ఇప్పుడు కూడా చైనా లక్ష్యంగా పశ్చిమ దేశాలు మరో దాడి జరుగుతోంది. దీర్ఘకాలంలో లబ్ది పొందేందుకు చైనా కరోనా దౌత్యం చేస్తోందని చెబుతున్నాయి.


చిత్రం ఏమంటే ప్రపంచ జనాలందరికీ సమంగా వాక్సిన్‌ పంపిణీ చేయాలని ఒప్పందం మీద సంతకాలు చేసిన 189దేశాల కోవాక్స్‌ కూటమిలో చైనా చేరింది తప్ప అమెరికా లేదు. అమెరికా, ఇతర దేశాలలో తయారు చేసే కంపెనీలు సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయి. చైనా వంద కోట్ల డోసుల తయారీకి ఏర్పాట్లు చేస్తోంది. బ్రెజిల్‌, మొరాకో, ఇండోనేషియా వంటి చోట్ల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అనేక చోట్ల వాక్సిన్‌ నిల్వ సౌకర్యాల ఏర్పాటుకూ పూనుకుంది. కొన్ని దేశాలు వాక్సిన్‌ కొనుగోలుకు అవసరమైన రుణం కూడా ఇస్తోంది. వీటిని వాక్సిన్‌ సిల్క్‌ రోడ్‌ అని కొందరు వర్ణిస్తున్నారు. ఇదే పని భారత్‌తో సహా ఇతర దేశాలు చేయటాన్ని, నిజంగా లబ్ది ఉంటే పొందటాన్ని ఎవరు అడ్డుకున్నారు ? చైనా రంగంలో లేక ముందు పేద, వర్దమాన దేశాలన్నింటినీ అదుపులో ఉంచుకున్నది ధనిక దేశాలే కదా ? వాటిని వదలించుకొని అవి ఇప్పుడు చైనా వైపు ఎందుకు చూస్తున్నాయి ? వీటిలో కొన్ని గతంలో చైనా మీద తీవ్ర ఆరోపణలు చేసినవి కూడా ఉన్నాయి.
గతంలో కరోనా సమాచారాన్ని సకాలంలో వెల్లడించలేదని ఆరోపించారు. ఇప్పుడు చైనా తయారు చేస్తున్న వాక్సిన్ల సామర్ధ్యం లేదా రక్షణకు సంబంధించిన సమాచారాన్ని బయటకు రానివ్వటం లేదని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. వాటి మీద నమ్మకం లేని వారు దూరంగా ఉండవచ్చు, బలవంతం ఏమీ లేదు కదా ? వివరాలన్నీ బయట పెట్టిన కంపెనీల తయారీనే వినియోగించవచ్చు. గతంలో చైనా వస్తువులు నాణ్యత లేనివి అని ప్రచారం చేశారు. ఆచరణలో వాటినే కొనుగోలు చేశారు, ఇప్పుడు వాక్సిన్‌ కూడా అంతేనా ? అసలు పశ్చిమ దేశాల సమస్య ఏమిటి ? కరోనా సమయంలో ఉద్దీపనల పేరుతో లబ్ది పొందిన కార్పొరేట్లు ఇప్పుడు వాక్సిన్నుంచి లాభాలు పిండుకోవాలని చూస్తున్నాయి. తమ కంపెనీలు తయారు చేసిన వాక్సిన్‌ను తమకు మిత్ర దేశాలా, శత్రుదేశాలా అనేదానితో నిమిత్తం లేకుండా తీసుకొనేందుకు సిద్దపడే అన్ని దేశాలతో లాభాలను ఆశించకుండా పంచుకొనేందుకు చైనా సిద్దపడుతోంది. తద్వారా తమ లాభాలకు అడ్డుపడుతోందన్నదే పశ్చిమ దేశాల అసలు దుగ్ద.

అమెరికా మిత్ర దేశం ఫిలీప్పీన్స్‌, దాని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే మాటల్లో ” ఇతర దేశాల మాదిరి చైనా వాక్సిన్‌ సరఫరాకు ముందుగా కొంత సొమ్ము చెల్లించమని అడగటం లేదు, అదే పశ్చిమ దేశాలు అడ్వాన్సు చెల్లించమని అడుగుతున్నాయి, అలా అయితే మేమంతా చావక తప్పదు.” అన్నాడు. ఐరోపా యూనియన్‌లోని హంగరీ పరిస్ధితి కూడా అదే. కరోనా కారణంగా అనేక వర్ధమాన దేశాలు నిధులకు కటకటలాడుతున్న విషయం తెలిసిందే. చైనా వాక్సిన్‌కు సంబంధించిన సమాచారం విడుదల చేయకపోయినా దాదాపు వంద దేశాలు తమకు కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక దేశాలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అత్యవసర పరిస్ధితిగా పరిగణించి చైనా కంపెనీలు తయారు చేసిన వాక్సిన్ను అక్కడ ఈ ఏడాది జూలై నుంచే వినియోగిస్తున్నారు. పది లక్షల మంది ప్రయోగాత్మకంగా తీసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా జాతీయ ఔషధ కంపెనీ(సినోఫార్మ) ప్రకటించింది. ఈ కంపెనీ వాక్సిన్‌ కొనుగోలు చేస్తున్నట్లు డిసెంబరు తొమ్మిదిన యుఏయి వెల్లడించింది. అది 86శాతం గుణం చూపినట్లు మూడవ దశ ప్రయోగాల్లో వెల్లడి అయినట్లు పేర్కొన్నది. ఇతర కంపెనీలు 94,95శాతం సామర్ద్యం చూపినట్లు చెప్పాయి. యుఏయి తరువాత బహరెయిన్‌, ఈజిప్టు, ఇండోనేషియా కొనుగోలు చేసింది. బ్రెజిల్‌ కూడా చైనా వాక్సిన్‌ వినియోగానికి నిర్ణయించింది.


