Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు
కేరళ స్ధానిక సంస్దల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి కూటములు రెండూ శబరిమల వివాదం, ప్రమాదవశాత్తూ ఏనుగు మృతి, బంగారం స్మగ్లింగ్‌ ఉదంతం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ కుమారులు కేసుల్లో ఇరుక్కొని అరెస్టు కావటాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన నేపధ్యంలో సాధించిన విజయం సామాన్యమైంది కాదు.


ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణలను బట్టి కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు జరిపిన ఆహార కార్యక్రమం, కరోనా చికిత్సలో చూపిన ప్రత్యేక శ్రద్ద, అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా మత శక్తుల పట్ల అనుసరించిన సూత్రబద్దవైఖరి జనామోదం పొందింది కనుకనే ఎల్‌డిఎఫ్‌ విజయం సాధ్యమైంది.పైన పేర్కొన్న అంశాలతో పాటు యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం) వర్గం కారణంగా దాని ప్రభావం కేరళ మధ్య జిల్లాల్లో విజయావకాశాలను పెంచింది. స్ధానిక సంస్ధల ఎన్నికలు కేరళలో సరికొత్త పరిణామాలకు తెరలేపినట్లు చెప్పవచ్చు. ప్రతిపక్షాలు చేసిన ప్రచారంతో ఊగిసలాడిన ఓటర్లు, గతంలో మద్దతుదార్లుగా ఉండి ఎల్‌డిఎఫ్‌కు దూరమైన వారు ఈ పరిణామంతో తిరిగి చేరువ కావచ్చు. ప్రజాభిప్రాయాన్ని మరింతగా కూడగట్టేందుకు వివిధ తరగతుల నుంచి సూచనలు పొందేందుకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదమూడు జిల్లాల పర్యటన ఖరారైంది. మరొక జిల్లా కార్యక్రమాన్ని రూపొందించవలసి ఉంది. రానున్న రోజుల్లో ఎల్‌డిఎఫ్‌ మరిన్ని కార్యక్రమాలను రూపొందించి, అందరికంటే ముందుగానే ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అవుతోంది.


గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఒక సారి ఎల్‌డిఎఫ్‌ కూటమి అధికారానికి వస్తే మరోసారి యుడిఎఫ్‌ రావటం ఒక ఆనవాయితీగా మారింది. వచ్చే ఎన్నికలలో ఓటర్లు దానికి మంగళం పాడతారని ఇప్పటికే కొందరు వ్యాఖ్యానించటం ప్రారంభించారు. ఎన్నికల నాటికి అసాధారణ పరిస్దితులు ఏర్పడితే తప్ప ఎల్‌డిఎఫ్‌ ఇదే విజయ పరంపరను కొనసాగించవచ్చని, వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారానికి రావచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికలలో కొత్తగా కేరళ కాంగ్రెస్‌(ఎం) వచ్చి చేరింది. ఎల్‌డిఎఫ్‌లోని కొన్ని పార్టీలు తమ సీట్ల గురించి ఆందోళన చెంది కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలలో సీట్ల పంపిణీ, ఐక్యంగా పని చేయటంలో అదెక్కడా కనిపించలేదు. ఇదే సర్దుబాటు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష యూడిఎఫ్‌లో కుమ్ములాటలు బజారున పడ్డాయి. ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలో, ఏమి చేయాలో రెండవ భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు మార్గనిర్దేశనం చేయటం కాంగ్రెస్‌ దుస్దితిని తెలియ చేస్తోంది. మరోవైపు మత అజెండాను ముందుకు తెచ్చినా భంగపడిన బిజెపి తాను తిరిగి గెలుచుకున్న పాలక్కాడ్‌ మున్సిపల్‌ కార్యాలయంపై శ్రీరాముడి చిత్రం ముద్రించిన కాషాయ జెండాను ఎగురవేయటం, దానికి అభ్యంతరం తెలపటంపై అది చేస్తున్న వాదనల ద్వారా తన అజెండాను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయించిందన్నది స్పష్టం.

స్ధానిక సంస్ధల ఎన్నికలలో అత్యధిక చోట్ల పార్టీలు పూర్తి మెజారిటీ సాధించాయి. మరికొన్ని చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితి ఏర్పడింది. ఎన్నికైన సభ్యులు పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఈ నెల 21, 22 తేదీలలో సమావేశం కానున్నారు. కీలకంగా మారిన వార్డు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనేదానిని బట్టి కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఎవరి ఆధిపత్యం ఏర్పడ నుందో తేలుతుంది. ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీలు వచ్చిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి. రెండు కార్పొరేషన్లలో పెద్ద పక్షంగా ఎల్‌డిఎఫ్‌ ఉంది. కేరళ ఎన్నికల నిబంధనల ప్రకారం హంగ్‌ ఏర్పడినపుడు అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలుత సీట్లు సంపాదించిన పార్టీలన్నీ పోటీ చేయవచ్చు. సగం కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికీ రాకపోతే మొదటి రెండు స్దానాలలో ఉన్న పార్టీలు రెండవ సారి పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీలో లేని పార్టీలు ఓట్లు వేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగానూ ఉండవచ్చు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. కేరళలో ఉన్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో స్వతంత్రులు ఏ వైఖరి అయినా తీసుకోవచ్చు గానీ ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌, బిజెపి పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని బలపరిచే పరిస్ధితి లేదు. ఈ కారణంగానే రెండు కార్పొరేషన్లలో ఎల్‌డిఎఫ్‌ పెద్ద పక్షంగా అవతరించినందున అక్కడ కూడా వారే విజయం సాధిస్తారనే భావనతో మీడియాలో ఎల్‌డిఎఫ్‌ ఐదు మేయర్‌ స్దానాలను గెలుచుకున్నట్లు రాస్తున్నారు. జిల్లా పంచాయతీలలో ఒక చోట ఎల్‌డిఎఫ్‌ పెద్ద పార్టీగా అవతరించగా మరొక చోట రెండు కూటములకు సమానంగా స్ధానాలు వచ్చాయి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌×××యుడిఎఫ్‌×××ఎన్‌డిఏ×××ఇతరులు×××హంగ్‌××× మొత్తం
గ్రామపంచాయతీలు×× 514(-2) ×××321(-51) ××19(+5) ×× 23(+15) ×× 64 ××× 941
బ్లాక్‌ పంచాయతీలు×× 108(+20)××× 38(-24) ×× 0(0) ×× 0(-5) ×× 6 ××× 152
జిల్లా పంచాయతీలు×× 10(+3) ××× 2(-3) ×× 0(0) ×× 0(0) ×× 2 ××× 14
మున్సిపాలిటీలు ×××× 35 ××× 39 ×× 2(+1) ×× 3 ×× 7 ××× 86
కార్పొరేషన్లు ×××× 3 ××× 1 ×× 0(0) ×× 0 ×× 2 ××× 6
వివిధ స్ధానిక సంస్ధలలో వార్డుల వారీగా వచ్చిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌-××××యుడిఎఫ్‌×××××ఎన్‌డిఏ×××××ఇతరులు××× మొత్తం
గ్రామపంచాయతీలు×7,262(-361) ×5,893(-431) ×1,182(+249) ×1,620(+542) ×15,962
బ్లాక్‌ పంచాయతీలు ×1,266(+178) ××727(-190) ×× 37(+16) ×× 49(-4) ××× 2,080
జిల్లా పంచాయతీలు×× 212(+42) ××110(-35) ×× 2(-1) ××××× 6(+2) ×××× 331
మున్సిపాలిటీలు ××1,167(-96) ×× 1,173(-145) ×× 320(+84) ××416(+157) ××3,076
కార్పొరేషన్లు ××× 207(+11) ×× 120(-23 ×× 59(+8) ×× 27(+3) ××× 414