చైనా వాక్సిన్‌ గురించి కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పోలియో చుక్కలను ఇచ్చే మాదిరి పరిజ్ఞానాన్నే చైనా వినియోగిస్తున్నది. సినోఫార్మ వాక్సిన్‌ 42వేల మంది మీద ప్రయోగించారు. ఇంత సంఖ్యలో ప్రయోగించినందున ప్రతికూల, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే కనుగొనేందుకు అవకాశం ఉంటుంది అని నాన్‌జింగ్‌ విశ్వవిద్యాలయ ప్రజారోగ్య పరిశోధనా కేంద్ర డైరెక్టర్‌ డాక్టర్‌ ఉ ఝీవెరు చెప్పారు. వైరస్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరు అనే దేశభక్తి పూరితమైన అవగాహనతో వ్యాక్సిన్‌ రూపకల్పన, ప్రయోగాలు జరుగుతున్నాయని లండన్‌ విశ్వవిద్యాలయ చైనా సంస్ధ డైరెక్టర్‌ స్టీవ్‌ శాంగ్‌ చెప్పారు. వివిధ సర్వేలలో వెల్లడైన అంశాల మేరకు చైనాలో తమ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు వాక్సిన్‌ తీసుకొనేందుకు సిద్దపడిన వారు 80శాతం ఉండగా, మిగిలిన దేశాలలో చాలా తక్కువ శాతాలలో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కుట్ర సిద్దాంతాల ప్రచారం, ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఈ పరిస్దితి ఉంది.


చైనా మీద విశ్వాసం ఉన్న దేశాలు తగిన సమాచారం లేనప్పటికీ వాక్సిన్‌ కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. మిగతా దేశాల వాటితో పోల్చితే చైనా వాక్సిన్‌ నిల్వ,రవాణా సులభం. ముఖ్యంగా పేద, వర్ధమాన దేశాలకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఫైజర్‌ వాక్సిన్‌ అత్యంత శీతల పరిస్ధితిలో మాత్రమే నిల్వ ఉంటుంది. గత అనుభవాలను చూసినపుడు వ్యాప్తి చెందే వైరస్‌ నివారణ అన్ని దేశాలలో జరిగినపుడే ఉపయోగం ఉంటుంది. అవసరాన్ని బట్టి తప్ప సంపదల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ ఉండకూడదు.


చైనాలో తయారవుతున్న వాక్సిన్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ డైవాక్స్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యం కూడా ఉంది. చైనాకు చెందిన ఊహాన్‌ బయెలాజికల్‌ ప్రోడక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి. చైనా వాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగ ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అవి విడుదలైన తరువాత మరికొన్ని దేశాలు కూడా ముందుకు వస్తాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా, ఐరోపాలోని కార్పొరేట్‌ కంపెనీల పట్టుకూడా సడలే అవకాశాలు లేకపోలేదు.


కొన్ని వాక్సిన్లు గర్భవిచ్చిత్తి కణాలతో రూపొందించినప్పటికీ అత్యవసరం, అందరి మంచి కోసం నైతిక బాధ్యతగా క్రైస్తవులు వాక్సిన్లు తీసుకోవచ్చని అమెరికా బిషప్పుల సభ పేర్కొన్నది. ఆస్ట్రాజెనికా కంటే మోడెర్నా, ఫైజర్‌ వాక్సిన్లు నైతికంగా ఆమోదకరమైనవని, తప్పనిసరి అయితే దాన్ని కూడా తీసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అయితే తప్పనిసరై వినియోగించినప్పటికీ గర్భవిచ్చిత్తికి వ్యతిరేకతను బలహీనపరచకూడదని కూడా పేర్కొన్నది.1972లో నెదర్లాండ్స్‌లో గర్భవిచ్చిత్తి జరిగిన ఉదంతంలో ఆడశిశువు మూత్రపిండాల నుంచి సేకరించిన కణాలతో ఒక వాక్సిన్ను రూపొందించారు. అప్పటి నుంచి కొన్ని కంపెనీలు అదే పద్దతిని అనుసరిస్తున్నాయి. దానికి భిన్నంగా ఫైజర్‌, మోడెర్నా వాక్సిన్లు తయారవుతున్నట్లు బిషప్పులు పేర్కొన్నారు.


మొత్తం మీద చూస్తే వాక్సిన్‌ గురించి విపరీత ప్రచారం జరుగుతోంది.ఎన్నికల లబ్దికి వాక్సిన్ను వాడుకోవాలని చూసి భంగపడిన డోనాల్డ్‌ ట్రంప్‌ను చూశాము. ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ తానేే స్వయంగా పర్యవేక్షించి తయారు చేయిస్తున్నట్లు జనానికి కనిపించే యత్నం చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాలూ, మీడియా వాక్సిన్‌ దౌత్యం, రాజకీయాలలో నిమగమయ్యాయి. వాక్సిన్‌ ప్రజోపయోగ ఔషధంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని చైనా నాయకత్వం తొలి నుంచీ చెబుతోంది. దాన్ని అమెరికా ఇతర దేశాలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ధనబలంతో చిన్న దేశాలను ఆకర్షిస్తున్న చైనా ఇప్పుడు వాక్సిన్‌తో తన పలుకుబడి పెంచుకోవాలని చూస్తోందని చెబుతున్నాయి. వందల సంవత్సరాల పాటు అలాంటి చర్యలను అమలు జరిపి ప్రపంచాన్ని ఆక్రమించిన దేశాల వారికి ప్రతిదీ అలాగే కనిపించటం, అనిపించటంలో ఆశ్చర్యం లేదు.