పై వివరాలను పరిశీలించినపుడు వెల్లడైన ధోరణులు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ రెండూ 792 స్ధానాలు కోల్పోగా వాటిలో ఇతరులు 542 సాధించగా బిజెపికి పెరిగింది 249, బ్లాక్‌ పంచాయతీలలో కాంగ్రెస్‌ కోల్పోయిన 190లో ఎల్‌డిఎఫ్‌ 178, బిజెపి 16 అదనంగా సాధించింది. మున్సిపల్‌ వార్డులలో ఎల్‌డిఎఫ్‌, యూడిఎఫ్‌ కోల్పోయిన 241 స్ధానాలలో ఇతరులు 157 పొందగా బిజెపి 84 అదనంగా సాధించింది. కార్పొరేషన్‌ వార్డులలో యుడిఎఫ్‌్‌ 23 కోల్పోగా ఎల్‌డిఎఫ్‌ 11, బిజెపి 8, ఇతరులకు మూడు అదనంగా వచ్చాయి. ఈ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు పది మున్సిపాలిటీలు, 40 గ్రామ పంచాయతీలలో విజయం సాధిస్తామని బిజెపి చెప్పుకున్నది. ఏమి జరిగిందో చూశాము. ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని చెప్పిన బిజెపి కంటే ఇతరులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లు కోల్పోయిన స్ధానాలను ఎక్కువగా పొందారు. శబరిమల ప్రాంతంలోని పండలం మున్సిపాలిటీని బిజెపి అదనంగా సంపాదించింది. స్ధానిక ఎన్నికలలో గతంలో గెలిచిన స్ధానాలను కొన్నింటిని పోగొట్టుకోవటం, కొత్తవాటిని సాధించిన ఉదంతాల గురించి ప్రతి పార్టీ పరిశీలన జరుపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో లోటు పాట్లను సరి చేసుకొనేందుకు ప్రయత్నించటం సహజం.
గత 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. శబరిమల ఉదంతం, బంగారం స్మగ్లింగ్‌ కేసులను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు అటు మతాన్ని, ఇటు కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకొని ఎల్‌డిఎఫ్‌పై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బహిర్గతమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాల గురించి ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కూటముల వారీ సాధించిన స్ధానాలు, 2019 లోక్‌ ఎన్నికలు, 2020 స్ధానిక ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరిది పై చేయిగా ఉందో దిగువ చూద్దాం. 2016 వివరాలలో బ్రాకెట్లలో ఉన్న అంకెలు అంతకు ముందు అసెంబ్లీ స్ధానాలతో పోల్చితే అదనంగా తెచ్చుకున్నవీ, కోల్పోయినవని గమనించాలి.
ఏడాది ××××××× ఎల్‌డిఎఫ్‌ ××××× యూడిఎఫ్‌×××××× బిజెపి
2016 ×××××× 91(+23) ×××××× 47(-25) ×××××× 1(+1)
2019××××××× 16 ×××××× 123 ×××××× 1
2020××××××× 101 ×××××× 38 ××××××× 1
గత లోక్‌ సభ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు చోట్ల బిజెపి రెండవ స్ధానంలో ఉంది, తాజా స్ధానిక ఎన్నికల్లో ఐదు చోట్ల రెండవ స్ధానంలో ఉంది.2016లో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఎంఎల్‌ఏగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటికీ పరిస్ధితిలో వచ్చిన మార్పును, కాంగ్రెస్‌కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బనూ ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. 2015 స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి యుడిఎఫ్‌ అధికారంలో ఉంది. ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌కు యుడిఎఫ్‌ మధ్య ఓట్ల తేడా అసెంబ్లీ ఎన్నికలలో యుడిఎఫ్‌ కంటే ఎల్‌డిఎఫ్‌ ఓట్ల శాతం కేవలం 0.2శాతమే ఎక్కువ. తాజా ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉండి, ప్రతిపక్షాలు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా యుడిఎఫ్‌ కంటే 4.5శాతం ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది. కనుకనే 101 అసెంబ్లీ సెగ్మెంట్లలో పై చేయి సాధించింది. ఇదే ఆదరణను ఎల్‌డిఎఫ్‌ నిలుపు కుంటే కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా తిరిగి 2021 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కేరళలో ఎల్‌డిఎఫ్‌ కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అవుతుంది.